ఏసీబీ దాడితో కలకలం
కమిషనర్ల సమావేశానికి వచ్చి ఏసీబీ వలలో చిక్కిన మునిసిపల్ ఆర్డీ
ఉదయం నుంచి మాటువేసి దాడిచేసిన ఏసీబీ అధికారులు
ఆర్డీ అవినీతిపై పలు ఫిర్యాదులు వచ్చాయంటున్న అధికారులు
తిరువూరు : జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం తిరువూరు వచ్చిన రాజమండ్రి ప్రాంతీయ సంచాలకుడు (ఆర్డీ) రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకోవడం కలకలం సృష్టించింది. తనను లంచం కోసం ఆర్డీ వేధిస్తున్నారని పెడన మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న మత్తి వినోద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఉదయం నుంచి తిరువూరు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మాటువేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలోని ఓ గదిలో వినోద్‌కుమార్ నుంచి తన క్యాంప్ క్లర్కు నాగరాజు ద్వారా ఆర్డీ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు. అయితే, రాజేంద్రప్రసాద్, నాగరాజు కొద్దిసేపు ప్రతిఘటించారు. తమదైన శైలిలో ప్రశ్నించి ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఇద్దరి నుంచి నిజాలు రాబట్టారు. గంటసేపు నిందితులను విచారించిన అనంతరం వారి వద్ద ఉన్న నగదును రసాయన పరీక్షలు చేసి అది లంచం సొమ్మేనని నిర్ధారించారు. అనంతరం మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేశారు. మరికొద్ది సమయం వేచివుంటే రాజేంద్రప్రసాద్‌కు లంచం ఇచ్చేందుకు కొందరు అధికారులు సైతం క్యూ కట్టేవారని ఏసీబీ అధికారులు భావిం చగా, ఆర్డీ అనుచరులు కొందరు చేసిన హంగామాతో పలువురు చల్లగా జారుకున్నారు.
వేధింపులతో విసిగే ఫిర్యాదు
ఆర్డీ రాజేంద్రప్రసాద్ తనను పదేళ్లుగా వేధిస్తుండటంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని పెడన పురపాలక సంఘ జూనియర్ అసిస్టెంట్ మత్తి వినోద్‌కుమార్ విలేకరులకు తెలిపారు. 2004లో తాను ఏలూరు మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు అనారోగ్యంతో 20 నెలలు సెలవు పెట్టానని, సెలవుపత్రాన్ని మాయంచేసిన ఆర్డీ మెమో జారీచేశారని, తదుపరి తాను రాజమండ్రిలో పనిచేస్తుండగా అదే కారణంపై చార్జిమెమో ఇస్తానంటూ తరచూ వేధించారని ఆరోపించారు. గతంలో తనను రూ.5వేల లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీబీకి ఫిర్యాదు చేయగా, పోలీసులు, ప్రయివేటు వ్యక్తులతో కలిసి రాజేంద్రప్రసాద్ బెదిరించారని పేర్కొన్నారు. 2014లో ఆర్డీ అనుచరులు రామచంద్రరావు, జేమ్స్ ఫిర్యాదు ఉపసంహరించుకోవాలంటూ తనపై దాడిచేయగా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేక కోర్టులో ప్రయివేటు ఫిర్యాదు దాఖలు చేశానని తెలిపారు. దళితుడినైన తనపై కక్షసాధింపు చర్యగా ఆరు ఇంక్రిమెంట్లు నిలిపివేశారని, పన్నెండేళ్లుగా ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. తనతోపాటు ఉద్యోగాల్లో చేరిన వారు కమిషనర్లుగా ప్రమోషన్లు పొందినా, తాను జూనియర్ అసిస్టెంట్ స్థాయిలోనే ఉండటానికి ఆర్డీ కక్షసాధింపు వైఖరే కారణమని వాపోయారు. లంచం ఇవ్వకపోతే ఉద్యోగం ఊడదీయిస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించానని తెలిపారు. ఆర్డీ బాధితులు అనేకమంది ఉన్నారని పేర్కొన్నారు.