Review Conference
-
వైరస్‌పై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్–19) బారిన పడిన వారిని ఏకాంతంగా ఉంచేందుకు తగిన ప్రాంతాలను గుర్తించడంతోపాటు, వ్యాధి మరింత తీవ్రతరమైతే అన్ని అత్యవసర సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై శనివారం ప్రధాని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, ప్రజలు పెద్ద ఎత్తున ఒకచోట గుమికూడే పరిస్థితులను నివారించాలని అధికారులకు సూచించారు. ‘అన్ని విభాగాల వారూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలి. అవగాహన పెంచే ప్రయత్నాలు చేపట్టాలి. ముందు జాగ్రత్త చర్యలనూ వివరించాలి’ అని ప్రధాని కోరినట్లు అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది. కోవిడ్ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న పద్ధతుల్లో మేలైనవి ఎంచుకుని అమలు చేయా లని ప్రధాని కోరారని ప్రకటనలో పేర్కొన్నారు. వైరస్ టెస్టింగ్‌కు 52 కేంద్రాలు కరోనా వైరస్ పరీక్షలు జరిపేందుకు దేశవ్యాప్తంగా 52 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రక్త నమూనాల సేకరణ విషయంలో సహకరించేందుకు మరో 57 పరిశోధనశాలలను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఇప్పటివరకూ 34 మంది కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ కాగా, వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు ఉన్న విషయం తెలిసిందే. మరో 29 వేల మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని స్విమ్స్, విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, అనంతపురములోని జీఎంసీలు ఉన్నాయి. అలాగే బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, మైసూర్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హాసన్, శివమొగ్గ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లలో పరీక్షలు జరుగుతాయి. కాలర్ టోన్లతో కరోనా వైరస్ అవగాహన పలు టెలికం సర్వీసుల్లో రింగ్టోన్లకు బదులు వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలుకొని జబ్బు లక్షణాలను వివరించే కాలర్ టోన్లు వినిపిస్తున్నాయి. కేంద్రం టెలికం ఆపరేటర్లకు ఈ ఆడియో క్లిప్‌ను అందించగా వాటిని తాము కాలర్ ట్యూన్ల కోసం డబ్బు చెల్లించే వారికి మినహా మిగిలిన వారందరికీ అందిస్తున్నట్లు ఒక టెలికం ఆపరేటర్ తెలిపారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగాయి. పేటీఎం, ట్విట్టర్ వంటి కంపెనీలు ఉద్యోగులను ఇంట్లో నుంచే పనిచేయాలని ఆప్పటికే ఆదేశాలు జారీ చేయగా, రిలయన్స్ జియో తమ ఆఫీసుల్లో అటెండెన్స్‌కు వాడే బయోమెట్రిక్ యంత్రాలను పక్కనబెట్టింది. ఓలా తమ డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లను అందించడం మొదలుపెట్టింది. భారత్‌లో మరో మూడు దేశంలో మరో ముగ్గురు కోవిడ్– 19 బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్– 19 బారిన పడిన వీరిలో ఇద్దరు లడాఖ్‌కు చెందిన వారు కాగా.. ఇటీవలే ఇరాన్‌కు వెళ్లారని, మిగిలిన ఒక వ్యక్తి తమిళనాడుకు చెందిన వారని ఒమన్‌ను సందర్శించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో వివరించారు. దీంతో భారత్‌లో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 34కు చేరుకున్నట్లు అయింది. తాజాగా కోవిడ్ వైరస్ బారిన పడ్డ ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. -
అధిక ఆదాయం కోసమే వలస పోతున్నారు..
‘జిల్లాలో నిజంగా ప్రజలెవరూ వలస పోవడం లేదు. అధికంగా డబ్బు సంపాదించాలని బెంగళూరుకు వెళ్తున్నారు.. వలసపోయి ప్రతి ఒక్కరూ కొత్త మెటారు సైకిళ్లు తెచ్చుకున్నారు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయచౌదరి, బీ.కే పార్థసారథి. జిల్లా కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన రాష్ట్ర డెప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప నిర్వహించిన సమీక్షలోఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఖంగుతిన్నారు. - మోటార్ బైక్‌లు కొంటున్నారు... - టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నం, బీకే వివాదాస్పద వ్యాఖ్యలు - సమర్థించిన మంత్రి సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి - పించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వ,చాంద్‌బాషా అనంతపురం సెంట్రల్ : జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప శుక్రవారం డ్వామా హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంభవిస్తున్న వ రుస కరువులను రాష్ట్రం, కేంద్రం దృష్టికి తీసుకుపోయి ప్రజలను, రైతులను ఆదుకోవాల్సిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు కరువును తెలుసుకునేందుకు వచ్చిన డెప్యూటీ సీఎం ఎదుట ఈ విధంగా వ్యాఖ్యానించడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. సమావేశంలో డ్వామా పీడీ నాగభూషణం మాట్లాడుతూ మహాత్మగాంధీ జా తీయ ఉపాధిహామీ పథకం కింద రోజూ 1.20 వేల మంది పై చిలుకు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి 150 రోజులు పనిదినాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతిచిందని వివరించారు. ఈ అంశంపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కలుగజేసుకొని ఉపాధిహామీ పథకం అంతా బాగా అమలవుతుండగా ప్రజలు ఎందుకు వలస పోతున్నారని ప్రశ్నిం చారు. వలసలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కలుగుజేసుకుంటూ జిల్లాలో ఎవరూ వాస్తవంగా వలస పోవడం లేదన్నార. కేవలం అదనంగా డబ్బు సంపాదనకే వలస పోతున్నారని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కలుగజేసుకొని అదనంగా ఆదాయం కోసమే ప్రజలు వలసపోతున్నది ముమ్మాటికి వాస్తవమేనన్నారు. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 150 కుటుంబాలు వలస పోయాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొత్త మోటారు సైకిళ్లు(ద్విచక్రవాహనాలు) తెచ్చుకున్నారని చెప్పారు. ఎవరైనా తన నియోజకవర్గానికి వస్తే రుజువు చేస్తానన్నారు. వలసలను ఆపడం ఎవరి సాధ్యం కాదన్నారు. వీరికి మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వంత పాడారు. మంత్రి సునీత మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్నారని ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. వరదాపురం సూరి మాట్లాడుతూ... గత పదేళ్ళలో మీ ప్రభుత్వం(కాంగ్రెస్‌పార్టీని అంట కడుతూ) ఏనాడైనా వలస గురించి పట్టించుకుందా? మేము అధికారం లోకి వచ్చాక కూలీలకు 150 రోజలు చేశాం. మీరు వలస గురించి మాకేం చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎదురుదాడికి దిగారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల వాఖ్యాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్చాంద్బాషాలు తీవ్రంగా ఆక్షేపించారు. ‘ రండి జిల్లాలోని మా రు మూల గ్రామాలకు వెళ్దాం. కుటుంబంలోని పెద్దలు వలస పోతే ఆ ఇంటికి కాపలా ఉన్న ముసలివాళ్లు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తినేందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏసీబీ దాడితో కలకలం
కమిషనర్ల సమావేశానికి వచ్చి ఏసీబీ వలలో చిక్కిన మునిసిపల్ ఆర్డీ ఉదయం నుంచి మాటువేసి దాడిచేసిన ఏసీబీ అధికారులు ఆర్డీ అవినీతిపై పలు ఫిర్యాదులు వచ్చాయంటున్న అధికారులు తిరువూరు : జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం తిరువూరు వచ్చిన రాజమండ్రి ప్రాంతీయ సంచాలకుడు (ఆర్డీ) రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకోవడం కలకలం సృష్టించింది. తనను లంచం కోసం ఆర్డీ వేధిస్తున్నారని పెడన మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న మత్తి వినోద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఉదయం నుంచి తిరువూరు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మాటువేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలోని ఓ గదిలో వినోద్‌కుమార్ నుంచి తన క్యాంప్ క్లర్కు నాగరాజు ద్వారా ఆర్డీ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు. అయితే, రాజేంద్రప్రసాద్, నాగరాజు కొద్దిసేపు ప్రతిఘటించారు. తమదైన శైలిలో ప్రశ్నించి ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఇద్దరి నుంచి నిజాలు రాబట్టారు. గంటసేపు నిందితులను విచారించిన అనంతరం వారి వద్ద ఉన్న నగదును రసాయన పరీక్షలు చేసి అది లంచం సొమ్మేనని నిర్ధారించారు. అనంతరం మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేశారు. మరికొద్ది సమయం వేచివుంటే రాజేంద్రప్రసాద్‌కు లంచం ఇచ్చేందుకు కొందరు అధికారులు సైతం క్యూ కట్టేవారని ఏసీబీ అధికారులు భావిం చగా, ఆర్డీ అనుచరులు కొందరు చేసిన హంగామాతో పలువురు చల్లగా జారుకున్నారు. వేధింపులతో విసిగే ఫిర్యాదు ఆర్డీ రాజేంద్రప్రసాద్ తనను పదేళ్లుగా వేధిస్తుండటంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని పెడన పురపాలక సంఘ జూనియర్ అసిస్టెంట్ మత్తి వినోద్‌కుమార్ విలేకరులకు తెలిపారు. 2004లో తాను ఏలూరు మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు అనారోగ్యంతో 20 నెలలు సెలవు పెట్టానని, సెలవుపత్రాన్ని మాయంచేసిన ఆర్డీ మెమో జారీచేశారని, తదుపరి తాను రాజమండ్రిలో పనిచేస్తుండగా అదే కారణంపై చార్జిమెమో ఇస్తానంటూ తరచూ వేధించారని ఆరోపించారు. గతంలో తనను రూ.5వేల లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీబీకి ఫిర్యాదు చేయగా, పోలీసులు, ప్రయివేటు వ్యక్తులతో కలిసి రాజేంద్రప్రసాద్ బెదిరించారని పేర్కొన్నారు. 2014లో ఆర్డీ అనుచరులు రామచంద్రరావు, జేమ్స్ ఫిర్యాదు ఉపసంహరించుకోవాలంటూ తనపై దాడిచేయగా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేక కోర్టులో ప్రయివేటు ఫిర్యాదు దాఖలు చేశానని తెలిపారు. దళితుడినైన తనపై కక్షసాధింపు చర్యగా ఆరు ఇంక్రిమెంట్లు నిలిపివేశారని, పన్నెండేళ్లుగా ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. తనతోపాటు ఉద్యోగాల్లో చేరిన వారు కమిషనర్లుగా ప్రమోషన్లు పొందినా, తాను జూనియర్ అసిస్టెంట్ స్థాయిలోనే ఉండటానికి ఆర్డీ కక్షసాధింపు వైఖరే కారణమని వాపోయారు. లంచం ఇవ్వకపోతే ఉద్యోగం ఊడదీయిస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించానని తెలిపారు. ఆర్డీ బాధితులు అనేకమంది ఉన్నారని పేర్కొన్నారు. -
వాటర్ చానల్ వెంట పెట్రోలింగ్
నీటి చౌర్యానికి చెక్ - సమీక్షా సమావేశంలో నిర్ణయం - బాధ్యతల్లో పాలుపంచుకోనున్న మూడు విభాగాల సిబ్బంది గుర్గావ్ : నీటి చౌర్యం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం తగు జాగ్రత్త చర్యలు తీసుకుం టోంది. ఇందులోభాగంగా గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ) వెంబడి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించనుంది. డిప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థి సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా గడచిన మూడు రోజుల వ్యవధిలో గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ)లో నీరు 50 శాతం మేర తగ్గింది, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే నిల్వలు ఘోరంగా తగ్గిపోతాయని సమావేశం అనంతరం విడుదలచేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందువల్ల నగరవాసులు నానాయాతనకు గురవ్వాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతోపాటు జీడబ్ల్యూసీ, హుడా, సాగునీటి శాఖల సిబ్బంది కలిసి సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తగు రీతిలో వర్షాలు కురవకపోవడంతో జీడబ్ల్యూసీలో నీటిని రైతులు చౌర్యం చేస్తున్నట్టు తాము అనుమానిస్తున్నామన్నా రు. కాగా జీడబ్ల్యూసీ... సోనేపట్ వద్ద మొదలై రోహ్తక్, ఝజ్జర్ జిల్లాల మీదుగా నగరానికి చేరుకుంటుంది. కాగా పెట్రోలింగ్ విషయమై ఝజ్జర్ డీఎస్పీ అనూప్‌సింగ్ మాట్లాడుతూ తమ జిల్లాలో జీడబ్ల్యూసీ వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పోలీసు, హుడా, సాగునీటి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా గుర్గావ్ నగరానికి ప్రతి రోజూ 140 క్యూసెక్కుల నీరు అవసరమవుతుంది. పంపింగ్ స్టేషన్ నేడు ప్రారంభం నగర పరిధిలోని 42 అనధికార కాలనీవాసులకు నీటి కొరత కష్టాల నుంచి విముక్తి కలగనుంది. కిరారి భూగర్భ జలాశయంకమ్ పంపింగ్ స్టేషన్‌ను ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) శనివారం ప్రారంభించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారి శుధ్య విభాగం మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ప్రారంభించనున్నారు. తన బృహత్తర ప్రణాళికలో భాగం గా డీజేబీ దీనిని నిర్మించింది. ఈ పంపింగ్ స్టేషన్ అందుబాటులోకివ స్తే కిరారి శాసనసభా నియోజకవర్గం పరిధిలోని 42 అనధికార కాలనీల్లో నివసించే దాదాపు 1.25 లక్షలమందికి ఉపయుక్తమవుతుంది. -
నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని పీఎల్ఆర్ గ్రాండ్ హోటల్లో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగే సమావేశానికి పరిశీలకులుగా నియమితులైన జ్యోతులనెహ్రూ, బీ.గురునాథరెడ్డి, ఎం.శంకరనారాయణ హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెలిచిన వారు, ఓడిన అభ్యర్థులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు (గెలిచిన వారు, ఓడిన వారు) సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.