అగ్నిప్రమాదంలో డంపింగ్ యార్డు వద్ద ఎగిసిపడుతున్న మంటలు సమీపంలోని అల్యూమినియం కంపెనీ వైపు దూసుకొస్తున్న దృశ్యం
పాత వస్తువులు డంపింగ్ చేసే చోట
ఎగసిపడిన మంటలు తిరుపతి జిల్లా తడలో ఘటన
తడ (తిరుపతి జిల్లా): పరిశ్రమల్లో లభించే పాత వస్తువులను సేకరించే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు సమీపంలో నెలకొలి్పన డంపింగ్ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకుని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులు ఆందోళన చెందారు.
నాయుడుపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ మధుబాబు, తడ, సూళ్లూరుపేట ఎస్‌ఐలు నరశింహారావు, రహీంరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట, అపాచీ పరిశ్రమలకు చెందిన రెండు ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతోపాటు మంటల్లో నుంచి భారీ శబ్దాలతో పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలు అడ్డుకుని ఇతర మార్గాల్లో వాహనాలు మళ్లించారు.
కాగా పరిశ్రమలకు సమీపంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్న డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని ఏడాది క్రితం సూళ్లూరుపేట ఫైర్ అధికారులు తిరుపతికి చెందిన స్థల యజమాని హర్షవర్ధన్, చెత్త సేకరించి నిల్వ చేసుకునేందుకు స్థలాన్ని లీజుకు తీసుకున్న షేర్ అలీ అనే వ్యక్తులకు సమాచారం ఇచ్చినా వారు పెడచెవిన పెట్టారని ఫైర్ సిబ్బంది తెలిపారు. డంపింగ్ యార్డులో పనికి రాని చెత్త మాత్రమే కాలిపోగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న అల్యూమినియం క్యాస్టింగ్ కంపెనీ తీవ్రంగా నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment