అధిక ఆదాయం కోసమే వలస పోతున్నారు..
‘జిల్లాలో నిజంగా ప్రజలెవరూ వలస పోవడం లేదు. అధికంగా డబ్బు సంపాదించాలని బెంగళూరుకు వెళ్తున్నారు.. వలసపోయి ప్రతి ఒక్కరూ కొత్త మెటారు సైకిళ్లు తెచ్చుకున్నారు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయచౌదరి, బీ.కే పార్థసారథి. జిల్లా కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన రాష్ట్ర డెప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప నిర్వహించిన సమీక్షలోఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఖంగుతిన్నారు.
- మోటార్ బైక్‌లు కొంటున్నారు...
- టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం, బీకే వివాదాస్పద వ్యాఖ్యలు
- సమర్థించిన మంత్రి సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి
- పించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వ,చాంద్‌బాషా
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప శుక్రవారం డ్వామా హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంభవిస్తున్న వ రుస కరువులను రాష్ట్రం, కేంద్రం దృష్టికి తీసుకుపోయి ప్రజలను, రైతులను ఆదుకోవాల్సిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు కరువును తెలుసుకునేందుకు వచ్చిన డెప్యూటీ సీఎం ఎదుట ఈ విధంగా వ్యాఖ్యానించడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. సమావేశంలో డ్వామా పీడీ నాగభూషణం మాట్లాడుతూ మహాత్మగాంధీ జా తీయ ఉపాధిహామీ పథకం కింద రోజూ 1.20 వేల మంది పై చిలుకు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
ఇప్పటి నుంచి 150 రోజులు పనిదినాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతిచిందని వివరించారు. ఈ అంశంపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కలుగజేసుకొని ఉపాధిహామీ పథకం అంతా బాగా అమలవుతుండగా ప్రజలు ఎందుకు వలస పోతున్నారని ప్రశ్నిం చారు. వలసలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కలుగుజేసుకుంటూ జిల్లాలో ఎవరూ వాస్తవంగా వలస పోవడం లేదన్నార. కేవలం అదనంగా డబ్బు సంపాదనకే వలస పోతున్నారని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కలుగజేసుకొని అదనంగా ఆదాయం కోసమే ప్రజలు వలసపోతున్నది ముమ్మాటికి వాస్తవమేనన్నారు. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 150 కుటుంబాలు వలస పోయాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొత్త మోటారు సైకిళ్లు(ద్విచక్రవాహనాలు) తెచ్చుకున్నారని చెప్పారు.
ఎవరైనా తన నియోజకవర్గానికి వస్తే రుజువు చేస్తానన్నారు. వలసలను ఆపడం ఎవరి సాధ్యం కాదన్నారు. వీరికి మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వంత పాడారు. మంత్రి సునీత మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్నారని ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. వరదాపురం సూరి మాట్లాడుతూ... గత పదేళ్ళలో మీ ప్రభుత్వం(కాంగ్రెస్‌పార్టీని అంట కడుతూ) ఏనాడైనా వలస గురించి పట్టించుకుందా? మేము అధికారం లోకి వచ్చాక కూలీలకు 150 రోజలు చేశాం. మీరు వలస గురించి మాకేం చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎదురుదాడికి దిగారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల వాఖ్యాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్‌చాంద్‌బాషాలు తీవ్రంగా ఆక్షేపించారు.
‘ రండి జిల్లాలోని మా రు మూల గ్రామాలకు వెళ్దాం. కుటుంబంలోని పెద్దలు వలస పోతే ఆ ఇంటికి కాపలా ఉన్న ముసలివాళ్లు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తినేందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.