Fodder shortage
-
పాలలో వెన్న శాతం పెంచుకునేదెలా?
పాలసేకరణ సాధారణంగా గ్రామ స్థాయిలో సంఘాల ద్వారా, ప్రైవేటు డెయిరీల ద్వారా, పాడి సమాఖ్యల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇలాకాక బయట వెండర్లకు కూడా రైతులు పాలను విక్రయిస్తూ ఉంటారు. పాల కేంద్రాల్లో పాలలోని వెన్న శాతాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ కాబట్టి 6–7% ఉంటే లీటరుకు రూ. 35–40 వస్తాయి. అదే ఆవు పాలలో 4–4.5 శాతం ఉంటే లీటరుకు రూ. 25–30 వస్తాయి. వెన్న శాతం పెంపుదలకు రైతులు పాటించాల్సిన సూచనలు.. ► ఎక్కువ వెన్న శాతం గల పాలు ఇచ్చే జాతుల పశువులను ఎన్నుకోవాలి. ఆవు పాలలో కంటే గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ. హెచ్.ఎఫ్. ఆవు పాలలో కన్నా జెర్సీ ఆవు పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ► తొలి ఈత పశువుల్లో కంటే, 2–3 ఈతల పశువుల్లో వెన్న ఎక్కువగా ఉంటుంది. పశువు ఈనిన తర్వాత 4–6 వారాలకు పాలలో వెన్న శాతం అత్యధిక స్థాయికి చేరుతుంది. రైతులు పాడి పశువులను కొనేటప్పుడు వరుసగా 3 పూటలు గమనించాలి. పాడి చివరి దశలో పాల దిగుబడి తగ్గి, వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. ► పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను పిండి కేంద్రానికి పోయాలి. మలి ధారల్లో సుమారు 10 శాతం వెన్న ఉంటుంది. వీటిని డూదకు తాగించడం మంచిది కాదు. ► పాలను పితికే సమయం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే పాలు ఎగసేపుకునే అవకాశాలున్నాయి. ► పాలను త్వరగా పిండేయాలి. ఎందుచేతనంటే, పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ లోపే పాలు పించేయాలి. ఇలా చేస్తే ఆఖరి ధారల వరకు పూర్తి వెన్న శాతం పొందవచ్చు. ► పాలు తీసే సమయంలో పశువుకు బెదురు, చిరాకు చేయకూడదు. ► పశువులకు పీచు పదార్థాలున్న మేతను మేపాలి. వీటి వినియోగానికి పశువు పెద్ద పొట్టలోని సూక్ష్మక్రిములు సహకరిస్తూ, కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి. వీటి నిష్పత్తిని బట్టి వెన్న శాతం ఉంటుంది. ► పశువుకు తప్పనిసరిగా రోజుకు 3–4 కిలోమీటర్ల నడక వ్యాయామం అవసరం. ► వ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా గాలికుంటు వ్యాధి నుంచి పశువులను రక్షించుకోవాలి. ► పాల కేంద్రంలో పరీక్ష కోసం పాల నమూనా తీస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. దీనిపై రైతు దృష్టి పెట్టాలి. ► దాణా పదార్థాలయిన పత్తి గింజల చెక్క, సోయా చెక్క మొదలగు వాటి వల్ల పాల నాణ్యతా నిష్పత్తి పెరిగే అవకాశం ఉంది. ► గర్భకోశ వ్యాధుల వలన పాల వెన్న శాతం తగ్గుతుంది. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవస్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
గొడ్డు.. గోడు
కరువు రక్కసి మూగజీవాల పాలిట శాపంగా మారింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పశుగ్రాసానికి తీవ్రకొరత ఏర్పడింది. కనీసం తాగించేందుకు నీళ్లు కూడా సరిగా దొరకని పరిస్థితి నెలకొంది. పోషించే మార్గం కనిపించక.. మేతలేక కళ్లముందే పశువులు బక్కచిక్కిపోతుండడంతో పశుపోషకులు వాటిని కబేళాలకు తరలిస్తూ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. తల్లిలా పాలిచ్చే పాడిగేదెలు, ఆవులు, దూడలు మొదలుకుని రేయింబవళ్లు కష్టంచేసే జోడెడ్లు, దున్నపోతులను సైతం విక్రయిస్తున్నారు. మెదక్‌జోన్: వరుస కరువు కాటకాలతో చెరువులు, కుంటలన్నీ ఎడారిలా మారిపోయాయి. జిల్లాలో 95వేల బోరుబావులు ఉండగా అందులో సుమారు 70 శాతం పూర్తిగా నీటి ఊటలు అడుగంటిపోయాయి. మరో 30 శాతం బోర్ల నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో వరి సాగుచేశారు. చాలా వరకు నీటితడులు అందక పొట్టదశలో ఎండిపోవడంతో పశువులను మేపారు. ప్రస్తుతం అదీ లేకుండా పోయింది. ఆధునిక వ్యవసాయం అందుబాటులోకి రావడంతో వరిచేలను రైతులు కోతమిషన్లతో కోయిస్తున్నారు. మిషన్ సగానికి కోయడంతో ఎకరాకు 100 మోపులు రావాల్సిన గడ్డి 20 మోపులు మాత్రమే వస్తోంది. దీంతో పశుగ్రాసానికి డిమాండ్ బాగా పెరిగింది. మార్కెట్లో ఒక్కో మోపు ధర రూ.70 ఉంది. ట్రాక్టర్లో సుమారు వంద మోపుల గడ్డిపడుతోంది. దీనికి రూ.7000 ఖర్చవుతోంది. అంత మొత్తం వెచ్చించలేక .. చేసేది లేక పశుపోషకులు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 2.79 లక్షల పశు సంపద ఉంది. వీటిలో 1.55 లక్షల తెల్లజాతి పశువులు (ఆవులు, లేగదూడలు, కాడెడ్లు) ఉన్నాయి. 1.24 లక్షల నల్లజాతి పశువులు (దున్నపోతులు, పలురకాల పాడిగేదెలు, దెడ్డెలు) ఉన్నాయి. గొర్లకూ కష్టకాలమే గొల్లకురుముల అభివృద్ధి కోసం ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొర్లను అందించింది. ప్రభుత్వం అందించిన వాటితో పాటు ఇతర గొర్లు కలిపి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 7.80 లక్షల గొర్లు ఉన్నాయి. గొర్లు గడ్డిని మాత్రమే మేస్తాయి. వరుస కరువు కాటకాలకు తోడు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమ్మీద గడ్డి మాడిపోయి చూద్దామంటే కనిపించని పరిస్థితి నెలకొంది. మేత కష్టాలతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఫలితంగా వాటిని పోషించడం భారంగా మారడంతో చాలామంది గొర్లకాపరులు వాటిని విక్రయించడం ప్రారంభించారు. అలంకారప్రాయంగా నీటితొట్లు మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం పల్లెల్లో నీటితొట్లను నిర్మించింది. జిల్లావ్యాప్తంగా 625 తొట్లు ఉన్నాయి. నీటి ఎద్దడి కారణంగా ఎందులోనూ నింపడంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి కటకట ఏర్పడింది. మనుషులకే తాగునీటి కష్టాలు ఉత్పన్నం కావడంతో తొట్లలో నింపడం మానేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. పశుపోషణ భారమైంది నాకు మూడు పాడిగేదెలు, రెండు దుడ్డెలు ఉన్నాయి. నాకున్న రెండెకరాల పొలంలో బోరు ఆధారంగా ఎకరం పొలం నాటు వేశాను. పంట పొట్టదశకు వచ్చే సమయంలో బోరుబావిలో నీటి ఊటలు పూర్తిగా ఎండిపోయాయి. పంటంతా పోయింది. పశువులకు మేపేందుకు గడ్డి కూడా లేదు. వాటి పోషణ భారంగా మారింది. కబేళాకు తరలించేందుకు మనసొప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – చాకలి నర్సింలు, జంగారాయి సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందించాం పశుగ్రాసం కొరత తీర్చేందుకు జిల్లావ్యాప్తంగా 60 వేల మెట్రిక్ టన్నుల గడ్డివిత్తనాలను సబ్సిడీపై పశుపోషకులకు అందించాం. ఆ విత్తనాలతో 40 వేల ఎకరాల మేర గడ్డిని పెంచుకునే వీలుంది. బోరుబావుల్లో నీటిఊటలు తగ్గిపోవడంతో చాలామంది రైతులు విత్తనాలను తీసుకెళ్లినప్పటికీ వాటిని సాగుచేయలేదు. బోరుబావుల్లో నీళ్లున్న రైతులు మాత్రం సాగు చేశారు. – అశోక్‌కుమార్, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి -
పశుగ్రాసం లేక పరేషాన్!
తాంసి(బోథ్): ఆరుగాలం రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కాడెద్దులకు మేత కరువైంది. ఇంటా, బయట మేత లేక మూగజీవాలు అంబా అంటున్నాయి. కాడెద్దులకు పశుగ్రాసం దొరకకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కబేళాలకు అమ్ముకుంటున్నారు. కొందరు ఆర్థికభారమైన వేలకువేలు పెట్టి గడ్డి కొని పశువులను సాకుతున్నారు. జిల్లాలోని పశుసంపదకు సరిపడా పశుగ్రాసం దొరకడం లేదు. ఉన్న కొద్దిపాటి మేత కూడా ప్రియమైంది. పశువులకు మేత కొనాలంటే రైతులకు తలకు మించిన భారమవుతోంది. వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పలు గ్రామాల్లో నీటిసౌకర్యం ఉన్న రైతులు గడ్డి, మొక్కజొన్న వంటివి సాగుచేసినా ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక పశువుల మేత కోసం వేసిన పంటలు కూడా ఎండిపోయాయి. దీంతో జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడింది. రైతులకు ఆర్థిక భారమైనా ఒక్కో గడ్డి కట్టను రూ.15 నుంచి రూ.20 పెట్టి మేత కొనుగోలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్ గడ్డి ధర అయితే వేలల్లో ఉంది. దీనికి రవాణా చార్జీలు అదనం. దూర’భారం’ జిల్లాలోని తాంసి, తలమడుగు, భీంపూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడతోపాటు తదితర మండలాలకు చెందిన గ్రామాల రైతులు దూరభారమైనా నిర్మల్ జిల్లాతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వరిగడ్డిని ఒక్కో ట్రాక్టర్ రూ.10 వేలు పెట్టి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో రబీలో రైతులు 8వేల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్నతోపాటు, 4 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దీంతో జిల్లాలోని పశువులకు సరిపడ మేత లేక గడ్డి ధరలు ఆకాశాన్నంటాయి. సాకలేక సంతకు తరలింపు జిల్లాలో ఏర్పడిన తీవ్ర పశుగ్రాసం కొరతతో రైతులు తమకున్న పశువులను సాకలేక సంతకు తరలించి కబేళాలకు అమ్ముకుంటున్నారు. పెంచుకున్న పశువులకు వేలకువేలు పెట్టి పశుగ్రాసం కొనలేకపోతున్నారు. అయినా పశుసంవర్ధక శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. రైతులకు సబ్సిడీ ద్వారా గడ్డి విత్తనాలతోపాటు, దాణా వంటివి ముందుగా పంపిణీ చేస్తే ఈ గోస తప్పేది. రైతులకు విత్తనాలు అందజేశాం జిల్లాలో పశుగ్రాసం కొరత లేకుండా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 10 వేలమెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను రైతులకు 75 శాతం సబ్సిడీపై అందజేశాం. త్వరలోనే రైతులకు అందించడానికి మరో 10 వేల మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలకు ఆర్డర్ ఇచ్చాం. ఇవి రాగానే 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తాం. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. – సురేశ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మేత లేక ఎడ్లను అమ్మేశా.. నాకున్న 8 ఎకరాలను రెండు ఎడ్లతో సాగు చేసుకుంటున్నా. వర్షాలు లేక పశువులకు సరిపడా పశుగ్రాసం లేకపోవడంతో వాటిని పస్తులు ఉంచలేక..డబ్బులు పెట్టి గడ్డి కొనలేక ఆదిలాబాద్ సంతలో 15 రోజుల క్రితం రూ.45వేలకు ఎడ్లను అమ్మాల్సి వచ్చింది. – సురేందర్‌రెడ్డి, రైతు తాంసి సబ్సిడీపై పశుగ్రాసం అందించాలి పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించాలి. జిల్లాలో గడ్డి దొరకకపోవడంతో పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చేంత వరకు పశుగ్రాసం దొరకని పరిస్థితి నెలకొంది. రైతులకు పశుగ్రాసంతోపాటు దాణా పంపిణీ చేయాలి. – విఠల్, యువరైతు, తాంసి -
