అమ్మో పులి...! భయంతో వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు | DFO Warns Of Movement Of Leopards In Nizamabad District | Sakshi
Sakshi News home page

అమ్మో పులి...! జిల్లాలో మళ్లీ చిరుతల అలజడి

Published Sun, Dec 11 2022 7:25 AM | Last Updated on Sun, Dec 11 2022 7:30 AM

DFO Warns Of Movement Of Leopards In Nizamabad District - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): జిల్లాలో మళ్లీ చిరుత పులుల అజలడి పెరిగింది. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో జిల్లాలోని పలు రేంజ్‌ల పరిధిలో చిరుతలు జనం కంట పడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పశువులు, మేకలు మేపడానికి వెళ్లే కాపరులకు సైతం భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం నవీపేట్‌ మండలం అబ్బాపూర్‌ గుట్టల్లో చిరుత కదలికలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పాదముద్రలను చూసి చిరుతగా నిర్ధారించారు. ఇదే రేంజ్‌ పరిధిలోని మోకన్‌పల్లి శివారులో ఐదారు నెలల క్రితం కూడా చిరుతపులి కుక్కను వేటాడింది. అదే విధంగా కొన్ని రోజుల కిందట నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్లారం అటవీ ప్రాంతంలో సైతం చిరుత కలకలం రేపింది. రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి వణికిపోయారు.

జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్‌ నార్త్, నిజామాబాద్‌ సౌత్, వర్ని, ఆర్మూర్, కమ్మర్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ కలిపి మొత్తం ఏడు రేంజ్‌లు ఉన్నాయి. జిల్లా అటవీ విస్తీర్ణం 2,14,659 ఎకరాల్లో(20.86శాతం)ఉండగా, అత్యధికంగా ఒక్క మోపాల్‌ మండలంలోనే 29,101 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. దీని తర్వాత ఇందల్వాయి, కమ్మర్‌పల్లి, సిరికొండ, నిజామాబాద్‌ నార్త్‌ రేంజ్‌ల పరిధిలో అడవులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు శాఖ గుర్తించినప్పటికీ, వీటిసంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం పెరిగి మేకలు, గొర్రెల మందలపై దాడులు చేస్తున్న క్రమంలో నిజామాబాద్‌ అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి అడవుల నుంచి మన జిల్లాలోని వర్ని రేంజ్‌ పరిధిలోకి చిరుతలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గుట్టలు గుల్ల చేయడంతో..
జిల్లాలో సంచారం పెరడానికి గల కారణాలు ఆహారం, నీరే కాకుండా అవి ఏర్పర్చుకున్న ఆవాస ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేయడం కూడా కారణం అవుతున్నాయి. మొరం తవ్వకాలు, వ్యవసాయం కోసం నేలను చదును చేసే పనులు చేపట్టి గుట్టలు, అడవులను కొల్లగొడుతున్నారు. తద్వారా శబ్దాలకు చిరుతలు, ఇతర వన్య ప్రాణులు సైతం జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతలు మనుషులు, గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీరు దొరక్కపోవడంతో కూడా గ్రామాల శివారు ప్రాంతాల్లో వచ్చి కుక్కలు, మేకలను వేటాడుతున్నాయి. గుట్టలు, అడవులకు నిప్పు పెట్టడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే, అటవీ అధికారులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా చిరుతలు అక్కడక్కడా కంటపడుతూనే ఉన్నాయి. ఎక్కడైనా చిరుత పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే అడవులు, గుట్టల వెంట తిరిగే పశువులు, మేకల కాపారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలి
జిల్లాలో పలు రేంజ్‌ల పరిధిలో చిరుత పులుల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడానికి రోడ్లను దాటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పక్కనే ఉండడంతో అక్కడి ఫారెస్టు నుంచి కూడా జిల్లా అడవుల్లోకి వస్తున్నాయి. ప్రజలకు చిరుతలు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. చిరుతల కదలికలు ఉన్నచోట ఫారెస్టు అధికారులను, సిబ్బందిని ఇప్పటికే అలర్ట్‌ చేశాం.
– వికాస్‌ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement