
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో చిరుతపులి సంచారం చేస్తుందన్న ప్రచారంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి దళితవాడలోని అటవీ ప్రాంతంలో కొండపక్కన పశువుల గొట్టం వద్ద చిరుతపులి కనపడినట్లు గ్రామానికి చెందిన కొందరు రైతులు పేర్కొన్నారు. పశువుల గొట్టం (పశువుల చావిడి)లో లేగదూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతపులి మాటువేసి ఉండటాన్ని గమనించిన పశువులు బిగ్గరగా అరవడంతో అక్కడే ఉన్న రైతులు అనుమానం వచ్చి చూడగా చిరుతపులి వీరి కళ్లముందు నుంచే కొండ ఎగువ ప్రాంతానికి పారిపోయినట్లు తెలిపారు. దీంతో విషయం దావానంలా వ్యాపించడంతో పొలాల వద్ద ఉన్న రైతులు పశువులతో సహా ఇళ్లకు చేరుకున్నారు. రాత్రి వేళ కావడంతో యువకులు డప్పులు శబ్దాలు చేస్తూ గస్తీ తిరుగుతున్నారు. కొద్ది సంవత్సరాల కిందట గంగవరం ప్రాంతంలో చిరుతపులి జాడలు కనిపించిన అనంతరం సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్లీ చిరుతపులి సంచారం కనపడిందని రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment