పరిశ్రమలోని హెచ్ బ్లాకులో ఉన్న చిరుత
జిన్నారం(పటాన్‌చెరు): జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలోకి శనివారం వేకువజామున చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు హెటిరో డ్రగ్స్ హెచ్‌బ్లాక్‌లోకి చిరుత చొరబడింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిరుతను చూసి హెచ్‌బ్లాకులోని డోర్లను మూసి పరిశ్రమ యాజమాన్యం, అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు.
అటవీ అధికారులు చిరుతను పట్టేందుకు ఆపరేషన్ చేపట్టారు. మేకను ఎర చూపుతూ ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. హెచ్ బ్లాకులోని పై భాగంలో ఉన్న పైపులపై నిద్రించి ఉన్న చిరుతపైకి పైపుల ద్వారా నీటిని పడేలా ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కిందికి దిగి ఉరుకులు, పరుగులు పెట్టింది. అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి చిరుత వెళ్లకపోవటంతో జూపార్కుకు చెందిన వైద్యులు తుపాకి పేల్చి మత్తును ఎక్కించారు. స్పృహ కోల్పోవటంతో బోనులో బంధించి హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు. ప్రస్తుతం చిరుత యాక్టివ్‌గా ఉందని, ఎవరికీ ఎలాంటి నష్టం కలుగలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment