అంబలి కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.
ముషీరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నదని, వడదెబ్బతో 400మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం రాంనగర్ మీ-సేవా సమీపంలో హరేకృష్ణా మూవ్‌మెంట్, భోజనామృత్, దత్తాత్రేయ చొరవతో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశుగ్రాసం లేక పశువులు కబేళాలకు తరలిపోతున్నాయని, వాటిని రక్షించేందుకు ప్రభుత్వం నీటి తొట్టిలను కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం కరువు నివారణకు రూ.385కోట్లు విడుదల చేసిందని రెండవ విడతగా మరో రూ.350కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. మంత్రులు జిల్లాల్లో పర్యటించి రైతలకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో హరేకృష్ణ మూమెంట్ ఉపాధ్యక్షులు మాధవదాస, ఆపరేషన్స్ ఇన్‌చార్జి కౌంతయ్య దాస, బీజేపీ నాయకులు మాధవ్, విన్ను ముదిరాజ్, శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఓం ప్రకాష్, మోహన్, రమేష్, గుప్తా తదితరులు పాల్గొన్నారు.