Teak
-
మరో రెండు సా మిల్లుల సీజ్
అక్రమ కలప వ్యాపారం కేసులో అధికారులు మరోరెండు సా మిల్లులను సీజ్ చేశారు. కొన్ని రోజులుగా సా మిల్లుల్లో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సా మిల్లులు సీజ్ కాగా బుధవారం వీటిని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్, పోలీస్ కమిషనర్ కార్తికేయ కలిసి పరిశీలించారు. అక్రమ కలప రవాణాలో భాగస్వామ్య ముందని ఆరోపణలు ఎదు ర్కొన్న ఏఆర్ ఎస్ఐ షకీల్పాషాను సస్పెండ్ చేస్తూ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సీజ్ చేసిన సా మిల్లుల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్): అక్రమ కలప వ్యాపారం కేసులో మరోరెండు సా మిల్లులను సీజ్ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. బుధవారం మాలపల్లిలో గల దక్కన్, సోహైల్ సా మిల్లులను సీజ్ చేస్తూ డీఎఫ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు నాలుగు సా మిల్స్ సీజ్ కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నాలుగు దుకాణాల యాజమానులు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పై నాలుగు సా మిల్లను సీజ్ చేసి, అందులోని కలప రికార్డుల ప్రకారం ఉందా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు డీఎఫ్‌వో ప్రసాద్ వెల్లడించారు. అటవీశాఖ అధికారుల తనిఖీలో సోహైల్ సా మిల్లులో ఆరు దుంగలు, దక్కన్ సా మిల్లులో ఐదు దుంగలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దాంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ, డీఎఫ్‌వో ప్రసాద్‌తో కలిసి సీజ్ చేసిన నాలుగు సా మిల్లులను పరిశీలించారు. వాటిలో లెక్క తేలెంతవరకు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీసులను, అటవీశాఖ సిబ్బందిని ఆదేశించా రు. ముఖ్యంగా రాత్రిపూట బందోబస్తులో నిర్లక్ష్యం చేయవద్దని సీపీ సూచించారు. దాడులు కొనసాగిస్తాం : డీఎఫ్‌వో జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో నిజామాబాద్, బిలాల్, దక్కన్, సోహైల్ సా మిల్లులకు అక్రమంగా కలప రవాణా చేసినట్లు తేలటంతో వాటిని సీజ్ చేసినట్లు, జిల్లాలో అనుమానం ఉన్న మిగతా సా మిల్లులలో దాడులు కొనసాగించనున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు. ప్రస్తుతం సీజ్ అయిన నాలుగింటి లో తనిఖీలు పూర్తి అయ్యాక జిల్లాలో అనుమానం ఉన్న, గతంలో ఆరోపణలు వచ్చిన సా మిల్లులలో దుంగలు రికార్డుల ప్రకారం ఉన్నాయా లేదా, అనేవి పరిశీలించి దొంగ కలప ఉంటే సా మిల్‌ను సీజ్ చేయనున్నట్లు డీఎఫ్‌వో వెల్లడించారు. గతంలో ఆరు సా మిల్లుల సీజ్... అక్రమ కలప వ్యాపారం చేసిన వ్యాపారులపై అటవీశాఖ అధికారులు గతంలోనూ కొరడా ఝళిపించారు. 1988లోనూ ఇదే మాదిరిగా అక్రమ కలప వ్యాపారం కేసులో అధికారులు ఒకేసారి ఆరు సా మిల్లుల సీజ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు మాలపల్లి, బోధన్ రోడ్డు, పూలాంగ్, వినాయక్‌నగర్ ప్రాంతాల్లో గల ఆరు సా మిల్లులను అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు ఒకేసారి మాలపల్లిలో నాలుగు సా మిల్లుల సీజ్, మిగతా అక్రమ వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడతో పాటు నిర్మల్ జిల్లా మామడ మండలం నుంచి నిజామాబాద్‌కు కలప అక్రమ రవాణా చేస్తూ నిర్మల్ రూరల్ పోలీసులకు పట్టుబడటం, ఈ కేసులో జిల్లాకు చెందిన ఏఆర్ ఏఎస్ఐ షకీల్ పాష పాత్ర ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ జరిపి కూపీ లాగారు. నిజామాబాద్‌లోని మాలపల్లిలో గల సా మిల్లుల యాజమానులు చేస్తున్న అక్రమ కలప వ్యాపార బాగోతం బట్టబయలయ్యింది. ఈ కేసులో నిర్మల్ పోలీసులు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిజామాబాద్ ఫారెస్టు అధికారులతో కలిసి సా మిల్లులపై దాడులు చేయడంతో సా మిల్లులలో అక్రమ కలప వ్యాపారాలు వెలుగుచూస్తున్నాయి. అధికారుల దాడులతో కొంతమంది అక్రమార్కులు జాగ్రత్తగా తమ సా మిల్లులోని కలపను ఇతర చోటుకు తరలించినట్లు తెలిసింది. నాలుగు సా మిల్లులపై వచ్చిన ఆరోపణలతో దాడులకు దిగిన అధికారులు మిగతా సా మిల్లులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే వాటిలో కూడా అక్రమ కలప వ్యాపారం బయట పడే అవకాశం ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీజైన సా మిల్లుల వద్ద గట్టి బందోబస్తు అక్రమ కలప వ్యాపారం విషయంలో సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆదేశాలు స్పష్టంగా ఉన్న నేప థ్యంలో అధికారులు సీజ్ అయిన సా మిల్లుల వద్ద గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లో సీజ్ అయిన నాలుగు సా మిల్లుల వద్ద అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా గట్టి బందోబస్తు చేపట్టారు. సీజ్ అయిన సా మిల్లులలో రికార్డుల ప్రకారం దుంగలు ఉన్నాయా లేవా అనేది ఇప్పట్లో తేలే అవకాశం లేక వాటి నుంచి దుంగలు బయటకు తరలిపోకుండా ఒక్కో సా మిల్ వద్ద అటవీశాఖ నుంచి సెక్షన్ ఆఫీసర్ ఒకరు, ఇద్దరు బీట్ ఆఫీసర్లు, ఫారెస్టు స్ట్రైక్ఫోర్సు సిబ్బంది ఒకరు, పోలీస్‌శాఖ నుంచి ఒక ఎస్‌ఐస్థాయి అధికారితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తుకు నియమించారు. -
పడావు భూముల్లో పచ్చని పంటలు!
సాగునీటికి వసతి లేని ప్రాంతం.. నీరు లేక భూములు బంజరుగా మారడం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన పాల్వాయి సత్యనారాయణ రెడ్డిని కలవరపరచింది. ఎలాగైనా తమ భూములను పంటలకు ఆలవాలంగా మార్చాలని, పచ్చదనాన్ని నింపుకోవాలన్న తపనతో అన్వేషించగా.. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని తోచింది. అయితే, అందుబాటులో ఉన్న అనేక పద్ధతుల్లో దేన్ని అనుసరించాలో అంతుపట్టలేదు. తన కుటుంబానికి చెందిన 50 ఎకరాలకు నీటి భద్రత సాధించుకోవడానికి తక్కువ ఖర్చులో చక్కని ఫలితాన్నిచ్చే నీటి సంరక్షణ పద్ధతి ఏమిటో తేల్చుకోవడం కష్టంగా తోచింది. ఆ దశలో ‘సాక్షి’తో కలసి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), సంగెం చంద్రమౌళి(98495 66009) ఆధ్వర్యంలో సాగుతున్న ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి తెలిసింది. వారి తోడ్పాటుతో 2016 జూన్‌లో ఎకరానికి కేవలం రూ. రెండు వేల ఖర్చుతో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక చోట 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతున సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల్లో కందకాలు తీయించారు. కందకాలు తవ్వి మట్టి కట్టలు పోయించారు. వాలును బట్టి 3–4, 5–6 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా విభజించి వాలుకు అడ్డంగా 3 అడుగుల, 3 అడుగుల వెడల్పున.. ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. కందకాలు తవ్వించి, మట్టికట్టలు పోయించారు. కందకాలు తవ్వించిన తర్వాత రెండేళ్లలో సాధారణ వర్షాలతోపాటు అకాల వర్షాలకు భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం నుండి పడే ప్రతి చినుకు కందకాలలోకి చేరి ఇంకిపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ఈ భూముల్లోని పత్తి పంట, ఇతర తోటలు ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో రెండు, మూడు వారాలు వర్షం పడకపోయినా పంటలకు ఢోకా లేదన్న భరోసాతో సత్యనారాయణ రెడ్డి ముందుకు సాగుతుండడం తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వర్షాలకు పడిన నీరు ఎక్కడికక్కడ ఆ కందకాల ద్వారా ఇంకి భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. ఆ విధంగా భూమి పొరల్లోకి చేరిన నీరే.. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పత్తి పంటకు, యూకలిప్టస్, టేకు తదితర తోటల్లో భూమికి నిమ్మునిస్తుంది. ఇటీవల వర్షాలు లేకపోయినా ఈ భూముల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగింది. ఇదే భూమికి దగ్గర్లోని రైతు భూమిలో పత్తి పంట కళతప్పింది. కందకాలు తవ్వుకొని పత్తి సాగు చేస్తున్నందున ఎకరాకు 20 క్వింటాళ్ళకు పైగానే పత్తి దిగుబడి వస్తున్నదని సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడి బాగుందన్నారు.తనకున్న 50 ఎకరాలలో ఏడెకరాల్లో టేకు మొక్కలు , ఇతరత్రా మొక్కలు పెంచుతున్నారు. అడవులను పెంచే భూమి చుట్టూ కందకాలు తీయడం మూలంగా మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయి. సాగులోకి తేవాలనే.. మూడున్నర ఏళ్ళ క్రితం మా భూములన్నీ పడావు పడి ఉండేవి. అసలు ఎందుకు సాగులోకి తేలేకపోతున్నామన్న బాధ ఉండేది. అప్పట్లోనే విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిచయమయ్యారు. మెట్ట భూముల్లో కూడా కందకాలతో నీటి భద్రత పొందవచ్చని, కందకాలు తవ్వించమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లు కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించా. అంతకుముందు వర్షం పడినా భూమిలోకి అంతగా ఇంకకుండా వరద వెళ్లిపోయేది. ఇప్పుడు ఎక్కడిదక్కడే ఇంకుతోంది. దీని వల్ల బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆనాడు పడావుగా ఉన్న భూములు నేడు పచ్చగా కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. దిగుబడి పెరగడంతో మా భూములకు కౌలుదారుల నుంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి రైతు తమ భూమిలో కందకాలు తీయించుకోవాలి. – పాల్వాయి సత్యనారాయణ రెడ్డి(98666 13645), బంగారి గడ్డ, చండూర్ మండలం, నల్లగొండ జిల్లా – మునుకుంట్ల గాలయ్య, సాక్షి, చండూర్, నల్లగొండ జిల్లా -
టేకు దుంగల పట్టివేత
ఆర్మూర్అర్బన్ : ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో బుధవారం రాత్రి అక్రమంగా టేకు కలపను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. మామిడిపల్లి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటో ట్రాలీని ఆపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కాగా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాహనాన్ని పరిశీలించగా అందులో ఆరు ఫీట్ల పొడవు ఉన్న 12 టేకు దుంగలు ఉన్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. వాహనాన్ని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. వాహనాన్ని పట్టుకున్న ఎస్సైలు సంతోష్, యాకూబ్, హెడ్ కానిస్టేబుల్ ఆత్మారం, కానిస్టేబుల్ నరేశ్‌ను ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో అభినందించారు. -
సరిహద్దులో భారీ టేకు కలప నిల్వలు
దాడి చేసి పట్టుకున్న ఖమ్మం స్క్వాడ్ అధికారులు పట్టుబడిన కలప విలువ రూ.5 లక్షలు పైనే.. అశ్వారావుపేట రూరల్ : తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో భారీస్థాయిలో విలువైన టేకు కలప నిల్వలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. సరిహద్దు ప్రాంతంలో ఉన్న అక్రమ కలపను ఖమ్మం స్క్వాడ్ రేంజర్, సిబ్బంది దాడులు చేసి పట్టుకోగా స్థానిక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. అశ్వారావుపేట మండలంలోని కాట్రపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో విలువైన టేకు కలపను సైజులుగా నరికి రవాణాకు సిద్ధంగా ఉంచారు. భారీస్థాయిలో కలప నిల్వ ఉండటంతో దీనిపై సమాచారం అందుకున్న ఖమ్మం స్క్వాడ్ రేంజర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో గ్రామానికి చెందిన రైతు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న రూ.5 లక్షల విలువగల టేకు కలపను గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన ప్రాంతంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని జీలుగుమిల్లి మండంలోని జగన్నాథపురం గ్రామాలకు సరిహద్దులో ఉండటంతో స్థానిక అటవీ శాఖ అధికారులు ఏపీకి చెందిన ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించారు. నిల్వ ఉంచిన కలపను పరిశీలించిన ఖమ్మం స్క్వాడ్ రేంజర్ కోటేశ్వరరావు సదరు రైతును విచారించగా అశ్వారావుపేట మండలంలోని కన్నాయిగూడెం సమీపంలోని తన సొంత పొలం గట్లపై ఉన్న టేకు చెట్లను నరికి ఇంటి వద్దకు తీసుకొచ్చి పెట్టినట్లు తెలిపాడు. కాగా పొలంలో ఉన్న టేకు చెట్లను నరికేందుకు అనుమతులు లేకపోగా, అక్రమంగా నిల్వ ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు స్థానిక అటవీశాఖ సిబ్బంది సహకరించారని ప్రచారం జరుగుతోంది. కాగా రైతు చెప్పినట్లు టేకు కలపను పొలంలో నరికారా? లేదా అటవీ ప్రాంతంలో నరికి నిల్వ ఉంచారా? అన్నది విచారిస్తే కానీ తెలియదు. దాడుల్లో ఎఫ్‌బీఓలు రమేష్, రామారావు, స్ర్టైకింగ్ ఫోర్స్ ఉన్నారు. ఫొటో నంబర్లుః25ఏఎస్పి26 : -
భూముల్లో ‘టేకు’, అన్నంలో ‘మేకు’
రెండోమాట ‘ప్రతీ పదేళ్లకు భారతదేశంలో 20 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని (హెక్టార్=2.47 ఎకరాలు)వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఇటీవల ప్రభుత్వాలు మళ్లించేస్తున్నాయి. వంద నగరాల అభివృద్ధి పేరిట ఆగమేఘాల మీద పట్టణీకరణ కోసం, ఉద్యోగాల కల్పన మిషపైన బీజేపీ హామీ పడింది. ఈ లక్ష్యాలను సాధించడానికి బీజేపీ సాగు భూములపైన ఒత్తిడి తెచ్చి రైతాం గం ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అందుకే, యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లు సహితం మొదట రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉన్నందున తిరిగి ఆ బిల్లును రైతుల రక్షణ కోసం సవరించుకోవలసివచ్చింది. కనుకనే భారత పరిశ్రమాధిపతుల సమాఖ్య, భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య సహా యూపీఏ బిల్లును పారిశ్రామికాభివృద్ధి వ్యతిరేకంగా ప్రకటిం చి, అందులోని రైతాంగ అనుకూల అంశాలను నీరుగార్చాలని ఉద్య మించాయి’. - ప్రసిద్ధ విశ్లేషకుడు సుధీర్ కుమార్ పన్వార్ కానీ, ఇంతకుమించిన ‘పిదప బుద్ధులు’ దేశ, రాష్ట్ర పాలనా వ్యవస్థలో చోటు చేసుకోబోతున్నాయి! ఆహార భద్రతకు ప్రాణప్రదమైన పంట భూము లనూ, వ్యవసాయ క్షేత్రాలనూ, రైతులనీ ‘నష్టజాతకం’గా భావించిన పాలక పక్షాలు ‘పరిశ్రమాభివృద్ధి, ఉద్యోగాల కల్పన’ అనే తాయిలం చూపి ప్రజల, రైతు కుటుంబాల దృష్టిని మళ్లించడానికి చేయని ప్రయత్నం లేదని పెంద లాడే గుర్తించటం కూడా అవసరం! కారణం లేని తోరణం ఉండదు! ఇటీవల, దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, కొందరు రచయితలు, పత్రికలు సహా చిత్రమైన ‘సర్వే’ల పేరుతో వ్యవసాయంపై ఏవగింపు కలిగించే వ్యాసాలూ, సర్వేక్షణలూ ప్రచురిస్తున్నారు! ‘వ్యవసాయం దండగ మారిది, గిట్టుబాటు కానిది, రుణభారాన్ని మాత్రమే పెంచేది. కాబట్టి రంగం నుంచి తప్పు కోండ’న్న హెచ్చరికలను పాలకులు ప్రజల బుర్రల్లోకి ఎక్కించాలన్న తాపత్ర యంలో ఉన్నారు. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సరసమైన ధరలకు అందించే బాధ్యత నుంచి పాలక పక్షాలు తప్పించుకుంటున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందించాల్సిన బాధ్యతను ఎన్నికలలో విజయావకాశాలు పెంచే హామీగానే ఉంచుతు న్నాయి. పంట నష్టాలను బీమా పథకాలతో పూరించే బాధ్యతనూ గాలికి వదిలేస్తున్నాయి. దేశానికి వెన్నెముక రైతు, వ్యవసాయ కార్మికులని తెలిసి తెలిసీ పంట భూములను బడా కార్పొరేట్ సంస్థలకు (బ్యాంక్ సంస్కరణల మేరకు) ధారాదత్తం చేయడానికి ‘భూసేకరణ’ చట్టాలను ఆర్డినెన్సు పేరిట దొడ్డిదారిలో రైతాంగంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. సేద్యానికి ఎసరు పెట్టే సర్వే ఈ క్రమంలోనే ప్రభుత్వాలకు ‘గొడుగు’లు పట్టే గణాంక, పరిశోధనా సంస్థల్లో ఒకటి - జాతీయ గణాంక సర్వేక్షణ సంస్థ (ఎన్ఎస్ఎస్)! ఇది జరి పిన నమూనా సర్వేక్షణ 70వ నివేదిక తాజాగా వెలువడింది. స్థూలంగా, ఆ సర్వే ఉద్దేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల సంక్షోభంలో పడిన వ్యవ సాయాన్నీ, రైతాంగాన్నీ, వారిపై ఆధారపడిన వృత్తిదారులను గానీ ఆదు కోవడం కాదు. రైతులు అధికాధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ, ఏటా పెరిగిపోతున్న రుణభారంతో కుంగిపోతున్నారు. దేశవ్యాపిత దృశ్యం లో భాగంగా తెలంగాణలో 83 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 90 శాతం రైతుల పరి స్థితి ఇదే. కనుక రైతుల సంఖ్య తరిగిపోతూ కౌలుదార్ల సంఖ్య పెరిగి పోతోందనీ, యంత్రాల వినియోగం పెరిగి వ్యవసాయం ఇక లాభసాటి కాని పరిస్థితి వచ్చిందంటూ ‘చావు కబురు’ సర్వే మన చెవుల్లో ఊది వెళ్లింది! ఆహా ర పంటల సాగుకన్నా పాడి సంపద మెరుగు కాబట్టి పశువులను పెంచుకో మంటోంది! సాగు వదిలేసి, ఇతర వ్యాపారాల్లోకి, కూలి పనుల్లోకి తరలి పోవటం మంచిదనీ ఉచిత సలహా ఇస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, భారత వ్యవసాయ రంగాన్ని ఎలా కుదించాలో చెప్పడమే ఆ సర్వే లక్ష్యం! అంతకన్నా గొప్ప ‘సలహా’ ప్రధాని మోదీ నుంచి దూసుకొచ్చింది. గత నెల 26వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ మోదీ వ్యవసాయం సాగాలంటే ఏం చేయాలో సలహా ఇచ్చారు. రైతులు తమ పొలంలో మూడింట ఒక వంతు మాత్రమే సాగు భూమిగా ఉంచుకోవాలి. మిగతా భూమిలో మూడింట ఒక వంతు పశువుల మేతకు, జంతువుల పెంపకానికి అట్టిపెట్టుకోవాలి. ఇక ఆపై మిగిలిన పొలంలో కలప (టేకు)నిచ్చే చెట్లు పెంచుకోండి! ఇదీ ఆ సూచన. ప్రధాని స్థాయిలో ఉన్న వారికి వాస్తవాలు తెలియవంటే నమ్మొచ్చా, లేదా వేళాకోళమా?! పండే వ్యవసాయ క్షేత్రం సగటు పరిమాణం (సైజు) 1.15 హెక్టారు. ఇందులో రైతు తన జీవనానికి, అమ్మకానికి 0.36 హెక్టార్ కొండ్రను అట్టిపెట్టుకోవాలనీ, మరో 0.36 హెక్టార్ భూమిని పశుమేతకు ఉంచుకోవా లనీ, మిగతా టేకు చెట్ల పెంపకానికి ఉంచుకోవాలనీ మోదీ సలహా! టేకు చెట్లు పెరిగి చేతికి అందడానికి ఎన్నేళ్లు పడుతుందో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీకి తెలియదా? శతాబ్దంలో నాలుగో వంతు - అంటే 25 సంవత్సరాలు పడుతుంది! ఈ లోగా రైతూ, అతని కుటుంబం ఎలా బతకాలి, వాళ్లని ఆదు కునే వాళ్లెవరని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలే, ప్రశ్నలే గాని సమాధానాలు రావు! బహుశా పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ లేదా మరాఠీ మొగల్ శరద్ పవార్ లాంటి ‘బక్క రైతుల్ని’ దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ సలహా ఇచ్చి ఉంటారని మనం సర్దుబాటు చేసుకోవాలా! రాయల మాట గుర్తు చేసుకోండి! ఎందుకంటే, దేశంలో సన్నకారు, మధ్యరకం కమతాల సంఖ్య 2005-06 సంవత్సరాల మధ్య 83.29 శాతం ఉండేవి. అవి 2010-11 మధ్య 85 శాతా నికి పెరిగిపోయాయని మరచిపోరాదు. అందువల్ల మోదీ సలహా సన్నకారు రైతుల కమతాలకు పనికిరాదు. బక్కరైతు చావకుండా, బతక్కుండా సరి పెట్టుకోడానికే పనికొస్తుంది! ఈ రైతాంగ వ్యతిరేక విధానాన్ని చేపట్టడంతో ప్రధాని మోదీ - ముఖ్యమంత్రి చంద్రబాబుల్లో ఎవరికి ఎవరు గురువో, ఎవరు ‘లఘు’వో తెలుసుకోవటం కష్టమే! ఇద్దరూ దేశంలో రైతుల ఆత్మ హత్యల ‘పరంపర’ లక్షల్లో నమోదు కావడానికి కారణాలను పాలనా విధా నాల్లో చూడడం లేదు. అందుకే తప్పుడు ఆర్డినెన్సుల ద్వారా ‘అభివృద్ధి’ మంత్రం కింద రైతుల్ని ‘బేదఖల్’ చేస్తున్నారు! 2012లో మోదీ పాలనలోని గుజరాత్లో రైతుల ఆత్మహత్యలు పెచ్చరిల్లిపోయినప్పుడు, నాటి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు ఆర్.సి.ఫల్దూ పంటలు పండకపోవడానికి రైతులే కారణ మని ఎదురు బొంకాల్సివచ్చింది! ఆత్మహత్యలు చేసుకోడానికి ప్రయత్నించిన రైతులని పిరికిపందలైన నేరగాళ్లని ఆరోపిస్తూ, వీరు ప్రభుత్వ సహాయానికి అనర్హులని ‘బీజేపీ కిసాన్ మోర్చా’ నాయకుడు, హరియాణా వ్యవసాయ మంత్రి ఓపీ ధంకర్ వ్యాఖ్యానించిన సంగతిని రైతులు మరచిపోలేదు. దీనిని మించిన మరొక విషయం - ‘మనలో మాట’ పేరిట ప్రధాని మోదీ రేడియో ద్వారా రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విన్నాం. యూపీఏ 2013 ‘భూసేకరణ’ చట్టంలో భూసేకరణకు రైతుల అనుమతి అవసరమనీ, చట్టం వల్ల సమాజంపై పడనున్న ప్రభావం గురించి అభిప్రాయసేకరణ విధిగా జరగాలన్న ప్రతిపాదన ఉన్నదనీ, దీనివల్ల భూసేకరణ కార్యక్రమం ఆల స్యమై పోతుందని అన్న మానూ మరవరాదు! ప్రభుత్వాలు అనుసరి స్తున్న రైతాంగ వ్యతిరేక, బడా భూస్వామ్య, దేశ, విదేశీ బడా వ్యాపారవేత్తల, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా పాలక పక్షాల విధాన రూపకల్పన జరుగుతున్నందునే సర్వీసు (ఐటీ వగైరా) సంస్థల, వస్తువుల తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగాలు మాత్రమే ‘అభివృద్ధి’ని సాధిస్తున్నట్టు చూపు కుంటున్నారు గాని - ఆహార భద్రతకు వెన్నుదన్నుగా నిలబడుతున్న సామా న్య రైతు, వ్యవసాయ కార్మికుల బతుకులు చితికి పోతున్నా పాల కులకు ‘చీమ కుట్టడం’ లేదు! కాని సర్వీసు, తయారీ రంగాల ద్వారా లభిస్తున్న ఉద్యోగాలు సర్వీసు రంగంలో 2.5 శాతం, తయారీ రంగంలో 1.5 శాతం మాత్రమేనని గమనించాలి. చివరికి ఒక వైపున రైతు - వ్యవసాయ కార్మిక జంట ఫలసాయాన్ని ఆరగిస్తూనే, వ్యవసాయాన్ని వృథా వ్యయ ప్రయాసగా ముద్ర వేయడానికి సాహసిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో చరిత్రలో శాశ్వత కీర్తి పొందిన ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల ‘అరితి నీలపు దండ’ శ్రీకృష్ణదేవ రాయలు ‘ఆముక్త మాల్యద’లో రైతుల గురించి చెప్పిన ఆర్ద్రమైన మాటలను నేటి, రేపటి పాలకులు మరువరాదు ‘మా పాలకుల పాదాలలో (పదరేఖల) భాగ్యరేఖల సుడికి అసలు కార ణం - తమ భుజాలపైన నాగళ్లు మోసి మోసి, బొప్పిలు కట్టి కట్టి ప్రజలకూ, మాకూ ఇంత భోజనం పెడుతున్న ఆ రైతుల శ్రమేనని మరువరాదు. రాజులే కున్నా రాజ్యం ఉంటుంది, కాని రైతు లేకపోతే రాజ్యమే శూన్యం’! రాయల పాఠం కేంద్ర, రాష్ట్ర పాలకుల చెవికి ఎక్కుతుందా? - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
యథేచ్ఛగా రోజ్‌వుడ్ అక్రమ రవాణా
దట్టమైన అడవిగా పేరున్న మర్రిపాకల రేంజ్ నుంచి రోజ్‌వుడ్ ఖాళీ అవుతోంది. ప్రతి శనివారం మంప అల్లూరి స్మారక మందిరం వద్ద రోజ్‌వుడ్ ముక్కల వ్యాపారం జరుగుతోంది. తూర్పుగోదావరి, విశాఖ సరిహద్దుల ద్వారా కొనుగోలు చేసిన ఉడ్ మొత్తం తరలిపోతుంది. కాకరపాడు చెక్‌పోస్టు అక్రమ రవాణాకు అడ్డగా మారింది.ఇదంతా అటవీ అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. * మంపలో రోజ్‌వుడ్ వ్యాపారం * వారానికి రూ.3 లక్షలలావాదేవీలు * వస్తువుల తయారీ కేంద్రంగా రేవళ్ల * పట్టించుకోని అధికారులు కొయ్యూరు:రోజ్‌వుడ్(ఇరుగుడుసేవ)కు మైదా న ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది.దీని తరువాతనే టేకుకు ప్రాధాన్యమిస్తారు.ప్రతి శనివారం మంపలోని అల్లూరి పార్క్ వద్దకు ఆదివాసీలు రోజ్‌వుడ్ ముక్కలు తీసుకు వస్తారు. వాటిని కొనుగోలు చేసేందుకు రాజవమ్మంగి, కొయ్యూరు, రాజేంద్రపాలెం, పాతూరు, కేడీపేట, నర్సీపట్నం ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖలోని మారుమూల ప్రాంతాలకు చెందిన సుమారు 20 గ్రామాలకు చెందిన గిరిజనులు ప్రతి శనివారం రోజ్‌వుడ్‌ను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ప్రతివారం ఇక్కడ రూ.3 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి రాజేంద్రపాలెం, మంప, రేవళ్లలో నిల్వ చేస్తా రు. కొంతకాలం తరువాత వాటిని ఐసర్ లేదా జీపులు, టాటా మేజిక్‌లలో తరలిస్తున్నారు. వస్తువుల తయారీ కేంద్రంగా రేవళ్ల: రోజ్‌వుడ్ ముక్కలను వస్తువులుగా చేసేందుకు వీలుగా మెషీన్లు ఏర్పాటు చేసుకున్న వారికి అనుమతి ఇస్తున్నారు. దీనికి సంబంధించి వడ్రంగులు,అధికారుల మధ్య ఒప్పందాలున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంపలో కొనుగోలు చేసిన వాటిని రేవళ్ల తీసుకువచ్చి అక్కడ వస్తువులుగా తయారు చేసి మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అనుమతి లేని వీటిపై దాడులు చేసి పట్టుకోవాల్సిన అట వీశాఖ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అడవిలో రోజ్‌వుడ్ ఖాళీ!: వారానికి 250 వరకూ రోజ్ఉడ్ ముక్కలు రావడంతో అడవి ఖాళీఅవుతోంది.అటవీ అధికారులు అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా రోజ్వుడ్చెట్లను పరిరక్షించవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అదుపులోకి తీసుకున్నా లేకుంటే వారు కొనుగోలు చేసిన ఉడ్‌ను పట్టుకున్నా రావడం మానేస్తారు. * ఎప్పుడో ఒకసారి దాడులు: దాడులు చేయకుంటే ఉన్నతాధికారులకు అనుమానం వస్తుందని ఇక్కడ అధికారులు ఎప్పుడో ఒకసారి దాడులు చేస్తారు. పట్టుకున్న రోజ్‌వుడ్‌ను కూడా పూర్తిగా కలప డిపోకు చేరుస్తారన్న నమ్మకం లేదు. * అక్రమ రవాణాపై దాడులు చేస్తాం: నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మణ్‌ను వివరణ కోరగా, అక్రమ రవాణాపై దాడులు చేస్తామని చెప్పారు. కలప రవాణా అయ్యే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిబ్బందికి వెంటనే ఆదేశాలు ఇస్తామని తెలిపారు.