సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది భూగర్భజల మట్టాల్లో పెరుగుదల కనిపించ డం లేదు. గత జూలై, ఆగస్టు నెలలో సరైన వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాల్లో వృద్ధి గతంతో పోలిస్తే తక్కువగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వాయర్లు, చెరువుల్లో అనుకున్న మేర నీరు రాకపోవడంతో సెప్టెంబర్‌లో భూగర్భ జల మట్టాల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది సెప్టెంబర్ సీజన్‌తో పోలిస్తే 0.41 మీటర్ల దిగువనే భూగర్భ జల మట్టాలు ఉండటం కల వరపరిచే అంశమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
పూర్తిగా నిండని చెరువులు
మొత్తంగా చూస్తే గోదావరి, కృష్ణా బేసిన్‌లోని 44,180 చెరువులకు గానూ 14,418 చెరువులు 25 శాతం కన్నా తక్కువగా నిండగా, మరో 9,289 చెరువులు 25 నుంచి 50 శాతం వరకు మాత్రమే నిండాయి. రంగారెడ్డి జిల్లాలో 2,019 చెరువులు ఉండగా ఏకంగా 1,635 చెరువులు నీటి కరువును ఎదుర్కొంటున్నాయి. పెద్దపల్లి జిల్లాలోనూ 1,185 చెరువులకు గానూ 1,070 చెరువుల్లో నీరు చేరలేదు. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇదీగాక కురిసిన వర్షపాతం, పడిన సమయం ఆధారంగా సగటున 10 నుంచి 11 శాతం నీరు భూగర్భానికి చేరుతుంది. అయితే ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, కొన్ని ప్రాంతాల్లో అసలు కురవనే లేదు. భారీగా కురిసిన చోట పెద్ద ప్రవాహా లతో స్థానిక చెరువులు, రిజర్వాయర్లలోకి నీరు చేరగా, అసలు కురవని చోట నీరు భూగర్భా నికి చేరనే లేదు. ఈ కారణం చేతనే భూగర్భ జల మట్టాల్లో పెరుగుదల లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 41 మండలాల్లో భూగర్భ జల మట్టాలు 20 మీటర్ల దిగువన ఉండగా, 10 మీటర్ల నుంచి 20 మీటర్ల మధ్యన భూగర్భ జలాలున్న మండలాల సంఖ్య 208గా ఉంది. కేవలం 168 మండలాల్లో మాత్రమే 5 మీటర్ల ఎగువన భూగర్భ జల మట్టాలున్నట్లు భూగర్భజల విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దెబ్బతీసిన లోటు వర్షపాతం
రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటున 12 నుంచి 10 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 724 మిల్లీమీటర్లు కాగా కేవలం 647 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జల సగటు మట్టాలు గత ఏడాదితో పోలిస్తే ఆశాజనకంగా లేవు. గత ఏడాది సెప్టెంబర్‌లో సగటు భూగర్భ జల మట్టం 8.95 మీటర్ల దిగువన ఉండగా, ప్రస్తుతం అది 9.36 మీటర్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 0.41 మీటర్ల దిగువన ఉంది. గద్వాల, రంగారెడ్డి, మేడ్చల్, నిర్మల్, పెద్దపల్లి, వికారాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో భూగర్భ జల మట్టాల్లో పెద్దగా పెరుగుదల లేదు. గరిష్టంగా మేడ్చల్‌లో 3.25 మీటర్లు, గద్వాలలో 3.17 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవకపోవడంతో 50 శాతానికి పైగా చెరువుల్లో నీరు చేరలేదు. దాంతో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేవని భూగర్భ జల విభాగం వెల్లడిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment