ఆదోని రూరల్: జిల్లాలో పత్తి తరువాత అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ. ప్రస్తుతం పంట సాగై నెలరోజులు పైగా కావస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల్లో ఎదుగుదల లోపించింది. కోసిగి మండలం కందకూరు, దిడ్డి, అలాగే ఆదోని మండలం మధిరె గ్రామాల్లో ఆకుముడత తెగులు కనిపిస్తోంది. పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో రసం పీల్చేపురుగు..మిగతా గ్రామాల్లో అక్కడడక్కడ తామర పురుగు ఆశించింది. ఆకుమచ్చ తెగులూ పంటను దెబ్బతీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జింక్ లోపం కారణంగా పైరు పసుపు రంగులోకి మారుతోందని ఆదోని ఏడీఏ చెంగలరాయుడు (8886613938) తెలిపారు. రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే తప్ప పంట చేతికొచ్చే పరిస్థితి లేదని వివరించారు.
వాతావరణ మార్పులతో ఆకుముడత తెలుగు వస్తోంది. ఆకులు గోధుమరంగులోకి మారి పైరు ఎండిపోతుంది. ఆకులపై బొబ్బలు వచ్చి పొరల మధ్య పురుగు ఉంటుంది. దీని నివారణకు ఫినాల్‌ఫాస్ 2.5ఎంఎల్, వేపనూనె 3ఎంఎల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆకుపై ముదురు గోధుమ రంగులో మచ్చలు (ఆకుమచ్చ తెగులు) ఏర్పడితే పైరు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఒకలీటరు నీటిలో 3 గ్రాముల డైథేన్‌ఎం45ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మొవ్వకుళ్లు తెగులు వస్తే ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి. మొక్కల ఎగుదల నశించి దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటికి మోనోప్రోటాఫాస్ 2ఎంఎల్, వేపనూనె 3ఎంఎల్‌తో పాటు సర్ఫ్ పొడిని ఎకరాకు 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగు ఆశిస్తే ఆకులు ఎర్రబడి ముడుచుకుపోతాయి. దీని నివారణకు ఒక లీటరు నీటిలో రోగార్ 2 ఎంఎల్‌తో పాటు వేపనూనె 5 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలి.
పైరు మొక్క దశలో ఉన్నప్పుడు ఎర్ర నేలల్లో 10 రోజులకోసారి వర్షం కురవాలి. లేదంటే పైరు బెట్టకు వస్తుంది. నల్లరేగడి నేలల్లో అయితే 15 రోజుల సమయం పడుతుంది. దీనిని నివారణకు ఒక లీటరు నీటిలో 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లీటర్ల నీటిని వాడటం మంచిది.
జింక్‌ధాతు లోపం ఉంటే మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి పిచిచారీ చేయాలి. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు చేయాల్సి ఉంటుంది.
వేరుశనగను కాపాడుకోండిలా..
Published Thu, Aug 14 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM