రాష్ట్రంలో కరువు పరిస్థితులు | Drought conditions in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కరువు పరిస్థితులు

Published Thu, Mar 7 2024 12:45 AM | Last Updated on Thu, Mar 7 2024 12:45 AM

Drought conditions in the state - Sakshi

వర్షాల్లేక తీవ్ర నీటి సమస్య

‘రైతు నేస్తం’ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

కలసికట్టుగా కరువును ఎదుర్కొందాం.. తాగునీటి కష్టాలు రాకుండా చూస్తున్నాం

‘రైతు నేస్తం’ ద్వారా మీ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తేవొచ్చు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఏడాదిగా సరైన వర్షపాతం లేక రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనిని అంతా కలసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. బుధవారం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ జిల్లాల రైతులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పండిస్తున్న పంటలు, అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కరువు పరిస్థి తులు ఉన్నాయి.

వచ్చే ఎండాకాలంలో తాగునీటికి కష్టా లు రాకుండా చూడాల్సిన అవ సరముంది. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలంటూ కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో రైతులు, నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

రైతులతో కలిసి భవిష్యత్‌ కార్యక్రమాలు
ప్రతి సీజన్‌లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడు తుంది. రైతులు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. ఎప్పుడూ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలి. అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మా ప్రభుత్వం రైతుల తో కలిసిమెలిసి భవిష్యత్‌ కార్యక్రమాలను చేపడు తుంది.

విత్తనాలు, ఎరువుల సరఫరా, ఏ పంట వేయాలనేది మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకు   నేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో మా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతుభరోసా, రుణమాఫీ, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మార్కెట్‌ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యక్రమాలన్నీ చేపడుతోంది.

పంట మార్పిడితో అధిక దిగుబడులు
రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉన్నా యి. రైతులు కేవలం వరి, పత్తి, మిర్చి పంటలకే పరిమితం కావొద్దు. ఇతర పంటలు సాగు చేయాలి. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లా భాలు వచ్చేలా పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి. వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసు కోవాలి. దీనిద్వారా తమ సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకురావొచ్చు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్ర మాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తాం.

రైతులు ధైర్యం కోల్పోవద్దు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమ ల్లోకి తెచ్చింది. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటే.. రైతులు ధీమాగా బతికేందుకు పంటల బీమా పనిచేస్తుంది.

పంట వేసినప్పటి నుంచి కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారం అందుతుంది. రైతులు పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుంది. వారు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది..’’అని సీఎం రేవంత్‌ చెప్పారు.

‘రైతు నేస్తం’ ఏమిటి?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతువేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం చేసి.. నేరుగా రైతుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూ.97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అధికారులు, వ్యవసాయ నిపుణులు గ్రామాల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. తగిన సలహాలు ఇవ్వడంతోపాటు పంటల సాగులో అధునాతన మెలకువలను సూచిస్తారు. ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు కూడా ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement