Hybrid seeds
-
మరో ‘డిజిటల్’ వ్యూహం
ఒక్కో పదం వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ప్రకృతితో కూడిన వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం రసాయన రహిత వ్యవసాయం. జీరో బడ్జెట్ వ్యవసాయం పెట్టుబడి ఖర్చు లేని వ్యవసాయం. హరిత విప్లవ వ్యవసాయం రసాయనాలతో, హైబ్రిడ్ విత్తనాలతో కూడిన వ్యవసాయం. పారిశ్రామిక వ్యవసాయం పరిశ్రమ స్థాయిలో ఉత్పాదకత మీద దృష్టి పెట్టే వ్యవసాయం. మరి, డిజిటల్ వ్యవసాయం అంటే ఏమిటి? సమాచారంతో కూడిన వ్యవసాయం. జ్ఞానం, విజ్ఞానం, నైపుణ్యం కాకుండా సమాచారం సేకరించి ఇచ్చే ప్రక్రియలతో కూడిన వ్యవసాయం. రైతు జ్ఞానాన్ని, నైపుణ్యాలను కాలరాసే పెట్టుబడిదారుల వ్యూహంలో డిజిటల్ వ్యవసాయం ఒక సాధనం.హరిత విప్లవం ఒక ప్యాకేజీ. హైబ్రిడ్ విత్తనాలు వేస్తే రసాయన ఎరువులు వాడాలి. రసాయన ఎరువులు వాడితే చీడపీడ, పురుగు పుట్రకు రసాయనాలు పిచికారీ చెయ్యాలి. ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. అంటే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోవాలి. డిజిటల్ వ్యవసాయం కూడా అలాంటి ఒక ప్యాకేజీ. బడా కంపెనీలు గుత్తాధిపత్యం సాధించడమే లక్ష్యం. రైతుల స్వావలంబనను దెబ్బ కొట్టడమే ఎజెండా. ఆహార ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడింది అంటున్నారు. ఒక వైపు అందరికి ఆహారం దొరకని పరిస్థితులలో ఆహారం మిగిలింది అని చెప్పడంలోనే డొల్లతనం బయటపడింది. ఆహార ఉత్పత్తి ఖర్చులు పెరిగి ధర రాని పరిస్థితులలో ఒకవైపు రైతు ఉంటే, అధిక ధరలకు కొనలేని స్థితిలో సగం దేశ జనాభా ఉన్నది. రైతుల ఆదాయం పెరగాలంటే పంటలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలి. ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నది. గిట్టుబాటు ధర కొరకు కనీస మద్దతు ధర పెంచమంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి, పెద్ద కొనుగోలు కంపెనీలు వస్తేనే గిట్టుబాటు ధర వస్తుంది అని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. అదే నిజమైతే అమె రికాలో, ఐరోపా దేశాలలో ఆ వ్యవస్థ ఉన్నది. అయినా అక్కడి రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్నారు. ఆధునిక వ్యవసాయం ద్వారా భారతదేశం అద్భుతమైన విజ యాలు సాధించింది. దురదృష్టవశాత్తూ చిన్న, సన్నకారు రైతులు అట్టడుగున ఉన్నారు. గడిచిన దశాబ్దంలో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు ఐదు రెట్లు పెరిగింది. 1995 నుండి దాదాపు 3,00,000 కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భారత వ్యవసాయంలో ఉన్న సంక్లిష్టత దృష్ట్యా, ఏ ఒక్క విధాన మార్పు లేదా సాంకేతిక మార్పుతో చిన్న రైతుల ఆదాయాన్ని పెంచడం, భారత వ్యవసాయంలో పోటీని బలోపేతం చేయడం వంటి ద్వంద్వ లక్ష్యాలు సాధ్యం కావు. కానీ డిజిటల్ వ్యవసాయమే అన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తున్నది.చిన్న రైతులకు ఆదాయం పరమార్థం కనుక ఉత్పత్తి–కేంద్రీకృత మౌలిక వసతుల కల్పన నుండి మార్కెట్–కేంద్రీకృత మౌలిక సదుపా యాలకు మారడం, డిజిటల్ వ్యవసాయం ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే భారతదేశంలో కూడా మొబైల్ ఫోన్ గ్రామీణ కుటుంబాల జీవితాలను మార్చింది. బిహార్‌లో గొర్రెలు అమ్ముకునే మహిళ ఫోను ఉపయోగించి వాటిని డిజిటల్ వేదికల ద్వారా అమ్ముకుంటున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలలో, తయారు చేస్తున్న విధానాలలో, పని తీరులో డేటా డిజిటల్ పద్ధతులు పాటిస్తున్నాయి. ఇదివరకు, సమాచార సేకరణలో ఏ సమాచారం అనే ప్రశ్న వచ్చేది. ఇప్పుడు సమాచారం దేనికి అనే ప్రశ్న వస్తున్నది.కేంద్ర ప్రభుత్వం, బడా పారిశ్రామిక సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ టెక్ కంపెనీలు అన్నీ కలిసి డిజిటల్ టెక్నాలజీల ద్వారా తమ వ్యాపారం పెంచుకోవడం కోసం సమాచారాన్ని ఒక వ్యాపార వస్తువుగా మలిచే ప్రక్రియను డిజిటల్ వ్యవసాయంగా ప్యాకేజీ చేసి ఊదరగొడుతున్నారు. ఒకవైపు మార్కెట్లో చిన్న రైతులకు డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలు అంటూ, ఇంకొక వైపు ఉత్పత్తి దశలలో రైతుల మీద ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇక్రిశాట్’ సహకారంతో బహుళ జాతి సంస్థ మైక్రోసాఫ్ట్ ‘ఏఐ’ విత్తే యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రైతులకు నాట్లకు సరైన తేదీలు, నేల సారం బట్టి ఎరువుల ఉప యోగం, వాడాల్సిన విత్తనాల సలహాలను పంపింది. నిత్యం వ్యవసాయం చేసే రైతులకు ఎప్పుడు ఏమి విత్తాలి వంటి సలహాలు ఇస్తుంది. రైతులకు తెలవదా? సలహాలు ఇవ్వాలంటే ఈ యాప్‌కు ప్రాథమిక సమాచారం కావాలి. ఆ సమాచారం ఒక ఒప్పందం ద్వార ప్రభుత్వం నుంచి ఎప్పుడో తీసుకున్నారు. ఇక ఇందులో రైతు పాత్ర ఉండదు. వాళ్ళు చెప్పింది చేయడమే!ఈ యాప్ కొనసాగాలంటే ఆ సలహాలు కొనేవాడు కావాలి. చిన్న రైతు కొంటే అదనపు పెట్టుబడి ఖర్చు. చిన్న రైతు కొనలేడు, కొనడు కాబట్టి ప్రభుత్వ నిధులు వాడి తమ వ్యాపారం పెంచుకుంటారు. వీళ్ళకు ఎరువులు, విత్తనాలు, క్రిమికీటక నాశక రసాయనాల కంపెనీలతో మార్కెట్ ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. ఒక విధంగా వ్యవసాయ ఇన్పుట్ మార్కెట్లో ఇంకొక మధ్య దళారీ వ్యవస్థను పెంపొందిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్ర యించడానికి, మధ్యవర్తులను తగ్గించడానికి, వ్యాపారంలో పారదర్శ కతను పెంచడానికి ఒక ఆన్లైన్ డిజిటల్ వేదిక (ఈ–నామ్) రూపొందించడానికి భారత ప్రభుత్వం 2016 నుంచి కృషి చేస్తోంది. వ్యవ సాయ మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు, కొనుగోలుదారులకు మధ్య ఆన్లైన్ ట్రేడింగ్‌ను సులభతరం చేయడానికి ఈ వేదికను తయారు చేస్తున్నారు. రైతు తన పంటకు మెరుగైన ధరను కనుగొ నడంలో ఇది సహాయపడుతుంది. అయితే, ఇది గిట్టుబాటు ధర కాదు. స్థానిక రసాయనాల దుకాణాల నుంచి అప్పు తీసుకుని పంట అమ్మే పరిస్థితి నుంచి రైతులను విముక్తులను చేసి, ఉత్తమ ధరకు పంటలను విక్రయించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు. పబ్లిక్ రంగానికి చెందిన బ్యాంకులు అప్పులు సరళంగా ఇచ్చే వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా, ప్రైవేటు రుణ వ్యవస్థకు ఊతం ఇస్తున్నారు. ప్రైవేటు అప్పులు సులభంగా అందుకోవడానికి మాత్రమే ఈ వేదికలు ఉపయోగపడతాయి. ఏ రాయి అయితే ఏమి పండ్లు ఊడగోట్టుకోవడానికి అన్న చందంగా స్థానిక వడ్డీ వ్యాపారి నుంచి డిజిటల్ వడ్డీ వ్యాపారి చేతిలో రైతులు పడతారు. డ్రోన్ ద్వారా పంట పొలాలలో చేసే విన్యాసాలు కూడా డిజిటల్ వ్యవసాయ ప్రతిపాదనలలో భాగమే. ఎరువులు చల్లవచ్చు, విత్తనాలు చల్లవచ్చు, నాటవచ్చు, క్రిమినాశక రసాయనాలు పిచికారీ చేయ వచ్చు. పైనుంచి క్రిమికీటకాలు, కలుపు ఫోటోలు తీసి యాప్‌లో పెడితే, ఏ రసాయనం పిచికారీ చెయ్యాలి అని సలహా వస్తుంది. ఆ సలహా మేరకు ఎక్కడ పురుగు ఉందో అక్కడ దాని మీదనే రసాయనం పిచికారీ చేయవచ్చు, ఇత్యాది పనులు డ్రోన్ల ద్వారా చేసి, అధిక దిగుబడులు, అధిక ఆదాయం చిన్న, సన్నకారు రైతులు పొందుతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే, ఒక్కొక్క డ్రోన్ కొరకు రూ.7 నుంచి 8 లక్షల వరకు ఆయా డ్రోన్ కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ పథకం పేరు డ్రోన్ దీదీ (డ్రోన్ అక్క). రైతు రోజుకు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడని వాపోతున్న ప్రభుత్వం నేరుగా రైతుకు ఇచ్చేది కేవలం రూ.2 వేలు మాత్రమే. డ్రోన్ కంపెనీలకు లక్షల సబ్సిడీ ఇవ్వడానికి మాత్రం సంకోచించడం లేదు.భారత వ్యవసాయంలో రైతు సంక్షోభంలో ఉన్నాడని ఒప్పుకొంటున్న ప్రభుత్వం మార్పుకు ప్రతిపాదిస్తున్న, నిధులు ఇస్తున్న పథ కాలు రైతు మీద ఉత్పత్తి ఖర్చు ఇంకా పెంచే విధంగా ఉంటున్నాయి. ఖర్చుకూ, ఆదాయానికీ మధ్య వ్యత్యాసం తగ్గించే ప్రయత్నం కాకుండా రైతును వ్యవసాయం నుంచి దూరం చేసే ప్రతిపాదనలు డిజిటల్ వ్యవసాయం దార్శనిక విధానాలలో ఉన్నాయి. డిజిటల్ వ్యవసాయంలో రైతు దగ్గర సమాచారం తీసుకుని, రైతుకే సలహాలు ఇచ్చే ప్రక్రియలు అనేకం ఉన్నాయి. పాత తప్పిదాల నుంచి తప్పించుకుని, రైతులకు చూపే కొత్త ఆశలకు ప్రతి రూపం డిజిటల్ వ్యవసాయం. రసాయన ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రమాదకర కీటక నాశక రసాయనాల వ్యాపారం పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తున్న వాహనం డిజిటల్ వ్యవసాయం.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
గోద్రెజ్ ఆగ్రోవెట్ నుంచి మూడు హైబ్రీడ్ విత్తనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ ఆగ్రోవెట్ సీడ్స్ వ్యాపార విభాగం కొత్తగా మూడు హైబ్రిడ్ విత్తనాలను ఆవిష్కరించింది. మొక్కజొన్నకు సంబంధించి జీఎంహెచ్ 6034, జీఎంహెచ్ 4110 రకాలు, వరికి సంబంధించి నవ్య రకం విత్తనాలు వీటిలో ఉన్నాయి. ముందుగా వీటిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర మార్కెట్లలో ప్రవేశపెట్టగా రాబోయే నెలల్లో తెలంగాణ, బీహార్ మొదలైన రాష్ట్రాల్లోను క్రమంగా అందుబాటులోకి తెస్తామని కంపెనీ సీఈవో ఎన్కే రాజవేలు తెలిపారు. తమకు పంట సంరక్షణ ఉత్పత్తులు కూడా ఉన్నందున నాట్ల దగ్గర్నుంచి కోతల వరకు అన్ని దశల్లో రైతులకు తాము వెన్నంటి ఉంటామని ఆయన పేర్కొన్నారు. విత్తన రంగంలో సొంత ఆర్అండ్డీ విభాగం ఉన్న అతి కొద్ది కంపెనీల్లో తమది ఒకటని, అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను రైతులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రాజవేలు చెప్పారు. -
ఉద్యోగం వదిలి.. ‘ప్రకృతి’లోకి కదిలి
గారపాటి విజయ్‌కుమార్ మూడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి ఆయన స్వగ్రామం. గడచిన రెండేళ్లూ హైబ్రిడ్ విత్తనాలను సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో పోషకాలతో పాటు ఔషధ విలువలు గల సాంప్రదాయ వరి రకాల సాగు వైపు దృష్టి సారించారు. తొమ్మిది రకాల దేశవాళీ విత్తనాలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మూడు నెలల వయస్సు ఉన్న వరి పైరు సుమారు ఆరు అడుగులు ఎత్తు పెరగడంతో తోటి రైతులు అబ్బురపడుతున్నారు. విజయ్‌కుమార్ తండ్రి గారపాటి శ్రీనివాస్‌రావు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి. ఆరు నెలల వయస్సులోనే తల్లి మృతి చెందడంతో విజయ్‌కుమార్ అమ్మమ్మ ఇంటి వద్దే పెరిగారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన అనంతరం వైజాగ్‌లో ఓ కన్స్ట్రక్షన్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు ఉద్యోగం చేశారు. 27 సంవత్సరాల వయసులో సహచరæ ఉద్యోగి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన విజయ్‌కుమార్‌ను తీవ్రంగా బాధించింది. అనారోగ్యానికి గల కారణాలను అన్వేషించి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్లనే అన్న అభిప్రాయానికి వచ్చారు. అంతే.. ఉద్యోగాన్ని విడిచి పెట్టి అమ్మమ్మ గారి ఊరు చేరుకున్నాడు. ఇది నాలుగేళ్ల నాటి ముచ్చట. దేశీ వంగడాలపై దృష్టి హైబ్రిడ్ విత్తనంతో కూడా విటమిన్ లోపాలు వచ్చి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకున్న విజయ్‌కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లోని దేశవాళీ వరి విత్తనాలను వృద్ధి చేస్తున్న సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయ్రామ్ను కలుసుకున్నారు. సుమారు 50 ఎకరాల్లో దేశవాళీ విత్తనం అభివృద్ధి చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి, వాటిలో ఔషధ గుణాలు, ఉపయోగాలను తెలుసుకున్నారు. ఆయన సూచనల మేరకు సుమారు తొమ్మిది రకాల దేశవాళీ విత్తనాలను తీసుకువచ్చి ఈ ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో తొమ్మిది మడుల్లో సాగు చేపట్టారు. నవార, కాలాబట్టీ, సుగంధ సాంబ, రధాతిలక్, రక్తసాలి, తులసీబసొ, నారాయణ కామిని, బహురూపి, రత్నచోడి రకాలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. రాధా తిలక్ రకం పంట సుమారు ఆరున్నర అడుగుల ఎత్తు పెరిగింది. వెన్ను సుమారు రెండు అడుగుల పొడవు ఉంది. మిగిలిన 8 దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్న మడుల్లో పైరు ఐదున్నర అడుగులు ఎత్తు పెరిగింది. మూడు రకాలను వెదజల్లే పద్ధతిలో, మిగిలిన ఆరు రకాలను ఊడ్పు పద్ధతిలో సాగు చేస్తున్నట్టు విజయ్‌కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన దేశవాళీ రకాలు క్వింటాల్ రూ. 3,500 నుంచి రూ.7,500 ధర పలుకుతోందని తెలిపారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తే లక్ష్యం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార ఉత్పత్తులను తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, బీపి, షుగర్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అందుకే ఆరోగ్యదాయకమైన తొమ్మిది రకాల దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్నాను. వీటిని సాగు చేయడం వలన రైతులకు కూడా మంచి లాభం వస్తుంది. సాగు చేసిన పంటను నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నా. రబీలో నీటి ఎద్దడి సమస్య ఉండటంతో కొర్రలు, సామలు, అండుకొర్రలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఖరీఫ్‌లో సుమారు పదెకరాల్లో దేశవాళీ వరి రకాలను సాగు చేద్దామనుకుంటున్నాను. ఈ విధానంలో మిత్రపురుగులు వృద్ధి చెందుతాయి. శత్రు పురుగులు అదుపులో ఉంటాయి. ఏటేటా భూసారం పెరుగుతుంది. పంచభూతాలకు, పశుపక్ష్యాదులకు మొత్తంగా మానవాళికి మంచి జరుగుతుంది. ఈ సాగు ద్వారా విత్తనాన్ని సొంతంగా తయారు చేసుకొని రైతులకు అందిస్తున్నాను. ప్రకృతి సాగులో ఎకరాకు కేవలం నాలుగు కేజీల విత్తనం అవసరం. అదే రసాయనిక సాగులో ఎకరానికి 25 కేజీల విత్తనం పడుతుంది. దీని వల్ల విత్తన ఖర్చు బాగా తగ్గి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – గారపాటి విజయ్ కుమార్ (98665 11419), గండేపల్లి, తూ.గో. జిల్లా -
ఆ విత్తనం ఓ మహా విస్ఫోటనం
మా నాయిన సోలిపేట రామకృష్ణారెడ్డి 12 ఎక రాలకు ఆసామి. పంట విత్తనంలోనే ఉంది’ అని నమ్మే రైతు. కోతకొచ్చిన పంట చేలోంచి మెండైన కంకులు ఏరించి మరుసటి ఏడాదికి విత్తనంగా దాచి పెట్టేవారు. మా నాయిన పండించిన వరి విత్తనాలను మా ఊరు రైతులు ఎగబడి ఎగబడి కొనేటోళ్లు. ఇçప్పుడీ పద్ధతి పల్లెల్లో చూద్దామన్నా కనిపించటం లేదు. సాంప్రదాయ విత్తనాల స్థానంలోకి అధికో త్పత్తి హైబ్రీడ్, జన్యుమార్పిడి విత్తనాలు చొర బడ్డాయి. ఇవ్వాళ పంట పొలంలో నాటుతున్న ఒక్కొక్క జన్యు మార్పిడి విత్తనం భవిష్యత్తులో మందు పాతరను మించిన మహా విస్ఫోటనమై మహా విపత్తును సృష్టించబోతున్నాయి. పత్తితో పాటు, మనుషులు ఆహారంగా తీసుకునే మిరప, వంగ, టమాట, నువ్వులు, వేరుశెనగ వంటి కూర గాయలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో జన్యు మార్పిడి విత్తనాలు వచ్చేశాయి. పర్యావరణ విఘాతం ఏర్పడుతుందనే కారణంతో వాణిజ్యప రంగా ఉత్పత్తి చేయటాన్ని దేశంలో నిషేధించారు. యూరోపియన్ దేశాలు కూడా బీజీ3ని నిషేధిం చాయి. జీవ వైవిధ్యాన్ని ఎలాంటి రూపంలోనైనా ప్రభావితం చేసే విత్తనాలకు దేశంలోకి అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ గత ఏడాది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 50 లక్షల ఎకరాల్లో బోల్‌గార్డు 3 విత్తనాలు సాగైనట్లు తేలటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు పరిశోధనలు చేసిన విత్తనా లను సర్టిఫై చేసి వాణిజ్యపరంగా ఉత్ప త్తికి విడుదల చేసేవాళ్లు, గ్లోబలైజేషన్‌తో వచ్చిన సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విత్తన రంగం బాధ్యతల నుంచి తప్పుకొని బహుళజాతి సంస్థ లçకు అప్పగించాయి. ఫలితంగానే నేడు విత్తనంపై బహుళజాతి సంస్థల పెత్త నమే కొనసాగుతున్నది. ఇప్పటికీ మనం 1955, 1966 నాటి సరళమైన పాత విత్తన చట్టాలనే వాడుతున్నాం. 52 ఏళ్లు గడిచిపోయినా కొత్త విత్తన చట్టాలను రూపొందించు కోవాల్సిన అవసరం లేదా? 1966 విత్తన చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ రూపొందించిన విత్తన చట్టం– 2004 ముసాయిదా నేటికీ పార్లమెంటులో పెండింగ్‌లోనే ఉంది. దేశంలోని 75 శాతం మంది రైతాంగం కోరుకుంటున్న సమగ్ర విత్తన చట్టాలు అమల్లోకి రాకుండా ఆపు తున్నది ఎవరో బహిరంగ రహస్యమే. ప్రస్తుతం రాష్ట్రంలో మోన్శాంటో, డూపా యింట్, కార్గిల్, సింజెంటా కంపెనీలు 60 శాతం విత్తనాలపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. మరో 9 సంస్థలు మిగిలిన మార్కెట్‌ను గుప్పిట పట్టాయి. ఇప్పటి వరకు లభించిన వ్యవసాయ శాఖ నివే దికల ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు 31.06 కోట్ల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 9.80 కోట్ల ఎకరాల్లో, నూనె గింజలు 6.62 కోట్ల ఎకరాల్లో, పత్తి 5.45 కోట్ల ఎకరాల్లో సాగు అవుతున్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 397 విత్త నోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్‌లో 20 లక్షల క్వింటాళ్ళు ఆహార, పప్పు, నూనె గింజల విత్తనాలు, ఒక కోటికి పైగా పత్తి విత్తనాలు, రబీలో 8 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం. కొత్త విత్తన చట్టాలు అమల్లోకి రాకపోగా.. బహుళ జాతి సంస్థలు పాత విత్తన చట్టాల్లో ఉన్న కొన్ని కఠినమైన క్లాజుల్లో మార్పులు తెచ్చేవిధంగా ప్రభు త్వంపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా ఉత్పత్తి చేసే కంపెనీయే తన విత్తనానికి ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ ఇచ్చు కునే వెసులుబాటు కల్పించారు. దీంతో పత్తి విత్త నాల అక్రమసాగుకు అడ్డు లేకుండాపోయింది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేసే పత్తి పంటలోకి నిషేధిత బీజీ3 విత్తనాలను చొప్పించటానికి ఓ రాచ మార్గం ఏర్పడింది. ఫలితంగా ఆ పంటలను మేసిన పశువులు మరణించడం, చేలో పనిచేసిన వారికి గర్భస్రావాలు, చర్మవ్యాధులు సోకినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన బీజీ3 విత్తనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రస్థాయిలో ఒక సమగ్రమైన విత్తన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చే పనిలో నిమగ్నమ యింది. నకిలీ విత్తనాలు విక్రయించే వాళ్లపై పీడీ యాక్టు ప్రయోగించే విధంగా నిబంధ నలు అమల్లోకి తెచ్చారు. సోలిపేట రామలింగారెడ్డి , వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141 -
బిర బిరా.. లాభాలు
ఏడాదంతా సాగు ఏడాది పొడవునా ఈ పంటను సాగు చేయవచ్చు. విత్తిన మూడు వారాలకే కాతకు రావడం దీని విశిష్టత. కాయలు తెంపడం, మార్కెట్‌కు తరలించడం తేలికగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మంది కూలీల అవసరం ఉండదు. ఫలితంగా ఖర్చు కలిసొస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తీగజాతి కూరగాయల పంటలకు తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు. డ్రిప్ పద్ధతిలో పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. విత్తన రకాలు.. పలు కంపెనీలకు చెందిన హైబ్రిడ్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రెండు వరుసల మధ్య దూరం ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్లు, రెండు పాదుల మధ్య దూరం 0.6 నుంచి 0.9మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు ఒకటిన్నర కిలోల నుంచి రెండు కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది. విత్తనశుద్ధి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరం, ఐదు గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6నుంచి 8టన్నుల పశవుల ఎరువు, 40కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను గుంతల్లో వేసుకోవాలి. విత్తిన 25 రోజులకు పూత, పిందె దశలో 40 కిలోల నత్రజని ఎరువులు వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఒకవేళ వేసినట్లయితే వెంటనే నీటి తడి అందించాలి. కలుపు నివారణ పంటల సాగులో కలుపు మొక్కల నివారణ అతిముఖ్యమైన అంశం. బీర తోటలోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. విత్తనం నాటిన మరుసటి రోజున తేలిక నేలల్లో లీటరు మెటాక్లోర్ (డ్యుయల్) మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. బరువు నేలల్లో1.5 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకోవాలి. మొక్కలు రెండు, నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ పౌడర్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే పూత ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. రెండుమూడు తడులు అందించిన తర్వాత మట్టిని గుళ్ల చేయాలి. నీటి యాజమాన్యం పాదు చుట్టూ 3-5సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వారానికో తడి అందిస్తే పంట ఆరోగ్యవంతంగా ఉంటుంది. నీరు ఎక్కువకాలం పాదు చుట్టూ నిల్వకుండా జాగ్రత్తపడాలి. తెగుళ్లు తీగజాతి రకం పంటలపై తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి బూజు తెగులు, బూడిద తెగులు, వేరు కుళ్లు తెగులు, పక్షికన్ను తెగులు ప్రధానమైనవి. వీటిని సకాలంలో గుర్తించి వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు తగిన మందులు పిచికారీ చేయాలి. సస్యరక్షణ చర్యలు ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. పంటమార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వంద గ్రాముల విత్తనానికి రెండు గ్రాముల డెర్మా విరిడి మందును వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. అల్లి రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుంచి పూతకు వచ్చే వరకు వేపగింజల కషాయాన్ని తగిన మోతాదులో 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. -
ఎండిపోతున్న పంటలు
అందుబాటులో ఉన్న పశుగ్రాస విత్తనాలు జిల్లాలో ప్రస్తుతం ఎస్ఎస్జీ-825 హైబ్రీడ్ విత్తనాలు 150 టన్నులు ఉన్నాయి. వీటిని 75 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నాం. కిలో రూ.36 కాగా రాయితీ పోను రైతులకు రూ.9కు అందజేస్తున్నాం. సర్టిఫైడ్, అడ్వంటా యూపీఎల్ అనే రెండు కొత్త రకాల గడ్గి విత్తనాలను రాయితీపై పంపిణీ చేశాం. ఈసారి న్యూట్రిఫీడ్ అనే పశుగ్రాసం విత్తనాలు(సజ్జ రకం) 75 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నాం. ఇవి కిలో రూ.144.50. ఎకరానికి రెండు కేజీలు సరిపోతాయి. అడ్వంటా, యూపీఎల్ రకం విత్తనాలైతే ఎకరాకు 20 కేజీలు అవసరమవుతాయి. దిగుబడి సుమారుగా 120-130 టన్నుల గడ్డి వస్తుంది. ఏడుసార్లు కోత కోయవచ్చు. న్యూట్రిఫైడ్ రకంలో పాయిజన్ ఉండదు. జిల్లాలో సీఎస్‌పురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పామూ రు మండలాల్లో గ్రాసం కొరత ఉంది. ఇప్పటి వరకు 12 టన్నుల గడ్డి విత్తనాలు పంపిణీ చేశాం. మరో 17 మండలాల్లో 38 టన్నుల విత్తనాలను ఇవ్వనున్నాం. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పాడి రైతులు విత్తనాలు తీసుకెళ్లి గడ్డి పెంచుకుంటే సమస్య ఉండదు. సుగర్ గ్రేజ్ ఇది హైబ్రీడ్ జొన్న రకం. రైతులు కిలో విత్తనాలకు రూ.84.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎకరాకు 5 కేజీలు అవసరమవుతాయి. రెండు సార్లు కోతకు వస్తుంది. గడ్డి తీయగా ఉంటుంది. ఈ గడ్డి పశువులకు వేస్తే పాల దిగుబడి పెరుగుతుంది. విత్తనాలు నాటేటప్పుడు సాళ్ల మధ్య 4-5 అంగుళాల దూరం ఉంచాలి. ఎకరాకు 30 కిలోల నత్రజని, 12 కిలోల పొటాష్ వేయాలి. 10-15 రోజులకోసారి నీరు పెట్టాలి. నాటిన 50 నుంచి 55 రోజుల తర్వాత 50 శాతం పూత దశలో మొదటి కోత కోయాలి. ప్రతి 35-40 రోజులకు ఒక కోత చొప్పున మూడు కోతలు కోయాలి. ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తుంది. న్యూట్రిఫీడ్ న్యూట్రిపీడ్ పలు దఫాలుగా కోత కోసేందుకు అనువైన పచ్చిగడ్డి రకం. కొత్తగా వస్తున్న ఈ పశుగ్రాసం విత్తనాలు అన్ని రకాల నేలలకు, ముఖ్యంగా మెట్ట సేద్యంకు అనుకూలమైనవి. ఇవి నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఈ గడ్డి పశువులకు బలాన్నిస్తుంది. త్వరగా మేపుటకు అనుకూలమైనది. అధిక పాల దిగుబడికి దోహద పడుతుంది. న్యూట్రిఫీడ్ పచ్చిమేతలో ఉండే విటమిన్ ఏ పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఒక పాడి పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేత అవసరం. నీటి వసతి గల ఒక ఎకరా భూమిలో న్యూట్రిఫీడ్ సాగు చేస్తే ఐదారు పశువులకు సరిపోతుంది. వర్షాధారం కింద సాగు చేస్తే రెండు పశువులకు సరిపోతుంది. -
పంట వేస్తున్నారా? విత్తనశుద్ధి మరవద్దు!
పాడి-పంట: కడప అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రైతన్నలు వివిధ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఏ పంట వేసినా రైతులు ముందుగా విత్తనాలను సేకరించుకోవాలి. వాటిని విధిగా శుద్ధి చేయాలి. అప్పుడే చీడపీడల బారి నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. హైబ్రిడ్ విత్తనాలను ఆయా కంపెనీలే శుద్ధి చేసి విక్రయిస్తాయి. అయినప్పటికీ రైతులు మరోసారి విత్తనశుద్ధి చేసుకోవడం మంచిది. దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. పైగా మంచి దిగుబడులు వస్తాయి. ఈ నేపథ్యంలో వివిధ పంటల్లో విత్తనశుద్ధిపై వైఎస్ఆర్ జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య అందిస్తున్న సూచనలు... ఆహార ధాన్యపు పంటల్లో... కిలో వరి విత్తనాలకు 3 గ్రాముల చొప్పున కార్బండజిమ్ కలిపి, 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దుంప నారుమడులైతే లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, మరో 24 గంటలు మండె కట్టాలి. ఆ మొలకల్ని దుంప నారుమడిలో చల్లాలి. ఇక మొక్కజొన్న వేసే వారు కిలో విత్తనాలకు 3 గ్రాముల మాంకోజెబ్/థైరమ్/కాప్టాన్ చొప్పున పట్టించాలి. విత్తనశుద్ధి చేసిన తర్వాత విత్తనాలను నీటిలో నానబెట్టకూడదు. జొన్న వేసే వారు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ చొప్పున కలపాలి. మొవ్వు తొలిచే ఈగ నివారణకు కిలో విత్తనాలకు 3 గ్రాముల చొప్పున థయోమిథాక్సామ్ కలపాలి. సజ్జ విత్తనాలను శుద్ధి చేయాలంటే ముందుగా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున ఉప్పు కలపాలి. ఆ ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల ఎర్గాట్ శిలీంద్ర అవశేషాలు పైకి తేలతాయి. వాటిని తొలగించి, విత్తనాలను బాగా ఆరబెట్టాలి. అనంతరం కిలో విత్తనాలకు 3 గ్రాముల చొప్పున థైరమ్ పట్టించాలి. రాగి విత్తనాల శుద్ధి కోసం కిలో విత్తనాలకు 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ చొప్పున కలపాలి. పప్పు పంటల్లో... కంది పంట వేసే వారు ఎకరానికి సరిపడే విత్తనాలకు 200-400 గ్రాముల రైజోబియం కల్చర్ కలిపితే మంచి దిగుబడులు వస్తాయి. ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 5 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడెను పట్టించాలి. అయితే ఫైటోఫ్తోరా ఎండు తెగులు సోకే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 గ్రాముల చొప్పున మెటలాక్సిల్ కలపాలి. మినుము/పెసర పంట వేసేటప్పుడు కిలో విత్తనాలకు ముందుగా 30 గ్రాముల చొప్పున కార్బోసల్ఫాన్ పట్టించాలి. మొక్కలు మొలిచిన తర్వాత 15-20 రోజుల వరకు పంటను రసం పీల్చే పురుగుల బారి నుంచి కాపాడుకోవాలంటే కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/థయోమిథాక్సామ్ చొప్పున కలపాలి. కొత్తగా పైరు వేసే వారు రైజోబియం కల్చర్‌ను కలిపితే మంచి దిగుబడులు వస్తాయి. నూనె గింజల పంటల్లో... కిలో వేరుశనగ విత్తనాలకు ఒక గ్రాము టెబ్యుకొనజోల్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కార్బండజిమ్ చొప్పున పట్టించాలి. కాండంకుళ్లు వైరస్ తెగులు సోకే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 మిల్లీలీటర్ల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలపాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కిలో విత్తనాలకు 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ చొప్పున కలపాలి. వరి మాగాణుల్లో వేసే వారు లేదా కొత్తగా వేరుశనగ సాగు చేసే వారు విత్తనాలకు రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. మొదలుకుళ్లు, వేరుకుళ్లు, కాండంకుళ్లు తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉన్న చోట కిలో వేరుశనగ విత్తనాలకు 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడెను పట్టించాలి. విత్తనాలను ముందుగా క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి, ఆరబెట్టాలి. ఆ తర్వాత శిలీంద్ర నాశనిని పట్టించాలి. అవసరమైతే రైజోబియం కల్చర్‌ను కూడా కలపవచ్చు. కిలో ఆముదం విత్తనాలకు 3 గ్రాముల కార్బండజిమ్/మాంకోజెబ్ చొప్పున పట్టిస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, మొలక దశలో సోకే కుళ్లు తెగులు, వేరు-కాండంకుళ్లు తెగులును నివారించవచ్చు. పత్తిలో... కిలో పత్తి విత్తనాలను 80-100 మిల్లీలీటర్ల గాఢ గంధకపు ఆమ్లంలో 2-3 నిమిషాల పాటు ఉంచాలి. ఆ వెంటనే వాటిని 2-3 సార్లు నీటితో, తర్వాత సున్నపు తేటతో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా శుద్ధి చేసిన కిలో విత్తనాలకు తగినంత జిగురు కలపాలి. వాటికి 40 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించాలి. ఎండాకు, వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్ లేదా 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్/ట్రైకోడెర్మా విరిడె చొప్పున కలిపి విత్తుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నారుమడుల్లో సస్యరక్షణ కూరగాయ పంటల నారుమడుల్లో నారుకుళ్లు తెగులు కన్పించినట్లయితే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణంతో నారుమడిని పూర్తిగా తడపాలి. రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు.