Underground water levels
-
జల దోపిడీల
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా మరోవైపు కొద్దోగొప్పో బోరుబావుల నుంచి వస్తున్న నీటితో అక్రమార్కులు నీటి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత కరెంట్‌ను దుర్వినియోగం చేస్తూ.. వ్యవసాయ బావుల నుంచి అడ్డగోలుగా నీటిని తోడేస్తూ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నారు. ట్యాంకర్లలో పారిశ్రామిక ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. వీరి వ్యాపారం మూడు ట్యాంకర్లు.. ఆరు పరిశ్రమలు అన్న చందంగా జోరుగా సాగుతోంది. తూప్రాన్: తూప్రాన్ డివిజన్ కేంద్రం హైదరాబాద్ నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్హైవే, రైల్వే స్టేషన్ల లాంటి చక్కటి రవాణా సౌకర్యంతోపాటు ఈ ప్రాంతం అనేక పరిశ్రమలకు నెలవైంది. డివిజన్ పరిధిలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి తదితర ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో ఆయా గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వెలిశాయి. వీటిలో రసాయనిక, విత్తన, ఐరన్, లిక్కర్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలే ఆసరాగా అనేక పారిశ్రామికవాడలు నెలకొన్నాయి. వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్న ఈ పరిశ్రమల్లోని కార్మిక కుటుంబాల అవసరాలను ఆసరా చేసుకొని అక్రమ వ్యాపారులు నీటి వ్యాపారానికి తెరలేపారు. బోరుబావులను లీజుకు తీసుకొని.. వ్యాపారులు రైతుల వ్యవసాయ పొలాల్లోని బోరుబావులను లీజుకు తీసుకొని వాటి నుంచి ట్యాంకర్ల ద్వారా రేయింబవళ్లు నీటిని పరిశ్రమలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 40కిపైగా ట్యాంకర్లు, 10 లారీలు, 15 మినరల్ వాటార్ ప్లాంట్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ట్యాంకర్ రోజుకు 10 నుంచి 15 ట్రిప్పుల వరకు తిరుగుతుంది. ట్రాక్టర్ ట్యాంకర్లకు రైతుకు కేవలం రూ.200 చెల్లించి పరిశ్రమలకు రూ.500 నుంచి అవసరాలకు అనుగుణంగా రూ.800 వరకు విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పుణ్యమా అని వ్యాపారుల పంట పండింది. ఇదంతా రెవెన్యూ, విద్యుత్ అధికారుల కనుసన్నల్లో సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్ లైన్‌మన్, లైన్ ఇన్స్పెక్టర్లకు ఒక్కో ట్రాక్టర్ ట్యాంకర్‌కు నెలకు రూ.వెయ్యి చొప్పున ట్యాంకర్ల యజమానులు ముట్టజెప్తున్నట్లు సమాచారం. మినరల్ పేరుతో దోపిడీ.. ఉమ్మడి మండలంలోని గ్రామాల్లో 40 వరకు కొనసాగుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులు మినరల్ పేరుతో రసాయనాలు కలుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏ ఓక్క ప్లాంటుకు ఐఎస్ఐ లేదు. ప్రతీ నెల అధికారులు మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తున్నా గ్రామాల్లో మినరల్ వాటర్ప్లాంట్ల హవా కొనసాగుతోంది. 20 లీటర్ల క్యాన్‌కు రూ.15 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్లాంటును సీజ్ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలంలో పరిశ్రమలు వెలుస్తుండడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటాయి. ప్రస్తుత వేసవి తీవ్రత కారణంగా నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. బోరుబావుల్లో కొద్దిపాటి నీటితో పంటలు పండించి నష్టాలపాలయ్యే బదులు నీటిని అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో 700 అడుగుల లోతు బోరుబావులు తవ్వించినా చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది. అయినా రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అప్పు తెచ్చి బోరుబావులు తవ్వుతున్నారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 8 వేలకు పైగా బోరుబావులున్నాయి. వీటిలో 1,300 పైగా మాత్రమే కాస్త నీళ్లు పోస్తున్నాయి. దీంతో పరిశ్రమ నిర్వాహకుల నీటి అవసరాలను గుర్తించిన అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం చట్టవ్యతిరేకంగా నీటిని అక్రమంగా ట్యాంకర్ల ద్వారా తరలించి విక్రయించినట్లైతే కేసులు నమోదు చేస్తాం. వ్యవసాయ రంగానికి వినియోగించాల్సిన బోరుబావులను వ్యాపారంగా మార్చడం చట్టరీత్యానేరం. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్యాంప్రకాశ్, ఆర్డీఓ, తూప్రాన్ దుర్వినియోగం చేయొద్దు వ్యవసాయ బోరుబావుల నుంచి ఉచిత కరెంట్ ద్వారా ట్యాంకర్లలో నీటిని వ్యాపారానికి వినియోగిస్తే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం. వ్యాపార రంగానికి కమర్షియల్ మీటర్లను తప్పనిసరిగా వినియోగించాలి. ఇలా వినియోగించని వారిని గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – వీరారెడ్డి, ట్రాన్స్‌కో ఏడీఈ, తూప్రాన్ -
పాతాళంలోకి గంగమ్మ
సాక్షి, ఆదిలాబాద్: ఆకాశ గంగమ్మ భువికి దిగి రానంటోంది. పాతాళ గంగమ్మ పైకి రానంటోంది. మరోవైపు మితిమీరిన ఎండలతో జనం గొంతెండిపోతోంది. గుక్కెడు నీటికోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భజలాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా భారీ వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. బజార్హత్నూర్లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48 మీటర్ల లోతుకు జలం వెళ్లిదంటే పరిస్థితి ఎంత జఠిలంగా ఉందో అర్థమవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా.. కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోసిపోతున్న జలాశయాలు జలాశయాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో సాత్నాల, మత్తడివాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, కుమురంభీం, పీపీరావు ప్రాజెక్టు, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. చెరువులు ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. బావులు, చేతిపంపుల్లో నీళ్లు రావడం లేదు. జూన్ 1 నుంచి వర్షాలు కురవాల్సి ఉన్నా ఈసారి నైరుతి రుతుపవనాలు కనికరించకపోవడంతో ఇంకా వర్షాల జాడలేకపోయింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటే వైపరీత్యాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా.. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది పరిస్థితులే ఈసారి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. జిల్లాలో కనిష్టంగా 5.52 మీటర్లలో, గరిష్టంగా 48 మీటర్లలో భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బజార్హత్నూర్, నేరడిగొండలో పరిస్థితి దారుణంగా ఉంది. బజార్హత్నూర్లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48.00 మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటాయి. ఏటా ఈ రెండు మండలాల్లోనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. జిల్లాలో సగటున కనిష్టంగా 4.23 మీటర్లు, గరిష్టంగా 24.98 మీటర్ల లోతులో నీళ్లు పడిపోయాయి. తానూర్ మండలం బోసిలో 24.98 మీటర్లు, సారంగాపూర్ మండలం బీరవెల్లిలో 19.20 మీటర్లు, నర్సాపూర్‌లో 18.60 మీటర్లు, లోకేశ్వరం మండలం మన్మడ్‌లో 24.50 మీటర్లు, కుంటాలలో 17.70 మీటర్లలో జలాలు పడిపోయాయి. కుమురంభీం జిల్లా.. కుమురంభీం జిల్లాలోనూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్‌లో 21.85 మీటర్లు, కాగజ్‌నగర్ శివారు జంబుగాంలో 15.50 మీటర్లు, దహెగాంలో 15.75 మీటర్లు, పెంచికల్పేట్ సమీపంలోని ఎల్కపల్లిలో 15.50 మీటర్ల లోతులో జలాలు పడిపోయాయి. ఇతర మండలాల్లోనూ భూగర్భ జలాలది ఇదే పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా.. మంచిర్యాల జిల్లాలోనూ భూగర్భజలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సగటున జిల్లాలో 7.98 మీటర్లకు జలాలు పడిపోయాయి. జైపూర్ మండలం కుందారంలో 19.54 మీటర్లకు, మందమర్రి సమీపంలోని పొన్నారంలో 16.35 మీటర్లు, తాండూర్‌లో 15.48 మీటర్లకు పడిపోయాయి. వర్షాలు పడితేనే రీచార్జ్ సమయానికి వర్షాలు కురువని పక్షంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి. మళ్లీ మంచి వర్షాలు పడినప్పుడే రీచార్జ్ అవుతాయి. ప్రజలు నీళ్లను పొదుపుగా వాడాలి. – టి.హన్స్‌రాజ్, అసిస్టెంట్ డైరెక్టర్, భూగర్భజల శాఖ, ఆదిలాబాద్ -
కరువు తీవ్రం బతుకు భారం
ఏళ్ల తరబడి కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. కోతకొచ్చిన కాయలతో పచ్చగా కళకళలాడాల్సిన మామిడి, బత్తాయి, సన్న నిమ్మ తోటలు కాయలతో సహా మలమలా మాడిపోతున్నాయి.. పొట్టేళ్లను వేలాడదీసినట్లు గెలలున్న అరటి చెట్లు వాడిపోతున్నాయి.. బొప్పాయిదీ అదే పరిస్థితి.. చెరకు ఎండిపోయిన గడ్డిలా మారింది.. కోతకు రావాల్సిన నువ్వు భూమికి అతుక్కుని వత్తుల్లా మారింది.. టమోటా, ఇతర కూరగాయల తోటలూ ఇందుకు భిన్నమేమీ కాదు. తినడానికి గడ్డి, తాగడానికి నీరులేక పశువులు బక్కచిక్కిపోతున్నాయి. ఇది తట్టుకోలేక అన్నదాతలు మనసు చంపుకుని వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. మరోవైపు.. వేలాది పల్లెలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. పనుల్లేక ఉపాధి కోసం కూలీలతోపాటు సన్నకారు రైతులు వలసబాట పట్టారు. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. సిరిధాన్యాలతో కళకళలాడాల్సిన పల్లె సీమలు కళావిహీనంగా, దయనీయంగా మారాయి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కరాళ నృత్యం సృష్టించిన బతుకు చిత్రం ఇది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని పుదూరు పొలాల్లో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న మహిళ సాక్షి, అమరావతి : ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఉష్ణతాపం, వేడిగాలులతో నీటి తడిపెట్టిన రెండో రోజే పంటపొలాలు తడారి ఎండిపోతున్నాయి. మరోవైపు ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టం పాతాళానికి చేరింది. బోర్లకు నీరు అందడంలేదు. ఎలాగైనా పైర్లు, పండ్ల తోటలను కాపాడుకోవాలనే ఆశతో అప్పుచేసి బోర్లు వేసినా నీరు పడటంలేదు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటి జాడేలేదు. దీంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. పంటల సాగుకు చేసిన అప్పులకు బోర్ల కోసం చేసిన అప్పులు తోడుకావడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటి నుంచి బయటపడే మార్గం కానరాక సతమతమవుతున్నారు. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో గెలలతో ఉన్న అరటి తోటలు, బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏతావాతా పెరిగిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు పడుతున్న మానసిక వేదన మాటలకందనిది. తాగునీరు.. కన్నీరు.. గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లకు అద్దం పడుతున్నాయి ఈ దృశ్యాలు. ఊరుదాటి కిలోమీటర్ల కొద్దీ వెళ్లినా చుక్క నీరు దొరకని దుస్థితిలో గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడో దూరాన చెలమల్లో అరకొర నీరు ఊరుతోందని తెలుసుకొని బిందెలు పట్టుకొని గంటల తరబడి తోడుకుంటూ గుక్కెడు నీళ్లు చేతికందగానే ఇంటి ముఖం పడుతున్నారు. మండు వేసవిలో మహిళలు చిన్న పిల్లలను కూడా వెంట నడిపించుకొస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇకనైనా తమకు కనీసం గుక్కెడు మంచినీళ్లు అందించాలని సర్కారును వేడుకుంటున్నారు. కందిపోతున్న కాయలు రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో నీటి తడులు అందక పండ్ల తోటల్లోని కాయలు నల్లగా కందిపోతున్నాయి. అరటి గెలలు వాడిపోతున్నాయి. బత్తాయి, బొప్పాయితోపాటు మామిడి కాయలు రంగు మారిపోతున్నాయి. టమోటాలు ఎండకు తెల్లగా రంగుమారి పిప్పితేలుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో టమోటా తోటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల టమోటా దిగుబడి భారీగా పడిపోయింది. అనంతపురం జిల్లాలో ఎండల నుంచి దానిమ్మ చెట్లను కాపాడుకోడానికి పాత చీరలను కప్పుతున్నారు. టమోటా రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘తోటకు పందిరి ఎటూ వేయలేం. భారీగా ఖర్చుపెట్టి గ్రీన్ హౌస్ లాంటివి పెట్టుకునే స్తోమతలేదు. అందువల్ల పాత చీరలు కొని పండ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని చెట్లకు రక్షణగా కట్టడంవల్ల పండ్లకు, మొగ్గలకు కొంతవరకు రక్షణగా ఉంటున్నాయి’ అని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన వెంకటప్ప గౌడ్ అన్నారు. పడిపోయిన భూగర్భ నీటిమట్టం గత ఏడాది మే 16వ తేదీతో పోల్చితే ప్రస్తుతం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో తప్ప మిగిలిన 11 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. చిత్తూరు జిల్లాలో గత ఏడాదికీ, ఈ ఏడాదికీ భారీ వ్యత్యాసం నెలకొంది. ఏకంగా 36.90 అడుగుల కిందకు జలమట్టం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే కాలంలో వైఎస్సార్ జిల్లాల్లో 19.65 అడుగుల కిందకు పడిపోయింది. రాయలసీమలో సగటున భూగర్భ జలమట్టం 20.86 అడుగులకు కిందకు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి నిదర్శనమని భూగర్భ జల శాఖ నిపుణులు చెబుతున్నారు. వరుసగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ఈ కారణంతోనే బోర్లు సైతం ఎండిపోతున్నాయి. ‘భూగర్భ జలమట్టం బాగా పెరగాలంటే మంచి వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రవహించాలి. ఇలా అయితేనే నీటి మట్టం పైకి వస్తుంది’ అని భూగర్భ జల రంగానికి చెందిన నిపుణుడు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని, వర్షపాతం కూడా సాధారణం (93 శాతం మాత్రమే )గానే ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇలాగైతే కష్టమే’ అని ఒక ఉన్నతాధికారి నిరాశను వ్యక్తం చేశారు. తాగునీటికీ కటకట రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ చాలాచోట్ల తాగునీటికి కటకట ఏర్పడింది. గ్రామాల్లో తాగునీరు అందించే బోర్లు ఇంకిపోయి నీరు రావడంలేదు. దీంతో చాలా గ్రామాల వారు సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల నుంచి బిందెల్లో నీరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా డ్రమ్ములతో నీరు తెచ్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో దారుణమైన కరువు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకుపైగా గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంచనా. జాడలేని పశు సంరక్షణ కేంద్రాలు మూగ జీవాలు మేత, నీరులేక అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశు సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వంఏర్పాటుచేసి మేత, నీరు అందించే చర్యలు తీసుకోవాలి. అయితే, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులు వరిగడ్డి కొనుక్కోవాలంటే ట్రాక్టరు రూ.15 వేలకు పైగా అవుతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినందున దానిని కొనే స్థితిలో చాలామంది రైతులు లేరు. ప్రభుత్వం చొరవ తీసుకుని గడ్డి, దాణా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయాల్సి ఉన్నా దానిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచక పశువులను కబేళాలకు ఇచ్చేస్తున్నారు. నిత్యం సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి బెంగళూరు, చెన్నై నగరాల కబేళాలకు వేలాది పశువులు తరలిపోతున్నాయి. ప్రకాశంలో 56 శాతం లోటు వర్షపాతం గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో సగటున 34.1 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో సాధారణంతో పోల్చితే 56.7 శాతం, నెల్లూరులో 54.6 శాతం, వైఎస్సార్ జిల్లాలో 55.9 శాతం, చిత్తూరులో 46.2, కర్నూలులో 48.1, అనంతపురంలో 43.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. వరుసగా ఐదేళ్లపాటు ఇలా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంవల్ల భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. చాలా నదులు ఎండిపోయాయి. డ్యామ్‌లలో నీరు డెడ్ స్టోరేజికి చేరింది. -
జటిలం!
