ఇదేం రాజ్యం చంద్రబాబూ.. బద్వేల్‌ ఘటనపై వైఎస్‌ జగన్‌ ఆవేదన | YS Jagan Fires On Chandrababu Govt Over Badvel Girl Incident, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

ఇదేం రాజ్యం చంద్రబాబూ.. బద్వేల్‌ ఘటనపై వైఎస్‌ జగన్‌ ఆవేదన

Published Sun, Oct 20 2024 2:40 PM | Last Updated on Sun, Oct 20 2024 4:37 PM

Ys Jagan Fires On Chandrababu Govt Over Badvel Girl Incident

సాక్షి,తాడేపల్లి :  బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిని  హత్యాచారం చేసిన ఘటనపై  వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బద్వేల్‌ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.  ఈ మేరకు ట్వీట్‌ చేసిన వైఎస్‌ జగన్‌..  కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హత్యలు,అత్యాచారాలు, వేధింపులు జరుతూనే ఉన్నాయి. బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారని, ఈ దారుణ ఘటన హేయం, అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని  వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

 

‘చంద్రబాబు మీరు వైఎస్సార్‌సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రజలమీద కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్‌ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ రూంకు, అక్కడినుంచి దగ్గర లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్‌ చేస్తారు. వారు ఫోన్‌ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’ ’పై రాజకీయ కక్ష ఎందుకు?

దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫొరెన్సిక్‌‌ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్‌స్టేషన్‌లను పెట్టి, 18 క్రైమ్‌ మేనేజ్‌మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.

వీటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్‌ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబు?’అంటూ నిలదీశారు వైఎస్‌ జగన్‌.

AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement