adinarayanareddy
-
ఆది ఇంట.. ఎమ్మెల్సీ మంట!
సాక్షి ప్రతినిధి కడప: మంత్రి ఆది నారాయణరెడ్డి ఇంట్లో ఎమ్మెల్సీ మంట మండుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన అన్న లేదా ఆయన తనయుడు భూపేష్ అంటూ ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అంతలోనే సోదరులంతా కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని చిన్నాన్న కుమారులను ఉసిగొల్పారు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా రాజకీయాల్లో లాభనష్టాలను బేరీజు వేస్తూ తమకే ఎమ్మెల్సీ సీటు కేటాయించాలనే దిశగా ఎవరికి వారు వాదనలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దేవగుడి సుబ్బరామిరెడ్డి, శంకర్‌రెడ్డిలు సోదరులు. రాజకీయాల్లో శంకర్‌రెడ్డి (మంత్రి ఆదినారాయణరెడ్డి చిన్నాన్న) క్రియాశీలకపాత్ర పోషించేవారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల చేతిలో మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద 1990 డిసెంబర్ 5న దేవగుడి శంకర్‌రెడ్డి, భీమగుండం గోపాల్‌రెడ్డిలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు 2006లో శిక్ష విధించగా, అప్పీల్‌కు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ 2008లో కేసును కొట్టి వేసింది. ఆపై శంకర్‌రెడ్డి తనయుడు శివనారాయణరెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి నుంచి కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ప్రస్తుతం ఇరువర్గాలు టీడీపీ శిబిరంలో ఉండడంతో పరస్పర రాజకీయ అవగాహనతో మంత్రి ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసేలా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఆ సీటు తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మంత్రి షరతు విధించారు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి మంత్రి కుటుంబంలో ఎవరికి ఇవ్వాలనే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. అభ్యర్థిగా ప్రకటించారు... ఆపై చిన్నాన్న కుమారులను ఉసిగొల్పారు... రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ సీటు తన అన్న నారాయణరెడ్డి లేదా ఆయన కుమారుడు సుబ్బరామిరెడ్డి (భూపేష్‌రెడ్డి)లకు కేటాయించాలని శుక్రవారం రాత్రి మంత్రి ఆదినారాయణరెడ్డి ఉండవల్లిలో ప్రకటించారు. అంతలోనే చిన్నాన్న కుమారుడైన జయరామిరెడ్డితో సోదరులంతా కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని, మీరంతా ఎవరికి చెబితే వారికే ఎమ్మెల్సీ సీటు అంటూ వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఓవైపు ఎమ్మెల్సీ పదవి ఎవరికి కేటాయించాలనే విషయాన్ని మంత్రి ప్రకటించడం, మరోవైపు సోదరులంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని చిన్నాన్న కుమారులను ఉసిగొల్పడంపై మంత్రి అంతరంగం ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వెల్లడిస్తున్నారు. నోటితో చెప్పడం, నొసటితో సైగలు చేయడంపై పలు అనుమానాలు నెలకొన్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. సోదరుల మధ్య ఐక్యత కుదరలేదనిపించి, తన కుమారుడు, లేదంటే తానే ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకోవాలనే దిశగా మంత్రి ఆది ఎత్తుగడ వేస్తున్నట్లు పలువురు వివరిస్తున్నారు. శంకర్‌రెడ్డి తనయుల డిమాండ్.. వయస్సులో పెద్దవాడు నారాయణరెడ్డి అయితే పర్వాలేదు, అయినా నారాయణరెడ్డి కూడా ఓమారు ఎమ్మెల్సీగా పనిచేశారు. అందువల్ల నాడు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన దేవగుడి శంకర్‌రెడ్డి తనయుల్లో ఒకరికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలనే డిమాండ్ వారి నుంచి తెరపైకి వస్తోంది. చిన్నాన్న కుమారులు మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి, జయరామిరెడ్డి, శివనారాయణరెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు తుది దశకు చేరిన నేపథ్యంలో శంకర్‌రెడ్డి తనయుల్లో ఒకరికి ఆ పదవి కేటాయించి, కేసు ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు సైతం ఆశిస్తున్నట్లు సమాచారం. చిన్నాన్న కుమారులు, అన్న కుటుంబాన్ని రంగంలోకి దింపి వ్యవహారాన్ని మంత్రి ఆది వ్యూహాత్మకంగా జటిలం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ రెండు పిల్లుల కొట్లాట కారణంగా కోతి రొట్టె ఎగరేసుకెళ్లినట్లు’ గా ఎమ్మెల్సీ సీటును చేజారకుండా ఆది జాగ్రత్త పడుతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా మంత్రి ఇంట ఎమ్మెల్సీ చిచ్చు రగులుకుందనే చెప్పవచ్చు. -
కరువు ప్రకటన కోసం ప్రతిపాదనలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని 51 మండలాలను కరువు కింద ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు పేర్కొన్నారు. కరువు పరిశీలనకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి గురువారం ఇక్కడి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు జిల్లాలో వర్షపాత లోటు 64.02 శాతం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో సాధారణ సాగు లక్షా 34 వేల హెక్టార్లకు గాను కేవలం 17 వేల హెక్టార్లు అంటే 12 శాతం మాత్రమే సాగైందని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ. 15.81 కోట్లు, పశుగ్రాసం కోసం రూ. 24.85 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి ఇప్పుడిస్తున్న విద్యుత్ సరఫరా సరిపోవడం లేదంటే అదనంగా ఇచ్చే అధికారాన్ని కలెక్టర్‌కు ఇచ్చామని వెల్లడించారు. సీపీడబ్లు్యఎస్ స్కీమ్ సకాలంలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేరుస్తామని, ప్రభుత్వ శాఖల ద్వారానే ఆ పనులు చేయిస్తామని హెచ్చరించారు. ఉపాధి పనుల కల్పన కోసం నాలుగు నెలల్లో రూ. 200 కోట్లు ఖర్చు చేశామని, ఈ యేడు రూ. 480 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. కృషి కల్యాణ్ అభియాన్‌లో కడప మొదటి స్థానంలో ఉందన్నారు. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే జిల్లా అందులో మొదటి స్థానంలో ఉందని వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో 18.88 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 1వ తేది నుంచి జిల్లా ప్రాజెక్టులకు శ్రీశైలం నీరు ఇవ్వాలని ఇటీవల కర్నూలులో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారని చెప్పారు. రెండు రోజుల్లో కేసీ కెనాల్‌కు సాగునీరు వస్తుందన్నారు. వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్ల కింద చేయాల్సిన 700 ఎకరాల భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామన్నారు. గండికోట ముంపునకు గురయ్యే కొండాపురం మండలం రామచంద్రనగర్‌లో కూడా భూసేకరణ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రెండవ జేసీ బి.శివారెడ్డి పాల్గొన్నారు. -
సీఎం రమేష్‌తో వేగలేం..!
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎత్తుకు పైఎత్తులను కొనసాగిస్తున్నారు.ఎంపీ రమేష్‌ను నియంత్రించే ప్రక్రియ జోరందుకుంది. క్రమం తప్పకుండా ఫిర్యాదుల పరంపర చేపట్టారు. మొన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రి నారాలోకేష్ ఎదుట ఏకరువు పెట్టగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఇక సీఎం రమేష్‌తో వేగలేం.. కట్టడి చేయండి ..పార్టీ ఉన్నతి కోసం దశాబ్దాలుగా కృషి చేసిన కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తినట్లు సమాచారం. జిల్లా టీడీపీలో రమేష్ ఓ వర్గానికి నాయకత్వం వహిస్తుండగా, మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో వర్గానికి అండగా నిలుస్తున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో ఒకరి కంటే మరొకరిది పైచేయి కావాలనే ఆరాటం అధికంగా కన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజ్యసభ సభ్యుడు రమేష్‌ను ఉద్దేశించి ‘పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’స్థాయి కల్గిన వ్యక్తిగా ఘాటుగా విమర్శించారు. వరద వాస్తవికతను బహిర్గతం చేయడంతో ‘తేలు కుట్టిన దొంగలా’మౌనం వహించాల్సిన పరిస్థితి రమేష్ వంతయింది. కాగా ఈ తతంగం వెనుక మంత్రి ఆది ఉన్నారని గ్రహించిన రమేష్ భారీ ఎత్తుగడ వేశారు. ఈక్రమంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఆమరణ దీక్ష తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఉక్కుదీక్షను సీఎం రమేష్ ఎంచుకొని రాష్ట్ర మంత్రి వర్గాన్ని తన దీక్షాశిబిరానికి రప్పించుకున్నారు. వెరసి ఆ దీక్షకు మంత్రి ఆది పడిగాపులు కాయాల్సిన పరిస్థితులను సృష్టించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాజధానికి చేరిన ఫిర్యాదులు..ఎంపీ రమేష్ ఆమరణదీక్ష చేపట్టినంత కాలం జిల్లా టీడీపీ నాయకులు (మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మినహా) భుజకీర్తులు మిన్నంటాయి. ఆ కార్యక్రమం ముగియగానే యథావిధిగా ‘సిఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’నినాదం తెరపైకి వచ్చింది. మండలస్థాయిలో కూడా ప్రజా పరపతి లేని వ్యక్తి ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు, పార్టీని అడ్డుపెట్టుకొని ఆదాయం గడిస్తున్నారు, వర్గ విభేదాలు సృష్టిస్తున్నారంటూ పలువురు నాయకులు ఫిర్యాదు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇదే విషయమై అమరావతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు కూలంకషంగా వివరించినట్లు సమాచారం. రమేష్‌ను కట్టడి చేయకపోతే జిల్లాలో టీడీపీకి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం అమరావతిలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. మా తాత బద్వేల్ వీరారెడ్డి చిత్తశుద్ధితో పార్టీ ఉన్నతి కోసం కష్టపడ్డారు. పార్టీ అడ్డుపెట్టుకొని ఆర్థికంగా సంపాదనపై దృష్టి పెట్టలేదు, వ్యక్తిగత పరపతి కోసం వర్గాలను సృష్టించలేదు, ఎంపీ రమేష్ జిల్లాలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, మాలాంటి వారు కూడా పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందుతూ పార్టీ కోసం పనిచేయడం లేదని, వ్యక్తిగతంగా జిల్లాలో రమేష్ ప్రజాపరపతి చాలా స్వల్పమని, కట్టడి చేయకపోతే కష్టమేనని తెలిపినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు సమక్షంలో ఎంపీపై ఫిర్యాదు చేయడంతో సీఎం ఆలకించినట్లు తెలుస్తోంది. గతంలో వాసుకు చెక్‌పెట్టిన ప్రతిఫలమే... టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని మార్చాలంటూ గతంలో ఎంపీ రమేష్ దృష్టి సారించారు. ఆస్థానాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, లేదా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలతో భర్తీ చేయాలనే దిశగా జోరుగా పావులు కదిపారు. ఈక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కూటమిది పైచేయి కావడంతో రమేష్ ప్రతిపాదన తెరమరుగైందని పలువురు వెల్లడిస్తున్నారు. అందుకు ప్రతిగా రమేష్‌నాయుడు వైరి పక్షాన్ని ప్రోత్సహిస్తూ అధిష్టానం దృష్టికి నేరుగా ఫిర్యాదు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. పైగా సాగునీటి ప్రాజెక్టుల్లో రమేష్ దక్కించుకున్న కాంట్రాక్టుల వివరాలు చేపట్టిన పనులు, అందులో లభించిన ప్రతిఫలం రికార్డులతో సహా కొందరు మంత్రి నారా లోకేష్ దృష్టిలో పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఆది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎంపీ రమేష్‌నాయుడుకు చెక్పెట్టుతోన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నీవు చేసిన అభివృద్ధి ఎక్కడ?
ఎర్రగుంట్ల : పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం టీడీపీ బైక్ ర్యాలీ సందర్భంగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిని ఓ సామాన్యుడు నిలదీశారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు.. నీవు చేసిన అభివృద్ధి ఎక్కడో చూపించాలని అడ్డుతగిలాడు. దీంతో ఆ సామాన్యుడిపై మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా..ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ముద్దనూరు మీదుగా ఎర్రగుంట్ల వరకు కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎర్రగుంట్ల నాలుగు రోడ్డ కూడలిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. అక్కడ మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాటం దీక్షను కూడా చేశారని, హోదా ఇవ్వక పోతే కేంద్రంతో పోరాటానికి సిద్ధమని, ఎర్రగుంట్ల అభివృద్ధికి నిధులు ఎక్కువగా తెప్పించామని చెప్పారు. ఇదే సమయంలో అక్కడున్న ఓ సామాన్యుడు మంత్రి ప్రసంగాన్ని అడ్డుతగిలి నీవు ఏమి అభివృద్ధి చేశావని మా పట్టణానికి వచ్చావని ప్రశ్నించాడు. మంత్రి ఆగ్రహంతో మత్తులో అడ్డదిడ్డంగా మాట్లాడే వారి కాళ్లు తీసేయాలన్నారు. దీంతో అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు అవాక్కయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముసలయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జెక్కు చెన్న క్రిష్ణారెడ్డి, నాయకులు బాల వెంకటరెడ్డి, మురళిలు పాల్గొన్నారు. -
చంద్రబాబే అవినీతి చేసుకోమని చెప్పారు..
సాక్షి, జమ్మలమడుగు : తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఓ మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని పేర్కొన్నారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేపించారని తెలిపారు. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి అక్కడున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని' అంటూ ఆది నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎక్కువయ్యాయి. -
చంద్రబాబే అవినీతి చేసుకోమని చెప్పారు..
-
ఆది నారాయణరెడ్డికి సుధీర్ రెడ్డి సవాల్
-
ఆది నారాయణరెడ్డికి సుధీర్ రెడ్డి సవాల్
సాక్షి, జమ్మలమడుగు : మంత్రి ఆదినారాయణరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ‘ఆదినారాయణరెడ్డి నీకు నిజంగా దమ్ముంటే ప్రజల్లోకి రా... ఎవరు గెలుస్తారో చూద్దాం. జమ్మలమడుగుకు ఆయన చేసిందేమీ లేదు. ఆదినారాయణరెడ్డి తన బామ్మర్ది కేశవరెడ్డిని రక్షించుకునేందుకే పార్టీ మారారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన చేసిందేమీలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు.’ అని వ్యాఖ్యానించారు. ఆదినారాయణరెడ్డికి సుధీర్ రెడ్డి బహిరంగ సవాల్ -
ఆదినారాయణరెడ్డి రాజీనామా చేశావా?
సాక్షి, విజయవాడ : ఏపీ మంత్రులు నారా లోకేశ్, ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. ఆ రాజీనామా లేఖను స్పీకర్‌కు ఎప్పుడిచ్చావ్. మరి స్పీకర్ ఎందుకు ఆమోదించలేదు?. ఆదినారాయణరెడ్డి నీకు దమ్ము, ధైర్యముంటే రాజీనామా ఆమోదింపచేసుకుని ఎన్నికలకు రావాలి. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తే మీకు భయమెందుకు?. 420 అనగానే ఏపీలో గుర్తుకొచ్చేది చంద్రబాబే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని తప్పులు లేకుండా పలకగలవా లోకేశ్. అఆలు, ఏబీసీడీలు రాని లోకేశ్ కూడా జగన్‌ను విమర్శించడమా?, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి. మంత్రి దేవినే ఉమకు బహిరంగ లేఖ రాస్తున్నా. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. టైమ్, డేట్, ప్లేస్ చెబితే నేను చర్చకు సిద్ధం. 24 గంటల్లో స్పందించకపోతే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేఖను ఇరిగేషన్ కార్యాలయానికి, మీ ఇంటికి పంపుతున్నా.’ అని పేర్కొన్నారు. కాగా పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలంతా అప్పుడే తమ రాజీనామా లేఖల్ని స్పీకర్‌కు అందచేశామని, వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఆదినారాయణరెడ్డి రాజీనామా చేశావా?
-
మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్ ఆలమూరు (కొత్తపేట) : ఇటీవల దళితులను ఉద్దేశించి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి సీహెచ్ ఆదినారాయణరెడ్డి అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని బహిరంగ క్షమాపణ తెలపాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని పెదపళ్లలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ రిజర్వేషన్లు ఉద్దేశించి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేశామని చెబుతున్న సీఎం చంద్రబాబు మళ్లీ స్టీరింగ్ కమిటీల నియామకం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికలోను, కాకినాడ నగరపాలక సంస్థలోను వైఎస్సార్సీపీ విజయం సాధింస్తుందని దీమా వ్యక్తంచేశారు. ఫ్రోటోకాల్ ఉల్లంఘనలతో అప్రతిష్ట జిల్లాలో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు ఉన్నచోట తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘనలతో పాల్పడుతూ టీడీపీ తన నైజాన్ని బయటపెట్టుకుంటుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరును ఒక్కోసారి రెండు, మరోసారి ఏడో నంబరులో పొందు పర్చుతున్నారన్నారు. ప్రోటోకాల్ నిబంధనలపై తరచూ మాట్లాడుతున్న రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శిలాఫలకంలో మూడో చోట స్థానే ఆరో చోట ఉంచిన విషయంపై ఆ పార్టీ నేతలు ఏమి సమాధానం చెబుతారన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నెక్కంటి వెంకట్రాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఏడిద మెహెర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.