రైతు ఇంట్లో నిల్వ ఉంచిన కలప
- దాడి చేసి పట్టుకున్న ఖమ్మం స్క్వాడ్ అధికారులు
- పట్టుబడిన కలప విలువ రూ.5 లక్షలు పైనే..
అశ్వారావుపేట రూరల్ : తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో భారీస్థాయిలో విలువైన టేకు కలప నిల్వలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. సరిహద్దు ప్రాంతంలో ఉన్న అక్రమ కలపను ఖమ్మం స్క్వాడ్ రేంజర్, సిబ్బంది దాడులు చేసి పట్టుకోగా స్థానిక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. అశ్వారావుపేట మండలంలోని కాట్రపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో విలువైన టేకు కలపను సైజులుగా నరికి రవాణాకు సిద్ధంగా ఉంచారు. భారీస్థాయిలో కలప నిల్వ ఉండటంతో దీనిపై సమాచారం అందుకున్న ఖమ్మం స్క్వాడ్ రేంజర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో గ్రామానికి చెందిన రైతు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న రూ.5 లక్షల విలువగల టేకు కలపను గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన ప్రాంతంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని జీలుగుమిల్లి మండంలోని జగన్నాథపురం గ్రామాలకు సరిహద్దులో ఉండటంతో స్థానిక అటవీ శాఖ అధికారులు ఏపీకి చెందిన ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించారు. నిల్వ ఉంచిన కలపను పరిశీలించిన ఖమ్మం స్క్వాడ్ రేంజర్ కోటేశ్వరరావు సదరు రైతును విచారించగా అశ్వారావుపేట మండలంలోని కన్నాయిగూడెం సమీపంలోని తన సొంత పొలం గట్లపై ఉన్న టేకు చెట్లను నరికి ఇంటి వద్దకు తీసుకొచ్చి పెట్టినట్లు తెలిపాడు. కాగా పొలంలో ఉన్న టేకు చెట్లను నరికేందుకు అనుమతులు లేకపోగా, అక్రమంగా నిల్వ ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు స్థానిక అటవీశాఖ సిబ్బంది సహకరించారని ప్రచారం జరుగుతోంది. కాగా రైతు చెప్పినట్లు టేకు కలపను పొలంలో నరికారా? లేదా అటవీ ప్రాంతంలో నరికి నిల్వ ఉంచారా? అన్నది విచారిస్తే కానీ తెలియదు. దాడుల్లో ఎఫ్‌బీఓలు రమేష్, రామారావు, స్ర్టైకింగ్ ఫోర్స్ ఉన్నారు.
ఫొటో నంబర్లుః25ఏఎస్‌పి26 :