మరో ‘డిజిటల్‌’ వ్యూహం | Sakshi Guest Column On Digital Farming | Sakshi
Sakshi News home page

మరో ‘డిజిటల్‌’ వ్యూహం

Published Wed, Aug 21 2024 12:11 AM | Last Updated on Wed, Aug 21 2024 12:11 AM

Sakshi Guest Column On Digital Farming

విశ్లేషణ

ఒక్కో పదం వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ప్రకృతితో కూడిన వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం రసాయన రహిత వ్యవసాయం. జీరో బడ్జెట్‌ వ్యవసాయం పెట్టుబడి ఖర్చు లేని వ్యవసాయం. హరిత విప్లవ వ్యవసాయం రసాయనాలతో, హైబ్రిడ్‌ విత్తనాలతో కూడిన వ్యవసాయం. పారిశ్రామిక వ్యవసాయం పరిశ్రమ స్థాయిలో ఉత్పాదకత మీద దృష్టి పెట్టే వ్యవసాయం. మరి, డిజిటల్‌ వ్యవసాయం అంటే ఏమిటి? సమాచారంతో కూడిన వ్యవసాయం. జ్ఞానం, విజ్ఞానం, నైపుణ్యం కాకుండా సమాచారం సేకరించి ఇచ్చే ప్రక్రియలతో కూడిన వ్యవసాయం. రైతు జ్ఞానాన్ని, నైపుణ్యాలను కాలరాసే పెట్టుబడిదారుల వ్యూహంలో డిజిటల్‌ వ్యవసాయం ఒక సాధనం.

హరిత విప్లవం ఒక ప్యాకేజీ. హైబ్రిడ్‌ విత్తనాలు వేస్తే రసాయన ఎరువులు వాడాలి. రసాయన ఎరువులు వాడితే చీడపీడ, పురుగు పుట్రకు రసాయనాలు పిచికారీ చెయ్యాలి. ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. అంటే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోవాలి. డిజిటల్‌ వ్యవసాయం కూడా అలాంటి ఒక ప్యాకేజీ. బడా కంపెనీలు గుత్తాధిపత్యం సాధించడమే లక్ష్యం. రైతుల స్వావలంబనను దెబ్బ కొట్టడమే ఎజెండా. 

ఆహార ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడింది అంటున్నారు. ఒక వైపు అందరికి ఆహారం దొరకని పరిస్థితులలో ఆహారం మిగిలింది అని చెప్పడంలోనే డొల్లతనం బయటపడింది. ఆహార ఉత్పత్తి ఖర్చులు పెరిగి ధర రాని పరిస్థితులలో ఒకవైపు రైతు ఉంటే, అధిక ధరలకు కొనలేని స్థితిలో సగం దేశ జనాభా ఉన్నది. రైతుల ఆదాయం పెరగాలంటే పంటలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలి. 

ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నది. గిట్టుబాటు ధర కొరకు కనీస మద్దతు ధర పెంచమంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి, పెద్ద కొనుగోలు కంపెనీలు వస్తేనే గిట్టుబాటు ధర వస్తుంది అని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. అదే నిజమైతే అమె రికాలో, ఐరోపా దేశాలలో ఆ వ్యవస్థ ఉన్నది. అయినా అక్కడి రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్నారు. 

ఆధునిక వ్యవసాయం ద్వారా భారతదేశం అద్భుతమైన విజ యాలు సాధించింది. దురదృష్టవశాత్తూ చిన్న, సన్నకారు రైతులు అట్టడుగున ఉన్నారు. గడిచిన దశాబ్దంలో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు ఐదు రెట్లు పెరిగింది. 1995 నుండి దాదాపు 3,00,000 కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

భారత వ్యవసాయంలో ఉన్న సంక్లిష్టత దృష్ట్యా, ఏ ఒక్క విధాన మార్పు లేదా సాంకేతిక మార్పుతో చిన్న రైతుల ఆదాయాన్ని పెంచడం, భారత వ్యవసాయంలో పోటీని బలోపేతం చేయడం వంటి ద్వంద్వ లక్ష్యాలు సాధ్యం కావు. కానీ డిజిటల్‌ వ్యవసాయమే అన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తున్నది.