జిల్లాలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. పలు మండలాల్లో 90 మీటర్లకు పైగా ఇంకిపోయాయి. అనేక మండలాలు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని అత్యంత ప్రమాదకర స్థాయిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యవసాయ బోరుబావులు దాదాపు 70 శాతానికిపైగా అడుగంటిపోయాయి. సాగు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సాగునీరు లేక కాడె పక్కన పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోర్లలో దాదాపు సగానికిపైగా ఎండిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు గుక్కెడు నీటి కోసం వెంపర్లాడాల్సి వస్తోంది. ఎండలు ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. ఏడాదిన్నరగా తీవ్ర వర్షాభావం నెలకొంది. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 35 మండలాలు డేంజర్ జోన్‌కు చేరాయి. మరో 21 మండలాలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరువయ్యాయి. అత్యధికంగా పీలేరు మండలంలో 97 మీటర్ల మేరకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. రామసముద్రంలో 90 మీటర్లు, వి.కోటలో 90, గుర్రంకొండలో 88, కలికిరిలో 84, కలకడలో 82, తంబళ్లపల్లెలో 81, పెద్దమండ్యంలో 80, పెద్దపంజాణిలో 78, కురబలకోటలో 72, ములకలచెరువులో 72, బంగారుపాళ్యంలో 68, నిమ్మనపల్లెలో 68, ఐరాలలో 59, కేవీపల్లెలో 57, బి కొత్తకోటలో 56, పీటీఎంలో 55, పులిచెర్లలో 48, పుంగనూరులో 48, మదనపల్లెలో 40, రొంపిచెర్లలో 40 మీటర్ల మేరకు భూVýæర్భ జలాలు అడుగంటిపోయాయి. మరో 14 మండలాల్లో 25 మీటర్లకు పైబడి జలాలు ఇంకిపోయాయి. సాధారణంగా అధికారులు 25 మీటర్లకు పైబడి జలాలు అడుంగటిన ప్రాంతాలను ప్రమాదకర స్థాయిగా నిర్ణయిస్తారు. 40 మీటర్లకు పైబడి జలాలు అడుగంటిన ప్రాంతాలను అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఈ లెక్కన అత్యంత ప్రమాదకర ప్రాంతా లుగా 21 మండలాలను పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. తాగునీటికీ తంటాలే.. జిల్లాలో మొత్తం 1,368 పంచాయతీలకు గాను 11,189 గ్రామాలు ఉన్నాయి. తాగునీటి సౌకర్యార్థం 8,802 బోర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వర్షాభావం కారణంగా అందులో ఇప్పటికే 3,500 బోర్లు ఇంకిపోయాయి. ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య జఠిలమైంది. ప్రభుత్వం కేవలం 1,641 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 324 గ్రామాలకు వ్యవసాయ బోర్ల నుంచి నీటిని సరఫరా చేస్తోంది. మిగిలిన గ్రామాల్లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరో రెండు వారాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 శాతానికి పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశముందని అధికారుల అంచనా.చతికిలపడిన సాగు జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం 3.8 లక్షల హెక్టార్లలో రైతులు అన్ని రకాల పంటలను సాగుచేస్తారు. అందులో ఖరీఫ్‌లో 2.11 లక్షల హెక్టార్లు, రబీలో 70 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తారు. ఇవిగాక ఉద్యాన పంటల కింద మామిడిని మరో 98 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. పంటలకు అవసరమైన సాగునీటి కోసం వ్యవసాయ బావులు 90 వేలు ఉండగా, బోర్లు 2.82 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావంతో దాదాపు 70 శాతం మేరకు బావులు, బోర్లు అడుగంటిపోయాయి. పంటలు సాగుచేయలేక వ్యవసాయ భూములను బీళ్లుగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘బోరు’మంటున్న రైతన్న..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రబీ పంటలు ఎండిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. రోజురోజు కు పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.. తద్వారా బోర్లన్నీ వట్టిపోతున్నాయి.. దీంతో రబీ పంటలు చేతికందడం ప్రశ్నార్థకంగా తయారైంది. ముఖ్యంగా బోర్లపై ఆశ లు పెట్టుకుని వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో ఎకరంపై రూ.వేల ల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి గింజ పాలు పట్టే దశకు చేరుకుంది. ఈ కీలక తరుణంలో నీళ్లు అందకపోవడంతో వరి దిగుబడే ప్రశ్నార్థకంగా మారింది. సుమారు సగానికి తగ్గే పరిస్థితుల నెలకొన్నాయి. బోర్లలో నీరు సరిగ్గా అందకపోవడంతో మూడు, నాలుగు ఎకరాలు వరి వేసుకున్న రైతులు బోరు నీటిని రెండు, మూడు ఎకరాలకు సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మిగితా పొలాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఇప్పటికే శనగ, ఉల్లి, ఎర్రజొన్న, తదితర పంటలు ఇప్పటికే దాదాపుగా కోతలు పూర్తయ్యాయి. వరి పంట కోత దశలో ఉంది. కూర ‘గాయాలు’ కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు సైతం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. మార్కెట్లో అధిక ధర దక్కుతుందని ఆశతో కూరగాయలు వేసుకున్న రైతులు పెట్టుబడులకే నష్టపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బీర, టమాట వంటి పంటలు ఎండల తీవ్రతకు ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 1.63 లక్షల బోర్లు.. విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 1.63 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 90 శాతం బోరు బావుల కనెక్షన్లే. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నీటి వాడకం అధికమవడం కూడా బోర్లు ఎండిపోవడానికి ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు.. జిల్లాలో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భీంగల్, సిరికొండ, ధర్పల్లి, బోధన్, కోటగిరి, మోర్తాడ్ తదితర మండలాల్లో రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఈ మండలాల్లో 20 మీటర్లకుపైనే లోతుకు నీటి మట్టాలు పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అత్యధికంగా భీంగల్ మండలం గోన్గొప్పులలో 40.10 మీటర్లు, సిరికొండలో 34.55 మీటర్ల లోతులో ఉన్నాయి. జిల్లాలో సగటు నీటిమట్టం 15.69 మీటర్లు ఉండగా, గతేడాది మార్చి నాటికి 14.06 మీటర్లకు తగ్గి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత మూడునెలల్లో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. డిసెంబర్లో 12.08 మీటర్లు, జనవరిలో 13.25, ఫిబ్రవరిలో 14.97 మీటర్ల లోతుకు పడిపోయాయి. కాగా ఎడపల్లి, నందిపేట్, ముప్కాల్, వేల్పూర్, మాక్లూర్, తదితర మండలాల్లోనూ ప్రమాదపుటంచునకు చేరుతున్నాయి. జిల్లాలో మరికొన్ని మండలాల్లోనూ భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులే కారణం.. భూగర్భజలమట్టాలు వేగంగా పడిపోవడానికి ప్రధానంగా వర్షాభావ పరిస్థితులే కారణం. జిల్లాలో ఈయేడాది సగటు వర్షపాతం 1,009 మిల్లీమీటర్లకుగాను కేవలం 849 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇలా లోటు వర్షపాతం నమోదు కావడంతో పాటు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికితోడు నీటి వినియోగం పెరగడం వల్ల నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. వివరాలు సేకరిస్తున్నాము... పంటలు ఎండిపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎండిపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నాము. రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాలని ముందే రైతులకు సూచించాము. కానీ చాలా చోట్ల రైతులు వరినే సాగు చేశారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో నీరు తగ్గిపోతోంది. దీంతో అక్కడక్కడ పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. గోవింద్, జిల్లా వ్యవసాయశాఖాధికారి -
పాతాళానికి చేరిన భూగర్భజలం
ఇక్కడ కనిపిస్తున్న పొలం మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్రెడ్డిది. ఇతనికి 20 ఎకరాల పొలం ఉంది. నాలుగు బోర్లు ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా నాలుగు బోర్లలో రెండింట్లో నీటిమట్టం పడిపోయింది. మరో రెండు బోర్లలో అంతంతమాత్రంగానే నీళ్లు వస్తున్నాయి. ఇరవై ఎకరాల రైతు గత రబీ సీజన్లో నాలుగున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే ఈ ఏడాది రబీలో నీళ్లు లేక కేవలం అర ఎకరంలో సాగుచేస్తున్నాడు. రైతులందరికీ ఇదే పరిస్థితి. ప్రతిఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోతుందనడానికి ఇదొక నిదర్శనం. వర్షాలు కురవక భూగర్భ జలాలు పడిపోతుండటంతో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. కోయిల్‌సాగర్ బ్యాక్ వాటర్‌ను మహబూబ్‌నగర్ రూరల్, కోయిలకొండ మండలాల్లోని చెరువుల్లోకి నింపితే రైతులు పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతోంది. ఆరేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా నీటిమట్టం పాతాళానికి చేరింది. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు సమస్య ఇలాగే ఉంది. 2013లో కురిసిన భారీ వర్షం తప్పా మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు కురవలేదు. అప్పటి నుంచి ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు, వాగులు, బోరుబావులు వట్టిపోయి పంటల సాగు కష్టతరంగా మారింది. ప్రస్తుత రబీ సీజన్లో సాగు చేసిన వరి, వేరుశనగ, జొన్న, శనగ తదితర పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవి రాకముందే.. వేసవి రాకముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడకపోవడం, మరోవైపు 24 గంటల విద్యుత్ సరఫరాతో బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి నీరు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా చిన్ననీటి వనరులు చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. రైతులు రబీ పంటలపై ఆశలు వదులుకున్నారు. కనీసం పశువులకు నీరు దొరకే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. అన్నం పెట్టే రైతన్నకు వివిధ పంటల సాగులో చేతినిండా పని లేకుండా పోవడంతో ఇతర పనులపై ఆధార పడాల్సి వస్తోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది సాగుకు నీరు వదలరాదని సంబంధిత అధికారులు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈ కారణంగా అక్కడ కూడా పంటల సాగుకు నీటి సమస్య ఎదురవుతోంది. బోరుబావుల కింద మాత్రం రైతులు సేద్యం చేస్తున్నారు. ఆ బోర్లు కూడా ఎప్పుడు ఎండిపోతాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి కారణాలతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. గతంలో ఐదు ఎకరాలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం రెండు ఎకరాలు కూడా సాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడు రబీ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాది వరి 22,500 హెక్టార్లు, వేరుశనగ 17వేల హెక్టార్లు, జొన్నలు 1000 హెక్టార్లు, శనగ వంటి చిరు ధాన్యాలు మొత్తం 1,930 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ ఏడు రబీ సీజన్లో వరి 15వేల హెక్టార్లు, వేరుశనగ 7,700 హెక్టార్లు, జొన్నలు 744 హెక్టార్లు, శనగలు 545 హెక్టార్లు, చిరు «ధాన్యాల వంటి పంటలు 1,415 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులంతా తమ బోరుబావుల్లో ఉన్న నీటిని బట్టి డ్రిప్ పద్ధతిని వినియోగిస్తూ ఆరుతడి పంటలు పండిస్తున్నారు. పాతాళానికి చేరిన జలం భూగర్భజలాలు లోలోతుకు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరీ పాతాళానికి వెళ్లిపోయాయి. ఖరీఫ్ గట్టెక్కినా రబీ పరిస్థితి దారుణంగా ఉంది. సాగునీటితోపాటు తాగునీటికీ సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో గత సంవత్సరం జనవరిలో భూగర్భ జలాలు 11.69 మీటర్ల వద్ద ఉండగా 2019 జనవరిలో 15.87 మీటర్లకు పడిపోయాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత 4.18 మీటర్లకు పడిపోయింది. నారాయణపేట మండలం అప్పారెడ్డిపల్లిలో భూగర్భజలాలు మరింత లోతుకు చేరాయి. జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా ఇక్కడ 15.79 మీటర్ల లోతుకు పడిపోయాయి. అదేవిధంగా గండీడ్ మండలం సల్కార్‌పేటలో 15.10 మీటర్లు, మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో 11.88 మీటర్లు, ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామంలో 8.65 మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత సంవత్సరం జనవరి నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ప్రతినెలా భూగర్భ జలాలు పడిపోవడమే తప్ప పెరగలేదు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 26 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే ఉంటే నీటి ఎద్దడి తప్పదు. వర్షపు నీటిని నిలువ చేస్తేనే.. వర్షపు నీటిని నిలువ చేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి వెళ్లే జీవనదులు, వాటికి అడ్డుగా ఆనకట్టలు కడితేనే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్లే వరద నీటికి అడ్డుకట్ట వేసి సద్వినియోగం చేసుకుంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ఉంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులు, పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి. నీటిని పొదుపుగా డ్రిప్‌ను వినియోగిస్తూ ఆరుతడి పంటలు, చిరు ధాన్యాలు సేద్యం చేసుకుంటే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. – సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి -
తరుముకొస్తోంది కరువు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శివారెడ్డిపేట చెరువు. 45 ఏళ్లుగా వికారాబాద్ పట్టణ ప్రజలకు ఇక్కడి నుంచే తాగునీరు సరఫరా చేశారు. వర్షాకాలంలో నిండిన చెరువు నీటిని శుద్ధి చేసి ప్రజల దాహార్తి తీర్చేవారు. ఒక్కసారి చెరువు నిండితే మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది ఉండేది కాదు. అయితే మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. గత సంవత్సరం కొత్తనీరు.. చుక్క కూడా చేరలేదు. దీంతో అడుగంటి పోయింది. నీటి సరఫరా కోసం మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ అర్బన్: వరుస వర్షాభావంతో జిల్లాలో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. జల జాడలు గతంలో ఎన్నడూ లేనంత లోతుల్లోకి పడిపోయాయి. వేసవి ప్రారంభానికి ముందే అన్ని గ్రామాల్లో సమస్యలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాల్లో భూగర్భ జలాలు భారీగా పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సుమారు లక్ష జనాభా ఉన్న జిల్లా కేంద్రంలోని ప్రజలకు సైతం రానున్న రెండు నెలల్లో నీటి ఎద్దడి తప్పేలా కనిపించడం లేదు. బొంరాస్‌పేట వంటి మారుమూల మండలాలను అధికారులు ఇప్పటికే డేంజర్ జోన్లుగా గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టం 125– 150 అడగుల లోతుకు పడిపోయింది. మూడేళ్లుగా ఎదురవుతున్న అనావృష్టి కారణంగా ఈ దుస్థితి నెలకొంది. ఈ సీజన్లో గత నవంబర్ నుంచే జిల్లాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. మానవ తప్పిదాలతో... రెండేళ్ల క్రితం మంచి వర్షపాతమే నమోదైనప్పటికీ భూగర్భ జలాలు పడిపోవడం వెనక మానవ తప్పిదాలే కారణమని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తోంది. అయితే ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని సర్కారు చేస్తున్న విజ్ఞప్తులను రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్ల ద్వారా నీటి దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపుపై వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చల విడిగా బోరు బావులు తవ్వడం, వాగుల్లో ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భంలో నీటి శాతం తగ్గుతోంది. 2017లో వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా చెరువుల్లో, కుంటల్లో పెద్దగా నీరు చేరలేదు. 2018లో వర్షాలు ఏమాత్రం లేకపోవడంతో చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. జిల్లాలో రోజు రోజుకు పడిపోతున్న నీటి మట్టం... 2017 డిసెంబర్ నాటికి జిల్లాలో సగటున 12.15 మీటర్ల (3.2 అడుగుల)లోతుల్లోకి భూర్గ నీటిమట్టం పడిపోయింది. 2018 మే నెల నాటికి 16.58 మీటర్ల లోతుకు వెళ్లింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడితే భూగర్భ నీటి శాతం పెరుగుతుందనుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురువక పోవడంతో భూమిలో నీటి శాతం మరింత తగ్గింది. 2018 నవంబర్‌లో 16.86 మీటర్ల లోతుకు పడిపోగా, 2018 డిసెంబర్ నాటికి ఏకంగా 17.06 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయింది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కన్నా ఈసారి 4.91 మీటర్ల లోతుల్లోకి నీరు పడిపోయినట్లు భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు. డేంజర్ జోన్లో బొంరాస్‌పేట... బొంరాస్‌పేట మండలంలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదముంది. దీంతో నాగిరెడ్డిపల్లి, లింగంపల్లి, నందార్‌పూర్, ఏర్పుమల్ల, అంసాన్పల్లి, గౌరారం, ఈర్లపల్లి, చౌదర్పల్లి, మంచన్‌పల్లి గ్రామాల్లో కొత్తగా బోరు బావులు వేయడాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తప్పనిసరిగా బోరు వేయాల్సి వస్తే సంబంధిత తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అప్రమత్తత అవసరం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చుక్క నీటిని కూడా వృథా చేయొద్దు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం నీటి కరువు తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. బొంరాస్‌పేటతో పాటు పెద్దేముల్, బంట్వారం మండలాల్లో ఇది ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. – ఎం.రామరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి -
పడావు భూముల్లో పచ్చని పంటలు!
సాగునీటికి వసతి లేని ప్రాంతం.. నీరు లేక భూములు బంజరుగా మారడం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన పాల్వాయి సత్యనారాయణ రెడ్డిని కలవరపరచింది. ఎలాగైనా తమ భూములను పంటలకు ఆలవాలంగా మార్చాలని, పచ్చదనాన్ని నింపుకోవాలన్న తపనతో అన్వేషించగా.. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని తోచింది. అయితే, అందుబాటులో ఉన్న అనేక పద్ధతుల్లో దేన్ని అనుసరించాలో అంతుపట్టలేదు. తన కుటుంబానికి చెందిన 50 ఎకరాలకు నీటి భద్రత సాధించుకోవడానికి తక్కువ ఖర్చులో చక్కని ఫలితాన్నిచ్చే నీటి సంరక్షణ పద్ధతి ఏమిటో తేల్చుకోవడం కష్టంగా తోచింది. ఆ దశలో ‘సాక్షి’తో కలసి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), సంగెం చంద్రమౌళి(98495 66009) ఆధ్వర్యంలో సాగుతున్న ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి తెలిసింది. వారి తోడ్పాటుతో 2016 జూన్‌లో ఎకరానికి కేవలం రూ. రెండు వేల ఖర్చుతో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక చోట 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతున సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల్లో కందకాలు తీయించారు. కందకాలు తవ్వి మట్టి కట్టలు పోయించారు. వాలును బట్టి 3–4, 5–6 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా విభజించి వాలుకు అడ్డంగా 3 అడుగుల, 3 అడుగుల వెడల్పున.. ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. కందకాలు తవ్వించి, మట్టికట్టలు పోయించారు. కందకాలు తవ్వించిన తర్వాత రెండేళ్లలో సాధారణ వర్షాలతోపాటు అకాల వర్షాలకు భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం నుండి పడే ప్రతి చినుకు కందకాలలోకి చేరి ఇంకిపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ఈ భూముల్లోని పత్తి పంట, ఇతర తోటలు ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో రెండు, మూడు వారాలు వర్షం పడకపోయినా పంటలకు ఢోకా లేదన్న భరోసాతో సత్యనారాయణ రెడ్డి ముందుకు సాగుతుండడం తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వర్షాలకు పడిన నీరు ఎక్కడికక్కడ ఆ కందకాల ద్వారా ఇంకి భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. ఆ విధంగా భూమి పొరల్లోకి చేరిన నీరే.. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పత్తి పంటకు, యూకలిప్టస్, టేకు తదితర తోటల్లో భూమికి నిమ్మునిస్తుంది. ఇటీవల వర్షాలు లేకపోయినా ఈ భూముల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగింది. ఇదే భూమికి దగ్గర్లోని రైతు భూమిలో పత్తి పంట కళతప్పింది. కందకాలు తవ్వుకొని పత్తి సాగు చేస్తున్నందున ఎకరాకు 20 క్వింటాళ్ళకు పైగానే పత్తి దిగుబడి వస్తున్నదని సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడి బాగుందన్నారు.తనకున్న 50 ఎకరాలలో ఏడెకరాల్లో టేకు మొక్కలు , ఇతరత్రా మొక్కలు పెంచుతున్నారు. అడవులను పెంచే భూమి చుట్టూ కందకాలు తీయడం మూలంగా మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయి. సాగులోకి తేవాలనే.. మూడున్నర ఏళ్ళ క్రితం మా భూములన్నీ పడావు పడి ఉండేవి. అసలు ఎందుకు సాగులోకి తేలేకపోతున్నామన్న బాధ ఉండేది. అప్పట్లోనే విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిచయమయ్యారు. మెట్ట భూముల్లో కూడా కందకాలతో నీటి భద్రత పొందవచ్చని, కందకాలు తవ్వించమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లు కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించా. అంతకుముందు వర్షం పడినా భూమిలోకి అంతగా ఇంకకుండా వరద వెళ్లిపోయేది. ఇప్పుడు ఎక్కడిదక్కడే ఇంకుతోంది. దీని వల్ల బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆనాడు పడావుగా ఉన్న భూములు నేడు పచ్చగా కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. దిగుబడి పెరగడంతో మా భూములకు కౌలుదారుల నుంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి రైతు తమ భూమిలో కందకాలు తీయించుకోవాలి. – పాల్వాయి సత్యనారాయణ రెడ్డి(98666 13645), బంగారి గడ్డ, చండూర్ మండలం, నల్లగొండ జిల్లా – మునుకుంట్ల గాలయ్య, సాక్షి, చండూర్, నల్లగొండ జిల్లా -
పైకి రాని పాతాళగంగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది భూగర్భజల మట్టాల్లో పెరుగుదల కనిపించ డం లేదు. గత జూలై, ఆగస్టు నెలలో సరైన వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాల్లో వృద్ధి గతంతో పోలిస్తే తక్కువగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వాయర్లు, చెరువుల్లో అనుకున్న మేర నీరు రాకపోవడంతో సెప్టెంబర్‌లో భూగర్భ జల మట్టాల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది సెప్టెంబర్ సీజన్‌తో పోలిస్తే 0.41 మీటర్ల దిగువనే భూగర్భ జల మట్టాలు ఉండటం కల వరపరిచే అంశమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పూర్తిగా నిండని చెరువులు మొత్తంగా చూస్తే గోదావరి, కృష్ణా బేసిన్‌లోని 44,180 చెరువులకు గానూ 14,418 చెరువులు 25 శాతం కన్నా తక్కువగా నిండగా, మరో 9,289 చెరువులు 25 నుంచి 50 శాతం వరకు మాత్రమే నిండాయి. రంగారెడ్డి జిల్లాలో 2,019 చెరువులు ఉండగా ఏకంగా 1,635 చెరువులు నీటి కరువును ఎదుర్కొంటున్నాయి. పెద్దపల్లి జిల్లాలోనూ 1,185 చెరువులకు గానూ 1,070 చెరువుల్లో నీరు చేరలేదు. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇదీగాక కురిసిన వర్షపాతం, పడిన సమయం ఆధారంగా సగటున 10 నుంచి 11 శాతం నీరు భూగర్భానికి చేరుతుంది. అయితే ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, కొన్ని ప్రాంతాల్లో అసలు కురవనే లేదు. భారీగా కురిసిన చోట పెద్ద ప్రవాహా లతో స్థానిక చెరువులు, రిజర్వాయర్లలోకి నీరు చేరగా, అసలు కురవని చోట నీరు భూగర్భా నికి చేరనే లేదు. ఈ కారణం చేతనే భూగర్భ జల మట్టాల్లో పెరుగుదల లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 41 మండలాల్లో భూగర్భ జల మట్టాలు 20 మీటర్ల దిగువన ఉండగా, 10 మీటర్ల నుంచి 20 మీటర్ల మధ్యన భూగర్భ జలాలున్న మండలాల సంఖ్య 208గా ఉంది. కేవలం 168 మండలాల్లో మాత్రమే 5 మీటర్ల ఎగువన భూగర్భ జల మట్టాలున్నట్లు భూగర్భజల విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి. దెబ్బతీసిన లోటు వర్షపాతం రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటున 12 నుంచి 10 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 724 మిల్లీమీటర్లు కాగా కేవలం 647 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జల సగటు మట్టాలు గత ఏడాదితో పోలిస్తే ఆశాజనకంగా లేవు. గత ఏడాది సెప్టెంబర్‌లో సగటు భూగర్భ జల మట్టం 8.95 మీటర్ల దిగువన ఉండగా, ప్రస్తుతం అది 9.36 మీటర్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 0.41 మీటర్ల దిగువన ఉంది. గద్వాల, రంగారెడ్డి, మేడ్చల్, నిర్మల్, పెద్దపల్లి, వికారాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో భూగర్భ జల మట్టాల్లో పెద్దగా పెరుగుదల లేదు. గరిష్టంగా మేడ్చల్‌లో 3.25 మీటర్లు, గద్వాలలో 3.17 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవకపోవడంతో 50 శాతానికి పైగా చెరువుల్లో నీరు చేరలేదు. దాంతో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేవని భూగర్భ జల విభాగం వెల్లడిస్తోంది. -
'బోరు' బోరు
అడుగంటుతోన్న భూగర్భజలాలు.. దాహార్తితో ప్రజల పాట్లు సగటున 3.52 మీటర్లు పడిపోయిన నీటిమట్టాలు.. గ్రేటర్ శివార్లలో భూగర్భ జలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే ఇంకుడు గుంతలు లేని కారణంగా పాతాళగంగ అడుగంటుతోంది. లక్షలాది బోరుబావులు ఒట్టిపోతున్నాయి. 1500 అడుగుల మేర బోర్లు వేసినా నీటిచుక్క జాడ లేదు. గతేడాది అక్టోబరు చివరితో పోలిస్తే ప్రస్తుతం ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, హయత్‌నగర్, మహేశ్వరం, శామీర్‌పేట్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చందానగర్ తదితర మండలాల్లో నీటిమట్టాలు అనూహ్యంగా పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి సగటున 11.04 మీటర్లు(36 అడుగులు)లోతున నీటినిల్వల జాడ దొరకగా.. ఈసారి 14.56 (47.78 అడుగులు)లోతునకు వెళితే కాని నీటిచుక్క అచూకీ కనిపించడంలేదు. - సాక్షి, సిటీబ్యూరో -
గ్రేటర్‌కు జలగండం
- నగరంలో తీవ్ర వర్షాభావం - అడుగంటుతున్న భూగర్భ జలం - జలాశయాల్లోనూ పడిపోతున్న నీటిమట్టం సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా మహా నగర దాహార్తిని తీరుస్తున్న జలాశయాలతో పాటు భూగర్భ జలమట్టాలు శరవేగంగా అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ నెలలో గ్రేటర్ పరిధిలో తాగునీటికి కటకట తప్పదని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ప్రతి మండలంలోనూ భూగర్భ జల మట్టాలు ఆందోళన కలిగించే స్థాయిలో పడిపోయాయి. జలమండలి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేని శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు వట్టిపోయి.. ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్‌ప్లాంట్లను ఆశ్రయించి జనం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో గత ఏడాది జూలై చివరి నాటికి సగటున 9.59 మీటర్ల లోతున పాతాళ గంగ దొరకగా.. ఈసారి 11.21 మీటర్ల లోతునకు వెళితే గానీ నీటిజాడ కనిపించడం లేదు. గ త సంవత్సరం కంటే సుమారు 1.63 మీటర్ల లోతున భూగర్భ జలాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ‘బోరు’మంటున్నాయ్... నగరంలో సుమారు 23 లక్షల బోరుబావులు ఉన్నాయి. ఇళ్లలో ఉన్న వీటికి ఆనుకొని ఇంకుడు గుంతలు లేకపోవడంతోనే నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. గతజూలైతో పోలిస్తే ప్రస్తుత ఏడాది జూలై చివరి నాటికి నాంపల్లి మండలంలో అత్యధికంగా 6.75 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టాయి. మారేడ్‌పల్లి మండలంలో 4.25 మీటర్లు, ఖైరతాబాద్‌లో 1.55 మీటర్లు, ఆసిఫ్‌నగర్‌లో 4.37 మీటర్లు, బండ్లగూడలో 0.30 మీటర్లు, బహదూర్‌పురాలో 0.48 మీటర్లు, హయత్‌నగర్‌లో 0.58 మీటర్లు, మహేశ్వరంలో 3.15 మీటర్లు, ఉప్పల్‌లో 0.55 మీటర్లు, బాలానగర్‌లో 0.80 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. జలాశయాల్లోనూ అదే దుస్థితి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లోనూ నీటి మట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట్) గరిష్ట మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1756.800 అడుగుల మేరకు నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 5 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సేకరిస్తోంది. ఇదే రీతిన సేకరిస్తే మరో 24 రోజుల పాటు మాత్రమే ఈ నిల్వలు సరిపోతాయని జలమండలి వర్గాలు తెలిపాయి. ఇక హిమాయత్‌సాగర్ గరిష్ట మట్టం 1763.500 అడుగులు. ప్రస్తుతం 1742.110 అడుగుల మేర నీళ్లున్నాయి. ఈ జలాశయం నుంచి జలమండలి నిత్యం 16.90 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తోంది. ఈ నిల్వలు మరో 117 రోజుల పాటు నగర అవసరాలకు సరిపోతాయని అంచనా. ఇక సింగూరు గరిష్ట మట్టం 1717.932 అడుగులు కాగా.. ప్రస్తుతం 1686.509 అడుగుల మేర నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 75 ఎంజీడీల జలాలను సేకరిస్తున్నారు. ఈ నిల్వలు 365 రోజుల అవసరాలకు సరిపోనున్నాయి. మంజీర జలాశయం గరిష్ట మట్టం 1651.750 అడుగులకు..ప్రస్తుతం 1644.900 అడుగుల మేర నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 45 ఎంజీడీల నీటిని సేకరిస్తున్నారు. ఈ నిల్వలు 365 రోజుల పాటు నగర తాగునీటి అవసరాలకు సరిపోనున్నాయి. ఇక అక్కంపల్లి (కృష్ణా) జలాశయం గరిష్టమట్టం 245 మీటర్లకు ప్రస్తుతం 244.400 మీటర్ల మేర నిల్వలున్నాయి. ఇవి మరో 365 రోజులపాటు నగర అవసరాలకు సరిపోనున్నాయి. నాగార్జునసాగర్(కృష్ణా) గరిష్ట మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 510.600 అడుగుల మేర నిల్వలున్నాయి. ఇవి మరో ఏడాది పాటు నగర అవసరాలకు సరిపోతాయని జలమండలి ప్రకటించింది. మొత్తంగా అన్ని జలాశయాల నుంచి రోజువారీ 366.90 ఎంజీడీల నీటిని సేకరించి... శుద్ధిచేసి 8.64 లక్షల నల్లాలకు సరిపెడుతున్నట్లు తెలిపింది. ఈ నెలలోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగితే సెప్టెంబర్‌లో నీటి కటకట తప్పదని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.