పంట వేస్తున్నారా? విత్తనశుద్ధి మరవద్దు! | will you cultivate Crops, Do not forget to refined seeds | Sakshi
Sakshi News home page

పంట వేస్తున్నారా? విత్తనశుద్ధి మరవద్దు!

Published Tue, Jul 8 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

పంట వేస్తున్నారా? విత్తనశుద్ధి మరవద్దు!

పంట వేస్తున్నారా? విత్తనశుద్ధి మరవద్దు!

పాడి-పంట: కడప అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రైతన్నలు వివిధ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఏ పంట వేసినా రైతులు ముందుగా విత్తనాలను సేకరించుకోవాలి. వాటిని విధిగా శుద్ధి చేయాలి. అప్పుడే చీడపీడల బారి నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. హైబ్రిడ్ విత్తనాలను ఆయా కంపెనీలే శుద్ధి చేసి విక్రయిస్తాయి. అయినప్పటికీ రైతులు మరోసారి విత్తనశుద్ధి చేసుకోవడం మంచిది. దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. పైగా మంచి దిగుబడులు వస్తాయి. ఈ నేపథ్యంలో వివిధ పంటల్లో విత్తనశుద్ధిపై వైఎస్‌ఆర్ జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య అందిస్తున్న సూచనలు...
 
 ఆహార ధాన్యపు పంటల్లో...
 కిలో వరి విత్తనాలకు 3 గ్రాముల చొప్పున కార్బండజిమ్ కలిపి, 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దుంప నారుమడులైతే లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, మరో 24 గంటలు మండె కట్టాలి. ఆ మొలకల్ని దుంప నారుమడిలో చల్లాలి. ఇక మొక్కజొన్న వేసే వారు కిలో విత్తనాలకు 3 గ్రాముల మాంకోజెబ్/థైరమ్/కాప్టాన్ చొప్పున పట్టించాలి. విత్తనశుద్ధి చేసిన తర్వాత విత్తనాలను నీటిలో నానబెట్టకూడదు. జొన్న వేసే వారు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ చొప్పున కలపాలి. మొవ్వు తొలిచే ఈగ నివారణకు కిలో విత్తనాలకు 3 గ్రాముల చొప్పున థయోమిథాక్సామ్ కలపాలి.
 
 సజ్జ విత్తనాలను శుద్ధి చేయాలంటే ముందుగా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున ఉప్పు కలపాలి. ఆ ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల ఎర్గాట్ శిలీంద్ర అవశేషాలు పైకి తేలతాయి. వాటిని తొలగించి, విత్తనాలను బాగా ఆరబెట్టాలి. అనంతరం కిలో విత్తనాలకు 3 గ్రాముల చొప్పున థైరమ్ పట్టించాలి. రాగి విత్తనాల శుద్ధి కోసం కిలో విత్తనాలకు 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ చొప్పున కలపాలి.
 
 పప్పు పంటల్లో...
 కంది పంట వేసే వారు ఎకరానికి సరిపడే విత్తనాలకు 200-400 గ్రాముల రైజోబియం కల్చర్ కలిపితే మంచి దిగుబడులు వస్తాయి. ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 5 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడెను పట్టించాలి. అయితే ఫైటోఫ్తోరా ఎండు తెగులు సోకే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 గ్రాముల చొప్పున మెటలాక్సిల్ కలపాలి. మినుము/పెసర పంట వేసేటప్పుడు కిలో విత్తనాలకు ముందుగా 30 గ్రాముల చొప్పున కార్బోసల్ఫాన్ పట్టించాలి. మొక్కలు మొలిచిన తర్వాత 15-20 రోజుల వరకు పంటను రసం పీల్చే పురుగుల బారి నుంచి కాపాడుకోవాలంటే కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/థయోమిథాక్సామ్ చొప్పున కలపాలి. కొత్తగా పైరు వేసే వారు రైజోబియం కల్చర్‌ను కలిపితే మంచి దిగుబడులు వస్తాయి.
 
 నూనె గింజల పంటల్లో...

 కిలో వేరుశనగ విత్తనాలకు ఒక గ్రాము టెబ్యుకొనజోల్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కార్బండజిమ్ చొప్పున పట్టించాలి. కాండంకుళ్లు వైరస్ తెగులు సోకే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 మిల్లీలీటర్ల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలపాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కిలో విత్తనాలకు 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ చొప్పున కలపాలి. వరి మాగాణుల్లో వేసే వారు లేదా కొత్తగా వేరుశనగ సాగు చేసే వారు విత్తనాలకు రైజోబియం కల్చర్‌ను పట్టించాలి.
 
 మొదలుకుళ్లు, వేరుకుళ్లు, కాండంకుళ్లు తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉన్న చోట కిలో వేరుశనగ విత్తనాలకు 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడెను పట్టించాలి. విత్తనాలను ముందుగా క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి, ఆరబెట్టాలి. ఆ తర్వాత శిలీంద్ర నాశనిని పట్టించాలి. అవసరమైతే రైజోబియం కల్చర్‌ను కూడా కలపవచ్చు. కిలో ఆముదం విత్తనాలకు 3 గ్రాముల కార్బండజిమ్/మాంకోజెబ్ చొప్పున పట్టిస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, మొలక దశలో సోకే కుళ్లు తెగులు, వేరు-కాండంకుళ్లు తెగులును నివారించవచ్చు.
 
 పత్తిలో...
 కిలో పత్తి విత్తనాలను 80-100 మిల్లీలీటర్ల గాఢ గంధకపు ఆమ్లంలో 2-3 నిమిషాల పాటు ఉంచాలి. ఆ వెంటనే వాటిని 2-3 సార్లు నీటితో, తర్వాత సున్నపు తేటతో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా శుద్ధి చేసిన కిలో విత్తనాలకు తగినంత జిగురు కలపాలి. వాటికి 40 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించాలి. ఎండాకు, వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్ లేదా 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్/ట్రైకోడెర్మా విరిడె చొప్పున కలిపి విత్తుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
 నారుమడుల్లో సస్యరక్షణ
 కూరగాయ పంటల నారుమడుల్లో నారుకుళ్లు తెగులు కన్పించినట్లయితే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణంతో నారుమడిని పూర్తిగా తడపాలి. రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement