మాట్లాడుతున్న మంత్రులు సోమిరెడ్డి, ఆది
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని 51 మండలాలను కరువు కింద ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పేర్కొన్నారు. కరువు పరిశీలనకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి గురువారం ఇక్కడి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు జిల్లాలో వర్షపాత లోటు 64.02 శాతం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో సాధారణ సాగు లక్షా 34 వేల హెక్టార్లకు గాను కేవలం 17 వేల హెక్టార్లు అంటే 12 శాతం మాత్రమే సాగైందని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ. 15.81 కోట్లు, పశుగ్రాసం కోసం రూ. 24.85 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు.
ప్రస్తుతం సాగు చేసిన పంటలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి ఇప్పుడిస్తున్న విద్యుత్ సరఫరా సరిపోవడం లేదంటే అదనంగా ఇచ్చే అధికారాన్ని కలెక్టర్‌కు ఇచ్చామని వెల్లడించారు. సీపీడబ్లు్యఎస్ స్కీమ్ సకాలంలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేరుస్తామని, ప్రభుత్వ శాఖల ద్వారానే ఆ పనులు చేయిస్తామని హెచ్చరించారు. ఉపాధి పనుల కల్పన కోసం నాలుగు నెలల్లో రూ. 200 కోట్లు ఖర్చు చేశామని, ఈ యేడు రూ. 480 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. కృషి కల్యాణ్ అభియాన్‌లో కడప మొదటి స్థానంలో ఉందన్నారు. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే జిల్లా అందులో మొదటి స్థానంలో ఉందని వివరించారు.
ప్రస్తుతం జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో 18.88 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 1వ తేది నుంచి జిల్లా ప్రాజెక్టులకు శ్రీశైలం నీరు ఇవ్వాలని ఇటీవల కర్నూలులో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారని చెప్పారు. రెండు రోజుల్లో కేసీ కెనాల్‌కు సాగునీరు వస్తుందన్నారు. వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్ల కింద చేయాల్సిన 700 ఎకరాల భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామన్నారు. గండికోట ముంపునకు గురయ్యే కొండాపురం మండలం రామచంద్రనగర్‌లో కూడా భూసేకరణ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రెండవ జేసీ బి.శివారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment