Runamaphi
-
‘అధికార’ గిమ్మిక్కులు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మభ్యపెడుతోంది. గత ఏడాది జూన్‌లోనే నాల్గో విడత రుణమాఫీకి సంబంధించిన సొమ్ము రైతు ఖాతాల్లో జమ కావాలి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాది జనవరిలోనే నాలుగు, ఐదు విడతల రుణమాఫీ సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసింది. జిల్లాలోనే 5.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.913 కోట్ల నిధులను జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి పట్టించుకోకుండా, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు కొంత సొమ్ము విదిల్చి జిమ్మిక్కులు చేసింది. రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ సొమ్ము గురించి పట్టించుకోలేదు. అయితే ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో రెండు విడతల సొమ్ము కాకుండా, నాల్గో విడత రుణమాఫీ సొమ్ము జమ చేశామని, బ్యాంకులకు రుణ ఉపశమన పత్రాలు, ఆధార్ కార్డు బ్యాంకులో ఇస్తే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులను మభ్య పెట్టడం తప్ప, సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్న నమ్మకం లేదనే భావన రైతు సంఘాల నాయకులతోపాటు, రైతుల్లో వ్యక్తమవుతోంది. విడుదలకాని పరిహారం రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. గతేడాది రబీలో ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేకపోవటంతో, క్వింటాకు రూ.200 చొప్పున రైతులకు అదనపు సాయం ఇస్తామని చెప్పి రైతుల జాబితాలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వేలాది మంది రైతులకు రూ.53 కోట్లు ఇంతవరకు రైతుల ఖాతాల్లో చేరలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేశామని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మొక్కజొన్న, జొన్న రైతులు అదనపు సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వరి పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన పెథాయ్ తుపాను వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగడంతో పాటు, కల్లంలో ధాన్యం తడిచి పంట మొలకెత్తడంతో పాటు, ధాన్యం రంగు మారిపోయింది. రైతులు భారీగా నష్టపోయారు. నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసి, రూ.67 కోట్లు నష్ట పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించింది. అది ఇప్పటి వరకు రైతులకు మాత్రం చేరలేదు. జిల్లాలో తొమ్మిది కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయి దెబ్బతిన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లు, పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ప్రభుత్వం రైతులకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. దీంతో ప్రభుత్వం విడుదల చేస్తామని చెబుతున్న నాల్గో విడత రుణమాఫీపై రైతులు పెదవి విరుస్తున్నారు. -
సేద్యం..బతుకు దైన్యం
సాక్షి, అమరావతి : అన్నం పెట్టే అన్నదాతకు ఆకలి పేగులు మిగిలాయి..పచ్చని సిరులు కురిపించే పంట పొలాలు.. ఎండిన మోడులయ్యాయి..పల్లె గూటిలో కమ్మిన కరువు మేఘాలు.. కన్నీటి ధారలై కురిశాయి.పంట దిగుబడులకు పడిన ధరల కళ్లేలు.. కర్షకుడ్ని కష్టాల ఊబిలోకి నెట్టేశాయి..మేతలేని పశువులు.. కబేళా కత్తికి ముక్కలు ముక్కలయ్యాయి..గుక్కెడు నీళ్లు దొరకని పల్లె గొంతులకు వెక్కిళ్లే దిక్కయ్యాయి..అడుగంటి భూగర్భ జలాలు.. కొండ రాళ్ల కింద ఇంకిపోయాయి.. బోరుమంటున్న జీవితాలకు .. కన్నీటి ఏరులే మిగిలాయి..కళతప్పిన పల్లెలను విడిచిన బతుకులు.. మెతుకుల వేటకై వలసబాట పట్టాయి..ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ సాయమెరుగక జిల్లాలో అనేక మంది రైతన్నల ప్రాణాలు అప్పుల ఉరికొయ్యకు వేలాడాయి. అన్నదాత వ్యవసాయ జూదంలో ప్రతి ఏటా ఓడిపోతూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, తెగుళ్లు, చీడపీడలు, గిట్టుబాటు ధరలేక రైతులు కుదేలయ్యారు. ఐదేళ్లలో పత్తి, మిర్చి ధరలు పతనమయ్యాయి. పత్తి పంటకు గులాబి పురుగు సోకడంతో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. మిరపకు జెమిని వైరస్ సోకి ఎకరాకు 5–7 క్వింటాళ్లకే పరిమితమైంది. జెమిని వైరస్ పూత, పిందె దశలో రావడంతో పంటను పీకేయాల్సిన దుస్థితి నెలకొంది. రైతుల పెట్టుబడులు మట్టి పాలయ్యారు. మినుము పంట ఆకుముడత తెగులుతో పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం 4,5 విడత రుణమాఫీ ఇంకా అందించలేదు. కౌలు రైతులను పట్టించుకోలేదు. ఐదేళ్లలో జిల్లాలో రైతులు 10 వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. రుణమాఫీ మాయ... ప్రభుత్వం ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు, ఐదు విడతల సొమ్ము ఇంకా అందలేదు. జిల్లాలో రూ.900 కోట్ల రైతుల ఖాతాలకు జమ కావాల్సి ఉంది. నాలుగో విడత రుణమాఫీకి సొమ్ము గత ఏడాది సెస్టెంబరు, అక్టోబరులోపు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం ఇంత వరకు జమ చేయలేదు. జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం 3.5 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కేవలం 98 వేల మందికి మాత్రమే కౌలు రైతు అర్హత పత్రాలు ఇచ్చారు. కోలుకోలేని దెబ్బ జిల్లాలో ప్రత్తి మొదలు, మిరప, మినుము, జొన్న,మొక్కజొన్న, కంది..ఇలా జిల్లాలో పంటలు సాగు చేసిన లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది జొన్న, మొక్క జొన్నలు క్వింటాళ్లకు రూ.1000లోపే ఉంది. మినుము రూ.3500కు పడిపోయింది. శనగ క్వింటాళ్లు రూ.3600కే పరిమితమైంది. పెథాయ్ తుఫాన్ వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగటంతోపాటు కళ్లాల్లో ధాన్యం తడిచి మొలకెత్తడంతోపాటు రంగు మారింది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. దీనికి సంబంధించి రూ.67 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు మాత్రం చేరలేదు. జిల్లాలో 9 కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లు పంట నష్టపోయినట్లు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంత వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాగునీటి ఎద్దడి జిల్లాలోని పల్నాడుతోపాటు అనేక గ్రామాలు తాగునీరు లేక గొంతెండుతున్నాయి. వందల అడుగుల లోతులో తవ్వినా జలధార లేక విలవిలలాడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెరువులు ఎండిపోయాయి. జీవనది వంటి నాగులేరు సైతం నీళ్లు లేక రాళ్లు తేలి నిర్జీవంగా దర్శనమిస్తోంది. ఐదేళ్లలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఆత్మహత్యల సంఖ్య : 113 అనధికారికంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య : 250మందికి పైనే పరిహారం అందింది : 64 మందికి రైతుల పరిస్థితి దయనీయం తంగెడ మేజర్ కాలువను అనుకుని పెదగార్లపాడు ఉంది. పత్తి, మిరప సాగు చేశాం. పంటకు గిట్టుబాటు ధరలేదు. ప్రభుత్వం సకాలంలో సాగునీరు విడుదల చేయలేదు. గిట్టుబాటు ధర లేకపోవటం వలన గ్రామాల్లో కరువు వచ్చింది. ఆపదలో సైతం డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే బతకటం చాలా కష్టంగా ఉంటుంది. – కర్పూరపు వెంకటకోటయ్య,పెదగార్లపాడు వ్యవసాయం సంక్షోభంలో ఉంది ఐదేళ్లుగా పంటలు పండటం లేదు. రామాపురం మేజర్ కాలువ, దండివాగు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందని పరిస్థితి. వ్యవసాయం అంటే సంతోషంగా ఉండే మేము సంక్షోభంలో పడ్డాం. వ్యవసాయాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతులంటే చంద్రబాబుకు గిట్టదు కాబట్టే పట్టించుకోవటం లేదు. – ఆకూరి వీరారెడ్డి, రామాపురం -
80 శాతం సాగు పూర్తి
త్వరలోనే రుణమాఫీ నిధుల విడుదల జేడీఏ విజయ్‌కుమార్ వెల్లడి సుభాష్‌నగర్ : జిల్లాలో 80 శాతం పంటల సాగు పూర్తయిందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు ఎం.విజయ్‌కుమార్ తెలిపారు. అన్ని పంటలు కలిపి 3,23,170 హెక్టార్లలో సాగు నిర్దేశించగా, అందులో ఇప్పటికే 2,48,038 హెక్టార్లలో (80 శాతం) సాగు పూర్తయ్యిందని చెప్పారు. వరిసాగు మాత్రం 40 శాతమే పూర్తయిందన్నారు. రుణమాఫీ నిధుల్లో ఇప్పటికే 12.5 శాతం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మరో పది రోజుల్లో 12.5 శాతం నిధులు విడుదల చేయనుందన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, ఎస్సారెస్పీలో ఇప్పటికే 45 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. జిల్లాలో 40 శాతం వరినాట్లు పూర్తయ్యాయని, ఆగస్టు 15 లోగా మిగతా 60 శాతం పూర్తవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నందున ఇప్పటికైనా నార్లు పోసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ నాటు ఆలస్యమైతే నారు మొక్కలు ఎక్కువగా నాటుకోవాలని, ఎరువుల మోతాదు సైతం రెట్టింపుగా వాడుకోవాలని తెలిపారు. తద్వారా సరైన సమయానికి వేసిన దిగుబడే ఇప్పుడూ వస్తుందన్నారు. రుణమాఫీలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో ప్రతి బ్యాంకుకు ఒక వ్యవసాయాధికారిని పర్యవేక్షణ కోసం నియమించామన్నారు. రైతుల కోసం 30 వేల టన్నుల యూరియా, 45 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఏమైనా సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. -
రుణమాఫీ భారం రూ.23 వేల కోట్లు
రెండోదశ అర్హుల జాబితా పరిశీలించాం రూ.50 వేల వరకు పూర్తి మాఫీ ఆపైన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రుణ ఉపశమన పథకంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండోదశకు అర్హులైన వారి ఖాతాలను రాష్ట్ర కేబినెట్ పరిశీలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రైతులకు అవసరమైన వివరాలను ఇచ్చేందుకు గ్రామ జన్మభూమి కమిటీలకు సూచనలిచ్చినట్టు తెలిపారు. రుణ ఉపశమన పథకంపై ఆయన సోమవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. రుణమాఫీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.23 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. రెండు దశల రుణ ఉపశమన పథకం వల్ల 33.19 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పంటల బీమా పరిహారం ద్వారా వచ్చే రూ.600 కోట్లను రైతుల ఖాతాల్లోనే జమచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.50 వేల వరకు ఉన్న రుణాలు ఏక కాలంలో మాఫీ అవుతాయని, ఆ పైన ఉన్నవాటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టామని చెప్పారు. పట్టాదారు, కౌలు రైతుల్లో కేవలం కౌలు రైతుకే పథకాన్ని వర్తింపజేసినట్టు పేర్కొన్నారు. తొలి విడత రుణమాఫీని అమలు చేశామని, అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం ఇవ్వని వారిని రెండో జాబితాలో చేర్చామని చెప్పారు. ఫిర్యాదుల కోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వ్యవసాయం కోసం తీసుకున్న బంగారు తాకట్టు రుణాల విషయంలోనూ.. అది తీసుకున్న సమయం, బ్యాంకుల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ఆత్మహత్యలు 2004-2014 మధ్య కాలంలో 24,012 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కల్లో తేలిందని, కాంగ్రెస్ హయాంలో రైతు ఆత్మహత్యల శాతం 20.4 శాతం నుంచి 36.2 శాతానికి చేరిందని చెప్పారు. అదే కర్ణాటకలో 40.5 నుంచి 30.8 శాతానికి తగ్గిందన్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి మోహన్ కుందారియా రైతు ఆత్మహత్యలపై సమాధానమిస్తూ.. దేశవ్యాప్తంగా 1,109 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 986 మంది మహారాష్ట్రలో, 29 మంది జార్ఖండ్‌లో, 84 మంది తెలంగాణలో ఉన్నట్టు చెప్పారని, ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు లేవని పేర్కొన్నారని చెప్పారు. ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కావాలి నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులు నిర్మించి తీరతామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికోసం రూ.25 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో రూ.11,300 కోట్లు ఎస్కలేషన్‌కు, రూ.18 వేల కోట్లు ప్రాజెక్టుకు, రూ.3,500 కోట్లు భూసేకరణకు, రూ.1,500 కోట్లు అటవీభూముల సేకరణకు ఖర్చవుతుందని అంచనా వేశామని, దీనికోసం కమిటీ వేసి పరిశీలిస్తున్నామని వివరించారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. రుణమాఫీ చేయడంతోనే తమ ప్రభుత్వానికి బాధ్యత తీరిపోలేదని, రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా నీళ్లు లేకుండా ఎండిపోకూడదన్నదే తమ అభిమతమని చెప్పారు. -
