hetero pharm
-
హెటిరోలో చిక్కిన చిరుత
జిన్నారం(పటాన్చెరు): జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలోకి శనివారం వేకువజామున చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు హెటిరో డ్రగ్స్ హెచ్‌బ్లాక్‌లోకి చిరుత చొరబడింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిరుతను చూసి హెచ్‌బ్లాకులోని డోర్లను మూసి పరిశ్రమ యాజమాన్యం, అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. అటవీ అధికారులు చిరుతను పట్టేందుకు ఆపరేషన్ చేపట్టారు. మేకను ఎర చూపుతూ ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. హెచ్ బ్లాకులోని పై భాగంలో ఉన్న పైపులపై నిద్రించి ఉన్న చిరుతపైకి పైపుల ద్వారా నీటిని పడేలా ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కిందికి దిగి ఉరుకులు, పరుగులు పెట్టింది. అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి చిరుత వెళ్లకపోవటంతో జూపార్కుకు చెందిన వైద్యులు తుపాకి పేల్చి మత్తును ఎక్కించారు. స్పృహ కోల్పోవటంతో బోనులో బంధించి హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు. ప్రస్తుతం చిరుత యాక్టివ్‌గా ఉందని, ఎవరికీ ఎలాంటి నష్టం కలుగలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎఫ్ఓ శ్రీధర్‌రావు తెలిపారు. -
కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ
సాక్షి, హైదరాబాద్ : మానవాళిని గడగడలాడిస్తోన్న కోవిడ్ మహామ్మారికి హైదరాబాదీ మెడిసిన్ సిద్ధమైంది. నగరంలోని సుప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు కరోనా మహమ్మారిపై పోరాటంలో హెటిరో ఆదివారం కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్ మెడిసిన్ (రెమ్డిసివిర్)` ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందినట్లు వెల్లడించింది. రెమ్డిసివిర్ హెటిరో జెనిరిక్ వెర్షన్‌కు ‘కోవిఫర్’ అనే పేరుతో భారతదేశంలో మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఇంజెక్షన్లను లక్షడోసుల మేర సిద్ధం చేశామని సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. (కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్) ఈ సందర్భంగా హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ ‘భారతదేశంలో కోవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో `కోవిఫర్` (రెమ్డిసివిర్) విజయవంతమైన క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడం గేమ్ చేంజర్‌గా మారనుంది. బలమైన ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను కలిగి ఉండటం వల్ల ఈ ఉత్పత్తి దేశవ్యాప్తంగా వెంటనే రోగులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నెలకొన్న అవసరాలకు తగిన రీతిలో రోగులకు తగినట్లుగా ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమవుతోంది. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య విభాగాలతో మేం నిరంతరం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన `మేక్ ఇన్ ఇండియా` ప్రచారానికి తగినట్లుగా భారతదేశంలో ఈ ఉత్పత్తిని తీర్చిదిద్దాం’ అని ప్రకటించారు. డీసీజీఐచే అనుమతి పొందిన `రెమ్డిసివిర్` ఔషధాన్ని కోవిడ్ అనుమానితులు లేదా ల్యాబ్‌లలో పరీక్ష చేసిన అనంతరం పాజిటివ్ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత, కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించవచ్చు. కోవిఫర్ (రెమ్డిసివిర్) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వైద్యల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించవచ్చు. తక్కువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలకు కోవిడ్-19 చికిత్స చేయడంలో భాగంగా గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీ తో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందాన్ని అనుసరించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఔషధాన్ని విక్రయించేందుకు దేశీయ ఔషధ కంపెనీలు సిప్లా, హెటిరోకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఆదివారం ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పేర్కొంది. ఈ డ్రగ్ రాబోయే రెండో వారాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. (కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం) సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకు మందును అందుబాటులో తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు తెలిపారు. ఇంజక్షన్ రూపంలో ‘కోవిఫర్ 100 ఎంజీ’ మార్కెట్లోకి రానుందని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపింది. దీంతో కోవిడ్‌కు మందును కనిపెట్టిన ఘనత హైదరాబాద్ హెటిరోకి దక్కనుంది. ఇక కరోనా యాంటీ డ్రగ్ సిప్లా, హెటిరో సంస్థల ఆధ్వర్యంలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్!) -
ఆ వాల్వ్... నష్టకారణం
జడ్చర్ల,న్యూస్‌లైన్: జడ్చర్ల సమీప పోలేపల్లి సెజ్‌లోనున్న హెటిరో ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించి నిర్వాహకులకు రూ.15 కోట్ల నష్టాన్ని మిగిల్చిన తీరుకు అందులో ఉన్న వాటర్‌వాల్వ్ సమయానికి పనిచేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం రెండుగంటలకు విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అంచనావేస్తున్నారు. అయితే దీన్ని తీవ్రత తగ్గించేందుకు యత్నించినా పరిశ్రమలోని వాటర్‌వాల్వ్ సకాలంలో తెరుచుకోలేదు. దీంతో మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల సేపు కష్టపడాల్సి వచ్చింది. సుమారు 500మంది సిబ్బంది పరిశ్రమ ప్రాంగణంలోనే ఉన్నారు. వారెవరికీ ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఆ 35నిమిషాల్లోనే: జనరల్ బ్లాక్‌లో గల 4వ యూనిట్లో తొలుత చిన్నగా ఉన్న మంటలను ప్రారంభంలోనే ఆర్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించనట్లు తెల్సింది. వాటర్ వాల్వ్ తెరుచుకునేందుకు దాదాపుగా 35 నిమిషాలకు పైగా ఆలస్యం కావడంతో ఆలోగా యూనిట్ విబాగం మొత్తం ప్రమాదంలో చిక్కుకుంది.అ యితే ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడం ఊరటనిచ్చే అంశం. మంటలు తీవ్రస్థాయికి చేరి పరిసర ప్రాంతాలవారిని భయభ్రాంతులకు గురిచేసింది. మంటలను ఆర్పేందుకు కావలసిన నీరు అందుబాటులో లేక కొంత మేరజాప్యమైంది.ఈ లోగా అక్కడికి సమీపంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో వారి పరిశ్రమలోని నీటిని మంటలను ఆర్పేందుకు వినియోగించారు. ఫైర్ స్టేషన్లకు సమాచారం ఇచ్చినా దాదాపు గంటన్నర అనంతరం గానీ సంఘటనా స్థలానికి చేరుకోలేక పోయాయి. తొలుత షాద్‌నగర్ నుండి వచ్చిన ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగింది.అనంతరం నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్‌లనుండి కూడా ఫైర్ ఇంజన్లను రప్పించారు. ఫైర్ ఇంజన్లకు తోడు పరిశ్రమలోని సంపు నుండి,ఇతరత్రా నీటితో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. మరోవైపు జేసీబీలను రప్పించి పరిశ్రమ గోడలను బద్దలు కొట్టి నీటిని చిమ్మడంతో సాయంత్రం 6గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి.అద్దాలను బద్దలు కొట్టి ముందస్తుగా గోడలను నీటితో తడిపేశామని పరిశ్రమ మేనేజర్ భాస్కర్‌రెడ్డి ఈ సందర్బంగా విలేకరులకు వెళ్లడించారు. ప్యాకింగ్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. మొత్తం నష్టం రూ.15కోట్లు ఉంటుందని డీఎస్పీ మల్లిఖార్జున ఆద్వర్యంలోని బృందం తేల్చింది. సీఐలు వెంటకరమణ,శ్రీనివాస్‌రెడ్డి,ఫైర్ అధికారి గిరిధర్‌రెడ్డి ,తహసీల్దార్ అమరేందర్,పోలేపల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి,తదితరులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మల్లురవి సంఘటనస్థలాన్ని పరిశీలించారు.