గొడ్డు.. గోడు | Cattle Fodder Shortage Medak Farmers | Sakshi
Sakshi News home page

గొడ్డు.. గోడు

Published Mon, May 13 2019 12:38 PM | Last Updated on Mon, May 13 2019 12:38 PM

Cattle Fodder Shortage Medak Farmers - Sakshi

కరువు రక్కసి మూగజీవాల పాలిట శాపంగా మారింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పశుగ్రాసానికి తీవ్రకొరత ఏర్పడింది. కనీసం తాగించేందుకు నీళ్లు కూడా సరిగా దొరకని పరిస్థితి నెలకొంది. పోషించే మార్గం కనిపించక.. మేతలేక కళ్లముందే పశువులు బక్కచిక్కిపోతుండడంతో పశుపోషకులు వాటిని కబేళాలకు తరలిస్తూ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. తల్లిలా పాలిచ్చే పాడిగేదెలు, ఆవులు, దూడలు మొదలుకుని రేయింబవళ్లు కష్టంచేసే జోడెడ్లు, దున్నపోతులను సైతం విక్రయిస్తున్నారు. 

మెదక్‌జోన్‌: వరుస కరువు కాటకాలతో చెరువులు, కుంటలన్నీ ఎడారిలా మారిపోయాయి. జిల్లాలో 95వేల బోరుబావులు ఉండగా అందులో సుమారు 70 శాతం పూర్తిగా నీటి ఊటలు అడుగంటిపోయాయి. మరో 30 శాతం బోర్ల నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో వరి సాగుచేశారు. చాలా వరకు నీటితడులు అందక పొట్టదశలో ఎండిపోవడంతో పశువులను మేపారు. ప్రస్తుతం అదీ లేకుండా పోయింది. ఆధునిక వ్యవసాయం అందుబాటులోకి రావడంతో వరిచేలను రైతులు కోతమిషన్లతో కోయిస్తున్నారు. మిషన్‌ సగానికి కోయడంతో ఎకరాకు 100 మోపులు రావాల్సిన గడ్డి 20 మోపులు మాత్రమే వస్తోంది. దీంతో పశుగ్రాసానికి డిమాండ్‌ బాగా పెరిగింది. మార్కెట్‌లో ఒక్కో మోపు ధర రూ.70 ఉంది. ట్రాక్టర్‌లో సుమారు వంద మోపుల గడ్డిపడుతోంది. దీనికి రూ.7000 ఖర్చవుతోంది. అంత మొత్తం వెచ్చించలేక .. చేసేది లేక పశుపోషకులు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 2.79 లక్షల పశు సంపద ఉంది. వీటిలో 1.55 లక్షల తెల్లజాతి పశువులు (ఆవులు, లేగదూడలు, కాడెడ్లు) ఉన్నాయి. 1.24 లక్షల నల్లజాతి పశువులు (దున్నపోతులు, పలురకాల పాడిగేదెలు, దెడ్డెలు) ఉన్నాయి.

గొర్లకూ కష్టకాలమే
గొల్లకురుముల అభివృద్ధి కోసం ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొర్లను అందించింది. ప్రభుత్వం అందించిన వాటితో పాటు ఇతర గొర్లు కలిపి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 7.80 లక్షల గొర్లు ఉన్నాయి. గొర్లు గడ్డిని మాత్రమే మేస్తాయి. వరుస కరువు కాటకాలకు తోడు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమ్మీద గడ్డి మాడిపోయి చూద్దామంటే కనిపించని పరిస్థితి నెలకొంది. మేత కష్టాలతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఫలితంగా వాటిని పోషించడం భారంగా మారడంతో చాలామంది గొర్లకాపరులు వాటిని విక్రయించడం ప్రారంభించారు. 

అలంకారప్రాయంగా నీటితొట్లు
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం పల్లెల్లో నీటితొట్లను నిర్మించింది. జిల్లావ్యాప్తంగా 625 తొట్లు ఉన్నాయి. నీటి ఎద్దడి కారణంగా ఎందులోనూ నింపడంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి కటకట ఏర్పడింది. మనుషులకే తాగునీటి కష్టాలు ఉత్పన్నం కావడంతో తొట్లలో నింపడం మానేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. 

పశుపోషణ భారమైంది

నాకు మూడు పాడిగేదెలు, రెండు దుడ్డెలు ఉన్నాయి. నాకున్న రెండెకరాల పొలంలో బోరు ఆధారంగా ఎకరం పొలం నాటు వేశాను. పంట పొట్టదశకు వచ్చే సమయంలో బోరుబావిలో నీటి ఊటలు పూర్తిగా ఎండిపోయాయి. పంటంతా పోయింది. పశువులకు మేపేందుకు గడ్డి కూడా లేదు. వాటి పోషణ భారంగా మారింది. కబేళాకు తరలించేందుకు మనసొప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.       – చాకలి నర్సింలు, జంగారాయి 

సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందించాం

పశుగ్రాసం కొరత తీర్చేందుకు జిల్లావ్యాప్తంగా 60 వేల మెట్రిక్‌ టన్నుల గడ్డివిత్తనాలను సబ్సిడీపై పశుపోషకులకు అందించాం. ఆ విత్తనాలతో 40 వేల ఎకరాల మేర గడ్డిని పెంచుకునే వీలుంది.  బోరుబావుల్లో నీటిఊటలు తగ్గిపోవడంతో చాలామంది రైతులు విత్తనాలను తీసుకెళ్లినప్పటికీ వాటిని సాగుచేయలేదు.  బోరుబావుల్లో నీళ్లున్న రైతులు మాత్రం సాగు చేశారు. – అశోక్‌కుమార్, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement