రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి!
– ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగంపై చిత్తశుద్ధి లేదు
– ప్రపంచస్థాయి రాష్ట్రం కాదు.. ఉపాధి కోసం వలసలు పోకుండా చూస్తే చాలు
– వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
అనంతపురం : రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం పాల్గొన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సదస్సులో మాట్లాడుతూ అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానని ప్రకటించారన్నారు. అలాగే వరుసగా మూడేళ్లు అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ జిల్లాలోనూ గతేడాది అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. ఇక కర్నూలు జిల్లా చరిత్రలోనే గతేడాది,
ఈసారి ఎదుర్కొన్న çవ్యవసాయ సంక్షోభం మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రధాన పంట అయిన వేరుశనగ ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో 9.3 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే.. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే 6.9 లక్షల హెక్టార్లు వేశారని వివరించారు. రాయలసీమ జిల్లాల్లో కేవలం పెట్టుబడి కిందే రూ. 2,500 కోట్ల దాకా నష్టపోయినట్లు పత్రికలు ఘోషించాయన్నారు. కంది పంట కూడా ఈసారి చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. 1.20 లక్షల హెక్టార్లకు పైగా దెబ్బతినేలా ఉందన్నారు. హంద్రీ-నీవా నీళ్లు, రెయిన్‌గన్లు ఏమయ్యాయంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కంపెనీలకు డబ్బులిచ్చేందుకే రెయిన్‌గన్ల సినిమా తీశారన్నారు. ఇప్పటికైనా సరే వాస్తవ పరిస్థితులు అంచనా వేయాలన్నారు. ఒకవైపు పంట పండక, మరోవైపు పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతాంగం నష్టపోతోందన్నారు.
పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఊరేగింపులు చేశారని, ఈవాళ ఆ విషయాన్ని పూర్తిగా వదిలిపెట్టారని విమర్శించారు. 2015 జూన్ 1 నాటికి గండికోటకు నీళ్లిస్తామని సీఎం స్వయంగా ప్రకటించారన్నారు. అప్పటిదాకా గడ్డం తీసుకోనని వారి శాసనమండలి సభ్యుడొకరు ఏకంగా శపథం చేశారన్నారు. అయితే.. ఏడాది పూర్తయినా అతీగతీ లేదన్నారు. చంద్రబాబుపై కోపంతోనే ఆ ఎమ్మెల్సీ గడ్డం పెంచుకున్నారేమోనంటూ ఎద్దేవా చేశారు.
కృష్ణా, శ్రీకాకుళం తప్ప తక్కిన అన్ని జిల్లాల్లోనూ రబీలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతోందన్నారు. చిత్తూరు జిల్లాలో టమాటకు, కర్నూలు జిల్లాలో ఉల్లికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి రాయలసీమ జిల్లాలు వెళ్తున్నాయని, ఈ ప్రాంతాన్ని కాపాడాలని ఒక లేఖయినా కేంద్రానికి రాశారా అని సీఎంను ప్రశ్నించారు. సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, యూపీ నాగిరెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం పాల్గొన్నారు.