చిన్న రైతులకు ఆదాయం పరమార్థం కనుక ఉత్పత్తి–కేంద్రీకృత మౌలిక వసతుల కల్పన నుండి మార్కెట్‌–కేంద్రీకృత మౌలిక సదుపా యాలకు మారడం, డిజిటల్‌ వ్యవసాయం ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే భారతదేశంలో కూడా మొబైల్‌ ఫోన్‌ గ్రామీణ కుటుంబాల జీవితాలను మార్చింది. 

బిహార్లో గొర్రెలు అమ్ముకునే మహిళ ఫోను ఉపయోగించి వాటిని డిజిటల్‌ వేదికల ద్వారా అమ్ముకుంటున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలలో, తయారు చేస్తున్న విధానాలలో, పని తీరులో డేటా డిజిటల్‌ పద్ధతులు పాటిస్తున్నాయి. ఇదివరకు, సమాచార సేకరణలో ఏ సమాచారం అనే ప్రశ్న వచ్చేది. ఇప్పుడు సమాచారం దేనికి అనే ప్రశ్న వస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం, బడా పారిశ్రామిక సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ టెక్‌ కంపెనీలు అన్నీ కలిసి డిజిటల్‌ టెక్నాలజీల ద్వారా తమ వ్యాపారం పెంచుకోవడం కోసం సమాచారాన్ని ఒక వ్యాపార వస్తువుగా మలిచే ప్రక్రియను డిజిటల్‌ వ్యవసాయంగా ప్యాకేజీ చేసి ఊదరగొడుతున్నారు. 

ఒకవైపు మార్కెట్లో చిన్న రైతులకు డిజిటల్‌ టెక్నాలజీ ప్రయోజనాలు అంటూ, ఇంకొక వైపు ఉత్పత్తి దశలలో రైతుల మీద ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇక్రిశాట్‌’ సహకారంతో బహుళ జాతి సంస్థ మైక్రోసాఫ్ట్‌ ‘ఏఐ’ విత్తే యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రైతులకు నాట్లకు సరైన తేదీలు, నేల సారం బట్టి ఎరువుల ఉప యోగం, వాడాల్సిన విత్తనాల సలహాలను పంపింది. 

నిత్యం వ్యవసాయం చేసే రైతులకు ఎప్పుడు ఏమి విత్తాలి వంటి సలహాలు ఇస్తుంది. రైతులకు తెలవదా? సలహాలు ఇవ్వాలంటే ఈ యాప్‌కు ప్రాథమిక సమాచారం కావాలి. ఆ సమాచారం ఒక ఒప్పందం ద్వార ప్రభుత్వం నుంచి ఎప్పుడో తీసుకున్నారు. ఇక ఇందులో రైతు పాత్ర ఉండదు. వాళ్ళు చెప్పింది చేయడమే!

ఈ యాప్‌ కొనసాగాలంటే ఆ సలహాలు కొనేవాడు కావాలి. చిన్న రైతు కొంటే అదనపు పెట్టుబడి ఖర్చు. చిన్న రైతు కొనలేడు, కొనడు కాబట్టి ప్రభుత్వ నిధులు వాడి తమ వ్యాపారం పెంచుకుంటారు. వీళ్ళకు ఎరువులు, విత్తనాలు, క్రిమికీటక నాశక రసాయనాల కంపెనీలతో మార్కెట్‌ ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. ఒక విధంగా వ్యవసాయ ఇన్‌పుట్‌ మార్కెట్లో ఇంకొక మధ్య దళారీ వ్యవస్థను పెంపొందిస్తున్నారు. 

రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్ర యించడానికి, మధ్యవర్తులను తగ్గించడానికి, వ్యాపారంలో పారదర్శ కతను పెంచడానికి ఒక ఆన్‌లైన్‌ డిజిటల్‌ వేదిక (ఈ–నామ్‌) రూపొందించడానికి భారత ప్రభుత్వం 2016 నుంచి కృషి చేస్తోంది. వ్యవ సాయ మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు, కొనుగోలుదారులకు మధ్య ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ను సులభతరం చేయడానికి ఈ వేదికను తయారు చేస్తున్నారు. 

రైతు తన పంటకు మెరుగైన ధరను కనుగొ నడంలో ఇది సహాయపడుతుంది. అయితే, ఇది గిట్టుబాటు ధర కాదు. స్థానిక రసాయనాల దుకాణాల నుంచి అప్పు తీసుకుని పంట అమ్మే పరిస్థితి నుంచి రైతులను విముక్తులను చేసి, ఉత్తమ ధరకు పంటలను విక్రయించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు. 

పబ్లిక్‌ రంగానికి చెందిన బ్యాంకులు అప్పులు సరళంగా ఇచ్చే వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా, ప్రైవేటు రుణ వ్యవస్థకు ఊతం ఇస్తున్నారు. ప్రైవేటు అప్పులు సులభంగా అందుకోవడానికి మాత్రమే ఈ వేదికలు ఉపయోగపడతాయి. ఏ రాయి అయితే ఏమి పండ్లు ఊడగోట్టుకోవడానికి అన్న చందంగా స్థానిక వడ్డీ వ్యాపారి నుంచి డిజిటల్‌ వడ్డీ వ్యాపారి చేతిలో రైతులు పడతారు. 

డ్రోన్‌ ద్వారా పంట పొలాలలో చేసే విన్యాసాలు కూడా డిజిటల్‌ వ్యవసాయ ప్రతిపాదనలలో భాగమే. ఎరువులు చల్లవచ్చు, విత్తనాలు చల్లవచ్చు, నాటవచ్చు, క్రిమినాశక రసాయనాలు పిచికారీ చేయ వచ్చు. పైనుంచి క్రిమికీటకాలు, కలుపు ఫోటోలు తీసి యాప్‌లో పెడితే, ఏ రసాయనం పిచికారీ చెయ్యాలి అని సలహా వస్తుంది. 

ఆ సలహా మేరకు ఎక్కడ పురుగు ఉందో అక్కడ దాని మీదనే రసాయనం పిచికారీ చేయవచ్చు, ఇత్యాది పనులు డ్రోన్ల ద్వారా చేసి, అధిక దిగుబడులు, అధిక ఆదాయం చిన్న, సన్నకారు రైతులు పొందుతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే, ఒక్కొక్క డ్రోన్‌ కొరకు రూ.7 నుంచి 8 లక్షల వరకు ఆయా డ్రోన్‌ కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. 

ఈ పథకం పేరు డ్రోన్‌ దీదీ (డ్రోన్‌ అక్క). రైతు రోజుకు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడని వాపోతున్న ప్రభుత్వం నేరుగా రైతుకు ఇచ్చేది కేవలం రూ.2 వేలు మాత్రమే. డ్రోన్‌ కంపెనీలకు లక్షల సబ్సిడీ ఇవ్వడానికి మాత్రం సంకోచించడం లేదు.

భారత వ్యవసాయంలో రైతు సంక్షోభంలో ఉన్నాడని ఒప్పుకొంటున్న ప్రభుత్వం మార్పుకు ప్రతిపాదిస్తున్న, నిధులు ఇస్తున్న పథ కాలు రైతు మీద ఉత్పత్తి ఖర్చు ఇంకా పెంచే విధంగా ఉంటున్నాయి. ఖర్చుకూ, ఆదాయానికీ మధ్య వ్యత్యాసం తగ్గించే ప్రయత్నం కాకుండా రైతును వ్యవసాయం నుంచి దూరం చేసే ప్రతిపాదనలు డిజిటల్‌ వ్యవసాయం దార్శనిక విధానాలలో ఉన్నాయి. 

డిజిటల్‌ వ్యవసాయంలో రైతు దగ్గర సమాచారం తీసుకుని, రైతుకే సలహాలు ఇచ్చే ప్రక్రియలు అనేకం ఉన్నాయి. పాత తప్పిదాల నుంచి తప్పించుకుని, రైతులకు చూపే కొత్త ఆశలకు ప్రతి రూపం డిజిటల్‌ వ్యవసాయం. రసాయన ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రమాదకర కీటక నాశక రసాయనాల వ్యాపారం పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తున్న వాహనం డిజిటల్‌ వ్యవసాయం.


డా‘‘ దొంతి నరసింహా రెడ్డి 
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement