సాక్షి, అమరావతి : అన్నం పెట్టే అన్నదాతకు ఆకలి పేగులు మిగిలాయి..పచ్చని సిరులు కురిపించే పంట పొలాలు.. ఎండిన మోడులయ్యాయి..పల్లె గూటిలో కమ్మిన కరువు మేఘాలు.. కన్నీటి ధారలై కురిశాయి.పంట దిగుబడులకు పడిన ధరల కళ్లేలు.. కర్షకుడ్ని కష్టాల ఊబిలోకి నెట్టేశాయి..మేతలేని పశువులు.. కబేళా కత్తికి ముక్కలు ముక్కలయ్యాయి..గుక్కెడు నీళ్లు దొరకని పల్లె గొంతులకు వెక్కిళ్లే దిక్కయ్యాయి..అడుగంటి భూగర్భ జలాలు.. కొండ రాళ్ల కింద ఇంకిపోయాయి.. బోరుమంటున్న జీవితాలకు .. కన్నీటి ఏరులే మిగిలాయి..కళతప్పిన పల్లెలను విడిచిన బతుకులు.. మెతుకుల వేటకై వలసబాట పట్టాయి..ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ సాయమెరుగక జిల్లాలో అనేక మంది రైతన్నల ప్రాణాలు అప్పుల ఉరికొయ్యకు వేలాడాయి.
అన్నదాత వ్యవసాయ జూదంలో ప్రతి ఏటా ఓడిపోతూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, తెగుళ్లు, చీడపీడలు, గిట్టుబాటు ధరలేక రైతులు కుదేలయ్యారు. ఐదేళ్లలో పత్తి, మిర్చి ధరలు పతనమయ్యాయి. పత్తి పంటకు గులాబి పురుగు సోకడంతో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. మిరపకు జెమిని వైరస్ సోకి ఎకరాకు 5–7 క్వింటాళ్లకే పరిమితమైంది.
జెమిని వైరస్ పూత, పిందె దశలో రావడంతో పంటను పీకేయాల్సిన దుస్థితి నెలకొంది. రైతుల పెట్టుబడులు మట్టి పాలయ్యారు. మినుము పంట ఆకుముడత తెగులుతో పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం 4,5 విడత రుణమాఫీ ఇంకా అందించలేదు. కౌలు రైతులను పట్టించుకోలేదు. ఐదేళ్లలో జిల్లాలో రైతులు 10 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.
రుణమాఫీ మాయ...
ప్రభుత్వం ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు, ఐదు విడతల సొమ్ము ఇంకా అందలేదు. జిల్లాలో రూ.900 కోట్ల రైతుల ఖాతాలకు జమ కావాల్సి ఉంది. నాలుగో విడత రుణమాఫీకి సొమ్ము గత ఏడాది సెస్టెంబరు, అక్టోబరులోపు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం ఇంత వరకు జమ చేయలేదు. జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం 3.5 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కేవలం 98 వేల మందికి మాత్రమే కౌలు రైతు అర్హత పత్రాలు ఇచ్చారు.
కోలుకోలేని దెబ్బ
జిల్లాలో ప్రత్తి మొదలు, మిరప, మినుము, జొన్న,మొక్కజొన్న, కంది..ఇలా జిల్లాలో పంటలు సాగు చేసిన లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది జొన్న, మొక్క జొన్నలు క్వింటాళ్లకు రూ.1000లోపే ఉంది. మినుము రూ.3500కు పడిపోయింది. శనగ క్వింటాళ్లు రూ.3600కే పరిమితమైంది. పెథాయ్ తుఫాన్ వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగటంతోపాటు కళ్లాల్లో ధాన్యం తడిచి మొలకెత్తడంతోపాటు రంగు మారింది.
దీంతో రైతులు భారీగా నష్టపోయారు. దీనికి సంబంధించి రూ.67 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు మాత్రం చేరలేదు. జిల్లాలో 9 కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లు పంట నష్టపోయినట్లు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంత వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
తాగునీటి ఎద్దడి
జిల్లాలోని పల్నాడుతోపాటు అనేక గ్రామాలు తాగునీరు లేక గొంతెండుతున్నాయి. వందల అడుగుల లోతులో తవ్వినా జలధార లేక విలవిలలాడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెరువులు ఎండిపోయాయి. జీవనది వంటి నాగులేరు సైతం నీళ్లు లేక రాళ్లు తేలి నిర్జీవంగా దర్శనమిస్తోంది.
ఐదేళ్లలో రైతుల ఆత్మహత్యలు
ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఆత్మహత్యల సంఖ్య : 113
అనధికారికంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య : 250మందికి పైనే
పరిహారం అందింది : 64 మందికి
రైతుల పరిస్థితి దయనీయం
తంగెడ మేజర్ కాలువను అనుకుని పెదగార్లపాడు ఉంది. పత్తి, మిరప సాగు చేశాం. పంటకు గిట్టుబాటు ధరలేదు. ప్రభుత్వం సకాలంలో సాగునీరు విడుదల చేయలేదు. గిట్టుబాటు ధర లేకపోవటం వలన గ్రామాల్లో కరువు వచ్చింది. ఆపదలో సైతం డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే బతకటం చాలా కష్టంగా ఉంటుంది.
– కర్పూరపు వెంకటకోటయ్య,పెదగార్లపాడు
వ్యవసాయం సంక్షోభంలో ఉంది
ఐదేళ్లుగా పంటలు పండటం లేదు. రామాపురం మేజర్ కాలువ, దండివాగు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందని పరిస్థితి. వ్యవసాయం అంటే సంతోషంగా ఉండే మేము సంక్షోభంలో పడ్డాం. వ్యవసాయాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతులంటే చంద్రబాబుకు గిట్టదు కాబట్టే పట్టించుకోవటం లేదు.
– ఆకూరి వీరారెడ్డి, రామాపురం
Comments
Please login to add a commentAdd a comment