కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం
ఉట్నూర్ రూరల్ : కరువు కోరల్లో చిక్కుకున్న ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందని, అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం జిల్లా వైపు దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజా సంఘాల నాయకులు నేతావత్ రాందాస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు బానోత్ రామారావులు ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో పంటలు సరిగా పండక కొద్దో గొప్పో పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం దారుణమన్నారు.
జిల్లాలో తాగునీటి సమస్య, గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్వరాష్ర్ట సాధన కోసం అసువులు బాసిన అమరవీరులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే కేవలం 485 మంది కుటుంబాలకే సహాయం చేసిందని, మిగితా వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1969 ఉద్యమం అమరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేతావత్ రాజేందర్, సీహెచ్ రాము, కచ్‌కడ్ తాతేరావు తదితరులు పాల్గొన్నారు.