సాక్షి ప్రతినిధి కడప: మంత్రి ఆది నారాయణరెడ్డి ఇంట్లో ఎమ్మెల్సీ మంట మండుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన అన్న లేదా ఆయన తనయుడు భూపేష్ అంటూ ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అంతలోనే సోదరులంతా కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని చిన్నాన్న కుమారులను ఉసిగొల్పారు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా రాజకీయాల్లో లాభనష్టాలను బేరీజు వేస్తూ తమకే ఎమ్మెల్సీ సీటు కేటాయించాలనే దిశగా ఎవరికి వారు వాదనలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దేవగుడి సుబ్బరామిరెడ్డి, శంకర్‌రెడ్డిలు సోదరులు. రాజకీయాల్లో శంకర్‌రెడ్డి (మంత్రి ఆదినారాయణరెడ్డి చిన్నాన్న) క్రియాశీలకపాత్ర పోషించేవారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల చేతిలో మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద 1990 డిసెంబర్ 5న దేవగుడి శంకర్‌రెడ్డి, భీమగుండం గోపాల్‌రెడ్డిలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి నిందితుడుగా ఉన్నారు.
ఈ కేసులో నిందితులకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు 2006లో శిక్ష విధించగా, అప్పీల్‌కు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ 2008లో కేసును కొట్టి వేసింది. ఆపై శంకర్‌రెడ్డి తనయుడు శివనారాయణరెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి నుంచి కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ప్రస్తుతం ఇరువర్గాలు టీడీపీ శిబిరంలో ఉండడంతో పరస్పర రాజకీయ అవగాహనతో మంత్రి ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసేలా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఆ సీటు తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మంత్రి షరతు విధించారు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి మంత్రి కుటుంబంలో ఎవరికి ఇవ్వాలనే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.
అభ్యర్థిగా ప్రకటించారు... ఆపై చిన్నాన్న కుమారులను ఉసిగొల్పారు...
రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ సీటు తన అన్న నారాయణరెడ్డి లేదా ఆయన కుమారుడు సుబ్బరామిరెడ్డి (భూపేష్‌రెడ్డి)లకు కేటాయించాలని శుక్రవారం రాత్రి మంత్రి ఆదినారాయణరెడ్డి ఉండవల్లిలో ప్రకటించారు. అంతలోనే చిన్నాన్న కుమారుడైన జయరామిరెడ్డితో సోదరులంతా కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని, మీరంతా ఎవరికి చెబితే వారికే ఎమ్మెల్సీ సీటు అంటూ వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఓవైపు ఎమ్మెల్సీ పదవి ఎవరికి కేటాయించాలనే విషయాన్ని మంత్రి ప్రకటించడం, మరోవైపు సోదరులంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని చిన్నాన్న కుమారులను ఉసిగొల్పడంపై మంత్రి అంతరంగం ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వెల్లడిస్తున్నారు. నోటితో చెప్పడం, నొసటితో సైగలు చేయడంపై పలు అనుమానాలు నెలకొన్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. సోదరుల మధ్య ఐక్యత కుదరలేదనిపించి, తన కుమారుడు, లేదంటే తానే ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకోవాలనే దిశగా మంత్రి ఆది ఎత్తుగడ వేస్తున్నట్లు పలువురు వివరిస్తున్నారు.
శంకర్‌రెడ్డి తనయుల డిమాండ్..
వయస్సులో పెద్దవాడు నారాయణరెడ్డి అయితే పర్వాలేదు, అయినా నారాయణరెడ్డి కూడా ఓమారు ఎమ్మెల్సీగా పనిచేశారు. అందువల్ల నాడు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన దేవగుడి శంకర్‌రెడ్డి తనయుల్లో ఒకరికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలనే డిమాండ్ వారి నుంచి తెరపైకి వస్తోంది. చిన్నాన్న కుమారులు మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి, జయరామిరెడ్డి, శివనారాయణరెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయాలని కోరుతున్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు తుది దశకు చేరిన నేపథ్యంలో శంకర్‌రెడ్డి తనయుల్లో ఒకరికి ఆ పదవి కేటాయించి, కేసు ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు సైతం ఆశిస్తున్నట్లు సమాచారం. చిన్నాన్న కుమారులు, అన్న కుటుంబాన్ని రంగంలోకి దింపి వ్యవహారాన్ని మంత్రి ఆది వ్యూహాత్మకంగా జటిలం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ రెండు పిల్లుల కొట్లాట కారణంగా కోతి రొట్టె ఎగరేసుకెళ్లినట్లు’ గా ఎమ్మెల్సీ సీటును చేజారకుండా ఆది జాగ్రత్త పడుతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా మంత్రి ఇంట ఎమ్మెల్సీ చిచ్చు రగులుకుందనే చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment