Drought area
-
కూళాంగల్: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్...?
మేక్సిమ్ గోర్కి ప్రఖ్యాత నవల ‘అమ్మ’లో ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేసే తండ్రి తల్లిని ఎందుకు చితక బాదుతున్నాడో చాలారోజులకు గాని అర్థం కాదు కొడుక్కు. పురుషుడిలోని హింసకు బాహ్య కారణాలూ ఉంటాయి. కరువు నేలలో పురుషులకు పని ఉండదు. స్త్రీలను హింసించడమే వారి పని. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీ అయిన ‘కూళాంగల్’ మధురై ప్రాంతంలో స్త్రీల మీద జరిగే హింసను పరోక్షంగా చర్చించింది. భర్త దాడికి పుట్టింటికి నిత్యం పారిపోయే భార్యను తిరిగి తేవడానికి తండ్రీ కొడుకులు బయలుదేరడమే ఈ కథ. నేడు కరోనా వల్ల ఉపాధులు తలకిందులై ఇళ్లల్లో చోటు చేసుకుంటున్న హింసను చర్చించడానికీ ఇది సందర్భమే. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బస్ ఆగుతుంది. ఒక ఆడమనిషి మూడు నీళ్లు నిండిన బిందెలను అతి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కిస్తుంది. ఆ నీళ్లను ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. ఆమె ఎవరో? ఎన్ని గంటలకు నిద్ర లేచిందో. ఎక్కడి నుంచి బస్సెక్కి ఇక్కడి దాకా వచ్చిందో. నీళ్లు పట్టుకోవడానికి ఎంతసేపు పట్టిందో. నీళ్లు ఇంటికి చేరడానికి ఇంకెంత సేపు పడుతుందో. ఇవన్నీ దర్శకుడు చెప్పడు. చూపడు. కాని చూస్తున్న ప్రేక్షకులకు ఇన్ని ఆలోచనలు తప్పక వస్తాయి. కరువు ఆ ప్రాంతంలో. కరువు అంటే నీటి సమస్య. నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్యే. ఎందుకంటే ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు కావాల్సింది వారికే కదా. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సన్నివేశం ‘కూళాంగల్’ సినిమాను తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరుకు దగ్గరగా ఉన్న అరిట్టపట్టి అనే ఊళ్లో 2019 మే నెలలో మొదలెట్టి తీశారు. దర్శకుడు వినోద్‌రాజ్ ది ఆ ప్రాంతమే. ఇది అతడి మొదటి సినిమా. ‘నా సినిమాలో మూడే కేరెక్టర్లు ప్రధానం. తండ్రి.. కొడుకు... కరువు’ అంటాడు వినోద్‌రాజ్. ‘కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా చిన్నక్కకు, ఆమె భర్తకు తగాదా వస్తే మా చిన్నక్క అత్తింటి నుంచి పుట్టింటికి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పది కిలోమీటర్లు మా బావ ఆమెను వెంటాడుతూనే వచ్చాడు. ఈ సినిమాకు ఆ సంఘటన ఒక స్ఫూర్తి’ అంటాడు దర్శకుడు వినోద్‌రాజ్. మధురైలోని కరువు ప్రాంతాల్లోని పల్లెల్లో ఏమీ పండదు. మగవారికి పని ఉండదు. నీళ్ల కటకట వల్ల శుభ్రత ఉండదు. అసహనంతో తాగడం. పేకాట ఆడటం. తగాదాలు పడటం. ఇంటికొచ్చి భార్యను హింసించడం... ఇవే పనులు. పిల్లల మీద ఈ తగాదాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. స్త్రీలు ఇళ్ల నుంచి పారిపోతుంటారు. ‘కూళాంగల్’లో తండ్రి కొడుకును అడుగుతాడు– ‘నీకు నేనంటే ఇష్టమా.. మీ అమ్మంటే ఇష్టమా’ అని. దానికి కొడుకు సమాధానం చెప్పడు. కాని సినిమాలో ఒకచోట వాడు ఒక రాయి మీద తల్లి పేరు, చెల్లిపేరు, తన పేరు రాసుకుంటాడు తప్ప తండ్రి పేరు రాయడు. తండ్రి దారుణమైన ప్రవర్తనకు అతడి నిరసన అది. ‘కూళాంగల్’ అంటే నున్నటి గులకరాళ్లు. ఈ సినిమా కథ భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, అతని వెనుక కొడుకు బయలుదేరుతారు. కాని దారంతా కరువు ఎలా ఉంటుందో, పచ్చటి మొక్క కూడా మొలవక ఆ పరిసరాలు ఎంత నిస్సారంగా ఉంటాయో, కిర్రుమనే చప్పుడు... మనిషి అలికిడి లేకపోవడం ఎంత దుర్భరంగా ఉంటుందో దర్శకుడు చూపుకుంటూ వెళతాడు. నీళ్లు చుక్క దొరకని ఆ దారిలో దాహానికి స్పృహ తప్పకుండా ఉండేందుకు పిల్లలు నున్నటి గులకరాయి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పదేళ్ల కొడుకు కూడా అలాగే చేస్తుంటాడు. కాని వాడి దగ్గర అప్పటికే చాలా గులకరాళ్లు పోగుపడి ఉంటాయి. అంటే తల్లి పారిపోవడం, తండ్రి వెళ్లి తిరిగి తేవడం, దారిలో ఈ పిల్లవాడు గులకరాయి చప్పరించడం ఆనవాయితీ అన్నమాట. కరువు ప్రాంతాల్లో మగవాళ్లు తీవ్రమైన అసహనంతో ఉంటే స్త్రీలు ఎలాగోలా చేసి, ఎలుకనో కుందేలునో పట్టుకుని ఏదో విధాన నాలుగు ముద్దలు వండి పెట్టడానికి పడే తాపత్రయాన్ని, నీళ్ల భారం మోయలేక వాళ్లు పడే అవస్థను దర్శకుడు చూపుతాడు. నటి నయనతార ఈ సినిమా చూసి దీని ఒక నిర్మాతగా మారడం విశేషం. ఆ విధంగా ఒక స్త్రీ ఈ స్త్రీల బాధను అర్థం చేసుకుందని భావించాలి. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనున్న ఈ సినిమా నామినేషన్స్‌కు వెళ్లగలిగితే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో పోటీ పడవలసి వస్తుంది. అంటే నామినేషన్‌కు చేరుకుంటే తర్వాతి మెట్టు అవార్డు గెలవడమే. గతంలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’, ‘జల్లికట్టు’, ‘గల్లీబాయ్’ సినిమాలు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లాయి. కాని కొన్ని నామినేషన్స్ వరకూ చేరాయి. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. అన్నట్టు ‘కూళాంగల్’ గత సంవత్సరంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతోంది. భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చిన పేరు వల్ల ఈ డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలోని దారుణమైన చాకిరీకి, తక్కువ రాబడికి అసహనం పొంది తన తండ్రి తల్లిని కొడుతున్నట్టు కొడుక్కు అర్థం అవుతుంది ‘అమ్మ’ నవలలో. ఆ పరిస్థితులు మార్చడానికి అతడు బయలదేరుతాడు. నేడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయిన ఇళ్లల్లో అసహనం చోటు చేసుకోవడం సహజం. కాని అది స్త్రీల మీద హింసగా ఏ మాత్రం రూపాంతరం చెందకూడదు. హింసకు తావులేని అవగాహనే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావాల్సింది. ‘కూళాంగల్’ వంటి సినిమాలు చెబుతున్నది అదే. కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. - ‘కూళాంగల్’ నిర్మాత నయనతార -
తరుముకొస్తోంది కరువు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శివారెడ్డిపేట చెరువు. 45 ఏళ్లుగా వికారాబాద్ పట్టణ ప్రజలకు ఇక్కడి నుంచే తాగునీరు సరఫరా చేశారు. వర్షాకాలంలో నిండిన చెరువు నీటిని శుద్ధి చేసి ప్రజల దాహార్తి తీర్చేవారు. ఒక్కసారి చెరువు నిండితే మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది ఉండేది కాదు. అయితే మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. గత సంవత్సరం కొత్తనీరు.. చుక్క కూడా చేరలేదు. దీంతో అడుగంటి పోయింది. నీటి సరఫరా కోసం మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ అర్బన్: వరుస వర్షాభావంతో జిల్లాలో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. జల జాడలు గతంలో ఎన్నడూ లేనంత లోతుల్లోకి పడిపోయాయి. వేసవి ప్రారంభానికి ముందే అన్ని గ్రామాల్లో సమస్యలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాల్లో భూగర్భ జలాలు భారీగా పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సుమారు లక్ష జనాభా ఉన్న జిల్లా కేంద్రంలోని ప్రజలకు సైతం రానున్న రెండు నెలల్లో నీటి ఎద్దడి తప్పేలా కనిపించడం లేదు. బొంరాస్‌పేట వంటి మారుమూల మండలాలను అధికారులు ఇప్పటికే డేంజర్ జోన్లుగా గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టం 125– 150 అడగుల లోతుకు పడిపోయింది. మూడేళ్లుగా ఎదురవుతున్న అనావృష్టి కారణంగా ఈ దుస్థితి నెలకొంది. ఈ సీజన్లో గత నవంబర్ నుంచే జిల్లాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. మానవ తప్పిదాలతో... రెండేళ్ల క్రితం మంచి వర్షపాతమే నమోదైనప్పటికీ భూగర్భ జలాలు పడిపోవడం వెనక మానవ తప్పిదాలే కారణమని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తోంది. అయితే ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని సర్కారు చేస్తున్న విజ్ఞప్తులను రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్ల ద్వారా నీటి దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపుపై వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చల విడిగా బోరు బావులు తవ్వడం, వాగుల్లో ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భంలో నీటి శాతం తగ్గుతోంది. 2017లో వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా చెరువుల్లో, కుంటల్లో పెద్దగా నీరు చేరలేదు. 2018లో వర్షాలు ఏమాత్రం లేకపోవడంతో చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. జిల్లాలో రోజు రోజుకు పడిపోతున్న నీటి మట్టం... 2017 డిసెంబర్ నాటికి జిల్లాలో సగటున 12.15 మీటర్ల (3.2 అడుగుల)లోతుల్లోకి భూర్గ నీటిమట్టం పడిపోయింది. 2018 మే నెల నాటికి 16.58 మీటర్ల లోతుకు వెళ్లింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడితే భూగర్భ నీటి శాతం పెరుగుతుందనుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురువక పోవడంతో భూమిలో నీటి శాతం మరింత తగ్గింది. 2018 నవంబర్‌లో 16.86 మీటర్ల లోతుకు పడిపోగా, 2018 డిసెంబర్ నాటికి ఏకంగా 17.06 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయింది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కన్నా ఈసారి 4.91 మీటర్ల లోతుల్లోకి నీరు పడిపోయినట్లు భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు. డేంజర్ జోన్లో బొంరాస్‌పేట... బొంరాస్‌పేట మండలంలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదముంది. దీంతో నాగిరెడ్డిపల్లి, లింగంపల్లి, నందార్‌పూర్, ఏర్పుమల్ల, అంసాన్పల్లి, గౌరారం, ఈర్లపల్లి, చౌదర్పల్లి, మంచన్‌పల్లి గ్రామాల్లో కొత్తగా బోరు బావులు వేయడాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తప్పనిసరిగా బోరు వేయాల్సి వస్తే సంబంధిత తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అప్రమత్తత అవసరం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చుక్క నీటిని కూడా వృథా చేయొద్దు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం నీటి కరువు తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. బొంరాస్‌పేటతో పాటు పెద్దేముల్, బంట్వారం మండలాల్లో ఇది ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. – ఎం.రామరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి -
కరువు ప్రకటన కోసం ప్రతిపాదనలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని 51 మండలాలను కరువు కింద ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పేర్కొన్నారు. కరువు పరిశీలనకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి గురువారం ఇక్కడి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు జిల్లాలో వర్షపాత లోటు 64.02 శాతం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో సాధారణ సాగు లక్షా 34 వేల హెక్టార్లకు గాను కేవలం 17 వేల హెక్టార్లు అంటే 12 శాతం మాత్రమే సాగైందని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ. 15.81 కోట్లు, పశుగ్రాసం కోసం రూ. 24.85 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి ఇప్పుడిస్తున్న విద్యుత్ సరఫరా సరిపోవడం లేదంటే అదనంగా ఇచ్చే అధికారాన్ని కలెక్టర్‌కు ఇచ్చామని వెల్లడించారు. సీపీడబ్లు్యఎస్ స్కీమ్ సకాలంలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేరుస్తామని, ప్రభుత్వ శాఖల ద్వారానే ఆ పనులు చేయిస్తామని హెచ్చరించారు. ఉపాధి పనుల కల్పన కోసం నాలుగు నెలల్లో రూ. 200 కోట్లు ఖర్చు చేశామని, ఈ యేడు రూ. 480 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. కృషి కల్యాణ్ అభియాన్‌లో కడప మొదటి స్థానంలో ఉందన్నారు. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే జిల్లా అందులో మొదటి స్థానంలో ఉందని వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో 18.88 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 1వ తేది నుంచి జిల్లా ప్రాజెక్టులకు శ్రీశైలం నీరు ఇవ్వాలని ఇటీవల కర్నూలులో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారని చెప్పారు. రెండు రోజుల్లో కేసీ కెనాల్‌కు సాగునీరు వస్తుందన్నారు. వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్ల కింద చేయాల్సిన 700 ఎకరాల భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామన్నారు. గండికోట ముంపునకు గురయ్యే కొండాపురం మండలం రామచంద్రనగర్‌లో కూడా భూసేకరణ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రెండవ జేసీ బి.శివారెడ్డి పాల్గొన్నారు. -
మేత కరువు
కడప సెవెన్ రోడ్స్/రాయచోటి రూరల్ : జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పశువుల మేత తీవ్ర సమస్యగా మారింది. వానలు పడక పచ్చిమేపు ఎలాగూ లేకపోయినా, రైతుల వద్ద ఒట్టిమేపు కూడా అయిపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. కడప, చెన్నూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు పెట్టి గ్రాసాన్ని తెచ్చుకుంటున్నారు. మేత తక్కువ కావడంతో పాల దిగుబడి కూడా తగ్గుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే అయినకాడికి పశువులను తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల ప్రత్యామ్నాయ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. బాటనీ, జువాలజీ మంత్రులమంటూ చెప్పుకునే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి సొంత పనుల్లో నిమగ్నమై తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలలో ఏ రైతును కదిలించినా ప్రస్తుతం పశుగ్రాస కొరత గురించే చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది చిన్న, సన్నకారు రైతులకు పాడి పశువులే ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. పాడి పశువులను పోషిస్తే అవి తమ కుటుంబాలను పోషిస్తాయని రైతులు అంటున్నారు. అందుకే కనీసం ఎకరా, అర ఎకరంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తుంటారు. ఒక్కో ఆవుకు రోజుకు అర కిలో తవుడు, కిలో ఫీడ్, పచ్చి మేత, ఎండు మేత వేస్తారు. అంతా కలిపితే రూ.150లు ఖర్చు వస్తోంది. రోజుకు ఒక్కో ఆవు సగటున 16 లీటర్ల పాలు ఇస్తోంది. లీటరు ధర సగటున రూ.23ల నుంచి రూ.25లు ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రకారం రూ.368లు వస్తోంది. అందులో ఖర్చు తీసేస్తే నికరంగా రోజుకు ఒక్కో ఆవు ద్వారా రూ.200లు ఆదాయం ఉంటుందని వివరిస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో పచ్చి మేత ఎక్కడా లేదు. బోర్ల కింద ఎక్కడైనా ఇంకా అరకొరగా ఉంటే, రోజురోజుకు నీటి మట్టం అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వట్టి మేత కూడా రైతుల వద్ద అయిపోయింది. దీంతో కడప, చెన్నూరు, వేంపల్లె తదితర ప్రాంతాలనుంచి తెచ్చుకుంటున్నారు. ఎకరా పొలంలో ఉండే ఎండు గడ్డి రూ.7 వేలు చెబుతున్నారని తెలుస్తోంది. ట్రాక్టర్‌కు గడ్డి ఎత్తే కూలీలకు రూ.1500లు, ట్రాక్టర్ బాడుగ రూ.3వేలు కలుపుకుంటే రూ.12వేలు ఖర్చు వస్తోందని రైతులు అంటున్నారు. అదే వేరుశనగ కట్టె అయితే సుమారు రూ.18వేలు అవుతోందని చెబుతున్నారు. ఈ ప్రాంతాలలోని రైతులకు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ, ఉపాధి పనులు ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. ప్రభుత్వం తమ గోడును ఆలకించి పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో మాదిరిగా క్యాటిల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఆవులు 59,580, ఎనుములు 50502, గొర్రెలు 4862, మేకలు 110422 ఉన్నాయి. ప్రస్తుతం 32,940 మెట్రిక్ టన్నుల గడ్డి కొరత ఏర్పడిందని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జయకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద 1300 మెట్రిక్ టన్నుల దాణా, వెయ్యి బేళ్ల సైలేజీ (మాగుడు గడ్డి), 70 క్వింటాళ్ల గడ్డి విత్తనాలు, 390 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ (దాణా మృతం) రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలకు అవసరమని పేర్కొన్నారు. గొర్రెలకు మేపు అందించండి నేను 3ఎకరాలు కౌలుకు పొలం తీసుకున్నాను. నారు కూడా వేశాను. వాన కోసం ఎదురుచూస్తున్నాను. ఇది కాకుండా 30 గొర్రెలు కూడా పెంచుకుంటున్నాను. ఎక్కడా మేత లేకపోవడంతో చాలా కష్టంగా ఉంది. మనుషులు తాగేందుకు నీరులేని పరిస్థితి వస్తోంది. దీంతో పశువులకు నీటిని తాపితే మనుషులకు తక్కువ వస్తున్నాయి. ఇంకా పది, 15రోజులు వర్షాలు పడకపోతే గొర్రెలు అమ్ముకోవాల్సిందే. 5ఏళ్ల క్రితం పశువుల ఆసుపత్రిలో రోజుకు 15కిలోల గడ్డి ఉచితంగా ఇచ్చారు. మళ్లీ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే గొర్రెల కాపరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేకలైతే ఆకులు, అలుములు తింటాయి. కానీ గొర్రెలు గడ్డి మాత్రమే తింటాయి. కనుక ప్రధానంగా మాకే సమస్య వస్తోంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు ఎస్.రెడ్డప్ప. ఈయనది సంబేపల్లె మండలం బొగ్గులవారిపల్లె. ఇతనికి 50గొర్రెలు ఉన్నాయి. ఇవే ఆయనకు ఉన్న ఆస్తి. వీటి పెంపకమే ఆయన జీవనాధారం. ఇప్పటిదాకా చుక్క వాన లేదు. కను చూపుమేరలో ఎక్కడా గడ్డి పరకైనా లేదు. దీంతో జీవాలకు మేత కరువైంది. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా రైతుల వద్ద గ్రాసంలేదు. దీంతో చిత్తూరు జిల్లాకు వెళ్లి రూ.15వేలు ఖర్చు చేసి ఒక ట్రాక్టర్ వేరుశనగ కట్టె తీసుకొచ్చారు. పగటిపూట గొర్రెలను అలా బయటకు తోలుకెళుతాడు. బయట ఎక్కడా మేత మేయకపోయినా.. అవి తిరిగి వస్తాయి. సాయంత్రం ఇంటికి తోలుకు వస్తాడు. ఒకప్పుడు గంపలు.. గంపలు వేరుశనగ, ఉలువ పొట్టు వేసి మేపుతుండేవాడు. ట్రాక్టర్ మేపు నెల తిరగకముందే అయిపోయింది. ఇప్పుడేం చేయాలి భగవంతుడా అని బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న దుర్గంబోయపల్లెకు చెందిన కొందరు గొర్రెల కాపరులు తమ మందలను తీసుకుని మైదుకూరుకు వెళ్లారు. ‘‘ఇంకా వారం, పది రోజులు దాటితే నేను కూడా ఏదో ఒక దిక్కుకు వెళ్లాల్సిందే.. మేత కోసం మూగ జీవాలు పడుతున్న అవస్థలు చూస్తుంటే మాకు ముద్ద దిగడంలేదు. జీవాలు బాగుంటేనే మేం బాగుంటాం.. ప్రభుత్వం దయ చూపి వేరుశనగ కట్టె, ఉలువ పొట్టు పంపిణీ చేస్తే చాలా మేలు చేసినట్లవుతుంది’’ అంటూ ఆయన సాక్షి వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. నెత్తిపై గడ్డి మోపుతో కనిపిస్తున్న ఈ రైతు పేరు పాలేటి. చిన్నమండెం మండలం జల్లవాండ్లపల్లెకు చెందిన రైతు. ఈయనకు 2ఎకరాల వర్షాధార భూమి ఉంది. వేరుశనగ సాగు చేస్తాడు. విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. వర్షం లేకపోవడంతో పంట వేయలేదు. భూమిపైనే ఆధారపడకుండా రెండు జెర్సీ ఆవులు మేపుతున్నాడు. ఆవులే ఆయనకు ప్రధాన జీవనాధారమయ్యాయి. చుట్టు పక్కల ఎక్కడా మేపు లేకుండా పోయింది. ట్రాక్టర్ రూ.12వేలు ఖర్చుచేసి వరి గడ్డి కొనుగోలు చేశాను. ఇప్పుడు ఆ గడ్డి కూడా అయిపోవస్తోంది. ఇక ఏమి చేయాలో పాలుపోవడంలేదు. మేతలేక పాల దిగుబడి కూడా తగ్గిపోతోంది. ఇంకా కొన్ని రోజులు వానలు పడకపోతే ఉన్న ఆవులను అయిన కాడికి అమ్ముకోవాల్సిందే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. -
‘కరువు జిల్లాలో రూ.10 లక్షలతో డిన్నర్’