మూగజీవాలకు పశుగ్రాసం కొరత
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడనుంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. 16 జిల్లాల్లోని, 70 మండలాల్లో ఈ ప్రభావం ఉండనుంది. వాస్తవానికి అన్ని జిల్లాల్లోని మూగజీవాలకు మేత కష్టాలు తప్పేలా లేవు. వేసవి వచ్చినపుడే పశుగ్రాసం గుర్తు రావడం, ముందస్తు ప్రణాళికలు వేసుకోకపోవడంతోనే పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. వేసవిలో పశుగ్రాసం కొరత సాధారణమేనని కొందరు అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. పశుసంవర్ధకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4.27 కోట్ల పశువులు ఉన్నాయి. వీటికి జనవరి నుంచి జూన్ వరకు 111.27 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం కాగా, 109.77 లక్షల మెట్రిక్ టన్నుల గ్రాసం మాత్రమే అందుబాటులో ఉంది. ఎండు మేతను తీసుకుంటే 101.11 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా, 82.57 టన్నులు అందుబాటులో ఉందని పశుసంవర్థక శాఖ తన నివేదికలో పేర్కొంది. 16 జిల్లాల్లో అధికం జనగాం, ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొరత తీవ్రంగా ఉంది. కొత్తగూడెం జిల్లాలో మూడు మండలాలు, భూపాలపల్లిలో రెండు, మహబూబాబాద్‌లో రెండు, మంచిర్యాల్లో ఐదు, నల్లగొండలో 18, నిర్మల్‌లో మూడు, సిరిసిల్లలో రెండు, రంగారెడ్డిలో 16, వికారాబాద్‌లో 6, యాదాద్రి భువనగిరిలోని 13 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు పేర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో సరిపోను గ్రాసం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గొర్రెలకు పచ్చదనం లేక మేత దొరకని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ సబ్సిడీ గొర్రెల పంపిణీ జరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. వాటి మేతకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇస్తే వేసవిలో అవి చనిపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సాధారణంగా వేసవిలో పశుగ్రాసం కొరత ఉంటుంది. అయినప్పటికీ కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాం. పశువుల తాగునీటికోసం కొత్తగా 8 వేల నీటి తొట్లను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 12 వేల నీటి తొట్లు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ సహకారంతో అదనపు తొట్లు నిర్మిస్తున్నాం. – డాక్టర్ ఎస్.రామచందర్, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు -
మేత కరువు
కడప సెవెన్ రోడ్స్/రాయచోటి రూరల్ : జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పశువుల మేత తీవ్ర సమస్యగా మారింది. వానలు పడక పచ్చిమేపు ఎలాగూ లేకపోయినా, రైతుల వద్ద ఒట్టిమేపు కూడా అయిపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. కడప, చెన్నూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు పెట్టి గ్రాసాన్ని తెచ్చుకుంటున్నారు. మేత తక్కువ కావడంతో పాల దిగుబడి కూడా తగ్గుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే అయినకాడికి పశువులను తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల ప్రత్యామ్నాయ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. బాటనీ, జువాలజీ మంత్రులమంటూ చెప్పుకునే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి సొంత పనుల్లో నిమగ్నమై తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలలో ఏ రైతును కదిలించినా ప్రస్తుతం పశుగ్రాస కొరత గురించే చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది చిన్న, సన్నకారు రైతులకు పాడి పశువులే ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. పాడి పశువులను పోషిస్తే అవి తమ కుటుంబాలను పోషిస్తాయని రైతులు అంటున్నారు. అందుకే కనీసం ఎకరా, అర ఎకరంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తుంటారు. ఒక్కో ఆవుకు రోజుకు అర కిలో తవుడు, కిలో ఫీడ్, పచ్చి మేత, ఎండు మేత వేస్తారు. అంతా కలిపితే రూ.150లు ఖర్చు వస్తోంది. రోజుకు ఒక్కో ఆవు సగటున 16 లీటర్ల పాలు ఇస్తోంది. లీటరు ధర సగటున రూ.23ల నుంచి రూ.25లు ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రకారం రూ.368లు వస్తోంది. అందులో ఖర్చు తీసేస్తే నికరంగా రోజుకు ఒక్కో ఆవు ద్వారా రూ.200లు ఆదాయం ఉంటుందని వివరిస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో పచ్చి మేత ఎక్కడా లేదు. బోర్ల కింద ఎక్కడైనా ఇంకా అరకొరగా ఉంటే, రోజురోజుకు నీటి మట్టం అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వట్టి మేత కూడా రైతుల వద్ద అయిపోయింది. దీంతో కడప, చెన్నూరు, వేంపల్లె తదితర ప్రాంతాలనుంచి తెచ్చుకుంటున్నారు. ఎకరా పొలంలో ఉండే ఎండు గడ్డి రూ.7 వేలు చెబుతున్నారని తెలుస్తోంది. ట్రాక్టర్‌కు గడ్డి ఎత్తే కూలీలకు రూ.1500లు, ట్రాక్టర్ బాడుగ రూ.3వేలు కలుపుకుంటే రూ.12వేలు ఖర్చు వస్తోందని రైతులు అంటున్నారు. అదే వేరుశనగ కట్టె అయితే సుమారు రూ.18వేలు అవుతోందని చెబుతున్నారు. ఈ ప్రాంతాలలోని రైతులకు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ, ఉపాధి పనులు ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. ప్రభుత్వం తమ గోడును ఆలకించి పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో మాదిరిగా క్యాటిల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఆవులు 59,580, ఎనుములు 50502, గొర్రెలు 4862, మేకలు 110422 ఉన్నాయి. ప్రస్తుతం 32,940 మెట్రిక్ టన్నుల గడ్డి కొరత ఏర్పడిందని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జయకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద 1300 మెట్రిక్ టన్నుల దాణా, వెయ్యి బేళ్ల సైలేజీ (మాగుడు గడ్డి), 70 క్వింటాళ్ల గడ్డి విత్తనాలు, 390 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ (దాణా మృతం) రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలకు అవసరమని పేర్కొన్నారు. గొర్రెలకు మేపు అందించండి నేను 3ఎకరాలు కౌలుకు పొలం తీసుకున్నాను. నారు కూడా వేశాను. వాన కోసం ఎదురుచూస్తున్నాను. ఇది కాకుండా 30 గొర్రెలు కూడా పెంచుకుంటున్నాను. ఎక్కడా మేత లేకపోవడంతో చాలా కష్టంగా ఉంది. మనుషులు తాగేందుకు నీరులేని పరిస్థితి వస్తోంది. దీంతో పశువులకు నీటిని తాపితే మనుషులకు తక్కువ వస్తున్నాయి. ఇంకా పది, 15రోజులు వర్షాలు పడకపోతే గొర్రెలు అమ్ముకోవాల్సిందే. 