drought conditions
-
రాష్ట్రంలో కరువు పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఏడాదిగా సరైన వర్షపాతం లేక రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనిని అంతా కలసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. బుధవారం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ జిల్లాల రైతులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పండిస్తున్న పంటలు, అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కరువు పరిస్థి తులు ఉన్నాయి. వచ్చే ఎండాకాలంలో తాగునీటికి కష్టా లు రాకుండా చూడాల్సిన అవ సరముంది. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలంటూ కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాలు ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడు తుంది. రైతులు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. ఎప్పుడూ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలి. అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మా ప్రభుత్వం రైతుల తో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలను చేపడు తుంది. విత్తనాలు, ఎరువుల సరఫరా, ఏ పంట వేయాలనేది మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకు నేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో మా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతుభరోసా, రుణమాఫీ, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యక్రమాలన్నీ చేపడుతోంది. పంట మార్పిడితో అధిక దిగుబడులు రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉన్నా యి. రైతులు కేవలం వరి, పత్తి, మిర్చి పంటలకే పరిమితం కావొద్దు. ఇతర పంటలు సాగు చేయాలి. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లా భాలు వచ్చేలా పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి. వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసు కోవాలి. దీనిద్వారా తమ సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకురావొచ్చు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్ర మాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తాం. రైతులు ధైర్యం కోల్పోవద్దు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమ ల్లోకి తెచ్చింది. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటే.. రైతులు ధీమాగా బతికేందుకు పంటల బీమా పనిచేస్తుంది. పంట వేసినప్పటి నుంచి కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారం అందుతుంది. రైతులు పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుంది. వారు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ‘రైతు నేస్తం’ ఏమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతువేదికలను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసి.. నేరుగా రైతుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూ.97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు, వ్యవసాయ నిపుణులు గ్రామాల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. తగిన సలహాలు ఇవ్వడంతోపాటు పంటల సాగులో అధునాతన మెలకువలను సూచిస్తారు. ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు కూడా ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. -
కరువును తట్టుకునే గోధుమ
లండన్: వాతావరణ మార్పుల కారణంగా వచ్చే కరువు పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకునే గోధుమ వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇవి నీటిని కూడా పొదుపుగా వాడుకునేలా జన్యు మార్పులు చేశారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త గోధుమ వంగడాలను రూపొందించారు. కొత్త వంగడాల్లో తక్కువ పత్ర రంధ్రాలు ఉండేలా జన్యు మార్పులు చేశారు. దీంతో తక్కువ నీటిని వినియోగించుకోవడంతో పాటు మంచి దిగుబడులు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం కోసం 80 నుంచి 90 శాతం మంచి నీరు అవసరం అవుతోంది. ఒక కిలో గోధుమ ఉత్పత్తి చేసేందుకు ఏకంగా 1,800 లీటర్ల నీరు అవసరం పడుతోంది. వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో నీటి ఎద్దడి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలాంటి వంగడాలు ఎంతో అవసరమని, పైగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా ఆహారపు అవసరాల కోసం రైతులు మరింత ఉత్పత్తి చేయాలని పరిశోధకులు అంటున్నారు. అన్ని మొక్కల్లాగే గోధుమ మొక్కలు కూడా నీటి ఆవిరిని నియంత్రిస్తుంటాయి. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు తెరుచుకుని ఆవిరి బయటికి వెళ్తుంది. అదే కరువు పరిస్థితుల్లో పత్రరంధ్రాలు మూసుకుపోయి నీరు బయటికి వెళ్లకుండా నియంత్రించుకుంటాయి. అదే పత్ర రంధ్రాలు తక్కువగా ఉంటే నీటిని జాగ్రత్తగా వాడుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కరువు రక్కసి@బొల్లాపల్లి తండాలు
సాక్షి , బొల్లాపల్లి(గుంటూరు) : బొల్లాపల్లి మండల తండాల్లో పేదరికం విసిరిన బతుకులు వలసదారుల్లో తరలిపోతున్నాయి. పండుగలాంటి పల్లె వాకిట పస్తుల తోరణాలు వేలాడుతున్నాయి. కరువు రక్కసి నోట చిక్కిన ఇళ్లు.. తాళం బుర్రలు కప్పుకుని కన్నీరొలుకుతున్నాయి. వానజాడ లేక, సాగర్ నీళ్లు రాక తడారిన పంట పొలాలు నెర్రెలిచ్చి ఘొల్లుమంటున్నాయి. మెతుకు దొరికే తావు చూపండయ్యా అంటూ ఏకరువు పెడుతున్నాయి. ప్రకాశం జిల్లా సరిహద్దు నల్లమల అటవీ ప్రాంతానికి ముఖ ద్వారంగా ఉన్న బొల్లాపల్లి ప్రాంతం జిల్లాలోనే వెనుకబడినదిగా గుర్తింపు పొందింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరమైంది తీవ్ర పంట నష్టం.. మండలంలో సుమారు 12 వేలకు పైగా హెక్టార్లలో మాగాణి, మెట్ట భూమి ఉంది. ఇక్కడ చిన్నా.. సన్నకారు రైతులు మిరప, పత్తి, పొగాకు, కంది పంటలు సాగు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం.. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు ఎండమావులను తలపిస్తున్నాయి. దీనికి తోడు గిట్టుబాటు ధరలు లేకపోవడం కూడా అన్నదాతలను కుంగదీసింది. ఖరీఫ్, రబీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. వాణిజ్య పంటలైన మిరప, పత్తి సుమారు 4,500 హెక్టార్లలో సాగు చేస్తే 3,200 హెక్టార్లలో, పత్తి 3 వేల హెక్టార్లలో సాగుచేస్తే 2,700 హెక్టార్లలో దెబ్బతింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు, రైతు కూలీలు పొట్ట చేతపట్టుకొని సొంత గ్రామాన్ని, పొలాలను వదిలి వేరే ప్రాంతాలకు వలసబాట పట్టారు. గొంతు తడవని పరిస్థితి ప్రస్తుతం మండల గ్రామాలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రేమిడిచర్ల, రావులాపురం, గండిగనుమల, దొమల గుండం, గుమ్మనంపాడు, గరికపాడు, పమిడిపాడు, జయంతిరామపురం, మర్రిపాలెం, బండ్లమోటు, అయ్యన్నపాలెం, గుట్లపల్లి పంచాయతీల్లో తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు అడుగంటడంతో.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మారుమూల తండాల్లోని ప్రజలు ట్యాంకులు వచ్చేంత వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. గతంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వాటర్ గ్రిడ్ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీ గుప్పించారు. ఆ తర్వాత దానిని విస్మరించారు. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇంకా పూరి గుడిసెల్లోనే! ప్రభుత్వం అందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేశామంటూ ఊదరగొతుంది. కానీ, మండలంలోని మారు మూల తండాల్లో ప్రజలు చాలా వరకు పూరిగుడెసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. కొంత మంది ప్రభుత్వం మాట నమ్మి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఉన్న ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇంటి నిర్మాణానికి పునాదులు వేశారు. అంతే నిధులు మంజూరు కాకపోవడంతో ఆ నిర్మాణాలు అక్కడితోనే నిలిచిపోయాయి. కరువుకు తార్కాణం మండలంలో నల్లమలకు ఆనుకుని 30కి పైగా గిరిజన తండాలున్నాయి. కరువు రక్కసి ధాటికి విలవిల్లాడుతున్నాయి. మన్నేపల్లితండా, గండిగనుమలపైతండా, దొమల గుండం తండా చక్రాయపాలెం, గంగుపల్లి తండా, లింగంగుంట తండా, చెంచుకుంట తండాల నుంచి సుమారు 2 వేల కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వలస బాటపట్టాయి. అయినా ప్రభుత్వం కరువు పరిస్థితిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బండ్లమోటు వద్ద 1969లో ఏర్పాటు చేసిన హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ మైనింగ్ 2002లో మూతపడింది. ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగించిన 1500 కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆ తర్వాత సరైన ఉపాధి లభించక వేరే వేరే ప్రాంతాలకు వలసబాట పట్టాయి. ఎప్పటికైనా ఆశ తీరకపోతుందా అని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని నాలుగు మండలాల కరువు నియంత్రణకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో దొమ్మర్లగొంది ప్రాజెక్టు పూర్తి చేస్తే చెరువులు నిండి కరువు చాయలు దరిచేరవని ఈ ప్రాంత వాసుల ఆశ. గుంటూరు జిల్లా వెల్దుర్తితో పాటు దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాలకు తాగునీటితో పాటు సాగు నీరందిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. చెరువులు నిండటం వలన భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. వైద్యం దైన్యం.. విద్య దూరం ఎస్టీ, ఎస్సీ, బీసీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో విద్య, వైద్య ఖర్చులు సైతం భరించలేని దయనీయ స్థితిలో ప్రజలున్నారు. పదో తరగతి తర్వాత పై స్థాయి విద్యకు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం రెండు బాలుర గిరిజన వసతి గృహాలు మాత్రమే ఉన్నాయి. బాలికా విద్యకు సరైన పోత్సాహం లేదు. వెనుకబడిన ప్రాంతంలో కనీసం ఇంటర్‌పై స్థాయితో పాటు సాంకేతిక కళాశాలలు ఏర్పాటు చేస్తే బాలికల విద్యాశాతంపెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాల మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. మండల కేంద్రంలో పేరుకే 24 గంటల ఆరు పడకల ఆస్పత్రి ఉంది. గతేడాది వరకు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం చేపట్టలేదు. ప్రస్తుతం వైద్యులు ఉన్నా..సమయానికి అందుబాటులో ఉండని దుస్థితి. ఐదేళ్ల కిందట నిర్మించిన వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేటికీ వైద్యులులేరు. గతంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో పాటు అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సీహెచ్‌సీని ప్రారంభించి వదిలేశారు. అంతా మోసం.. మండలాభివృద్ధికి కేటాయించిన నిధులను టీడీపీ నాయకులు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. అదే విధంగా కరువు మండలం కింద నిధుల మంజూరైతే వాటిని వేరే మండలానికి మళ్లించారు. పంచాయతీ నిధులను తాగునీటికి వెచ్చించాలని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుమారు రూ 1.50 కోట్లను ఆయా పంచాయతీల్లో సిమెంట్ రోడ్లుకు కేటాయించి, ఆ పనుల్లోనూ చేతివాటం చూపించారు. నీరు– చెట్టు కింద సుమారు రూ 3.50 కోట్లు చెరువు పూడిక తీత, చెక్ డ్వామ్ల నిర్మాణాల పేరుతో జేబుల్లో వేసుకున్నారు. ఇదంతా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల అండదండలతో కింది స్థాయి టీడీపీ నాయకులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధ్వానంగా రవాణా సౌకర్యం గ్రామాలను కలుపుతూ ఉండే లింకు రోడ్లు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కనుమల చెర్వు పంచాయతీ శివారు నెహ్రునగర్ తండాకు వెళ్లాలంటే అటవీ మార్గంలో సుమారు 5 కిలోమీటర్లు వెళ్లాలి. అయితే నాగార్జునసాగర్ కుడి కాలువ పై బ్రిడ్జి నిర్మిస్తే ఆ ప్రాంతాన్ని చేరుకోవడం సులభమవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి పలుసార్లు శంకుస్థాపనలు చేశారు గానీ, పనులు మొదలుపెట్టలేదు. నిమ్మలసుబ్బయ్య కుంట తండాకు రోడ్డు సౌకర్యం లేదు. బస్సులు రావు, అత్యవసర సమయాల్లో నానా ఇబ్బందులు పడాలి. పంచాయతీ కేంద్రం గుమ్మనంపాడుకు అటవీ ప్రాంతం నుంచి 7 కిలోమీటర్లు దూరం నడవాలి. పంచాయతీలు : 23 జనాభా : 58 వేలు వలస కుటుంబాలు : 2 వేలు గిరిజన తండాలు : 30 సాగు భూమి : 12వేల హెక్టార్లు అటవీ ప్రాంతం : 33వేల చదరపు హెక్టార్లు -
వరి సాగుపై నీలి నీడలు
‘మెతుకు’ సీమలో భిన్నమైన పరిస్థితి గణనీయంగా పడిపోతున్న సాగు విస్తీర్ణం రెండేళ్లుగా మరింత దయనీయం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో... భూగర్భజలమట్టం పడిపోవటమే కారణం భారంగా మారి.. సాగుకు రైతన్న దూరం గజ్వేల్ఃవిస్తారమైన వరి సాగుతో ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించిన మెదక్ జిల్లాలో నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం పడిపోవటంతో బోరుబావుల ఆధారంగా సాగవుతున్న ‘వరి’ గణనీయంగా తగ్గుతున్నది. మరోవైపు రిజర్వాయర్లు, ఆనకట్టలు వెలవెలబోతుండగా...వాటి పరిధిలోని వేల ఎకరాల వరి పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. రెండేళ్లుగా మరింత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ‘వరి’పై నీలినీడలు కమ్ముకోడంతో దాని స్థానంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కథనం... జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కరిస్తే..ఏటా 5.5లక్షల హెక్టార్ల పంటలు సాగులోకి వస్తుంటాయి. గత పదేళ్ల క్రితం వరకు ఇందులో ‘వరి’దే అగ్రస్థానం. మిగితా పంటలన్నీ 60శాతం మాత్రమే ఉండేవి. ఇదే క్రమంలో మెదక్ జిల్లా ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించింది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం గణనీయంగా పడిపోతున్నది. ఫలితంగా బోరుబావులు వట్టిపోయి...‘వరి’ సాగు ముందుకు సాగటం లేదు. జిల్లాలో ఈసారి 82206 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ వరి ఇప్పటివరకు కేవలం సుమారుగా 10వేల హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చింది. సీజన్ ముగిసేవరకు మరో 20హెక్టార్లలోకి సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ భావిస్తున్నది. జూన్‌లో 125.6 మి.మీల వర్షపాతానికిగానూ 136.9మి.మీలు నమోదు కాగా...జూలై నెలలో ఇప్పటివరకు 183.6మి.మీల వర్షపాతానికి ఇప్పటివరకు 155.7మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుములు లాంటి ఆరుతడి పంటలు ఇప్పటివరకు 3లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. ‘వరి’ సాగు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. బోర్ల సాయంతో ఒకవేళ...వరి సాగు చేసినా..వర్షాభావం అలుముకుంటే నీరు తగ్గిపోయి పంటలు కళ్లముంగిటే ఎండిపోతుంటే విలవిల్లాడాలని గమనించిన రైతులు ఆ సాగును తగ్గించుకోవడానికి మరో కారణం. కొన్నేళ్లుగా జరుగుతున్నదిదే. గతేడాది సీజన్ మొత్తంలో 61512 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. 2014లోనూ ‘వరి’ 50వేల హెక్టార్లకు మించలేదు. అంతకుముందు కూడా అదే పరిస్థితి. ఘనపురం ఆనకట్ట వెలవెల... జిల్లాలో వరి సాగుకు ఘనపురం ఆనకట్ట ప్రసిద్ధి. 0.2 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ఆనకట్ట నిండితే....ఆనకట్టకు చెందిన మహబూబ్‌నహర్, ఫతేనహర్ కాల్వల సాయంతో ఖరీఫ్‌లో 30వేల హెక్టార్లకుపైగా వరి సాగులోకి వస్తుంది. నిజానికి 30వేల ఎకరాల వరి సాగుకు సీజన్ మొత్తానికి 2టీఎంసీల నీరు అవసరముంటుంది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే...ఆనకట్టకు వర్షం ద్వారా వరద నీరు వచ్చి వరి ఢోకా ఉండదు. కానీ రెండేళ్లుగా ఆనకట్ట వెలవెలబోతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ 3వేల ఎకరాలకు మించి ‘వరి’ సాగులోకి వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలోని పలు రిజర్వాయర్లకు చెందిన ఆయకట్టు సైతం వెలవెలబోతున్నది. ఇదీ ఉదాహరణలు... దౌల్తాబాద్ మండలం వీరానగర్‌కు చెందిన ఉప్పరి రాజయ్య గ్రామంలో తనకున్న సుమారు మూడెకరాల భూమిలో బోర్లు వేసినా నీరు రాకపోవడంతో దానిని ఇతరులకు కౌలుకు ఇచ్చాడు. ఈ క్రమంలో తన భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్ పట్టణానికి వచ్చి స్థిరపడ్డాడు. రాజయ్యకు భార్య రాజమణితో పాటు కొడుకులు కరుణాకర్(డిగ్రీ పూరై్త... ఓపెన్‌లో పీజీ) తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సహాయపడుతున్నాడు. రెండో కొడుకు మధు డిగ్రీ చదువుతున్నాడు. అయితే గత ఆరేళ్లుగా గజ్వేల్ పట్టణ శివారులో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా...వర్షాలు సరిగ కురియకపోవడంతో 3ఎకరాలలో మాత్రమే వరిసాగు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈసారి మాత్రం 4ఎకరాలలో మొక్కజొన్న, ఎకరన్నరలో పత్తి సాగు చేయగా ప్రస్తుతం వరిని మాత్రం ఎకరంన్నరకూ పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాడు.. వానలు సక్కగ పడతలేవ్వు...అందుకనే వరిని తగ్గించిన...అంటూ పేర్కొన్నాడు. - ఇదిలావుంటే జగదేవ్‌పూర్‌కు చెందిన రైతు చంద్రయ్యకు రెండు ఎకరాల భూమి ఉంది. బోరుబావి సాయంతో ఏటా వరి సాగు చేస్తున్నాడు. కానీ ఈసారి వానల్లేక బోరులో నీరు తగ్గింది. ఈ సారి ఎకరంలోనే వరి సాగు చేయడానికి ఆ రైతు సమాయత్తమవుతున్నాడు. రెండేళ్ల నుండి వరి పంట వల్ల నష్టలు వచ్చినాయ్. ఎకరానికి 20 వేల వరకు నష్టపోయిన అంటూ ఆ రైతు వాపోయాడు. వర్షం తగ్గితే...‘వరి’ని తగ్గించుకోవడమే మంచిది -జేడీఏ మాధవీ శ్రీలత గజ్వేల్ జిల్లాలో ఇప్పటివరకు వర్షపాతం తక్కువగానే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే..‘వరి’కి దూరంగా ఉండటమే మేలు. జిల్లాలో 24వేల హెక్టార్ల సాగుకు అవసరమైన వరి నారు సిద్ధంగా ఉంది. ఒకవేళ..వర్షాలు భారీగా కురిస్తే మాత్రం రైతులు వరిని సాగు చేస్తారు. లేని పక్షంలో తగ్గుతుందని భావిస్తున్నాం. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో భూగర్భజలమట్టం తగ్గి..జిల్లాలో ‘వరి’ సాగుకు ప్రతికూల పరిస్థితులేర్పడ్డాయి. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ గొల్లపల్లి : రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ అన్నారు. గొల్లపల్లిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి దశ, దిశ లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉంటే.. ఎవరి కోసం ఈ సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పోతుందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల పంపిణీ, డబుల్బెడ్రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ విద్య అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందన్నారు. -
కరువు జిల్లాను ఆదుకోండి
► ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ► కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ► ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తాం : ఐప్యాడ్ ప్రతినిధి వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయని ప్రపంచ బ్యాంకు ద్వారా జిల్లాను ఆదుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. డ్రాఫ్ట్ ఐఎఫ్ఏడీ(ఐప్యాడ్) ప్రతినిధులను కోరారు. శనివారం రాత్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ప్రపంచ బ్యాంకు తరఫున వచ్చిన ఐప్యాడ్ ప్రతినిధులతో ఎంపీ సమావేశమై జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఇటలీకి చెందిన ఐప్యాడ్ ప్రతినిధులు అండ్రీనెప్యూడి ఐసాటూర్ , ఆ సంస్థ ఇండియా ప్రతినిధులు విన్సెం ట్ డార్లాంగ్, సన్‌ప్రీత్ కౌర్.. గురు, శుక్రవారాల్లో ఓర్వకల్లు, ఆళ్లగడ్డ, డోన్ మండలాల్లో కరువు పరిస్థితులను, ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు తరపున ఈ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. శనివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంది. ముందుగా జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌ను ఆయన ఛాంబర్లో కలిశా రు. కలెక్టర్ జిల్లాలోని కరువు పరిస్థితులను ఐప్యాడ్ ప్రతినిధులకు వివరించారు. అనంతరం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. జిల్లాలో వరుసగా కరువు వస్తుండటం వల్ల రైతు లు తీవ్రమైన కష్టాల్లో మునిగి తేలుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్లలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. జిల్లా మ్యాపు ద్వారా కరువు ప్రాంతాలను చూపించా రు. ప్రపంచ బ్యాంకు ద్వారా కరువు జిల్లాకు చేయూతనివ్వాలని సూచించా రు. డ్రాఫ్ట్ ఐప్యాడ్ టీమ్ లీడర్ అండ్రి నెఫ్యూడి మాట్లాడుతూ తొలి విడతలో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మరో టీమ్ జూన్ నెల 5వ తేదీన జిల్లాకు వచ్చి కరువు పరిస్థితులను మరోసారి పరిశీలి స్తుందని తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాాశం జిల్లాలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ గణపతి, ఏడీఏ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు. ఐప్యాడ్ ప్రతినిధులు జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం తిరిగి వెళ్లనున్నారు. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
► తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కుమార్ డిమాండ్ కరీంనగర్ కల్చరల్ : వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయూరని, కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేద్రంలోని కెమిస్ట్ భవన్లో వైఎస్సార్సీపీ జిల్లాస్థారుు విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ... జిల్లాలోని 57 మండలాలకు గాను 40 మండలాల్లో కరువున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ 19 కరువు మండలాలనే ప్రకటించడం శోచనీయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడుతామన్నారు. ఇప్పటికైనా కరువుపై ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చడంలో విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హామీలుగానే మిగిలిపోయాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన సాగుతోందన్నారు. రైతులు కరువు బారినపడి కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగాఉద్యమాలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెగ్గెం రాజేష్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. జిల్లా మాజీ అధికార ప్రతినిధి వరాల శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలోని కరువు పరిస్థితులపై అవగాహన లేకపోవడం సిగ్గుచేటాన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో నాయకులు ముస్కు వెంకట్‌రెడ్డి, సందమల్ల నరేష్, ఎస్కే.జావీద్, సిరి రవి, పిండి ఎల్లారెడ్డి, వేణుమాధవరావు, బోగె పద్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కరువుపై చర్చకు అసెంబ్లీని సమావేశపర్చాలి
సీఎంకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రభుత్వపరంగా చేపట్టే సహాయ చర్యలపై చర్చిం చేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ఎద్దడి, పశుగ్రాసం కొర త నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నుంచి కరువు సహాయం కింద రూ.10వేల గ్రాంట్ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. పంట నష్టపోయి న రైతులకు తక్షణ సహాయగా ఎకరాకు రూ.10వేల కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా ఉల్లి క్వింటాల్ రూ.1500 చొప్పున, మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు క్వింటాల్‌కు రూ.12వేలు చొప్పున, చెరకు టన్నుకు రూ.1,000 చొప్పున ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కోరారు. -
‘కరువు’పై గవర్నర్ నివేదిక సరికాదు: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో తీవ్ర కరు వు పరిస్థితులుంటే ముమ్మరంగా కరువు సహాయక చర్యలను చేపడుతున్నట్లు కేం ద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజలకు కరువు సహాయం అందడం లేదని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేస్తుంటే నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. సోమవారం మఖ్దూం భవన్లో మాట్లాడుతూ... రాష్ర్టం నాలుగు వందల స్కూళ్లు మూసివేయాలని చూడడం సరికాదన్నారు. పాలేరు ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ రకరకాల వాగ్దానాలతో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డిందనీ.. అయితే సానుభూతి పనిచేయడంవల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయన్నారు. -
పదవి కాపాడుకునేందుకే సీఎం మంత్రి వర్గ విస్తరణ: యడ్యూరప్ప
సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి మంత్రిమండలి విస్తరణ చేపడుతున్నారని విపక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప విమర్శించారు. పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బృందంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిపిన కరువు పర్యటనలో వెలుగుచూసిన వివరాలతోకూడిన నివేదికను పార్టీ ముఖ్యనాయకులైన కే.ఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్ తదితరులతో కలిసి ఆయన గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ కరువు పరిస్థితుల నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణను వాయిదా వేస్తు వచ్చిన సీఎం సిద్ధరామయ్య హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఈనెల చివరన ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం సరికాదన్నారు. కేవలం పదవిని కాపాడుకోవడానికే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో నలభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కరువు ఏర్పడిన నేపథ్యంలో ప్రజల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యుల నిర్లక్ష్యధోరణే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సీఎం సిద్ధరామయ్య, ఆయన మంత్రిమండలి సభ్యులు అధికారుల బదిలీ విషయం పై దృష్టి సారించడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఇది ఒక పెద్ద ‘దందా’గా సాగుతోందని యడ్యూరప్ప ఘాటు వాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నారు. అందువల్లే తాము రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ప్రభుత్వ వైఫల్యం, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాల పై గవర్నర్‌కు పూర్తి స్థాని నివేదిక అందజేశామని యడ్యూరప్ప తెలిపారు. -
సీఎంకు వినతుల వెల్లువ
చెళ్లకెరె రూరల్ : కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు శుక్రవారం పట్టణంలోని నెహ్రూ సర్కిల్ వద్ద రైతు సంఘం పదాధికారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ప్రముఖుడు భూతయ్య మాట్లాడుతూ... తాలూకాలో ఎలాంటి శాశ్వత నీటి పారుదల సౌలభ్యాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చెరువులకు నీటిని అందించే భద్రా ఎత్తిపోతల పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండు చేశారు. 2015లో రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించలేదని, వెంటనే రైతుల పంటల బీమా మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకు అధికారులకు ఆదేశించాలని కోరారు. పురసభ మాజీ సభ్యుడు ఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... తాలూకాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని తాలూకాకు తాగునీటి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి తాలూకాలోని దొడ్డ ఉళ్లార్తి గ్రామానికి వెళ్లి గ్రామంలోని గోశాలను పరిశీలించారు. తాలూకాలోని హీరేహళ్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలి కార్మికుల సమస్యలను వినకుండా వెళుతున్న ముఖ్యమంత్రిపై ఉపాధి హామి కూలీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉపాధి హామీ కూలీ బకాయిలను అధికారులు చెల్లించలేదని కూలీ కార్మికుడు తిప్పేశ్ ముఖ్యమంత్రికి ఆరోపించారు. -
తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభం
► అడ్డుకున్న లచ్చన్నపాలెం గ్రామస్తులు ► పోలీసుల సాయంతో కొనసాగుతున్న పనులు లచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఎట్టకేలకు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను స్థానికులు మళ్లీ అడ్డుకోగా పోలీసుల రంగ ప్రవేశంతో కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నారు. మండలంలోని లచ్చన్నపాలెం సర్పానదిలో రూ.ఏడు కోట్ల వ్యయంతో భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించతలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని భావించిన గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఈ పనులను అడ్డుకున్నారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో మళ్లీ గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు గ్రామస్తులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. ఈ పనులను అడ్డుకుంటే కేసులు తప్పవని ఎస్ఐ రమేష్ హెచ్చరించడంతో చేసేదిలేక వారు అడ్డుతొలగారు. దీంతో పనులు యథావిధిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నదిలో ట్యాంకు నిర్మాణానికి తీసిన ప్రాంతంలో ఉన్న నీటిని తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ పర్యవేక్షిస్తున్నారు. కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటితోపాటు పాడిపరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లచ్చన్నపాలెం గ్రామస్తులు అనేక సార్లు పనులు అడ్డుగించారు. ఇక్కడ ప్రాజెక్టు వద్దని స్పష్టం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిసింది. -
కరువుపై కన్నెర్ర
► వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ► ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, ధర్నాలు ► ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం సాక్షి, విజయవాడ/ విజయవాడ (గాంధీనగర్) : కేవలం రెండేళ్లలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం చంద్రబాబుదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో సోమవారం ప్రదర్శన, ధర్నా చేపట్టారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి న్యూఇండియా హోటల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. న్యూఇండియా హోటల్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఖాళీ బిందెలతో మహిళలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయడంలో ఉన్న శ్రద్ధ కరువు సమస్యల నుంచి ప్రజలను బయటవేయడంలో లేదన్నారు. కరువు వల్ల డెల్టాలో దాదాపు 40 శాతం సాగు జరగలేదన్నారు. కరువు, వరదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ధారించిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తాలు కూడా రైతులకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం నుంచి హక్కులు సాధించుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సారథి విమర్శించారు. సిగ్గులేని ప్రభుత్వం... పోలవరం విషయంలో సాక్షాత్తూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని.. ‘మేం నమ్మం. దీనిలో అవినీతి జరిగింది. మీరిచ్చిన లెక్కల్ని మేం స్క్రూట్నీ చేయాలి’ అని కేంద్ర ప్రభుత్వం పక్కన పడేసిందంటే.. అంతకంటే సిగ్గుచేటైన విషయం ప్రజాస్వామ్య దేశంలో ఇంకొకటి ఉండదని సారథి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదు... కృష్ణానదిపై పక్క రాష్ట్రమైన తెలంగాణ అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం మాట కూడా మాట్లాడటం లేదన్నారు. దీనివల్ల కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తన విలాసాలు, ఆర్భాటాలు, బూటకపు ప్రచారాలు మాని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. డెప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, తంగిరాల రామిరెడ్డి, జానారెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా, నగర అధ్యక్షులు మాదు శివరామకృష్ణ, విశ్వనాథ రవి, వాణిజ్య విభాగం పట్టణ అధ్యక్షుడు రమేష్, కార్పొరేటర్లు ఆసీఫ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అంతటా వెల్లువెత్తిన నిరసనలు ►పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేతృత్వంలో ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. తోట్లవల్లూరు, పెదపారుపూడి, పమిడిముక్కల, మొవ్వ మండలాల్లోనూ నిరసనలు జరిగాయి. ►నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ చైర్పర్సన్ బసవా రేవతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ►గుడివాడ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ► తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి నేతృత్వంలో విస్సన్నపేట మండలంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ► జగ్గయ్యపేటలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సమన్వయకర్త సామినేని ఉదయభాను నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ► ఇబ్రహీంపట్నంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరంలో ధర్నాలు నిర్వహించారు. ► అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి మండలాల్లో జరిగిన నిరసన ర్యాలీలు, ధర్నాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, పార్టీ నేత కడవకొల్లు నరసింహారావు తదితరలు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి మట్టి కుండలను ధ్వంసం చేశారు. మంత్రి కామినేని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ► పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పెడన, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో ఆందోళనలు జరిగాయి. ► గన్నవరం నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జ్ఞానమణి పాల్గొన్నారు. ► మచిలీపట్నంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సలార్ దాదా నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ► కంచికచర్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహన్రావు, నందిగామ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొండితోక ఆరుణ్‌కుమార్ పాల్గొన్నారు. ► పెనమలూరులో పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ పాల్గొన్నారు. పేదల కష్టాలు పట్టని ప్రభుత్వం : జోగి రమేష్ ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో కరువుకాటకాలు రాజ్యమేలుతుంటే ప్రభుత్వ పాలకులు ధనార్జనే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ విమర్శించారు. పేదల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న నేతలకు వారి కష్టాలు మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీపుల్స్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్(పిఎఫ్ఐ) ఆధ్వర్యంలో ‘కరువు-నీరుపై’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 459 మండలాలకుగాను 232 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం దారుణమన్నారు. వాస్తవానికి జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం 368 మండలాలు కరువుకాటుతో అల్లాడుతున్నాయన్నారు. ప్రభుత్వం అన్ని చేస్తున్నుట్లుగా ప్రకటిస్తుందే తప్ప ఏమీ చేయటం లేదని, కరువు భారిన పడిన ప్రజలను ఆదుకునేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 1972 తర్వాత ఇంతటి కరువు చూడలేదని, ఆదాయ మార్గాలు లేక గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వలస వెళ్లుతున్నార న్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోకుండా ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. నీటి సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతి గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలని, పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలని, ఉపాధి హామీ పనులను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలన్నారు. వలసలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వడదెబ్బతో మరణించిన కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, మండల, గ్రామ స్థాయిల్లో కరువు సహాయక కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఎఫ్ఐ అధ్యక్షులు వి.యాదయ్య, ఉపాధ్యక్షులు జె.వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పార్ధపారథి, మాజీ ఎమ్మెల్యే నంధ్యాల నర్సింహారెడ్డి, డిజి.నర్సింహారావు, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు ,ఎం.శ్రీనివాస్, జి.నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
కరువును ఎదుర్కోవడంలో సర్కార్ విఫలం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తుమకూరు : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించారు. కరువును అధ్యయనం చేయడంలో భాగంగా ఆదివారం ఆయన తుమకూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర సరి హద్దు ప్రాంతమైన గౌడగెరె గ్రామాన్ని సందర్శించిన బీఎస్‌వై అక్కడి రైతులను, గ్రామస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేని పరిస్థితులు నెలకొన్నాయని, గ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతున్నాయన్నారు. అయినప్పటికీ సీఎం సిద్దరామయ్య కరువు సమస్యను పట్టించుకోకుండ కేవలం కేంద్రాన్ని తిట్టడంలోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కరువు నివారణ చర్యలకు కేంద్రం రాష్ట్రానికి రూ. 2575 కోట్లు కేటాయించిందన్నారు. అయితే ఆ నిధులు ప్రజలకు చేరవేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సొగడు శివణ్ణ, ఎమ్మెల్యే సురేష్‌గౌడ పాల్గొన్నారు. -
నేడు బళ్లారి జిల్లాకు సీఎం సిద్ధరామయ్య రాక
► కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు ► బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు సాక్షి, బళ్లారి : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి జిల్లాకు రానున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి, స్వయంగా కరువు ప్రాంతాలను పర్యటించేందుకు సీఎం సోమవారం బళ్లారి జిల్లాకు రానున్న నేపథ్యంలో బళ్లారి నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బళ్లారి తాలూకాలోని పలు గ్రామాల్లో సీఎం పర్యటించి, రైతులతో సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. దీంతో బళ్లారి జిల్లా అధికారులు సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బళ్లారి నగరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సీఎం ఉంటున్న సందర్భంగా ఆయా గ్రామాలతో బళ్లారి నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చే స్తున్నారు. జిల్లాలో కరువు పరిస్థితులను స్వయంగా తిలకించేందుకు సీఎం విచ్చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రైతులపై ఏమైనా వరాల జల్లు కురిస్తారా?లేదా? ఇలా వచ్చి అలా వెళ్లి పోతారా? అని రైతుల్లో సంశయం నెలకొంది. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికి ప్రభుత్వం తూతూమంత్రంగా స్పందించింది. జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కరువు నివారణ, రైతులను ఆదుకోవడంలో చొరవ చూపలేదు. అయితే సీఎం జిల్లాకు రానున్న సందర్భంగా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఏ మేరకు తమను ఆదుకుంటారన్నది రైతులు ఎదురు చూస్తున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటున్నారు. నేడు పలు రోడ్లలో ట్రాఫిక్ మళ్లింపు బళ్లారి టౌన్ : ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బళ్లారి నగరానికి రానున్నందున పలు రోడ్ల ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నగరంలోని కౌలుబజార్ రోడ్డు మొదటి గేటు, సుధా క్రాస్, రేడియో పార్కు, ఎస్పీ సర్కిల్, మోతీ సర్కిల్, ఇందిరా సర్కిల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగనుందని, ప్రజలు ఈ విషయం గమనించి సహకరించాలని తెలిపారు. -
సర్కారుపై సమరం
► ప్రభుత్వ చేతకానితనం వల్లే కరువు ► సర్కారు తీరుకు నిరసనగా నేడు ఖాళీ బిందెలతో ప్రదర్శన ► వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి వెల్లడి. విజయవాడ (మధురానగర్) : రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్లే నేడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. కరువు నివారణకు సర్కారు తీసుకున్న చర్యలు శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ఖాళీ బిందెలతో ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విజయవాడ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమను కోనసీమగా మారుస్తామంటూ ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉభయ గోదావరి, కృష్ణా తదితర ప్రాంతాలు ఎడారిగా మారుతున్నా పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఒక్కసారి కూడా కంటింజెన్సీ ప్లాన్ చేయకపోవటం, కనీసం మంత్రివర్గం చర్చించకపోవటం ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చులకనభావాన్ని తెలియజేస్తోందన్నారు. కరువు, తాగునీరు, సాగునీటి సమస్యలపై కనీసం చర్చించని ప్రభుత్వం ఇసుక, పారిశ్రామిక వేత్తలకు భూములు కట్టబెట్టే వ్యవహారాలపై మాత్రం పలుమార్లు చర్చించటం గమనార్హమన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి రాష్ట్రంలో నెలకొన్న కరువుపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ కలిసి రావాలి... రాష్ట్రంలో కరువు పరిస్థితులపై వైఎస్సార్సీపీ చేస్తున్న రాష్ట్రవ్యాప్త పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని సారథి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభించనున్నట్లు చెప్పారు. అర్బన్ తహశీల్దారు కార్యాలయానికి చేరుకున్న అనంతరం అక్కడ ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి... వైఎస్సార్సీపీ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రెండో తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామా దేవరాజు, తలశిల రఘురామ్, కార్పొరేటర్లు కె.కాశి, వీరమాచినేని లలిత, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణ, నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి, యువజన విభాగం నాయకుడు కాజ రాజ్‌కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కాలే పుల్లారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాస్, నగర వాణిజ్య విభాగం క న్వీనర్ కొణిజేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంబలి కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ముషీరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నదని, వడదెబ్బతో 400మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం రాంనగర్ మీ-సేవా సమీపంలో హరేకృష్ణా మూవ్మెంట్, భోజనామృత్, దత్తాత్రేయ చొరవతో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశుగ్రాసం లేక పశువులు కబేళాలకు తరలిపోతున్నాయని, వాటిని రక్షించేందుకు ప్రభుత్వం నీటి తొట్టిలను కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కరువు నివారణకు రూ.385కోట్లు విడుదల చేసిందని రెండవ విడతగా మరో రూ.350కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. మంత్రులు జిల్లాల్లో పర్యటించి రైతలకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో హరేకృష్ణ మూమెంట్ ఉపాధ్యక్షులు మాధవదాస, ఆపరేషన్స్ ఇన్చార్జి కౌంతయ్య దాస, బీజేపీ నాయకులు మాధవ్, విన్ను ముదిరాజ్, శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఓం ప్రకాష్, మోహన్, రమేష్, గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
మీ నాన్న లేని జీవితం మనకొద్దమ్మా
► భర్త ఆత్మహత్య తాళలేక ... ► తన ఇద్దరు కుమార్తెలపై కిరోసిన్ పోసి...ఓ తల్లి అఘాయిత్యం ► చామరాజనగర్ జిల్లాలో ► రైతు కుటుంబంలో విషాదం ► ఉసురు తీసిన అప్పులు తరచూ సరదాగా గడచిపోయే ఆదివారమే వారి జీవితాల్లో చివరి రోజు అని భావించి ఉండరు. తన ఇద్దరి పిల్లలకు ఉదయమే పాలు తాపి రాత్రి పొలం కాపలాకు వెళ్లిన భర్తకు టీ తీసుకుని బయలుదేరిన ఆ మహిళకు భర్త నిర్జీవంగా కనిపించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ ఇల్లాలు ఇంటికి చేరుకుని తన ఇద్దరి చిన్నారులపై కిరోసిన్ పోసి తాను పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరు (బనశంకరి) : అన్నదాత ఆత్మహత్యలు కన్నడ నాట సర్వసాధారణమైపోతున్నాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చామరాజనగర జిల్లాలోని హొన్నళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు... హొన్నళ్లి గ్రామానికి చెందిన సిద్దప్ప కుమారుడు రైతు శివనప్ప (38) శనివారం రాత్రి తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం భర్త కోసం పొలం వద్దకు టీ తీసుకు వచ్చిన శివనప్ప భార్య కన్యా (35) భర్త ఉరి వేసుకుని ఉండటం చూసి నిర్ఘంతపోయింది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఆమె ఇంటికి చేరుకుని కిరోసిన్ తీసుకుని తన ఇద్దరు పిల్లలు ప్రీతి (6), ప్రియ (4)పై పోసి అనంతరం తనపై కూడా పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే కాలిపోయారు. మృతుడు శివనప్ప సహకార బ్యాంక్‌లో రుణంతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసినట్లు తెలిసింది. అంతేగాక ఇటీవల పొలంలో బోరు వేసిన నీరు లభించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, కుటుంబ బాధ్యతలు తలుచుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనలో గ్రామంలో విషాదం నెలకొంది. బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ స్తంభానికి కట్టేశాడు!
వికారాబాద్‌లో రైతన్నపై పశువుల వ్యాపారి దాష్టీకం వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో రూ.10 వేల బాకీ ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఓ రైతును విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ధన్నారం గ్రామానికి చెందిన వడ్డే యాదయ్య (38) రెండేళ్ల కిందట ధారూరు మండల కేంద్రానికి చెందిన ఓ పశువుల వ్యాపారి వద్ద కాడెద్దులు కొనుగోలు చేశాడు. వీటి ధర రూ. 27 వేలు. ఇందులో రూ. 17 వేలు రెండు విడతల్లో తీర్చాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన రూ.10 వేలు చెల్లించలేకపోయాడు. ఆదివారం మిత్రుడి కోరిక మేరకు వికారాబాద్ పశువుల సంతకు వచ్చిన యాదయ్య.. సదరు వ్యాపారికి తారసపడ్డాడు. అంతే.. మరో ఆలోచన లేకుండా రైతును తాడుతో అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ‘రెండేళ్లుగా.. నీ కోసమే ఎదురు చూస్తున్నా.. అప్పు తీర్చమని మీ ఇంటికి వస్తే.. ఇబ్బందుల పాల్జేశావు. నిన్ను ఎవరు విడిపిస్తారో చూస్తా..’ అంటూ వ్యాపారి హెచ్చరించాడు. కరువు పరిస్థితుల్లో తీసుకున్న అప్పు తీర్చులేకపోయానని, పనిచేసి అయినా.. అప్పు తీరుస్తానని, కొంత సమయం కావాలని వ్యాపారిని రైతు అభ్యర్థించాడు. కానీ, వ్యాపారి కనికరిం చకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. పోలీసులు విచారణ చేపట్టారు. -
సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
ఆదిలాబాద్ అర్బన్ : కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని 2016-17 సెలవుల్లోనూ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో విద్యా శాఖఅధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొని మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి పదో తరగతి వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ డీఈవో శ్యాం పాల్గొన్నారు. -
మొక్కుబడి భోజనం!
► విద్యార్థుల కోసంఏజెన్సీల నిరీక్షణ ► తొలిరోజు 1,01,082 మంది మాత్రమే.. ► చాలాచోట్ల కనిపించని పర్యవేక్షకులు ► ఉపాధ్యాయులు చొరవచూపితేనే సత్ఫలితం మహబూబ్‌నగర్ విద్యావిభాగం: కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో గురువారం ప్రారంభమైన మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. జిల్లాలో 4.37లక్షమంది విద్యార్థులకు గానూ వేసవి సెలవుల్లో కనీసం 2.31లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు హాజరవుతారని ఎంఈఓల రిపోర్టు ప్రకారం జిల్లా ఉన్నతాధికారులు అంచనావేశారు. కానీ తొలిరోజు 1.01లక్షల మంది విద్యార్థులు మాత్రమే వచ్చారు. జిల్లా కేంద్రంలోని పలుపాఠశాలలను పరిశీలించగా చాలా వాటిలో విద్యార్థులు కనిపించలేదు. వంట ఏజెన్సీల మహిళలు వారికోసం వేచిచూడడం కనిపించింది. పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా పాఠశాలలకు రాలేదు. బేసిక్ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ వారు వచ్చినప్పటికీ విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో వారు ఎదురుచూసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు కూడా అక్కడికి రాలేదు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు రావడంతో వారికి భోజనాలు పెట్టించి పంపించారు. పోలీస్‌లైన్ ప్రాథమిక, ఉన్నతపాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ కనిపించలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్నత సంకల్పంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనంపై కొంత నిరాసక్తి చూపినట్లు కనిపించింది. గ్రామాల్లో చిన్నారులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న ఉపాధ్యాయులు సైతం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే భోజనానికి సార్థకత చేకూరుతుందని పలువురు కోరుతున్నారు. పారదర్శకంగా మధ్యాహ్న భోజనం మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం అమలుచేస్తున్న వేసవిలో మధ్యాహ్న భోజనం పథకాన్ని జిల్లాలో మరింత పారదర్శకంగా అమలుచేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి విద్యాశాఖ అధికారులను గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 21 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. పథకం అమలుతీరును హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలను ఉదయం 8.30 నుంచి 10.30 వరకు నిర్వహించాలని, భోజనం చేసిన తరువాతే వారికి ఇంటికి పంపించాలని కోరారు. మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాకమిటీలు, సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, ఇతర శాఖల సిబ్బంది భాగస్వాములు కావాలని సూచించారు. వేసవి సెలవుల్లో వంట ఏజెన్సీలను నియమించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు డీఈఓకు పంపినట్లు ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల వరకు పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను ఎస్ఎంఎస్ ద్వారా డీఈఓకు పంపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, విద్యార్థుల హాజరురిజిస్టర్లను నిర్వహించడమే కాకుండా కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు పాఠశాలలు సందర్శించిన సమయాల్లో సంతకాలను తీసుకోవాలని ఆదేశించారు. -
నీటి సమస్య రానివ్వొద్దు
► ఎన్ని నిధులైనా ఖర్చుచేసేందుకు ప్రభుత్వం సిద్ధం ► పెండింగ్ తాగునీటి పథకాల ప్రతిపాదనలు రెండు రోజుల్లో సమర్పించాలి ► అధికారులతో సమీక్షించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్ న్యూటౌన్: తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం జిల్లాకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, తాగునీటి పథకాలకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు రెండురోజుల్లో సమర్పించాలని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో తాగునీరు, ఉపాధిహామీ, పశుగ్రాసం, హరితహారం తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. తాగునీటి కొరత లేకుండా నివారించేందుకు ప్రభుత్వం సీఆర్ఎఫ్ గ్రాంటు కింద రూ.6.6 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరుచేసిందన్నారు. నాన్ సీఆర్ఎఫ్ కింద రూ.47.8కోట్లు మంజూరుచేయగా ఇప్పటివరకు రూ.15.9 కోట్లు మాత్రమే ఖర్చుచేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండురోజుల్లో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గ్రామాల్లో అవసరాన్ని బట్టి ట్యాంకర్ల ధరలు రీషెడ్యూల్ చేయాలని, రవాణా ద్వారా ఎక్కువ నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సరఫరా చేసిన ట్రిప్పుల వివరాలు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు మెసేజ్ పంపించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు రామన్‌పాడు తాగునీటిపై ఆధారపడి ఉన్నాయని, త్వరితగతిన నీటిని తరలించే చర్యలు వేగవంతం చేయాలని జేసీని కోరారు. ఉపాధి పనిదినాలను పూర్తిచేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ జములమ్మ రిజర్వాయర్ ద్వారా గద్వాలకు తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని, ట్యాంకర్లకు ఇచ్చే ధరలను పెంచాలన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీటికోసం మంజూరైన నిధులను ఈ వేసవిలో ఖర్చుచేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో తాగునీటి వనరులు లేనందున ఎక్కువ గ్రామాల్లో సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో జేసీ రాంకిషన్, గువ్వల బాల్‌రాజ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పద్మనాభం, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ సుధాకర్ పాల్గొన్నారు. -
ఆయన అలా మాట్లాడటం సరికాదు
బెంగళూరు: కరువు పరిస్థితులు పెద్దగా లేవని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం అక్కరలేదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సిద్ధరామయ్య పేర్కొనడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు విషయంలో కూడా రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఎప్పుడూ లేనంతగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇక్కడ కరువు పరిస్థితులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిపుణులను కర్ణాటకకు పంపించి క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించిందన్నారు. అధికారుల నివేదికను అనుసరించి గతంలో ఏ ప్రభుత్వం మంజూరు చేయని నిధులను కరువు నివారణ పనుల నిమిత్తం రాష్ట్రానికి కేటాయించిందని యడ్యూరప్ప ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరువు ఉందనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పర్యటించలేదా? అని యడ్డీ ప్రశ్నించారు. కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంతో నివారణ పనుల కోసం తమ పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నామన్నారు. -
సమస్యలు వినిపించేనా?
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం ► ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా? ► కరువు కోరల్లో పాలమూరు ► గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ► గ్రాసం లేక కబేళాలకు పశువులు ► విపక్షసభ్యులు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది.. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మేత కోసం మూగజీవాలు అల్లాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈ ఏడాది సరైన వర్షాల్లేక కృష్ణా, తుంగభద్ర నదులు ఎండిపోయాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించింది. కరువు సహాయకచర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు.. ఇలా అనేక సమస్యలతో జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమస్యల పరిష్కారం కోసం ఏ మేరకు దిశానిర్దేశం చేస్తుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కరువుపై నిలదీయనున్న ప్రతిపక్షాలు జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా అలుముకున్నాయని ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యులు చెబుతున్నారు. కరువుపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలకపక్షాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మికాంత్‌రెడ్డి చెప్పారు. జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన ఏ తీర్మానాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆరోపిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో అధికారులు ప్రజాసమస్యలపై స్పందించడం లేదని ఈ అంశంపై సభలో చర్చించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎంపీపీ కార్యాలయాల్లో జెడ్పీటీలకు ప్రత్యేక చాంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జెడ్పీ సర్వసభ్య సమావేశాలు తీర్మానించినా ఎక్కడా అమలుకాలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గత సమావేశాల తీరిది.. ప్రస్తుత జెడ్పీ పాలకమండలి 2014 జులై 5న కొలువుదీరింది. ఇప్పటివరకు 8సార్లు సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈనెల 20న మరోసారి సమావేశం జరగనుంది. గతేడాది ఏప్రిల్ 7న జరిగిన సమావేశంలో ప్రొటోకాల్ వివాదం, జూరాల- పాకాల పథకానికి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు అధికారులు తమను ఆహ్వానించడం లేదని అధికార, ప్రతిపక్షాల జెడ్పీటీసీలు సభ్యులు వాకౌట్ చేశారు. తమకు ప్రత్యేకగదిని కేటాయించాలని ఎంపీపీలు డిమాండ్ చేస్తున్నారు. గత మే 23వ తేదీన ప్రత్యేకంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సారి కేవలం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎలా నిర్వహించాలనే అంశంపైనే చర్చించారు. సెప్టెంబర్ 4న జరిగిన సమావేశం రసాభాసగా మారింది. జనవరి 4న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, కాంగ్రెస్ ఎంపీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమావేశంలో గొడవతోనే సరిపోయింది. జెడ్పీ నిధులను ఎమ్మెల్యేలకు కేటాయించొద్దని జెడ్పీటీసీలు, ఆ నిధులను తమకు కేటాయించాలని ఎంపీపీలు.. ఇలా అనే డిమాండ్లతో సభ గందరగోళంగా మారింది. ఆర్డబ్ల్యూఎస్, డ్వామ్యాపై చర్చించే అవకాశం నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా తాగునీటి సరఫరా, ఉపాధిహామీ పథకాలపైనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత సమావేశంలో కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అప్పట్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరుచేసిందని మంత్రి ప్రకటించారు. ఆ చర్యలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎజెండాలు సమర్పించని 19 శాఖలు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 19శాఖలు తమ శాఖలో చేపట్టిన పూర్తి వివరాలను ఎజెండాలో సమర్పించలేదు. మొత్తం 64 శాఖలకు గాను 19శాఖలు ఇవ్వలేదు. మత్స్యశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, సివిల్‌సప్లయి, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్‌శాఖ వారు తమ ప్రగతి సమాచారాన్ని జెడ్పీ ఎజెండాకు సమర్పించలేదు. నివేదిక సమర్పించని శాఖలను ఎందుకు ప్రశ్నించడం లేదని జెడ్పీటీసీలు నిలదీస్తున్నారు. ఈ సారైన నివేదికలను సమర్పించని శాఖలను ప్రశ్నిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది.