సాక్షి, తిరుపతి: తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు.
నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి(శుక్రవారం, జూన్ 23) 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడినట్లు తెలుస్తోంది.
డీఎఫ్‌వో ఏమన్నారంటే..
బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుతను బంధించాం. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ చిరుతను ఇంకా వేటాడడం పూర్తిగా అలవాటు కాలేదు అని డీఎఫ్‌వో తెలియజేశారు.
చిన్నారి కౌశిక్‌ను పరామర్శిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పక్కన చికిత్స అందిస్తున్న వైద్యుడు
తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక‍్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు.
గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: గోవధ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment