మరో రెండు సా మిల్లుల సీజ్‌ | Teak Wood Business Houses Seized Nizamabad | Sakshi
Sakshi News home page

మరో రెండు సా మిల్లుల సీజ్‌

Published Thu, Jan 24 2019 10:53 AM | Last Updated on Thu, Jan 24 2019 10:53 AM

Teak Wood  Business Houses  Seized Nizamabad - Sakshi

మాలపల్లిలోని సామిల్లులో టేకు కట్టెల రికార్డులను తనిఖీ చేస్తున్న డీఎఫ్‌వో

 అక్రమ కలప వ్యాపారం కేసులో అధికారులు మరోరెండు సా మిల్లులను సీజ్‌ చేశారు. కొన్ని రోజులుగా సా మిల్లుల్లో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సా మిల్లులు సీజ్‌ కాగా బుధవారం వీటిని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ కలిసి పరిశీలించారు. అక్రమ కలప రవాణాలో భాగస్వామ్య ముందని ఆరోపణలు ఎదు ర్కొన్న ఏఆర్‌ ఎస్‌ఐ షకీల్‌పాషాను సస్పెండ్‌ చేస్తూ  రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సీజ్‌ చేసిన సా మిల్లుల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌ అర్బన్‌): అక్రమ కలప వ్యాపారం కేసులో మరోరెండు సా మిల్లులను సీజ్‌ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్‌ తెలిపారు. బుధవారం మాలపల్లిలో గల దక్కన్, సోహైల్‌ సా మిల్లులను సీజ్‌ చేస్తూ డీఎఫ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు నాలుగు సా మిల్స్‌ సీజ్‌ కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నాలుగు దుకాణాల యాజమానులు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పై నాలుగు సా మిల్‌లను సీజ్‌ చేసి, అందులోని కలప రికార్డుల ప్రకారం ఉందా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు డీఎఫ్‌వో ప్రసాద్‌ వెల్లడించారు. అటవీశాఖ అధికారుల తనిఖీలో సోహైల్‌ సా మిల్లులో ఆరు దుంగలు, దక్కన్‌ సా మిల్లులో ఐదు దుంగలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దాంతో వాటిని సీజ్‌ చేసినట్లు తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, డీఎఫ్‌వో ప్రసాద్‌తో కలిసి సీజ్‌ చేసిన నాలుగు సా మిల్లులను పరిశీలించారు. వాటిలో లెక్క తేలెంతవరకు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీసులను, అటవీశాఖ సిబ్బందిని ఆదేశించా రు. ముఖ్యంగా రాత్రిపూట బందోబస్తులో నిర్లక్ష్యం చేయవద్దని సీపీ సూచించారు.

దాడులు కొనసాగిస్తాం : డీఎఫ్‌వో  
జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో నిజామాబాద్, బిలాల్, దక్కన్, సోహైల్‌ సా మిల్లులకు అక్రమంగా కలప రవాణా చేసినట్లు తేలటంతో వాటిని సీజ్‌ చేసినట్లు, జిల్లాలో అనుమానం ఉన్న మిగతా సా మిల్లులలో దాడులు కొనసాగించనున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు. ప్రస్తుతం సీజ్‌ అయిన నాలుగింటి లో తనిఖీలు పూర్తి అయ్యాక జిల్లాలో అనుమానం ఉన్న, గతంలో ఆరోపణలు వచ్చిన సా మిల్లులలో దుంగలు రికార్డుల ప్రకారం ఉన్నాయా లేదా, అనేవి పరిశీలించి దొంగ కలప ఉంటే సా మిల్‌ను సీజ్‌ చేయనున్నట్లు డీఎఫ్‌వో వెల్లడించారు.

గతంలో ఆరు సా మిల్లుల సీజ్‌...  
అక్రమ కలప వ్యాపారం చేసిన వ్యాపారులపై అటవీశాఖ అధికారులు గతంలోనూ కొరడా ఝళిపించారు. 1988లోనూ ఇదే మాదిరిగా అక్రమ కలప వ్యాపారం కేసులో అధికారులు ఒకేసారి ఆరు సా మిల్లుల సీజ్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు మాలపల్లి, బోధన్‌ రోడ్డు, పూలాంగ్, వినాయక్‌నగర్‌ ప్రాంతాల్లో గల ఆరు సా మిల్లులను అధికారులు సీజ్‌ చేశారు. ఇప్పుడు ఒకేసారి మాలపల్లిలో నాలుగు సా మిల్లుల సీజ్, మిగతా అక్రమ వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతోంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడతో పాటు నిర్మల్‌ జిల్లా మామడ మండలం నుంచి నిజామాబాద్‌కు కలప అక్రమ రవాణా చేస్తూ నిర్మల్‌ రూరల్‌ పోలీసులకు పట్టుబడటం, ఈ కేసులో జిల్లాకు చెందిన ఏఆర్‌ ఏఎస్‌ఐ షకీల్‌ పాష పాత్ర ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ జరిపి కూపీ లాగారు. నిజామాబాద్‌లోని మాలపల్లిలో గల సా మిల్లుల యాజమానులు చేస్తున్న అక్రమ కలప వ్యాపార బాగోతం బట్టబయలయ్యింది. ఈ కేసులో నిర్మల్‌ పోలీసులు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిజామాబాద్‌ ఫారెస్టు అధికారులతో కలిసి సా మిల్లులపై దాడులు చేయడంతో సా మిల్లులలో అక్రమ కలప వ్యాపారాలు వెలుగుచూస్తున్నాయి. అధికారుల దాడులతో కొంతమంది అక్రమార్కులు జాగ్రత్తగా తమ సా మిల్లులోని కలపను ఇతర చోటుకు తరలించినట్లు తెలిసింది. నాలుగు సా మిల్లులపై వచ్చిన ఆరోపణలతో దాడులకు దిగిన అధికారులు మిగతా సా మిల్లులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే వాటిలో కూడా అక్రమ కలప వ్యాపారం బయట పడే అవకాశం ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.    

సీజైన సా మిల్లుల వద్ద గట్టి బందోబస్తు 
అక్రమ కలప వ్యాపారం విషయంలో సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు స్పష్టంగా ఉన్న నేప థ్యంలో అధికారులు సీజ్‌ అయిన సా మిల్లుల వద్ద గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లో సీజ్‌ అయిన నాలుగు సా మిల్లుల వద్ద అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా గట్టి బందోబస్తు చేపట్టారు. సీజ్‌ అయిన సా మిల్లులలో రికార్డుల ప్రకారం దుంగలు ఉన్నాయా లేవా అనేది ఇప్పట్లో తేలే అవకాశం లేక వాటి నుంచి దుంగలు బయటకు తరలిపోకుండా ఒక్కో సా మిల్‌ వద్ద అటవీశాఖ నుంచి సెక్షన్‌ ఆఫీసర్‌ ఒకరు, ఇద్దరు బీట్‌ ఆఫీసర్లు, ఫారెస్టు స్ట్రైక్‌ఫోర్సు సిబ్బంది ఒకరు, పోలీస్‌శాఖ నుంచి ఒక ఎస్‌ఐస్థాయి అధికారితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తుకు నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మాలపల్లిలో సా మిల్లులో రికార్డులను తనిఖీ చేస్తున్న డీఎఫ్‌వో   మాలపల్లిలో నిల్వ ఉన్న టేకు దుంగలు  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement