Cotton crop cultivation
-
భారీ వర్షాలకు పత్తి పంట నాశనం... సర్కారే ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి
-
Telangana: రైతులకు వి‘పత్తి’!
సాక్షి, వరంగల్/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైతుల ఇళ్లు ఇరుగ్గా మారిపోయాయి.. ఇంటి ఆవరణలు, పశువుల కొట్టాల్లో కూడా జాగా లేకుండా పోయింది.. ఉన్నట్టుండి ఇలా అయిపోవడానికి కారణం ‘పత్తి’ తెచ్చిన తంటాలే. అసలే అడ్డగోలు పెట్టుబడులు, పైగా తగ్గిన దిగుబడితో ఆందోళనలో ఉన్న రైతులకు పత్తి ధరలు తగ్గిపోవడం అశనిపాతంగా మారింది. తక్కువ ధరకు అమ్ముకుని అప్పులు మిగుల్చుకోలేక.. ఎక్కువ ధర ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ.. పత్తిని ఇళ్ల వద్ద, కొట్టాల్లో నిల్వ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సమయానికల్లా వానాకాలం పత్తి అమ్మేసుకుని, యాసంగి పంటపై దృష్టిపెట్టే రైతులు.. ఈసారి ఇంకా పంటను విక్రయించకుండా ఎదురుచూస్తున్నారు. దీనితో కాటన్, జిన్నింగ్ మిల్లులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అమ్మింది 3.17 లక్షల టన్నులే.. మార్కెట్లో గత ఏడాది పత్తికి గరిష్టంగా క్వింటాల్‌కు రూ.13 వేలకుపైగా ధర పలికింది. ఈ క్రమంలో వరిసాగు తగ్గించి, పత్తి పెంచాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అయితే సీజన్ ప్రారంభంలో భారీ వర్షాలు పడటంతో పలుచోట్ల మొదట వేసిన పత్తి విత్తనాలు కుళ్లిపోయాయి. దాంతో రైతులు మళ్లీ విత్తనాలు వేశారు. మరోవైపు అధిక వర్షాలు కొనసాగడంతో పత్తి దిగుబడి కూడా తగ్గింది. ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాల్సి ఉన్నా.. ఐదారు క్వింటాళ్లే వచి్చందని రైతులు చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 26 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో జనవరి మూడో తేదీ నాటికి మార్కెట్‌కు కేవలం 3.17 లక్షల టన్నులే వచి్చందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు చెప్తున్నారు. మిగతా పత్తినంతా రైతులు నిల్వ చేసుకున్నట్టు వివరిస్తున్నారు. బోసిపోయిన మిల్లులు రాష్ట్రవ్యాప్తంగా 350 మిల్లుల్లో రోజూ పత్తిని జిన్నింగ్ చేయాలంటే.. కనీసం 4 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు రావాలి. ప్రస్తుతం అందులో సగం కూడా రావడం లేదని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చెప్తున్నాయి. దీనితో మార్కెట్ యార్డులు, కాటన్, జిన్నింగ్ మిల్లులు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. తగ్గిన ధర.. మళ్లీ పెరుగుతుందనే ఆశలు గత ఏడాది పత్తి ధర రూ.13 వేలు కూడా దాటింది. 6 నెలల కిందటి వరకు కూడా క్వింటాల్‌కు రూ.10 వేలు పైన పలికినా.. తర్వాత తగ్గిపోయింది. ప్రస్తు తం రకాన్ని బట్టి క్వింటాల్ రూ.6,200 నుంచి రూ.8,300 మధ్య కొనుగోలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కొన్నిచోట్ల వ్యాపారులు రూ.6 వేల వరకే చెల్లించారు. దీనితో ఆందోళనలో పడ్డ రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందన్న ఆశ తో నిల్వ చేసుకున్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో మాత్రం కొంతమేర పత్తి మార్కెట్‌కు వస్తోంది. గత శుక్రవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర గరిష్టంగా క్వింటాల్‌కు రూ.8,170గా నమోదైంది. ఆదిలాబాద్ మార్కెట్లో రూ.8,150, ఖమ్మం, జమ్మికుంట మార్కెట్లలో రూ.8,300 పలికింది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత క్వింటాల్‌కు ధర రూ.10 వేలు దాటుందని రైతులు ఆశిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఒక క్యాండీ (గింజలు తీసిన 3.56 క్వింటాళ్ల పత్తి) ధర రికవరీ అవుతోంది. గతేడాది జూన్, జూలై వరకు రూ.1,10,000గా ఉన్న క్యాండీ ధర తర్వాత రూ.52 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.62 వేలు దాటింది. త్వరలో ఇది రూ.90 వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పత్తి గింజల ధర కూడా పెరుగుతోందని.. ఈ లెక్కన పత్తి ధర పెరుగుతుందని అంటున్నాయి. కౌలుకు తీసుకుని సాగు చేసి.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన తుమ్మ రాజారెడ్డి తన పదెకరాలతోపాటు మరో పదెకరాలను కౌలు తీసుకొని పత్తిసాగు చేశాడు. రూ.15 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఇప్పటికే కూలీలను పెట్టి 120 క్వింటాళ్ల పత్తి ఏరారు. కానీ గిట్టుబాటు ధర రాక విక్రయించకుండా నిల్వ చేశారు. చేనులో ఇంకా పత్తి ఉన్నా చేతిలో డబ్బుల్లేక అలాగే వదిలేశాడు. ఇంటి బయట ఎండా వానకు.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బీడ చిన్న లచ్చయ్య ఎనిమిది ఎకరాల్లో పత్తి వేశాడు. మార్కెట్లో ధర లేదని పత్తిని ఇలా ఇంటి బయట, వరండాలో ప్లాస్టిక్ కవర్లు కప్పి నిల్వ చేశాడు. ఎప్పుడు ధర పెరుగుతుందో, ఎప్పుడు అమ్ముతానో అని ఆవేదన చెందుతున్నాడు. సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలం బొప్పన్పల్లికి చెందిన రైతు రాములు ఇంట్లో పరిస్థితి ఇది. దిగుబడి వచి్చన పత్తిని అమ్ముకుందామంటే సరైన ధర రాక ఇంట్లోనే నిల్వచేసుకున్నాడు. ఉన్న రెండు గదుల్లోనూ పత్తి నిండిపోవడంతో.. దానికి ఓ పక్కన స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటున్నారు. ఆ కొంత స్థలంలోనే కుటుంబమంతా నిద్రపోతున్నారు. -
పడావు భూముల్లో పచ్చని పంటలు!
సాగునీటికి వసతి లేని ప్రాంతం.. నీరు లేక భూములు బంజరుగా మారడం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన పాల్వాయి సత్యనారాయణ రెడ్డిని కలవరపరచింది. ఎలాగైనా తమ భూములను పంటలకు ఆలవాలంగా మార్చాలని, పచ్చదనాన్ని నింపుకోవాలన్న తపనతో అన్వేషించగా.. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని తోచింది. అయితే, అందుబాటులో ఉన్న అనేక పద్ధతుల్లో దేన్ని అనుసరించాలో అంతుపట్టలేదు. తన కుటుంబానికి చెందిన 50 ఎకరాలకు నీటి భద్రత సాధించుకోవడానికి తక్కువ ఖర్చులో చక్కని ఫలితాన్నిచ్చే నీటి సంరక్షణ పద్ధతి ఏమిటో తేల్చుకోవడం కష్టంగా తోచింది. ఆ దశలో ‘సాక్షి’తో కలసి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), సంగెం చంద్రమౌళి(98495 66009) ఆధ్వర్యంలో సాగుతున్న ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి తెలిసింది. వారి తోడ్పాటుతో 2016 జూన్‌లో ఎకరానికి కేవలం రూ. రెండు వేల ఖర్చుతో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక చోట 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతున సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల్లో కందకాలు తీయించారు. కందకాలు తవ్వి మట్టి కట్టలు పోయించారు. వాలును బట్టి 3–4, 5–6 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా విభజించి వాలుకు అడ్డంగా 3 అడుగుల, 3 అడుగుల వెడల్పున.. ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. కందకాలు తవ్వించి, మట్టికట్టలు పోయించారు. కందకాలు తవ్వించిన తర్వాత రెండేళ్లలో సాధారణ వర్షాలతోపాటు అకాల వర్షాలకు భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం నుండి పడే ప్రతి చినుకు కందకాలలోకి చేరి ఇంకిపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ఈ భూముల్లోని పత్తి పంట, ఇతర తోటలు ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో రెండు, మూడు వారాలు వర్షం పడకపోయినా పంటలకు ఢోకా లేదన్న భరోసాతో సత్యనారాయణ రెడ్డి ముందుకు సాగుతుండడం తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వర్షాలకు పడిన నీరు ఎక్కడికక్కడ ఆ కందకాల ద్వారా ఇంకి భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. ఆ విధంగా భూమి పొరల్లోకి చేరిన నీరే.. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పత్తి పంటకు, యూకలిప్టస్, టేకు తదితర తోటల్లో భూమికి నిమ్మునిస్తుంది. ఇటీవల వర్షాలు లేకపోయినా ఈ భూముల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగింది. ఇదే భూమికి దగ్గర్లోని రైతు భూమిలో పత్తి పంట కళతప్పింది. కందకాలు తవ్వుకొని పత్తి సాగు చేస్తున్నందున ఎకరాకు 20 క్వింటాళ్ళకు పైగానే పత్తి దిగుబడి వస్తున్నదని సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడి బాగుందన్నారు.తనకున్న 50 ఎకరాలలో ఏడెకరాల్లో టేకు మొక్కలు , ఇతరత్రా మొక్కలు పెంచుతున్నారు. అడవులను పెంచే భూమి చుట్టూ కందకాలు తీయడం మూలంగా మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయి. సాగులోకి తేవాలనే.. మూడున్నర ఏళ్ళ క్రితం మా భూములన్నీ పడావు పడి ఉండేవి. అసలు ఎందుకు సాగులోకి తేలేకపోతున్నామన్న బాధ ఉండేది. అప్పట్లోనే విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిచయమయ్యారు. మెట్ట భూముల్లో కూడా కందకాలతో నీటి భద్రత పొందవచ్చని, కందకాలు తవ్వించమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లు కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించా. అంతకుముందు వర్షం పడినా భూమిలోకి అంతగా ఇంకకుండా వరద వెళ్లిపోయేది. ఇప్పుడు ఎక్కడిదక్కడే ఇంకుతోంది. దీని వల్ల బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆనాడు పడావుగా ఉన్న భూములు నేడు పచ్చగా కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. దిగుబడి పెరగడంతో మా భూములకు కౌలుదారుల నుంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి రైతు తమ భూమిలో కందకాలు తీయించుకోవాలి. – పాల్వాయి సత్యనారాయణ రెడ్డి(98666 13645), బంగారి గడ్డ, చండూర్ మండలం, నల్లగొండ జిల్లా – మునుకుంట్ల గాలయ్య, సాక్షి, చండూర్, నల్లగొండ జిల్లా -
పత్తిపై తెగుళ్లతో పరేషాన్
యాచారం: పత్తి పంటపై తెగుళ్లతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రోజుల వ్యవధిలోనే మొక్కలు వాడిపోయి, నేలవాలుతుండటంతో జీర్ణించుకోలేక పోతున్నారు. అదనులో వర్షాలు లేక ఆలస్యంగా విత్తనాలు విత్తారు. కురిసిన కొద్దిపాటి వర్షాలకు మొక్కలు ఎదుగుతున్న దశలో తెగుళ్లు సోకి ఎండిపోతుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. మండలంలోని తమ్మలోనిగూడ, యాచారం, నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో పంటపై తెగుళ్ల కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయి. గత వారం రోజులుగా కురిసిన కొద్దిపాటి వర్షాలతో ప్రాణం పోసుకున్నాయి. ఈ దశలో పత్తి మొక్కలు వాడిపోవడం, నేల వాలిపోవడంతో రైతుల్లో బెంగ పట్టుకుంది. కొన్ని గ్రామాల్లో రోహిణీ కార్తెలో విత్తిన పత్తి ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. కాగా.. రెండు మూడు రోజుల వ్యవధిలోనే పంటలో పలు మార్పులు వస్తుండటంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. -
పురుగు మందులు మోతాదుకు మించొద్దు
- బీటీ పంటలకు 90 రోజుల వరకు మందుకొట్టొద్దు - పత్తి పంట చేతికొచ్చేలోపు నాలుగుసార్లు స్ప్రే చేస్తే చాలు - వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు జోగిపేట: జిల్లాలో ప్రధాన పంటల్లో ఒకటిగా పత్తి సాగవుతోంది. ఈ పంట చేతికొచ్చేలోపు నాలుగు సార్లు పురుగుల మందులు పిచికారీ చేస్తే చాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో పురుగుల మందులు వాడితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అవగాహన లోపంతో రైతు లు అధిక మోతాదులో పురుగు మందులు వాడుతున్నారు. పత్తి పంట గూడ (పూత) దశకు కూడా రా కుండానే.. విత్తిన 45 రోజుల్లో రెండు సార్లు పురుగుల మందులు స్ప్రే చేసేశారు. పత్తిలో పురుగు మందుల వాడకంపై జోగిపేట డివిజన్ ఏడీఏ శ్రీలత అం దించిన సలహాలు, సూచనలు.. ప్రస్తుతం పత్తి పం టలు కొన్ని చోట్ల గూడలు.. మరికొన్ని చోట్ల ఆరు నుంచి ఎనిమిది ఆకులు వచ్చే దశలో ఉన్నాయి. రైతులు ప్రస్తుతం విత్తుతున్న విత్తనాలు (బీటీ) బయోటెక్నాలజీకి సంబంధించినవే. అందువల్ల విత్తిన 90 రోజుల వరకు పురుగులు ఆశించే అవకాశం లేదు. ఈ 90 రోజుల్లోపు ఆకు ముడత రాకుం డా కాన్ఫిడార్ లాంటి మందును ఒకటికి రెండు సార్లు వాడితే సరిపోతుంది. కానీ ఇప్పటికే రైతులు తమకు తోచిన మందులు తెచ్చి రెండు సార్లు పిచికారీ చేశారు. మరోవైపు నీటిలో కలపాల్సిన మందు మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. నష్టాలు... - అధిక మోతాదుతో పాటు ఎక్కువ సార్లు పురుగుల మందు పిచికారీ చేయడం వల్ల ఆకులు ముడత పడడంతో పాటు పంట దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంది. - ఎక్కువసార్లు మందులు వాడడం వల్ల ఖర్చు బాగా పెరిగి పెట్టుబడులు అధికమవుతాయి. - నేలలో తగినంత తేమ లేనప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మందులు పిచికారీ చేయొద్దు. - వర్షాలు పడక 15 రోజులు దాటితే యూరియాను నీటిలో కలిపి పత్తి పంటపై స్ప్రే చేస్తే ఫలితం ఉంటుంది. - లీటరు నీటికి 5 నుంచి 10 గ్రాముల యూరియాను నీటిలో కరిగించి స్ప్రే చేయడం ద్వారా ఆకులకు ముడత రాకుండా ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల కొంత వరకైనా తట్టుకుంటుంది. - పంటపై అక్కడక్కడ పచ్చదోమ ఆశించినట్లు తెలుస్తోంది. నివారణకు ఎస్పేట్ వాడాలి. - వర్షాలు కురవని సమయంలో యూరియా, డీఏపీ, పొటాష్ మందులు వేయొద్దు. - మొక్క మొదళ్ల వద్ద కొంచెం మట్టిని మందు వేసి మట్టితో కప్పితే మంచి ఫలితం ఉంటుంది. - శ్రీలత, ఏడీఏ, జోగిపేట ఫోన్: 8886614280 ఉచితంగా వర్మీ యూనిట్లు వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి.. భూ సారం పెంచుకునే విధంగా రైతులను సేంద్రియ ఎరువుల తయారీ వైపు మళ్లించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా మండలంలో ఉత్సాహవంతులైన రైతులు సొంతంగా షెడ్ ఏర్పాటు చేసుకుంటే వ్యవసాయ శాఖ తరఫున వర్మీకంపోస్ట్ కవర్‌తో పాటు ఉచితంగా వానపాములతో కూడిన వర్మీ యూనిట్లను ఇవ్వనున్నట్లు ఏఈఓ శ్రీదేవి తెలిపారు. కంగ్టి మండలానికి 15 యూనిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల రైతులకు వర్మీ కంపోస్ట్ ఏర్పాటు విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు ఆదర్శ రైతు జార సంగారెడ్డి, సెల్: 9492677867ని సంప్రదించాలన్నారు. - తడ్కల్ -
వేరుశనగను కాపాడుకోండిలా..
ఆదోని రూరల్: జిల్లాలో పత్తి తరువాత అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ. ప్రస్తుతం పంట సాగై నెలరోజులు పైగా కావస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల్లో ఎదుగుదల లోపించింది. కోసిగి మండలం కందకూరు, దిడ్డి, అలాగే ఆదోని మండలం మధిరె గ్రామాల్లో ఆకుముడత తెగులు కనిపిస్తోంది. పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో రసం పీల్చేపురుగు..మిగతా గ్రామాల్లో అక్కడడక్కడ తామర పురుగు ఆశించింది. ఆకుమచ్చ తెగులూ పంటను దెబ్బతీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జింక్ లోపం కారణంగా పైరు పసుపు రంగులోకి మారుతోందని ఆదోని ఏడీఏ చెంగలరాయుడు (8886613938) తెలిపారు. రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే తప్ప పంట చేతికొచ్చే పరిస్థితి లేదని వివరించారు. వాతావరణ మార్పులతో ఆకుముడత తెలుగు వస్తోంది. ఆకులు గోధుమరంగులోకి మారి పైరు ఎండిపోతుంది. ఆకులపై బొబ్బలు వచ్చి పొరల మధ్య పురుగు ఉంటుంది. దీని నివారణకు ఫినాల్‌ఫాస్ 2.5ఎంఎల్, వేపనూనె 3ఎంఎల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుపై ముదురు గోధుమ రంగులో మచ్చలు (ఆకుమచ్చ తెగులు) ఏర్పడితే పైరు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఒకలీటరు నీటిలో 3 గ్రాముల డైథేన్ఎం45ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వకుళ్లు తెగులు వస్తే ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి. మొక్కల ఎగుదల నశించి దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటికి మోనోప్రోటాఫాస్ 2ఎంఎల్, వేపనూనె 3ఎంఎల్‌తో పాటు సర్ఫ్ పొడిని ఎకరాకు 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగు ఆశిస్తే ఆకులు ఎర్రబడి ముడుచుకుపోతాయి. దీని నివారణకు ఒక లీటరు నీటిలో రోగార్ 2 ఎంఎల్‌తో పాటు వేపనూనె 5 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలి. పైరు మొక్క దశలో ఉన్నప్పుడు ఎర్ర నేలల్లో 10 రోజులకోసారి వర్షం కురవాలి. లేదంటే పైరు బెట్టకు వస్తుంది. నల్లరేగడి నేలల్లో అయితే 15 రోజుల సమయం పడుతుంది. దీనిని నివారణకు ఒక లీటరు నీటిలో 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లీటర్ల నీటిని వాడటం మంచిది. జింక్‌ధాతు లోపం ఉంటే మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి పిచిచారీ చేయాలి. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. -
పంట మార్పిడిపై రైతుల దృష్టి
యాచారం: ఆలస్యంగా కురిసిన వర్షాల కారణంగా రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు. అదునలో వర్షాలు కురిస్తే పత్తి పంట సాగు చేద్దామనుకున్న రైతులు.. దిగుబడి తగ్గుతుందేమోనని ఇతర పంటల సాగుపై అసక్తి చూపుతున్నారు. మండలంలో ఈ ఏడాది 1,500 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేయడానికి రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారు. కానీ అదనులో వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి వైపు మళ్లారు. ఈసారి పత్తి 400 హెక్టార్ల వరకు కూడ సాగు చేయలేదు. రెండు రోజుల క్రితం ఓ మోస్తరు వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు రోజుల్లోనే 700 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న విత్తుకోవడం గమనార్హం. వర్షాలు సకాలంలో కురిసే అవకాశం లేని విషయం పసిగట్టిన వ్యవసాయాధికారులు అవసరమైన మొక్కజొన్న విత్తనాలు నిల్వలు సిద్ధంగా ఉంచారు. మండలంలో ఇప్పటివరకు 13.3 టన్నుల మొక్కజొన్న విత్తనాలు విక్రయించారు. అదనులో కురవని వర్షాల కారణంగా రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్న దృష్ట్యా మళ్లీ మూడు టన్నుల విత్తనాలు సిద్ధంగా ఉంచారు. 100 రోజుల్లోనే పంట చేతికి.. ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తే వంద రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పుడప్పుడు కురిసే వర్షాలతోనైనా మొక్కజొన్న పంట పండే అవకాశముంది. కానీ పత్తి పంట ఆలస్యంగా విత్తితే పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా.. పంటపై చీడపీడలు సోకడంతో పాటు దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుందని రైతుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో వారు మొదట మొక్కజొన్న, రెండో దశలో ఆముదం, కందులు తదితర పంటలపై దృష్టి పెట్టారు. మండలంలో ఇప్పటికే 900 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు అయింది. పంటమార్పిడితో రైతులు సాగు విస్తీర్ణం పెంచితే మొక్కజొన్న రెండు వేల ఎకరాలకు పైగా దాటే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఆయా గ్రామాల్లో 400 హెక్టార్లలో ఆముదం, కంది పంటలు సాగు చేశారు. 200 ఎకరాలకు పైగా వరి పంట సాగులో ఉంది. బీపీటీ తూకాలు పోసిన రైతులు సంమృద్ధిగా వర్షాలు కురిస్తే తప్ప కరిగెట్లు దున్ని నాట్లేయలేమని అంటున్నారు. కొన్ని గ్రామాల్లో పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకున్న రైతులు దిగుబడి తగ్గుతుందని తెలిసినా పత్తినే సాగు చేస్తున్నారు. ఈసారి అత్యధికంగా మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా బీమా సౌకర్యాం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు. -
కనికరించని చినుకు
సాక్షి, ముంబై: ప్రతి ఏడాది మాదిరిగానే వరుణుడు ఈసారి కూడా దోబూచులాడుతున్నాడు. ముంబైలో ఇటీవల వర్షాలు కురుస్తున్నా, ఇతర ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురవక లక్షల హెక్టార్ల పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అప్పు చేసి మరీ పత్తిపంటను సాగు చేసిన రైతులు వర్షాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది పత్తి రైతులు తమ పంటపై ఆశలు వదులుకున్నారు. దాదాపు 15 లక్షల హెక్టార్లలో నాటిన పత్తి విత్తనాలు వర్షాలు కురవకపోవడంతో ఎండిపోయాయి. మునుపటి మాదిరిగానే ఈసారి కూడా జూన్‌లో పత్తి విత్తనాలు నాటినట్లు రైతులు పేర్కొన్నారు. వర్షాలు కురవకపోవడంతో అవి మొలకెత్తడం లేదని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో గతంలో వర్షాన్ని అంగుళాల పద్ధతిలో కొలిచేవారు. ఇప్పుడు సెంటీమీటర్లలో లెక్కించాల్సి వస్తుందని ‘విధర్భ జనాందోళన్ సమితి’ (వీజేఏఎస్) వ్యవస్థాపకుడు కిషోర్ తివారీ పేర్కొన్నారు. ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన, ఇక్కడ వ్యవసాయ సంక్షోభంపై ఈ సంఘం పోరాటాలు చేస్తోంది. రాష్ట్రంలో పత్తి రైతులు ప్రతిసారి దాదాపు 44 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలు నాటేవారు. మద్దతు ధర రాకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాల వల్ల తీవ్ర నష్టాలు రావడంతో సాగు 20 లక్షల హెక్టార్లకు పడిపోయింది. వర్షాభావం వల్ల చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఉమాకాంత్ డాన్జెట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వర్షాలు ఇప్పటికీ నెల రోజులు ఆలస్యం అయ్యాయి. విత్తనాలు ఆలస్యంగా నాటి ఉంటే పంటలకు తెగుళ్లు వచ్చేవి. అయితే కొంత ఆలస్యం అయినా వర్షాలు కురుస్తాయి. ఆశించినస్థాయి దిగుబడులు వస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి పత్తిపై తమకు ఆశలు లేవని, ఇతర పంటలసాగుపై దృష్టి సారిస్తామని రైతులు చెబుతున్నారు. పత్తి విత్తనాలు నాటే సమయం ముగిసిపోయిందని కూడా తివారీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నందున, వారికి ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే పత్తి విత్తనాలకు చేసిన వ్యయం వృథా అయింది. ప్రభుత్వం రాయితీపై పప్పుధాన్యాల విత్తనాలు ఇవ్వాలి. పత్తి పంట మంచి ఆదాయం తెచ్చి పెడుతున్నా, ఈసారి ప్రకృతి సహకరించడం లేదు’ అని తివారీ అన్నారు. ఈసారి పంట దిగుబడి 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. హెక్టారు భూమిలో పత్తి విత్తనాలు నాటేందుకు రైతులు రూ.30 వేల ఖర్చు చేసినందున, మరో పంటను తిరిగి సాగు చేయడానికి అయ్యే ఖర్చును భరించలేరని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ సాయం అనివార్యమని స్పష్టం చేశారు. చాలా ప్రాంతాల్లో పత్తిసాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నా, ఇప్పటికీ కొంత పంట మాత్రం సురక్షితంగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. బిందుసేద్యం చేస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల హెక్టార్ల రైతుల భూములకు ఎలాంటి భయమూ లేదని తెలిపింది. వర్షాధార భూముల్లో పంటలకు నష్టం జరుగుతున్న మాట నిజమేనని వ్యవసాయశాఖ పేర్కొంది. ఇలాంటి వారిని సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని డాన్జెట్ తెలిపారు.