అనుకోని అతిథి.. ఆరు గంటల విహారం
అనుకోని అతిథి.. ఆరు గంటల విహారం
Published Fri, Feb 17 2017 9:36 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
హరియాణాలోని పల్వాల్ గ్రామం కృష్ణా కాలనీకి ఉదయాన్నే అనుకోని అతిథి వచ్చింది. ఉదయం 7-8 గంటల సమయంలో మూడు నాలుగేళ్ల వయసున్న మగ చిరుతపులి ఒకటి గ్రామం మొత్తం తన ఇష్టం వచ్చినట్లు తిరిగేసింది. దాదాపు ఆరు గంటల పాటు అది ఊళ్లో ఏవేం ఉన్నాయో అన్నీ చూసుకుంది. ఆ తర్వాత ఎట్టకేలకు అటవీ శాఖాధికారులు దాన్ని పట్టుకోగలిగారు. వాళ్లు దాన్ని ఎలా పట్టుకుంటున్నారో చూసేందుకు దాదాపు వెయ్యి మందికి పైగా జనం గుమిగూడారు. చాలామంది తమ పిల్లలను కూడా తీసుకొచ్చి మరీ ఆ చిరుతను చూపించారు.
మూడునెలల క్రితం మాండవార్‌లో మాత్రం పోలీసులు, అటవీ శాఖాధికారులు కలిసి కూడా చిరుతను పట్టుకోలేకపోవడంతో గ్రామస్థులే దాన్ని పట్టుకుని కొట్టి చంపేవారు. ఈసారి మాత్రం అలా జరగకుండా.. అత్యంత జాగ్రత్తగా చిరుతను అధికారులు పట్టుకున్నారు. కృష్ణకాలనీలోని పార్కులో కొంతమంది ముందుగా దీన్ని చూశారు. వెంటనే వాళ్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈలోపు అది పార్కు నుంచి ఒక ఖాళీ ఇంట్లోకి దూరింది. కాసేపటికి ఆ ఇల్లు నచ్చలేదో ఏమో.. మళ్లీ పార్కుకు వచ్చేసింది. దాంతో అటవీ శాఖాధికారులు దానికి మత్తుమందు ఇచ్చి, పట్టుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పల్వాల్, గుర్‌గావ్, ఫరీదాబాద్ అటవీశాఖాధికారులు అంతా కలిసి దాన్ని పట్టుకున్నారని గుర్‌గావ్ డీఎఫ్‌ఓ శ్యామ్ సుందర్ చెప్పారు. దాన్ని 12 గంటల పాటు పరిశీలించి, ఆ తర్వాత అడవుల్లోకి వదిలిపెడతామన్నారు.
Advertisement