పాలు స్వచ్ఛంగా ఉన్నాయా? | Sakshi Guest Column On Milk Purity | Sakshi
Sakshi News home page

పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?

Published Thu, Oct 17 2024 12:55 AM | Last Updated on Thu, Oct 17 2024 4:13 AM

Sakshi Guest Column On Milk Purity

విశ్లేషణ

ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.

పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. 

పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్‌ అని మల్స్‌’ పరిస్థితికి చేరుకుంటున్నాము. 

పెద్ద డెయిరీలతో కాలుష్యం
పాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్‌ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్‌లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్‌లో లక్ష ఆవులు ఉన్నాయి. 

ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్‌లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్‌ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.

అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌  కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్‌ ్స, నెద ర్లాండ్స్‌. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్‌లు 7.5 కోట్లు. భారత్‌లోనే చాలావరకు డెయిరీ ఫామ్‌లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.

అంత పెద్ద డెయిరీ ఫామ్‌లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.

పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్‌ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. 

అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం  హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్‌ విలువ 12 బిలియన్‌ డాలర్లు దాటిందని అంచనా.

పశువు ఒక యంత్రమా?
తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.

అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.

పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.

పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్‌’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్‌లో పూర్వం ‘మ్యాడ్‌ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. 

పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. 

కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. 

పాల ద్వారా విషాలు
పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. 

పడేసిన చికెన్‌ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.


డా‘‘ దొంతి నరసింహా రెడ్డి 
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement