leopard in village
-
అమ్మో పులి...! భయంతో వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో మళ్లీ చిరుత పులుల అజలడి పెరిగింది. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో జిల్లాలోని పలు రేంజ్‌ల పరిధిలో చిరుతలు జనం కంట పడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పశువులు, మేకలు మేపడానికి వెళ్లే కాపరులకు సైతం భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం నవీపేట్ మండలం అబ్బాపూర్ గుట్టల్లో చిరుత కదలికలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పాదముద్రలను చూసి చిరుతగా నిర్ధారించారు. ఇదే రేంజ్ పరిధిలోని మోకన్‌పల్లి శివారులో ఐదారు నెలల క్రితం కూడా చిరుతపులి కుక్కను వేటాడింది. అదే విధంగా కొన్ని రోజుల కిందట నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం అటవీ ప్రాంతంలో సైతం చిరుత కలకలం రేపింది. రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి వణికిపోయారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, వర్ని, ఆర్మూర్, కమ్మర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ కలిపి మొత్తం ఏడు రేంజ్‌లు ఉన్నాయి. జిల్లా అటవీ విస్తీర్ణం 2,14,659 ఎకరాల్లో(20.86శాతం)ఉండగా, అత్యధికంగా ఒక్క మోపాల్ మండలంలోనే 29,101 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. దీని తర్వాత ఇందల్వాయి, కమ్మర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్‌ల పరిధిలో అడవులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు శాఖ గుర్తించినప్పటికీ, వీటిసంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం పెరిగి మేకలు, గొర్రెల మందలపై దాడులు చేస్తున్న క్రమంలో నిజామాబాద్ అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి అడవుల నుంచి మన జిల్లాలోని వర్ని రేంజ్ పరిధిలోకి చిరుతలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టలు గుల్ల చేయడంతో.. జిల్లాలో సంచారం పెరడానికి గల కారణాలు ఆహారం, నీరే కాకుండా అవి ఏర్పర్చుకున్న ఆవాస ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేయడం కూడా కారణం అవుతున్నాయి. మొరం తవ్వకాలు, వ్యవసాయం కోసం నేలను చదును చేసే పనులు చేపట్టి గుట్టలు, అడవులను కొల్లగొడుతున్నారు. తద్వారా శబ్దాలకు చిరుతలు, ఇతర వన్య ప్రాణులు సైతం జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతలు మనుషులు, గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీరు దొరక్కపోవడంతో కూడా గ్రామాల శివారు ప్రాంతాల్లో వచ్చి కుక్కలు, మేకలను వేటాడుతున్నాయి. గుట్టలు, అడవులకు నిప్పు పెట్టడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే, అటవీ అధికారులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా చిరుతలు అక్కడక్కడా కంటపడుతూనే ఉన్నాయి. ఎక్కడైనా చిరుత పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే అడవులు, గుట్టల వెంట తిరిగే పశువులు, మేకల కాపారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలి జిల్లాలో పలు రేంజ్‌ల పరిధిలో చిరుత పులుల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడానికి రోడ్లను దాటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పక్కనే ఉండడంతో అక్కడి ఫారెస్టు నుంచి కూడా జిల్లా అడవుల్లోకి వస్తున్నాయి. ప్రజలకు చిరుతలు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. చిరుతల కదలికలు ఉన్నచోట ఫారెస్టు అధికారులను, సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేశాం. – వికాస్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి -
లాక్డౌన్: గ్రామంలో చిరుత నివాసం
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమ్యారు. దీంతో అడవి తీరంలోని గ్రామాల్లో సింహాలు, పులులు సంచరిస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ చిరుత పులి రాజస్థాన్‌లోని ఓ ఇంటిలో ఏకంగా తన మూడు పిల్లలతో కలిసి నివాసం ఏర్పరుచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీ ఫుటేజ్‌లో రికార్డైనా ఈ వీడియోను ఆటవీ అధికారి పర్వీన్ కశ్వన్ గురువారం ట్విటర్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన చిరుత.. తన పిల్లలను నోటితో కరుచుకుని తీసుకువెళ్తు కనిపించింది. ఇక ఈ వీడియోకు ఇప్పటీ వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఈ వీడియో పంచుకున్నందుకు ధన్యవాదాలు’, ‘ఇది అద్బుతం’ ‘ఎంత ముద్దుగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చండీగఢ్‌లో అడవి జంతువు కలకలం!) While everybody was inside the mother #leopard found an unused house & started raising her three cubs. In Tantol village of Rajasmand. Mother is coming in night & in daytime she goes for food. Cubs are doing fine. So now dept has put staff & cameras to monitor things. VC Raj FD. pic.twitter.com/zDIbhKKUvf — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 16, 2020 అయితే ఆ ఇంటి ముందు సీసీ కెమారాలను ఏర్పాటు చేసి నిరంతరం చిరుత కదలికలను అధికారులు గమనిస్తున్నట్లు పర్విన్ తెలిపాడు. 21 సెకన్ల నిడివి గల ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితయ్యారు. ఈ క్రమంలో ఈ తల్లి చిరుత కూడా నివాసం కోసం తంటోల్ గ్రామంలోని పాతబడిన కోటను తన పిల్లల కోసం నివాసం చేసుకుంది. ఇక ఈ చిరుత రోజంతా ఆహార వేటకు వెళ్లి తిరిగి రాత్రిపూట తన పిల్లల దగ్గరికి వస్తుంది. ప్రసుతం చిరుత పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు. -
చాడేపపల్లిలో చిరుత వాటి పిల్లలు సంచారం!
సాక్షి, చౌడేపల్లె(చిత్తూరు): మండలంలోని కందూరు బీట్, తవళం బీట్ పరిధిలో గోవిందురాజుల చెరువు సమీపంలో గల అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాగిరెడ్డిపల్లె, ఎల్లంపల్లె, బత్తలాపురం, తెల్లనీళ్లపల్లె మడుకూరు తదితర గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలకు సమీపంలోనే అటవీ ప్రాంతం కలదు. పదిరోజుల క్రితం చిరుతపులి దాడిలో బత్తలాపురానికి చెందిన సుబ్రమణ్యం, గంగాధర్, ఎల్లంపల్లెకు చెందిన నరసింహులు ఆరు మేకలు మృతిచెందాయి. దీంతో అటవీ ప్రాంతంలోకి మేతకు మేకలు, పశువులు, గొర్రెలను తోలుకెళ్లడం లేదు. చిరుత పులితోపాటు వాటి పిల్లలు కూడా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నెమిలిగుట్ట, పారాలకుప్ప, గువ్వరాయి, గోవిందరాజుల చెరువు, మడుకూరు మార్గంలో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసినా అటవీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని వావపోతున్నారు. దీనిపై ఎఫ్‌బీవో రామకృష్ణ మాట్లాడుతూ పులి సంచారం విషయమై ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. అడవి వైపు వెళ్ల వద్దని ప్రజలను తెలియజేసినట్టు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఎస్టీలు -
గంగవరంలో చిరుత సంచారం?
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో చిరుతపులి సంచారం చేస్తుందన్న ప్రచారంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి దళితవాడలోని అటవీ ప్రాంతంలో కొండపక్కన పశువుల గొట్టం వద్ద చిరుతపులి కనపడినట్లు గ్రామానికి చెందిన కొందరు రైతులు పేర్కొన్నారు. పశువుల గొట్టం (పశువుల చావిడి)లో లేగదూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతపులి మాటువేసి ఉండటాన్ని గమనించిన పశువులు బిగ్గరగా అరవడంతో అక్కడే ఉన్న రైతులు అనుమానం వచ్చి చూడగా చిరుతపులి వీరి కళ్లముందు నుంచే కొండ ఎగువ ప్రాంతానికి పారిపోయినట్లు తెలిపారు. దీంతో విషయం దావానంలా వ్యాపించడంతో పొలాల వద్ద ఉన్న రైతులు పశువులతో సహా ఇళ్లకు చేరుకున్నారు. రాత్రి వేళ కావడంతో యువకులు డప్పులు శబ్దాలు చేస్తూ గస్తీ తిరుగుతున్నారు. కొద్ది సంవత్సరాల కిందట గంగవరం ప్రాంతంలో చిరుతపులి జాడలు కనిపించిన అనంతరం సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్లీ చిరుతపులి సంచారం కనపడిందని రైతులు తెలిపారు. -
చెట్టెక్కిన చిరుత.. ఆందోళనలో జనాలు
సాక్షి, తూర్పుగోదావరి : ఆత్రేయపురం మండలం అంకపాలెంలో చిరుతపులి సంచరిస్తోంది. ఇప్పటికే ఓ రైతు సహా ముగ్గురిపై దాడి చేసిన చిరుత అనంతరం కొబ్బరి చెట్టు ఎక్కడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది.. గ్రామానికి చేరుకుని చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు. పులి ఇళ్లలోకి ప్రవేశిస్తుందేమో అనే భయంతో ఇంట్లోకి కూడా వెళ్లకుండా బయటే ఉన్నామంటున్నారు గ్రామస్తులు -
చిక్కని చిరుత
కామారెడ్డి క్రైం : గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం ఇటీవల పెరిగింది. నీళ్లు, ఆహారం కోసం పులులు జనావాసాల్లోకి వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పశువుల పాకల్లోని మూగజీవాలకు రక్షణ లేకుండా పోయింది. చిరుత పులుల దాడుల్లో ఎంతోమంది రైతులు తమ విలువైన పశుసంపదను కోల్పోతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు, ప్రజలు ఒంటరిగా పంటపొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలరోజుల వ్యవధిలోనే ఆరు చోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రయత్నాలు విఫలం.. పంటపొలాలు, శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులుల కారణంగా తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. భిక్కనూరు మండలంలోని ర్యాగట్లపల్లి, రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్ గ్రామాల వెంబడి నెల రోజులుగా ఓ చిరుతపులి సంచరిస్తూ ఆయా గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు వలను ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు. ఇప్పటికే ఆ చిరుత 20కి పైగా మూగజీవాలను పొట్టనబెట్టుకుంది. తాజాగా గురువారం, శుక్రవారాల్లో వరుసగా రెండు రోజులు పిట్లం, జుక్కల్ మండలం కోరన్‌పల్లి తండా శివారులోని పశువుల పాకమీద ఓ చిరుత దాడి చేసింది. ఈ దాడిలో మూడు దూడలు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో దూడకు తీవ్రంగా గాయాలయ్యాయి. చిరుత దాడి విషయం తెలియగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. మూడు నెలల క్రితం ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండా, తిమ్మాపూర్ గ్రామాల శివారు ప్రాంతాల్లో సంచరించిన ఓ చిరుత హల్చల్ చేసింది. అటవీ అధికారులు, గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా యత్నించారు. రెండు రోజులపాటు ఉరుకులు పరుగులు పెట్టించిన ఆ చిరుత చివరికి మృతి చెంది లభించింది. అప్పటికే ఆయా గ్రామాల పరిధిలో రెండుచోట్ల దాడులు చేసి దూడలు, గొర్రెలను హతమార్చింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటివరకు చిరుత పులులు దాడులు చేసిన ఘటనలన్నీ దాదాపుగా వేకువజాము సమయంలోనే జరిగినట్లు బాధితులు, అటవీ అధికారులు భావిస్తున్నారు. చిరుతల పరిస్థితీ దయనీయమే.. ఉమ్మడి జిల్లాలో పులుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. మనిషి స్వార్థానికి అడవులు లేకుండాపోతున్నాయి. అడవిలో తిండి దొరక్క ఆహారం కోసం గ్రామాల మీదపడి పశువులు, మేకలను హతమారుస్తున్నాయి. రైతులు తమ పశుసంపదను కోల్పోయి రూ.వేలల్లో నష్టాలకు గురవుతున్నారు. వాస్తవానికి అటవీ ప్రాంతాల్లో వన్యమృగాలకు ఏ మాత్రం ఆహారం గానీ, నీళ్లు గానీ దొరకడం లేదు. వన్య ప్రాణులు జనావాసాల్లోకి ఇస్తున్నాయంటే అది కొందరు స్వార్థ పరుల పుణ్యమేనని చెప్పవచ్చు. యథేచ్ఛగా అడవులను ఆక్రమిస్తూ వన్యప్రాణుల మనుగడకు ఆటంకాలు కలిగించడం ప్రధాన కారణమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు అటవీశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గత కొద్ది కాలంలోనే ఉమ్మడి జిల్లాలో నాలుగు చిరుత పులులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడ్డాయి. ఏది ఏమైనా చిరుత పులులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు అటవీశాఖ, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అనుకోని అతిథి.. ఆరు గంటల విహారం
హరియాణాలోని పల్వాల్ గ్రామం కృష్ణా కాలనీకి ఉదయాన్నే అనుకోని అతిథి వచ్చింది. ఉదయం 7-8 గంటల సమయంలో మూడు నాలుగేళ్ల వయసున్న మగ చిరుతపులి ఒకటి గ్రామం మొత్తం తన ఇష్టం వచ్చినట్లు తిరిగేసింది. దాదాపు ఆరు గంటల పాటు అది ఊళ్లో ఏవేం ఉన్నాయో అన్నీ చూసుకుంది. ఆ తర్వాత ఎట్టకేలకు అటవీ శాఖాధికారులు దాన్ని పట్టుకోగలిగారు. వాళ్లు దాన్ని ఎలా పట్టుకుంటున్నారో చూసేందుకు దాదాపు వెయ్యి మందికి పైగా జనం గుమిగూడారు. చాలామంది తమ పిల్లలను కూడా తీసుకొచ్చి మరీ ఆ చిరుతను చూపించారు. మూడునెలల క్రితం మాండవార్లో మాత్రం పోలీసులు, అటవీ శాఖాధికారులు కలిసి కూడా చిరుతను పట్టుకోలేకపోవడంతో గ్రామస్థులే దాన్ని పట్టుకుని కొట్టి చంపేవారు. ఈసారి మాత్రం అలా జరగకుండా.. అత్యంత జాగ్రత్తగా చిరుతను అధికారులు పట్టుకున్నారు. కృష్ణకాలనీలోని పార్కులో కొంతమంది ముందుగా దీన్ని చూశారు. వెంటనే వాళ్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈలోపు అది పార్కు నుంచి ఒక ఖాళీ ఇంట్లోకి దూరింది. కాసేపటికి ఆ ఇల్లు నచ్చలేదో ఏమో.. మళ్లీ పార్కుకు వచ్చేసింది. దాంతో అటవీ శాఖాధికారులు దానికి మత్తుమందు ఇచ్చి, పట్టుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పల్వాల్, గుర్గావ్, ఫరీదాబాద్ అటవీశాఖాధికారులు అంతా కలిసి దాన్ని పట్టుకున్నారని గుర్గావ్ డీఎఫ్ఓ శ్యామ్ సుందర్ చెప్పారు. దాన్ని 12 గంటల పాటు పరిశీలించి, ఆ తర్వాత అడవుల్లోకి వదిలిపెడతామన్నారు.