గడ్డిపోచ కూడా లేక బీడుగా ఉన్న పొలాలు
కడప సెవెన్ రోడ్స్/రాయచోటి రూరల్ : జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పశువుల మేత తీవ్ర సమస్యగా మారింది. వానలు పడక పచ్చిమేపు ఎలాగూ లేకపోయినా, రైతుల వద్ద ఒట్టిమేపు కూడా అయిపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. కడప, చెన్నూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు పెట్టి గ్రాసాన్ని తెచ్చుకుంటున్నారు. మేత తక్కువ కావడంతో పాల దిగుబడి కూడా తగ్గుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే అయినకాడికి పశువులను తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల ప్రత్యామ్నాయ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. బాటనీ, జువాలజీ మంత్రులమంటూ చెప్పుకునే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి సొంత పనుల్లో నిమగ్నమై తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలలో ఏ రైతును కదిలించినా ప్రస్తుతం పశుగ్రాస కొరత గురించే చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది చిన్న, సన్నకారు రైతులకు పాడి పశువులే ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. పాడి పశువులను పోషిస్తే అవి తమ కుటుంబాలను పోషిస్తాయని రైతులు అంటున్నారు. అందుకే కనీసం ఎకరా, అర ఎకరంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తుంటారు. ఒక్కో ఆవుకు రోజుకు అర కిలో తవుడు, కిలో ఫీడ్, పచ్చి మేత, ఎండు మేత వేస్తారు. అంతా కలిపితే రూ.150లు ఖర్చు వస్తోంది. రోజుకు ఒక్కో ఆవు సగటున 16 లీటర్ల పాలు ఇస్తోంది. లీటరు ధర సగటున రూ.23ల నుంచి రూ.25లు ఉందని రైతులు చెబుతున్నారు.
ఈ ప్రకారం రూ.368లు వస్తోంది. అందులో ఖర్చు తీసేస్తే నికరంగా రోజుకు ఒక్కో ఆవు ద్వారా రూ.200లు ఆదాయం ఉంటుందని వివరిస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో పచ్చి మేత ఎక్కడా లేదు. బోర్ల కింద ఎక్కడైనా ఇంకా అరకొరగా ఉంటే, రోజురోజుకు నీటి మట్టం అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వట్టి మేత కూడా రైతుల వద్ద అయిపోయింది. దీంతో కడప, చెన్నూరు, వేంపల్లె తదితర ప్రాంతాలనుంచి తెచ్చుకుంటున్నారు. ఎకరా పొలంలో ఉండే ఎండు గడ్డి రూ.7 వేలు చెబుతున్నారని తెలుస్తోంది. ట్రాక్టర్‌కు గడ్డి ఎత్తే కూలీలకు రూ.1500లు, ట్రాక్టర్ బాడుగ రూ.3వేలు కలుపుకుంటే రూ.12వేలు ఖర్చు వస్తోందని రైతులు అంటున్నారు.
అదే వేరుశనగ కట్టె అయితే సుమారు రూ.18వేలు అవుతోందని చెబుతున్నారు. ఈ ప్రాంతాలలోని రైతులకు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ, ఉపాధి పనులు ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. ప్రభుత్వం తమ గోడును ఆలకించి పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో మాదిరిగా క్యాటిల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ ప్రణాళిక
రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఆవులు 59,580, ఎనుములు 50502, గొర్రెలు 4862, మేకలు 110422 ఉన్నాయి. ప్రస్తుతం 32,940 మెట్రిక్ టన్నుల గడ్డి కొరత ఏర్పడిందని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జయకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద 1300 మెట్రిక్ టన్నుల దాణా, వెయ్యి బేళ్ల సైలేజీ (మాగుడు గడ్డి), 70 క్వింటాళ్ల గడ్డి విత్తనాలు, 390 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ (దాణా మృతం) రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలకు అవసరమని పేర్కొన్నారు.
గొర్రెలకు మేపు అందించండి
నేను 3ఎకరాలు కౌలుకు పొలం తీసుకున్నాను. నారు కూడా వేశాను. వాన కోసం ఎదురుచూస్తున్నాను. ఇది కాకుండా 30 గొర్రెలు కూడా పెంచుకుంటున్నాను. ఎక్కడా మేత లేకపోవడంతో చాలా కష్టంగా ఉంది. మనుషులు తాగేందుకు నీరులేని పరిస్థితి వస్తోంది. దీంతో పశువులకు నీటిని తాపితే మనుషులకు తక్కువ వస్తున్నాయి. ఇంకా పది, 15రోజులు వర్షాలు పడకపోతే గొర్రెలు అమ్ముకోవాల్సిందే. 5ఏళ్ల క్రితం పశువుల ఆసుపత్రిలో రోజుకు 15కిలోల గడ్డి ఉచితంగా ఇచ్చారు. మళ్లీ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే గొర్రెల కాపరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేకలైతే ఆకులు, అలుములు తింటాయి. కానీ గొర్రెలు గడ్డి మాత్రమే తింటాయి. కనుక ప్రధానంగా మాకే సమస్య వస్తోంది.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు ఎస్.రెడ్డప్ప. ఈయనది సంబేపల్లె మండలం బొగ్గులవారిపల్లె. ఇతనికి 50గొర్రెలు ఉన్నాయి. ఇవే ఆయనకు ఉన్న ఆస్తి. వీటి పెంపకమే ఆయన జీవనాధారం. ఇప్పటిదాకా చుక్క వాన లేదు. కను చూపుమేరలో ఎక్కడా గడ్డి పరకైనా లేదు. దీంతో జీవాలకు మేత కరువైంది. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా రైతుల వద్ద గ్రాసంలేదు. దీంతో చిత్తూరు జిల్లాకు వెళ్లి రూ.15వేలు ఖర్చు చేసి ఒక ట్రాక్టర్ వేరుశనగ కట్టె తీసుకొచ్చారు. పగటిపూట గొర్రెలను అలా బయటకు తోలుకెళుతాడు. బయట ఎక్కడా మేత మేయకపోయినా.. అవి తిరిగి వస్తాయి. సాయంత్రం ఇంటికి తోలుకు వస్తాడు. ఒకప్పుడు గంపలు.. గంపలు వేరుశనగ, ఉలువ పొట్టు వేసి మేపుతుండేవాడు. ట్రాక్టర్ మేపు నెల తిరగకముందే అయిపోయింది. ఇప్పుడేం చేయాలి భగవంతుడా అని బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న దుర్గంబోయపల్లెకు చెందిన కొందరు గొర్రెల కాపరులు తమ మందలను తీసుకుని మైదుకూరుకు వెళ్లారు. ‘‘ఇంకా వారం, పది రోజులు దాటితే నేను కూడా ఏదో ఒక దిక్కుకు వెళ్లాల్సిందే.. మేత కోసం మూగ జీవాలు పడుతున్న అవస్థలు చూస్తుంటే మాకు ముద్ద దిగడంలేదు. జీవాలు బాగుంటేనే మేం బాగుంటాం.. ప్రభుత్వం దయ చూపి వేరుశనగ కట్టె, ఉలువ పొట్టు పంపిణీ చేస్తే చాలా మేలు చేసినట్లవుతుంది’’ అంటూ ఆయన సాక్షి వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు.
నెత్తిపై గడ్డి మోపుతో కనిపిస్తున్న ఈ రైతు పేరు పాలేటి. చిన్నమండెం మండలం జల్లవాండ్లపల్లెకు చెందిన రైతు. ఈయనకు 2ఎకరాల వర్షాధార భూమి ఉంది. వేరుశనగ సాగు చేస్తాడు. విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. వర్షం లేకపోవడంతో పంట వేయలేదు. భూమిపైనే ఆధారపడకుండా రెండు జెర్సీ ఆవులు మేపుతున్నాడు. ఆవులే ఆయనకు ప్రధాన జీవనాధారమయ్యాయి. చుట్టు పక్కల ఎక్కడా మేపు లేకుండా పోయింది. ట్రాక్టర్ రూ.12వేలు ఖర్చుచేసి వరి గడ్డి కొనుగోలు చేశాను. ఇప్పుడు ఆ గడ్డి కూడా అయిపోవస్తోంది. ఇక ఏమి చేయాలో పాలుపోవడంలేదు. మేతలేక పాల దిగుబడి కూడా తగ్గిపోతోంది. ఇంకా కొన్ని రోజులు వానలు పడకపోతే ఉన్న ఆవులను అయిన కాడికి అమ్ముకోవాల్సిందే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment