ఆ వాల్వ్... నష్టకారణం | fire accident in hetero pharm | Sakshi
Sakshi News home page

ఆ వాల్వ్... నష్టకారణం

Published Tue, Jan 7 2014 5:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in hetero pharm

జడ్చర్ల,న్యూస్‌లైన్: జడ్చర్ల సమీప పోలేపల్లి సెజ్‌లోనున్న హెటిరో ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించి నిర్వాహకులకు రూ.15 కోట్ల నష్టాన్ని మిగిల్చిన తీరుకు అందులో ఉన్న వాటర్‌వాల్వ్ సమయానికి పనిచేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం రెండుగంటలకు విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అంచనావేస్తున్నారు. అయితే దీన్ని తీవ్రత తగ్గించేందుకు యత్నించినా పరిశ్రమలోని వాటర్‌వాల్వ్ సకాలంలో తెరుచుకోలేదు. దీంతో మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల సేపు కష్టపడాల్సి వచ్చింది. సుమారు 500మంది సిబ్బంది పరిశ్రమ ప్రాంగణంలోనే ఉన్నారు. వారెవరికీ ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు.

 ఆ 35నిమిషాల్లోనే: జనరల్ బ్లాక్‌లో గల 4వ యూనిట్‌లో  తొలుత చిన్నగా ఉన్న మంటలను ప్రారంభంలోనే ఆర్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించనట్లు తెల్సింది. వాటర్ వాల్వ్ తెరుచుకునేందుకు  దాదాపుగా 35 నిమిషాలకు పైగా  ఆలస్యం కావడంతో ఆలోగా  యూనిట్ విబాగం మొత్తం ప్రమాదంలో చిక్కుకుంది.అ యితే ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడం ఊరటనిచ్చే అంశం. మంటలు తీవ్రస్థాయికి చేరి పరిసర ప్రాంతాలవారిని భయభ్రాంతులకు గురిచేసింది.  మంటలను ఆర్పేందుకు కావలసిన నీరు అందుబాటులో లేక కొంత మేరజాప్యమైంది.ఈ లోగా అక్కడికి  సమీపంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో వారి పరిశ్రమలోని నీటిని మంటలను ఆర్పేందుకు వినియోగించారు.

ఫైర్ స్టేషన్‌లకు సమాచారం ఇచ్చినా దాదాపు గంటన్నర అనంతరం గానీ సంఘటనా స్థలానికి చేరుకోలేక పోయాయి. తొలుత  షాద్‌నగర్ నుండి వచ్చిన ఫైర్ ఇంజన్  రంగంలోకి దిగింది.అనంతరం నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్‌లనుండి కూడా ఫైర్ ఇంజన్‌లను రప్పించారు. ఫైర్ ఇంజన్‌లకు తోడు పరిశ్రమలోని సంపు నుండి,ఇతరత్రా నీటితో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. మరోవైపు  జేసీబీలను రప్పించి పరిశ్రమ గోడలను బద్దలు కొట్టి నీటిని చిమ్మడంతో సాయంత్రం 6గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి.అద్దాలను బద్దలు కొట్టి ముందస్తుగా గోడలను నీటితో తడిపేశామని పరిశ్రమ మేనేజర్ భాస్కర్‌రెడ్డి ఈ సందర్బంగా విలేకరులకు వెళ్లడించారు.

ప్యాకింగ్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు.  మొత్తం నష్టం రూ.15కోట్లు ఉంటుందని డీఎస్పీ మల్లిఖార్జున ఆద్వర్యంలోని బృందం తేల్చింది. సీఐలు వెంటకరమణ,శ్రీనివాస్‌రెడ్డి,ఫైర్ అధికారి గిరిధర్‌రెడ్డి ,తహసీల్దార్ అమరేందర్,పోలేపల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి,తదితరులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మల్లురవి సంఘటనస్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement