సాక్షి , బొల్లాపల్లి(గుంటూరు) : బొల్లాపల్లి మండల తండాల్లో పేదరికం విసిరిన బతుకులు వలసదారుల్లో తరలిపోతున్నాయి. పండుగలాంటి పల్లె వాకిట పస్తుల తోరణాలు వేలాడుతున్నాయి. కరువు రక్కసి నోట చిక్కిన ఇళ్లు.. తాళం బుర్రలు కప్పుకుని కన్నీరొలుకుతున్నాయి. వానజాడ లేక, సాగర్ నీళ్లు రాక తడారిన పంట పొలాలు నెర్రెలిచ్చి ఘొల్లుమంటున్నాయి. మెతుకు దొరికే తావు చూపండయ్యా అంటూ ఏకరువు పెడుతున్నాయి. ప్రకాశం జిల్లా సరిహద్దు నల్లమల అటవీ ప్రాంతానికి ముఖ ద్వారంగా ఉన్న బొల్లాపల్లి ప్రాంతం జిల్లాలోనే వెనుకబడినదిగా గుర్తింపు పొందింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరమైంది
తీవ్ర పంట నష్టం..
మండలంలో సుమారు 12 వేలకు పైగా హెక్టార్లలో మాగాణి, మెట్ట భూమి ఉంది. ఇక్కడ చిన్నా.. సన్నకారు రైతులు మిరప, పత్తి, పొగాకు, కంది పంటలు సాగు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం.. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు ఎండమావులను తలపిస్తున్నాయి. దీనికి తోడు గిట్టుబాటు ధరలు లేకపోవడం కూడా అన్నదాతలను కుంగదీసింది. ఖరీఫ్, రబీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. వాణిజ్య పంటలైన మిరప, పత్తి సుమారు 4,500 హెక్టార్లలో సాగు చేస్తే 3,200 హెక్టార్లలో, పత్తి 3 వేల హెక్టార్లలో సాగుచేస్తే 2,700 హెక్టార్లలో దెబ్బతింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు, రైతు కూలీలు పొట్ట చేతపట్టుకొని సొంత గ్రామాన్ని, పొలాలను వదిలి వేరే ప్రాంతాలకు వలసబాట పట్టారు.
గొంతు తడవని పరిస్థితి
ప్రస్తుతం మండల గ్రామాలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రేమిడిచర్ల, రావులాపురం, గండిగనుమల, దొమల గుండం, గుమ్మనంపాడు, గరికపాడు, పమిడిపాడు, జయంతిరామపురం, మర్రిపాలెం, బండ్లమోటు, అయ్యన్నపాలెం, గుట్లపల్లి పంచాయతీల్లో తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
బోర్లు అడుగంటడంతో.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మారుమూల తండాల్లోని ప్రజలు ట్యాంకులు వచ్చేంత వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. గతంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వాటర్ గ్రిడ్ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీ గుప్పించారు. ఆ తర్వాత దానిని విస్మరించారు. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి కష్టాలు మరింత పెరగనున్నాయి.
ఇంకా పూరి గుడిసెల్లోనే!
ప్రభుత్వం అందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేశామంటూ ఊదరగొతుంది. కానీ, మండలంలోని మారు మూల తండాల్లో ప్రజలు చాలా వరకు పూరిగుడెసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. కొంత మంది ప్రభుత్వం మాట నమ్మి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఉన్న ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇంటి నిర్మాణానికి పునాదులు వేశారు. అంతే నిధులు మంజూరు కాకపోవడంతో ఆ నిర్మాణాలు అక్కడితోనే నిలిచిపోయాయి.
కరువుకు తార్కాణం
మండలంలో నల్లమలకు ఆనుకుని 30కి పైగా గిరిజన తండాలున్నాయి. కరువు రక్కసి ధాటికి విలవిల్లాడుతున్నాయి. మన్నేపల్లితండా, గండిగనుమలపైతండా, దొమల గుండం తండా చక్రాయపాలెం, గంగుపల్లి తండా, లింగంగుంట తండా, చెంచుకుంట తండాల నుంచి సుమారు 2 వేల కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వలస బాటపట్టాయి. అయినా ప్రభుత్వం కరువు పరిస్థితిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
బండ్లమోటు వద్ద 1969లో ఏర్పాటు చేసిన హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ మైనింగ్ 2002లో మూతపడింది. ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగించిన 1500 కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆ తర్వాత సరైన ఉపాధి లభించక వేరే వేరే ప్రాంతాలకు వలసబాట పట్టాయి.
ఎప్పటికైనా ఆశ తీరకపోతుందా అని..
గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని నాలుగు మండలాల కరువు నియంత్రణకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో దొమ్మర్లగొంది ప్రాజెక్టు పూర్తి చేస్తే చెరువులు నిండి కరువు చాయలు దరిచేరవని ఈ ప్రాంత వాసుల ఆశ. గుంటూరు జిల్లా వెల్దుర్తితో పాటు దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాలకు తాగునీటితో పాటు సాగు నీరందిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. చెరువులు నిండటం వలన భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది.
వైద్యం దైన్యం.. విద్య దూరం
ఎస్టీ, ఎస్సీ, బీసీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో విద్య, వైద్య ఖర్చులు సైతం భరించలేని దయనీయ స్థితిలో ప్రజలున్నారు. పదో తరగతి తర్వాత పై స్థాయి విద్యకు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం రెండు బాలుర గిరిజన వసతి గృహాలు మాత్రమే ఉన్నాయి. బాలికా విద్యకు సరైన పోత్సాహం లేదు. వెనుకబడిన ప్రాంతంలో కనీసం ఇంటర్‌పై స్థాయితో పాటు సాంకేతిక కళాశాలలు ఏర్పాటు చేస్తే బాలికల విద్యాశాతంపెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాల మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు.
- మండల కేంద్రంలో పేరుకే 24 గంటల ఆరు పడకల ఆస్పత్రి ఉంది. గతేడాది వరకు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం చేపట్టలేదు. ప్రస్తుతం వైద్యులు ఉన్నా..సమయానికి అందుబాటులో ఉండని దుస్థితి.
- ఐదేళ్ల కిందట నిర్మించిన వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేటికీ వైద్యులులేరు.
- గతంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో పాటు అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సీహెచ్‌సీని ప్రారంభించి వదిలేశారు.
అంతా మోసం..
- మండలాభివృద్ధికి కేటాయించిన నిధులను టీడీపీ నాయకులు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. అదే విధంగా కరువు మండలం కింద నిధుల మంజూరైతే వాటిని వేరే మండలానికి మళ్లించారు.
- పంచాయతీ నిధులను తాగునీటికి వెచ్చించాలని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుమారు రూ 1.50 కోట్లను ఆయా పంచాయతీల్లో సిమెంట్ రోడ్లుకు కేటాయించి, ఆ పనుల్లోనూ చేతివాటం చూపించారు.
- నీరు– చెట్టు కింద సుమారు రూ 3.50 కోట్లు చెరువు పూడిక తీత, చెక్ డ్వామ్‌ల నిర్మాణాల పేరుతో జేబుల్లో వేసుకున్నారు. ఇదంతా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల అండదండలతో కింది స్థాయి టీడీపీ నాయకులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
అధ్వానంగా రవాణా సౌకర్యం
గ్రామాలను కలుపుతూ ఉండే లింకు రోడ్లు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కనుమల చెర్వు పంచాయతీ శివారు నెహ్రునగర్ తండాకు వెళ్లాలంటే అటవీ మార్గంలో సుమారు 5 కిలోమీటర్లు వెళ్లాలి. అయితే నాగార్జునసాగర్ కుడి కాలువ పై బ్రిడ్జి నిర్మిస్తే ఆ ప్రాంతాన్ని చేరుకోవడం సులభమవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి పలుసార్లు శంకుస్థాపనలు చేశారు గానీ, పనులు మొదలుపెట్టలేదు. నిమ్మలసుబ్బయ్య కుంట తండాకు రోడ్డు సౌకర్యం లేదు. బస్సులు రావు, అత్యవసర సమయాల్లో నానా ఇబ్బందులు పడాలి. పంచాయతీ కేంద్రం గుమ్మనంపాడుకు అటవీ ప్రాంతం నుంచి 7 కిలోమీటర్లు దూరం నడవాలి.
పంచాయతీలు : 23
జనాభా : 58 వేలు
వలస కుటుంబాలు : 2 వేలు
గిరిజన తండాలు : 30
సాగు భూమి : 12వేల హెక్టార్లు
అటవీ ప్రాంతం : 33వేల చదరపు హెక్టార్లు
Comments
Please login to add a commentAdd a comment