5ఏళ్ల క్రితం పశువుల ఆసుపత్రిలో రోజుకు 15కిలోల గడ్డి ఉచితంగా ఇచ్చారు. మళ్లీ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే గొర్రెల కాపరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేకలైతే ఆకులు, అలుములు తింటాయి. కానీ గొర్రెలు గడ్డి మాత్రమే తింటాయి. కనుక ప్రధానంగా మాకే సమస్య వస్తోంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు ఎస్.రెడ్డప్ప. ఈయనది సంబేపల్లె మండలం బొగ్గులవారిపల్లె. ఇతనికి 50గొర్రెలు ఉన్నాయి. ఇవే ఆయనకు ఉన్న ఆస్తి. వీటి పెంపకమే ఆయన జీవనాధారం. ఇప్పటిదాకా చుక్క వాన లేదు. కను చూపుమేరలో ఎక్కడా గడ్డి పరకైనా లేదు. దీంతో జీవాలకు మేత కరువైంది. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా రైతుల వద్ద గ్రాసంలేదు. దీంతో చిత్తూరు జిల్లాకు వెళ్లి రూ.15వేలు ఖర్చు చేసి ఒక ట్రాక్టర్ వేరుశనగ కట్టె తీసుకొచ్చారు. పగటిపూట గొర్రెలను అలా బయటకు తోలుకెళుతాడు. బయట ఎక్కడా మేత మేయకపోయినా.. అవి తిరిగి వస్తాయి. సాయంత్రం ఇంటికి తోలుకు వస్తాడు. ఒకప్పుడు గంపలు.. గంపలు వేరుశనగ, ఉలువ పొట్టు వేసి మేపుతుండేవాడు. ట్రాక్టర్ మేపు నెల తిరగకముందే అయిపోయింది. ఇప్పుడేం చేయాలి భగవంతుడా అని బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న దుర్గంబోయపల్లెకు చెందిన కొందరు గొర్రెల కాపరులు తమ మందలను తీసుకుని మైదుకూరుకు వెళ్లారు. ‘‘ఇంకా వారం, పది రోజులు దాటితే నేను కూడా ఏదో ఒక దిక్కుకు వెళ్లాల్సిందే.. మేత కోసం మూగ జీవాలు పడుతున్న అవస్థలు చూస్తుంటే మాకు ముద్ద దిగడంలేదు. జీవాలు బాగుంటేనే మేం బాగుంటాం.. ప్రభుత్వం దయ చూపి వేరుశనగ కట్టె, ఉలువ పొట్టు పంపిణీ చేస్తే చాలా మేలు చేసినట్లవుతుంది’’ అంటూ ఆయన సాక్షి వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. నెత్తిపై గడ్డి మోపుతో కనిపిస్తున్న ఈ రైతు పేరు పాలేటి. చిన్నమండెం మండలం జల్లవాండ్లపల్లెకు చెందిన రైతు. ఈయనకు 2ఎకరాల వర్షాధార భూమి ఉంది. వేరుశనగ సాగు చేస్తాడు. విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. వర్షం లేకపోవడంతో పంట వేయలేదు. భూమిపైనే ఆధారపడకుండా రెండు జెర్సీ ఆవులు మేపుతున్నాడు. ఆవులే ఆయనకు ప్రధాన జీవనాధారమయ్యాయి. చుట్టు పక్కల ఎక్కడా మేపు లేకుండా పోయింది. ట్రాక్టర్ రూ.12వేలు ఖర్చుచేసి వరి గడ్డి కొనుగోలు చేశాను. ఇప్పుడు ఆ గడ్డి కూడా అయిపోవస్తోంది. ఇక ఏమి చేయాలో పాలుపోవడంలేదు. మేతలేక పాల దిగుబడి కూడా తగ్గిపోతోంది. ఇంకా కొన్ని రోజులు వానలు పడకపోతే ఉన్న ఆవులను అయిన కాడికి అమ్ముకోవాల్సిందే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. -
గడ్డుకాలం
♦ అలమటిస్తున్న మూగజీవాలు ♦ గ్రాసమూ లేదు.. నీళ్లూ లేవు ♦ కబేళాలకు తరలుతున్న పశుసంపద ♦ కొన్నిచోట్ల అయినకాడికి విక్రయాలు ♦ కరువు కాలంలో భారంగా మారిన పశుపోషణ ♦ చేతికొచ్చిన పంటే గ్రాసమాయె.. కొన్యాలకి చెందిన యాదాగౌడ్ మాదూర గ్రామంలో ఎకరం ఎనిమిది కుంటల పొలంలో రబీ కింద వరి సాగు చేశాడు. పొట్టపోసుకునే దశలో నీరందక పంటంతా ఎండిపోయింది. దీంతో పొలంలో పశువులను వదిలేశాడు. స్వేదం చిందించి చేసిన సేద్యం తనకు కలిసి రాకున్నా.. కనీసం పశువుల ఆకలినైనా తీరుస్తుందని ఆ రైతు అంటున్నాడు. - హత్నూర నెమరు వేసేందుకు గడ్డి పరకలు కరువు.. గొంతు తడిసే దారే లేదు. కనీసం నిలువ నీడా లేకుండాపోయింది. దుర్భిక్షం రైతులనే కాదు.. వ్యవసాయంలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే పశుసంపదనూ నకనకలాడిస్తోంది. నిన్నటి వరకు వెన్నంటి ఉన్న మూగజీవాల్ని.. పోషించే దారి లేక రైతులు వదిలించుకుంటున్నారు. గడ్డి మోపు ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతుండటంతో కరువు కాలంలో అంత పెట్టి కొనే స్థోమత లేక వారాంతపు సంతల్లో అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు. కొందరు కబేళాలకు తరలిస్తున్నారు. - జోగిపేట మెదక్ జిల్లాలో మూగజీవాలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పశువులకు తినడానికి గడ్డి లభించక, తాగేందుకు నీరు దొరకక, కనీసం నిలబడేందుకు చెట్ల నీడ లేక అల్లాడిపోతున్నాయి. వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో రైతులు భూములన్నింటినీ సాగు చేయలేక వృథాగా వదిలేశారు. పొలాల్లోని చెట్లను నరికి వేస్తూ కలపను విక్రయించుకుంటున్నారు. పశుగ్రాసం దొరకకపోవడంతో గ్రామాల్లో ఉన్న పశువులను అమ్ముకుంటున్నారు. మరికొన్ని పశువులను ఎంత దొరికితే అంతకే లాభం ఆశించకుండా విక్రయిస్తున్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ఎక్కువగా జహీరాబాద్ ప్రాంతంలో గల అల్లానా ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోనే పశుసంపద అత్యధికంగా ఉండే మెదక్ జిల్లా.. ప్రస్తుతం గడ్డు పరిస్థితి నెలకొంది. కరవు నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండుగడ్డి కూడా లభించ క వ్యవసాయదారులు పక్క జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ఎద్దులు, ఆవులు 4.42 లక్షలు, గేదెలు 4.37 లక్షలు, గొర్రెలు 10.83 లక్షలు, మేకలు 5.72 లక్షలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఐదేళ్ల కొకసారి జరిగే పశుగణన ప్రకారం నిర్ధారించిన లెక్కలివి. ఇంత పెద్దసంఖ్యలో పశుసంపద గల జిల్లాలో వాటికి మేత సమస్యగా మారింది. మేకలు, గొర్రెలు తినడానికి పచ్చిగరక, తాగడానికి నీళ్లు లభించక వీటి పెంపకందారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశుగ్రాసం కొరత వాస్తవమే జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడిన విషయం వాస్తవమేనని పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి చెప్పారు. ఆయనేమన్నారంటే.. ‘జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల గ్రా సం కొరత ఉంది. దాన్ని అధిగమించేందుకు పశు సంవర్ధక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా 160 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం విత్తనాలకు రూ.40 లక్షలు వెచ్చించి 5 వేల ఎకరాలలో పండించాం. మరో 10 వేల ఎకరాలలో విత్తనాలు పండిస్తే కొంత వరకు కొరత తీరే అవకాశం ఉంది. జిల్లాలోని అన్ని మండలాల్లో పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో 8.50 లక్షల పశుసంపద ఉంది. కేవలం వ్యవసాయానికి ఉపయోగానికి రాని పశువులను మాత్రమే విక్రయించాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పశువులు కబేళాలకు తరలించొద్దు. జిల్లాలోని అల్లానా, ఆల్‌కబీర్ ఫ్యాక్టరీలకు పశువులను తరలిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సాధ్యమైనంత వరకు వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తాము పండిస్తున్న పంటలతో పాటే పశుగ్రాసాన్ని కూడా పండించుకోవాలి. పశువులకు తాగునీటి అవసరాల కోసం నీటి తొట్టెలను ఈజీఎస్ ద్వారా నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’. ఊహకందని వేదన.. నాకు ఊహ వచ్చిన నాటి నుంచి ఇంత దుర్భిక్షాన్ని చూడలేదు. గతంలో పశువులకు ఎంతంటే అంత పశుగ్రాసం లభించేది. రెండేళ్ల నుంచి పరకే కరువైంది. గడ్డి మోపు రూ.250 పెట్టి కొన్నా.. పశుగ్రాసం కోసం ఎన్నడూ ఇన్ని తిప్పలు పడింది లేదు. పశువులకు మేతే కాదు.. నీళ్లూ అందించలేకపోతున్నాం. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు మనుషుల అవసరాలకే సరిపోవట్లేదు. పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నా అవి ఎవరికి ఇస్తున్నారో మాకైతే తెలియదు. - కిష్టయ్య, రైతు, అన్నాసాగర్ పశువులను అమ్ముకోవద్దు పంటలు పండకపోవడం, విస్తీర్ణం తగ్గిపోవడం, ధరలు పెరగడం, కూలీల లభ్యత లేకపోవడంతో పశువులను రైతులు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు అమ్మితే తిరిగి కొనాలంటే ధరలు విపరీతంగా పెరడం వల్ల కొనలేకపోతామన్న విషయాన్ని గమనించాలి. మండలాల వారిగా పశుసంవర్ధక శాఖ డాక్టర్లను పర్యటింపజేసి రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడతాం. పశువుల సంత, దళారుల అమ్మకాలపై నిఘా పెట్టి అక్రమంగా పశువుల్ని తరలించడం, అమ్ముకోవడం లాంటి వాటిని నియంత్రణ చేస్తాం. జిల్లాలో పశుసంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ లక్ష్మారెడ్డి, జేడీ, పశుసంవర్ధకశాఖ గడ్డి కొరత.. తీరని వెత.. జిల్లాలో సగటున ఒక్కో రైతు నాలుగు నుంచి ఆరేడు పశువుల వరకు పోషిస్తున్నారు. కరువు కారణంగా రైతులు తమకున్న పశువుల్లో కొన్నింటిని అమ్మేసుకుంటున్నారు. నారాయణఖేడ్, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట ప్రాంతాల్లో రైతులు పశువులకు అవసరమన గ్రాసం కొరతతో పశువులను వదిలించుకుంటున్నారు. పశువులను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వద్దకు దళారులు చేరుకొని క్రయవిక్రయాలు జరుపుతున్నారు. సంతల్లో ఎక్కువగా ఎద్దులు, గేదెల విక్రయాలకు పశుగ్రాసం కొరతే కారణమని రైతులు అంటున్నారు. ఇతర ప్రాంతాలకు తరలింపు.. పశువులు లేని రైతులు తాము పండించిన వరి ధాన్యం పంటలో వచ్చే గడ్డిని డబ్బులు వస్తున్నాయన్న ఆశతో ఇతర ప్రాంతాలకు రూ.150 చొప్పున గడ్డిమోపును అమ్ముకుంటున్నారు. ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు గడ్డి తరలిపోవడం వల్ల కూడా స్థానికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత ఖరీఫ్, రబీ సీజన్లోనే సుమారుగా 25 శాతం ఎద్దులు, గేదెలు తగ్గిపోయినట్లుగా సమాచారం. గడ్డిలేకపోవడంతో చేసేది లేక రైతులు పశువులను వదిలించుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో జరిగే సంతల రోజున ఇతర జిల్లాలకు చెందిన వారు వచ్చి స్థానికంగా ఉన్న రైతులు విక్రయించే పశువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పశువులను జహీరాబాద్ ప్రాంతంలోని అల్లానా ఫ్యాక్టరీకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.