తరుముకొస్తోంది కరువు | Underground Water Level Decrease Rangareddy | Sakshi
Sakshi News home page

తరుముకొస్తోంది కరువు

Published Mon, Jan 21 2019 1:16 PM | Last Updated on Mon, Jan 21 2019 1:21 PM

Underground Water Level Decrease Rangareddy - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది శివారెడ్డిపేట చెరువు. 45 ఏళ్లుగా వికారాబాద్‌ పట్టణ ప్రజలకు ఇక్కడి నుంచే తాగునీరు సరఫరా చేశారు. వర్షాకాలంలో నిండిన చెరువు నీటిని శుద్ధి చేసి ప్రజల దాహార్తి తీర్చేవారు. ఒక్కసారి చెరువు నిండితే మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది ఉండేది కాదు. అయితే మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. గత సంవత్సరం కొత్తనీరు.. చుక్క కూడా చేరలేదు. దీంతో అడుగంటి పోయింది.  నీటి సరఫరా కోసం మున్సిపల్‌ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

వికారాబాద్‌ అర్బన్‌: వరుస వర్షాభావంతో జిల్లాలో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. జల జాడలు గతంలో ఎన్నడూ లేనంత లోతుల్లోకి పడిపోయాయి. వేసవి ప్రారంభానికి ముందే అన్ని గ్రామాల్లో సమస్యలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాల్లో భూగర్భ జలాలు భారీగా పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సుమారు లక్ష జనాభా ఉన్న జిల్లా కేంద్రంలోని ప్రజలకు సైతం రానున్న రెండు నెలల్లో నీటి ఎద్దడి తప్పేలా కనిపించడం లేదు. బొంరాస్‌పేట వంటి మారుమూల మండలాలను అధికారులు ఇప్పటికే డేంజర్‌ జోన్లుగా గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టం 125– 150 అడగుల లోతుకు పడిపోయింది. మూడేళ్లుగా ఎదురవుతున్న అనావృష్టి కారణంగా ఈ దుస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో గత నవంబర్‌ నుంచే జిల్లాలో నీటి కష్టాలు మొదలయ్యాయి.

మానవ తప్పిదాలతో... 
రెండేళ్ల క్రితం మంచి వర్షపాతమే నమోదైనప్పటికీ భూగర్భ జలాలు పడిపోవడం వెనక మానవ తప్పిదాలే కారణమని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తోంది. అయితే ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగించాలని సర్కారు చేస్తున్న విజ్ఞప్తులను రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్ల ద్వారా నీటి దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఆటోమేటిక్‌ స్టార్టర్ల తొలగింపుపై వ్యవసాయ, విద్యుత్‌ శాఖల అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చల విడిగా బోరు బావులు తవ్వడం, వాగుల్లో ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భంలో నీటి శాతం తగ్గుతోంది. 2017లో వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా చెరువుల్లో, కుంటల్లో పెద్దగా నీరు చేరలేదు. 2018లో వర్షాలు ఏమాత్రం లేకపోవడంతో చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయాయి.  
జిల్లాలో రోజు రోజుకు పడిపోతున్న నీటి మట్టం...  
2017 డిసెంబర్‌ నాటికి జిల్లాలో సగటున 12.15 మీటర్ల (3.2 అడుగుల)లోతుల్లోకి భూర్గ నీటిమట్టం పడిపోయింది. 2018 మే నెల నాటికి 16.58 మీటర్ల లోతుకు వెళ్లింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడితే భూగర్భ నీటి శాతం పెరుగుతుందనుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురువక పోవడంతో భూమిలో నీటి శాతం మరింత తగ్గింది. 2018 నవంబర్‌లో 16.86 మీటర్ల లోతుకు పడిపోగా, 2018 డిసెంబర్‌ నాటికి ఏకంగా 17.06 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయింది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కన్నా ఈసారి 4.91 మీటర్ల లోతుల్లోకి నీరు పడిపోయినట్లు భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు.

డేంజర్‌ జోన్‌లో బొంరాస్‌పేట... 
బొంరాస్‌పేట మండలంలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదముంది. దీంతో నాగిరెడ్డిపల్లి, లింగంపల్లి, నందార్‌పూర్, ఏర్పుమల్ల, అంసాన్‌పల్లి, గౌరారం, ఈర్లపల్లి, చౌదర్‌పల్లి, మంచన్‌పల్లి గ్రామాల్లో కొత్తగా బోరు బావులు వేయడాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.  తప్పనిసరిగా బోరు వేయాల్సి వస్తే సంబంధిత తహసీల్దార్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు.  

అప్రమత్తత అవసరం  
భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చుక్క నీటిని కూడా వృథా చేయొద్దు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం నీటి కరువు తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. బొంరాస్‌పేటతో పాటు పెద్దేముల్, బంట్వారం మండలాల్లో ఇది ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.  – ఎం.రామరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement