- ‘మెతుకు’ సీమలో భిన్నమైన పరిస్థితి
- గణనీయంగా పడిపోతున్న సాగు విస్తీర్ణం
- రెండేళ్లుగా మరింత దయనీయం
- తీవ్ర వర్షాభావ పరిస్థితులతో...
- భూగర్భజలమట్టం పడిపోవటమే కారణం
- భారంగా మారి.. సాగుకు రైతన్న దూరం
గజ్వేల్ఃవిస్తారమైన వరి సాగుతో ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించిన మెదక్ జిల్లాలో నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం పడిపోవటంతో బోరుబావుల ఆధారంగా సాగవుతున్న ‘వరి’ గణనీయంగా తగ్గుతున్నది. మరోవైపు రిజర్వాయర్లు, ఆనకట్టలు వెలవెలబోతుండగా...వాటి పరిధిలోని వేల ఎకరాల వరి పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. రెండేళ్లుగా మరింత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ‘వరి’పై నీలినీడలు కమ్ముకోడంతో దాని స్థానంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై కథనం...
జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కరిస్తే..ఏటా 5.5లక్షల హెక్టార్ల పంటలు సాగులోకి వస్తుంటాయి. గత పదేళ్ల క్రితం వరకు ఇందులో ‘వరి’దే అగ్రస్థానం. మిగితా పంటలన్నీ 60శాతం మాత్రమే ఉండేవి. ఇదే క్రమంలో మెదక్ జిల్లా ‘మెతుకుసీమ’గా ఖ్యాతి గడించింది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం గణనీయంగా పడిపోతున్నది. ఫలితంగా బోరుబావులు వట్టిపోయి...‘వరి’ సాగు ముందుకు సాగటం లేదు.
జిల్లాలో ఈసారి 82206 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ వరి ఇప్పటివరకు కేవలం సుమారుగా 10వేల హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చింది. సీజన్ ముగిసేవరకు మరో 20హెక్టార్లలోకి సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ భావిస్తున్నది. జూన్‌లో 125.6 మి.మీల వర్షపాతానికిగానూ 136.9మి.మీలు నమోదు కాగా...జూలై నెలలో ఇప్పటివరకు 183.6మి.మీల వర్షపాతానికి ఇప్పటివరకు 155.7మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుములు లాంటి ఆరుతడి పంటలు ఇప్పటివరకు 3లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి.
‘వరి’ సాగు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. బోర్ల సాయంతో ఒకవేళ...వరి సాగు చేసినా..వర్షాభావం అలుముకుంటే నీరు తగ్గిపోయి పంటలు కళ్లముంగిటే ఎండిపోతుంటే విలవిల్లాడాలని గమనించిన రైతులు ఆ సాగును తగ్గించుకోవడానికి మరో కారణం. కొన్నేళ్లుగా జరుగుతున్నదిదే. గతేడాది సీజన్ మొత్తంలో 61512 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. 2014లోనూ ‘వరి’ 50వేల హెక్టార్లకు మించలేదు. అంతకుముందు కూడా అదే పరిస్థితి.
ఘనపురం ఆనకట్ట వెలవెల...
జిల్లాలో వరి సాగుకు ఘనపురం ఆనకట్ట ప్రసిద్ధి. 0.2 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ఆనకట్ట నిండితే....ఆనకట్టకు చెందిన మహబూబ్‌నహర్, ఫతేనహర్ కాల్వల సాయంతో ఖరీఫ్‌లో 30వేల హెక్టార్లకుపైగా వరి సాగులోకి వస్తుంది. నిజానికి 30వేల ఎకరాల వరి సాగుకు సీజన్ మొత్తానికి 2టీఎంసీల నీరు అవసరముంటుంది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే...ఆనకట్టకు వర్షం ద్వారా వరద నీరు వచ్చి వరి ఢోకా ఉండదు. కానీ రెండేళ్లుగా ఆనకట్ట వెలవెలబోతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ 3వేల ఎకరాలకు మించి ‘వరి’ సాగులోకి వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలోని పలు రిజర్వాయర్లకు చెందిన ఆయకట్టు సైతం వెలవెలబోతున్నది.
ఇదీ ఉదాహరణలు...
దౌల్తాబాద్ మండలం వీరానగర్‌కు చెందిన ఉప్పరి రాజయ్య గ్రామంలో తనకున్న సుమారు మూడెకరాల భూమిలో బోర్లు వేసినా నీరు రాకపోవడంతో దానిని ఇతరులకు కౌలుకు ఇచ్చాడు. ఈ క్రమంలో తన భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్ పట్టణానికి వచ్చి స్థిరపడ్డాడు. రాజయ్యకు భార్య రాజమణితో పాటు కొడుకులు కరుణాకర్(డిగ్రీ పూరై్త... ఓపెన్‌లో పీజీ) తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సహాయపడుతున్నాడు.
రెండో కొడుకు మధు డిగ్రీ చదువుతున్నాడు. అయితే గత ఆరేళ్లుగా గజ్వేల్ పట్టణ శివారులో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా...వర్షాలు సరిగ కురియకపోవడంతో 3ఎకరాలలో మాత్రమే వరిసాగు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈసారి మాత్రం 4ఎకరాలలో మొక్కజొన్న, ఎకరన్నరలో పత్తి సాగు చేయగా ప్రస్తుతం వరిని మాత్రం ఎకరంన్నరకూ పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాడు.. వానలు సక్కగ పడతలేవ్వు...అందుకనే వరిని తగ్గించిన...అంటూ పేర్కొన్నాడు.
- ఇదిలావుంటే జగదేవ్‌పూర్‌కు చెందిన రైతు చంద్రయ్యకు రెండు ఎకరాల భూమి ఉంది. బోరుబావి సాయంతో ఏటా వరి సాగు చేస్తున్నాడు. కానీ ఈసారి వానల్లేక బోరులో నీరు తగ్గింది. ఈ సారి ఎకరంలోనే వరి సాగు చేయడానికి ఆ రైతు సమాయత్తమవుతున్నాడు. రెండేళ్ల నుండి వరి పంట వల్ల నష్టలు వచ్చినాయ్. ఎకరానికి 20 వేల వరకు నష్టపోయిన అంటూ ఆ రైతు వాపోయాడు.
వర్షం తగ్గితే...‘వరి’ని తగ్గించుకోవడమే మంచిది
-జేడీఏ మాధవీ శ్రీలత
గజ్వేల్ జిల్లాలో ఇప్పటివరకు వర్షపాతం తక్కువగానే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే..‘వరి’కి దూరంగా ఉండటమే మేలు. జిల్లాలో 24వేల హెక్టార్ల సాగుకు అవసరమైన వరి నారు సిద్ధంగా ఉంది. ఒకవేళ..వర్షాలు భారీగా కురిస్తే మాత్రం రైతులు వరిని సాగు చేస్తారు. లేని పక్షంలో తగ్గుతుందని భావిస్తున్నాం. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో భూగర్భజలమట్టం తగ్గి..జిల్లాలో ‘వరి’ సాగుకు ప్రతికూల పరిస్థితులేర్పడ్డాయి.