సాక్షి, బెంగళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కరువు జిల్లా కలబురగిలో సీఎం డిన్నర్ పార్టీ కోసం రూ. పదిలక్షలు వెచ్చించారని బీజేపీ నేత ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాగా కలబురగి రికార్డులకెక్కింది. రైతులు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో కలబురగిలో కర్ణాటక సీఎం విందు కోసం ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టారని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ తెల్కూర్ ఆరోపించారు. సిద్ధరామయ్య రైతులకు క్షమాపణ చెప్పి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చేందుకు జిల్లా అధికారులు రూ.10 లక్షలు ఖర్చు చేశారని అన్నారు. ఒక్కో ప్లేట్‌కు రూ 800 ఖర్చు చేశారని, కొందరు వీవీఐపీలకు వెండి కంచాలు, బౌల్స్‌లో వడ్డించారని చెప్పారు. బీజేపీ నేత ఆరోపణలపై కలబురగి జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు. కర్ణాటకలో 2018 ప్రధమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి!
– ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగంపై చిత్తశుద్ధి లేదు – ప్రపంచస్థాయి రాష్ట్రం కాదు.. ఉపాధి కోసం వలసలు పోకుండా చూస్తే చాలు – వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అనంతపురం : రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం పాల్గొన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సదస్సులో మాట్లాడుతూ అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానని ప్రకటించారన్నారు. అలాగే వరుసగా మూడేళ్లు అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ జిల్లాలోనూ గతేడాది అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. ఇక కర్నూలు జిల్లా చరిత్రలోనే గతేడాది, ఈసారి ఎదుర్కొన్న çవ్యవసాయ సంక్షోభం మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రధాన పంట అయిన వేరుశనగ ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో 9.3 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే.. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే 6.9 లక్షల హెక్టార్లు వేశారని వివరించారు. రాయలసీమ జిల్లాల్లో కేవలం పెట్టుబడి కిందే రూ. 2,500 కోట్ల దాకా నష్టపోయినట్లు పత్రికలు ఘోషించాయన్నారు. కంది పంట కూడా ఈసారి చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. 1.20 లక్షల హెక్టార్లకు పైగా దెబ్బతినేలా ఉందన్నారు. హంద్రీ-నీవా నీళ్లు, రెయిన్గన్లు ఏమయ్యాయంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కంపెనీలకు డబ్బులిచ్చేందుకే రెయిన్గన్ల సినిమా తీశారన్నారు. ఇప్పటికైనా సరే వాస్తవ పరిస్థితులు అంచనా వేయాలన్నారు. ఒకవైపు పంట పండక, మరోవైపు పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతాంగం నష్టపోతోందన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఊరేగింపులు చేశారని, ఈవాళ ఆ విషయాన్ని పూర్తిగా వదిలిపెట్టారని విమర్శించారు. 2015 జూన్ 1 నాటికి గండికోటకు నీళ్లిస్తామని సీఎం స్వయంగా ప్రకటించారన్నారు. అప్పటిదాకా గడ్డం తీసుకోనని వారి శాసనమండలి సభ్యుడొకరు ఏకంగా శపథం చేశారన్నారు. అయితే.. ఏడాది పూర్తయినా అతీగతీ లేదన్నారు. చంద్రబాబుపై కోపంతోనే ఆ ఎమ్మెల్సీ గడ్డం పెంచుకున్నారేమోనంటూ ఎద్దేవా చేశారు. కృష్ణా, శ్రీకాకుళం తప్ప తక్కిన అన్ని జిల్లాల్లోనూ రబీలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతోందన్నారు. చిత్తూరు జిల్లాలో టమాటకు, కర్నూలు జిల్లాలో ఉల్లికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి రాయలసీమ జిల్లాలు వెళ్తున్నాయని, ఈ ప్రాంతాన్ని కాపాడాలని ఒక లేఖయినా కేంద్రానికి రాశారా అని సీఎంను ప్రశ్నించారు. సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, యూపీ నాగిరెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం పాల్గొన్నారు. -
కరువు కరాళ నృత్యం
-
కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం
ఉట్నూర్ రూరల్ : కరువు కోరల్లో చిక్కుకున్న ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందని, అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం జిల్లా వైపు దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజా సంఘాల నాయకులు నేతావత్ రాందాస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు బానోత్ రామారావులు ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో పంటలు సరిగా పండక కొద్దో గొప్పో పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య, గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్వరాష్ర్ట సాధన కోసం అసువులు బాసిన అమరవీరులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే కేవలం 485 మంది కుటుంబాలకే సహాయం చేసిందని, మిగితా వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1969 ఉద్యమం అమరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేతావత్ రాజేందర్, సీహెచ్ రాము, కచ్కడ్ తాతేరావు తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాను కరువు ప్రాం తంగా ప్రకటించి, ఈజీఎస్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం తోపాటు పెం డింగ్ నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రా జేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు బుధవారం కలెక్టర్ వాకాటి కరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ జిల్లాలో కరువు నివారణ చ ర్యలు చేపట్టాలని, రుణమా ఫీని పూర్తిగా అ మలు చేయాలన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు కృషి చేయూలని కోరారు. సోషల్ ఆడిట్‌పై అభినందనలు.. జిల్లాలో పీఆర్ రోడ్ల నిర్మాణంలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో చేపడుతున్న సామాజిక తనిఖీ బాగుందని కాంగ్రెస్ నాయ కులు అన్నారు. ప్రజాధనం వృథాకాకుండా, అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమం అద్భుతమని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు, నాయకులు వెంకట్రాంరెడ్డి, డాక్టర్ బండా ప్రకాష్, ఈవీ శ్రీనివాస్‌రావు, బత్తినిశ్రీనివాస్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'గోస్పాడును కరువు ప్రాంతంగా ప్రకటించాలి'
గోస్పాడు (కర్నూలు) : కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, సహాయ చర్యలు ప్రారంభించాలని సీపీఎం మంగళవారం నుంచి రిలే దీక్షలకు దిగింది. మండలంలో కరువు పరిస్థితులు అలుముకోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు. దీంతో పలువురు బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలకు దిగారు. -
కర్నూలు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలి
కర్నూలు : కర్నూలు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కర్నూలు జిల్లాలోని దేవనకొండ, కరివేమల, కలిడికొండ గ్రామాల్లోని పంట పొలాలు ఏపీ రైతు సంఘం సభ్యులు పరిశీలించారు. చెరువులను నీటితో నింపి రైతులకు సాగు నీరు అందించాలని రైతు సంఘం సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జగన్నాథం ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటించింది. -
ఆత్మహత్యలను ఆపేది ప్రకృతి సేద్యమే!
పరిహారం పెంపుకంటే అప్పులపాలు కాకుండా చూడటం ముఖ్యం ‘సాక్షి’తో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ ఆరుగాలం కష్టించి.. చెమట ధారలతో నేలను తడిపి.. సమాజం ఆకలి తీర్చుతున్న అన్నదాతలు అసలైతే సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అయితే, వాస్తవం మరోలా ఉంది. ఎడతెగని అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ప్రభుత్వ పథకాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు.. ఇవేవీ రైతు ప్రాణాలను నిలబెట్టలేకపోతున్నాయి.. సకల వృత్తులకు తల్లి అయిన సంక్షుభిత వ్యవసాయానికి కాయకల్ప చికిత్స చేసి.. రైతులోకానికి తిరిగి జవజీవాలనివ్వటం అసలు సాధ్యమేనా? విష రసాయనిక అవశేషాలతో, పర్యావరణ కాలుష్యంతో జాతి యావత్తునూ రోగగ్రస్తంగా మార్చిన పారిశ్రామిక సేద్య పద్ధతిని ఉన్నట్టుండి మార్చడం సాధ్యమేనా?? సాధ్యమైతే ఎలా??? ఈ ప్రశ్నలన్నిటికీ ఉన్న ఏకైక శాశ్వత పరిష్కారం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో తప్ప మరెక్కడా లేదంటున్నారు సుభాష్ పాలేకర్. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడైన పాలేకర్ ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మహారాష్ట్ర కరువు ప్రాంతం విదర్భలో రైతు కుటుంబంలో పుట్టిన పాలేకర్ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నారు. రసాయనిక సేద్యం కొనసాగించే క్రమంలో ఎదురుదెబ్బలు తిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్- జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిని రూపొందించి.. 16 ఏళ్లుగా దేశాటన చేస్తూ రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కర్నూలులో ఈ నెల 25న(ఎస్ఎల్ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు) ప్రారంభమయ్యే 5 రోజుల రైతు శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వెళ్తూ హైదరాబాద్ వచ్చిన పాలేకర్‌తో ముఖాముఖిలో ముఖ్యాంశాలు... {పకృతి సేద్యం అవసరమేమిటి? దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రసాయనిక వ్యవసాయ విధానం వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, శిలీంద్ర నాశనులు.. అన్నిటినీ అధిక ధరలకు కొనుగోలు చేసి పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. మార్కెట్ మాయాజాలంలో బలిపశువు అవుతున్న రైతు ఎడాపెడా దోపిడీకి గురవుతూ నిరంతరం అప్పుల పాలవుతున్నారు. దారీతెన్నూ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 7 లక్షల మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలే రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి. కేన్సర్, మధుమేహం వంటి అనేక దారుణమైన వ్యాధులు విజృంభించడానికీ రసాయనిక వ్యవసాయమే మూలకారణం. అదెలా? రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు, నైట్రేట్లు పోగుపడిన ఆహారోత్పత్తులను తిన్న మనుషులు రోగగ్రస్తులవుతున్నారు. ఈ ఆహారంలో సూక్ష్మపోషకాలతోపాటు ఔషధ విలువలు లోపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ఆహారంలో పోషకాలతోపాటు ఔషధ విలువలు ఉంటాయి. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంతో ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నాయి. గతంలో ఎరుగని స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి మొండి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. గత మూడేళ్లుగా రుతుపవనాల టైమ్‌టేబుల్ మారటం వల్ల ఖరీఫ్, రబీ పంటల సాగు నెల రోజులు ఆలస్యమవుతోంది. కరువు ప్రాంతాల్లో అధిక వర్షం, వర్షాలు బాగా పడే చోట కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనంతటికీ పరిశ్రమలతోపాటు రసాయనిక సేద్యంతో ఏర్పడే వాయుకాలుష్యమే కారణం. రైతును దోపిడీ నుంచి, వినియోగదారులను విషతుల్యమైన ఆహారం నుంచి రక్షించాలంటే ప్రకృతి సేద్యమే పరిష్కారం. ప్రకృతి సేద్యంలో మొదటి ఏడాది సరైన దిగుబడి రాదన్న ప్రచారం ఉంది..? ఇది కొంతమంది చేస్తున్న దుష్ర్పచారం. వెయిటింగ్ పీరియడ్ లేదు. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలన్నిటినీ పూర్తిగా పాటిస్తే మొదటి ఏడాది కూడా దిగుబడి అంతకుముందుకన్నా ఏమాత్రం తగ్గదు. వేలాది మంది రైతులకు శిక్షణ ఇస్తున్నారు కదా.. రైతుల స్పందన ఎలా ఉంది? 1998 నుంచి దక్షిణాదిలో, మూడేళ్లుగా ఉత్తరాదిలోనూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై రైతులకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాం. దేశంలో 40 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ విషపూరితం కాని అమృతాహారాన్ని ప్రజలకు అందిస్తూ సంతోషంగా ఉన్నారు. వీరిలో శిక్షణ పొందిన వారు కొందరే. పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్నవారు కొందరు, పక్కరైతుల పొలాలను చూసి నేర్చుకుని ప్రకృతి సేద్యం చేస్తున్న వారు మరికొందరు. ఆధ్యాత్మిక స్వభావం కలిగిన రైతులు వెంటనే ఈ పద్ధతిలోకి మారుతున్నారు. శిబిరాలకు యువ రైతులు ఎక్కువగా వస్తున్నారు. వీరిలో కనీసం సగం మంది ప్రకృతి సేద్యం చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపిస్తోంది కదా..? అవును. తెలంగాణ వ్యవసాయ మంత్రి, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకుడు తదితర శాస్త్రవేత్తలు ఒకరోజు శిబిరంలో పాల్గొన్నారు. ప్రశ్నలడిగారు. ఈ పద్ధతిలో సాగవుతున్న పంటలు చూశారు. కానీ, తర్వాత మళ్లీ ఎటువంటి స్పందనా లేదు. {పకృతి సేద్యాన్ని ప్రభుత్వ విధానంగా ప్రకటిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా? తప్పకుండా. రైతులు విత్తనాలు, ఎరువుల దగ్గర్నుంచీ అన్నీ కొంటున్నారు. తీరా పంట అమ్మబోతే ధర గిట్టుబాటు కావటం లేదు. ప్రకృతి వ్యవసాయంలో దేన్నీ కొనే పని లేదు. ఒక దేశీ ఆవుతో 30 ఎకరాల్లో సేద్యం అన్ని రకాల దోపిడీల నుంచి రైతులను పూర్తిగా రక్షించడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతుల్లో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోకపోవటమే ఇందుకు నిదర్శనం. పోషకాలు, ఔషధ విలువలతో కూడిన అమృతాహారాన్ని పండిస్తున్న ఈరైతులకు వినియోగదారులు సంతోషంగా రెట్టింపు ధర ఇస్తున్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు మార్కెటింగ్ సమస్య లేదు. అప్పుల అవసరం లేదు కాబట్టి పంటను తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ధర వచ్చినప్పుడే అమ్ముకుంటారు. జన్యుమార్పిడి విత్తనాల అవసరం లేదు. స్థానిక విత్తనాలతోనే అధిక దిగుబడి వస్తోంది. అవి కొనాల్సిన ఖర్చుండదు. వరకట్నాలు, ఆర్భాటపు పెళ్లిళ్లకు మేం దూరంగా ఉంటాం. మా ఇద్దరు అబ్బాయిల పెళ్లి సందర్భంగా మేం డబ్బు, బంగారం కూడా తీసుకోలేదు. కాబట్టి అప్పులు చేయాల్సిన పని లేదు. వలస పోవాల్సిన అగత్యం లేదు. ప్రకృతి వ్యవసాయంలో 10 శాతం విద్యుత్, 10 శాతం నీరు సరిపోతాయి. ప్రకృతి వనరుల విధ్వంసం ఆగి భూతాపం తగ్గుతుంది. సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కదా? సేంద్రియ సేద్యం రసాయనిక సేద్యం కన్నా ప్రమాదకరం. కంపోస్టు, వర్మీకంపోస్టు, పశువుల ఎరువులో 46% సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని పొలంలో వేసిన తర్వాత 28 డిగ్రీల సెల్షియస్కన్నా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సేంద్రియ కర్బనం విడుదలై.. కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. సేంద్రియ రైతులకు రసాయనిక సేద్యంలో కన్నా ఎక్కువ ఖర్చవుతోంది. ప్రకృతి వ్యవసాయంలో ఈ సమస్యల్లేవు. సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి రుజువు చేసి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. మీ అభిప్రాయం? ఇది చాలా ప్రమాదకరం. రైతుల అప్పుల బాధను ఈ చర్య శాశ్వతంగా తీర్చలేదు. అప్పుల్లో కూరుకుపోయిన రైతుల మదిలో అలాగైనా పిల్ల పెళ్లి అవుతుందన్న భావన కలిగించే ప్రమాదం ఉంది. అంతిమంగా ఈ చర్య ఆత్మహత్యలకు దోహదం చేసే ప్రమాదం ఉంది. అప్పులు అవసరం లేని ప్రకృతి సేద్యపద్ధతిని అలవాటు చేయడమే వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం. సంక్షోభాన్ని పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా. -
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
నర్సాపూర్: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ కేవలం 8 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలాగే అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి రైతు కూలీలను ఆదుకోవాలన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని ఉండడంతో రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గోదాముల్లో స్థలం లేదంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతుల వద్ద ధాన్యం ఉన్నంత వరకు కొనుగోలు చేయాలని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 72 గంటల్లో ధాన్యం విక్రయించిన సొమ్ము వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలన్నారు. అలాగే చెరకు మద్దతు ధరను టన్నుకు రూ.మూడు వేలుగా ప్రకటించాలన్నారు. చెరకు క్రషింగ్ చేస్తారో చేయరో తెలియని పరిస్థితి నెలకొందని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. విచారణ పేరుతో కాలయాపన.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ప్రభుత్వం విచారణల పేరుతో కాలయాపన చేయవద్దని సునీతారెడ్డి ప్రభత్వాన్ని కోరారు. ఆత్మహత్యలపై డీఎస్పీ, ఆర్డీఓ, తహశీల్దార్లు విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని, విచారణలో జాప్యం జరగడంతో రైతు కుటుంబాలకు నష్టం జరగుతోందన్నారు. పార్టీ సభ్యత్వంపై రేపు సమీక్ష జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని సునీతారెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆదివారం జహీరాబాద్‌కు, డిసెంబరు 3న నారాయణఖేడ్‌కు పార్టీ ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. డిసెంబరు 1న జిల్లాలో సభ్యత్వ నమోదును సమీక్షించేందుకు అందోలులో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరవుతారన్నారు. సమీక్షకు జిల్లాలోని పార్టీ మండల స్థాయి నాయకులు తదితరులు హాజరు కావాలని కోరారు. జిల్లాలో లక్షా 20వేల సభ్యత్వ నమోదు లక్ష ్యంగా నిర్ణయించామన్నారు. -
కరువు కనిపించలేదా?
లాతూర్: రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోవడంలేదని బీజేపీ ఆరోపించింది. మరాఠ్వాడా వంటి ప్రాంతాల్లో వర్షాలు లేక పంట భూములు బీడివారిపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆ పార్టీ విమర్శించింది. రాష్ట్రాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డీఎఫ్ ప్రభుత్వాన్ని బీజీపీ డిమాండ్ చేసింది. ఇలా చేయడం వల్ల కేంద్రం నుంచి కరువు నివారణ చర్యలకు గాను నిధులను రాబట్టేందుకు అవకాశముంటుందని పేర్కొంది. బీజేపీ నాయకుడు, రాష్ట్ర విధాన కౌన్సిల్లో ప్రతిపక్షనేత అయిన వినోద్ తావ్డే బుధవారం మీడియాతో మాట్లాడారు. వర్షాలు లేక రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో కరువు ప్రాంతాలను ప్రకటించి కేంద్రంలోని మోడీ సర్కార్‌తో మాట్లాడి నిధులు తేవాలని ఆయన సూచించారు. ‘కరువు ప్రాంతాల్లో మున్ముందు వర్షాలు పడతాయోమోనని సీఎం ఇంకా ఆశలు పెట్టుకుని ఉన్నారేమో... ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది..’ అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రం సుమారు రూ.3 లక్షల కోట్ల రుణభారంలో ఉందని ఆయన అన్నారు. డీఎఫ్ ప్రభుత్వ హయాంలో అవినీతి కోరలు చాచడంతో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని తావ్డే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతులకు సకాలంలో విత్తనాలు అందజేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత కరువుపై ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా క్షీణించాయని తావ్డే విమర్శించారు. ఎంహెచ్ఏ నివేదిక ప్రకారం శాంతిభద్రతల విషయంలో మన రాష్ట్రం 27వ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై తావ్డే స్పందిస్తూ.. బీజేపీ, శివసేన సీనియర్ నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కూటమిలోని అన్ని పార్టీలకూ సముచితమైన పాత్ర ఉండేలా సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై చర్చలు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తమ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తావ్డే చెప్పారు.