చేయూత ఏదీ?
ధర్మవరం : చేనేత కార్మికునికి చచే ్చదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న నానుడి అక్షర సత్యం అవుతోంది. మగ్గం గుంతల్లోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. ఎదుగూ బొదుగూ లేని జీవితాలతో కార్మికులు అవస్థ పడుతున్నారు. పవర్‌లూమ్స్‌పై విరివిగా తయారవుతున్న వస్త్రాలు చేనేత రంగం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, సిండికేట్‌నగర్, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో 80 వేల కుటుంబాలకు పైగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 5లక్షల మందికి పైగా చేనేత రంగంలో ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్‌పై పలు డిజైన్లలో చీరలు తయారవుతుండడం, వాటినే చేనేత చీరలుగా తక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తుండడంతో చేనేత చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏడాదికి రూ. కోటి విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉన్నత చదువులకు దూరం చేనేతల పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదు. కుటుంబం గడవటమే కష్టంగాఉన్న నేపథ్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి 10వ తరగతితో సరిపెడుతున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత సహకార సంఘాలున్నా అధిక శాతం మంది కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్దనే పనిచేయాల్సి వస్తోంది. వారు నిర్ణయించిందే ధర. ఇచ్చేదే కూలి. పాలకులకు పట్టనిహెల్త్ కార్డులు నిత్యం మగ్గం గుంతలో గడిపే చేనేత కార్మికులకు అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో పైసా ఉండని పరిస్థితి. 2012 ఆగస్టు15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రీయ స్వచ్చత బీమా యోజన పేరిట ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక చేనేత కుటుంబంలో ఐదుగురు సభ్యులకు రూ. 37,500 కేటాయించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా వాడుకోవచ్చునని సూచించారు. అయితే.. ఆ హెల్త్ కార్డుల కాలపరిమితి ముగుస్తోందని కార్మికులు చెప్పడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరునెలల గడువును పెంచారు. ఆ గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కార్మికులు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాల్లోనూ మొండిచేయే.. ఎలాంటి హామీ లేకుండా ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.25వేల నుంచి రూ.1.50 లక్షలవరకు రుణాలను మంజూరు చేసేవారు. వీటిపై ప్రభుత్వమే 84 శాతం గ్యారంటీ ఇచ్చేది. అయితే.. ఈ నిధులను రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదని చేనేత నాయకులు చెబుతున్నారు. జిల్లాలో ఈ రుణాలను పొందినవారు వందల్లో ఉంటారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.46 కోట్లతోనే సరిపెట్టారు. ఇందులో ఖర్చులు, చేనేతశాఖ సిబ్బంది వేతనాలు పోను ఎంత మేర కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేనేత ఆత్మహత్యలు పెరుగుతాయి ఇప్పటికే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటువంటి తరుణంలో ఊతమివ్వాల్సిన ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం పట్టించుకోకపోతే చేనేత రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చీరలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందే. లేకపోతే చేనేతల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తాం. -పోలా రామాంజినేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేనేత రంగాన్ని విస్మరించారు బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయించిన నిధులను చూస్తే ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రంగమే మనుగడ కష్టం. అదీకాక చేనేత రంగానికి చేయూతగా ఉన్న పథకాలన్నింటినీ ఒకేగాటన కట్టారు. దీని వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. -జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గతంతో పోల్చితే చాలా తక్కువ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కేటాయించిన రూ.48 కోట్లు కేవలం అధికారులకు సంబంధించిన వేతనాలు, ఇతరత్రా వాటికే సరిపోతాయి. ఇక కార్మికులకు ఏమి ప్రయోజనం? అసలే గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న చేనేత రంగానికి ఇది అశనిపాతమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. చేనేతలను మోసం చేసిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదు. -రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్‌నాయకుడు 18డిఎంఎం02ఎ- మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు 18డిఎంఎంఎ02బి- పోలా రామాంజినేయులు 18డిఎంఎం012స- జింకాచలపతి 18డిఎంఎం02డి- రంగన అశ్వర్థనారాయణ -
రుణమాఫీలో కోతే ప్రభుత్వ లక్ష్యం
వైఎస్సార్ సీపీ నాయకులు అరుణ్‌కుమార్ కంచికచర్ల : రుణమాఫీలో కోత విధించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, మండల కన్వీనర్ బండి జానకిరామయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాటిబండ్ల హరిజగన్నాథరావు తదితరులు శనివారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్‌కార్డు అనుసంధానం, ఇతర నిబంధనల బూచి చూపిస్తూ చాలా వరకు బ్యాంకు ఖాతాలను తగ్గించారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రూ.87,612కోట్ల వరకు వ్యవసాయ రుణాలు ఉన్నాయని, ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.18.500కోట్లు మాత్రమే బ్యాంకుల ఖాతాలకు జమచేసిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 4,300కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రైతులు చెల్లించాలని ప్రభుత్వం చెబుతోందని, లేదా సాగుకోసం తీసుకున్న అప్పుకోసం తాకట్టుపెట్టిన బంగారం, పట్టాదార్ పాసు పుస్తకాలు బ్యాంకుల్లో ఉండాల్సిందేననే అంశాన్ని నిబంధనలో ప్రభుత్వం చేర్చడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల ఇతర వ్యక్తుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేందుకు అవకాశం కూడా లేదన్నారు. ఎన్నికల హామీ మేరకు సకాలంలో రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
కార్మిక చట్టం సవరణకు ఓకే
రెండో విడత రుణమాఫీకి నిధుల విడుదలకు అంగీకారం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టులో.. సింగిల్ డెస్క్ విధానం ఏపీ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్మిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు వీలుగా కార్మిక చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కేబినెట్ భేటీలో తీసుకున్న ఇతర నిర్ణయాలివీ... షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంటు యాక్టు ప్రకారం వ్యాపార సంస్థల ఏర్పాటుకు సింగిల్ డెస్క్ విధానం. ఏడాదిలోపు ఈ సంస్థలు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్ ఒకేచోట దాఖలు చేసే వెసులు బాటు. కేజీ రూపాయి వంతున దారిద్య్రరేఖకు దిగువనున్న(బీపీఎల్) కుటుంబాల్లోని అందరికీ ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం. ఏప్రిల్ 1 నుంచి అమలు రాష్ట్ర ఖజానాపై రూ.800 కోట్ల భారం పడుతుందని అంచనా . చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో శ్రీసిటీ పక్కన హీరో మోటార్స్‌కు 592 ఎకరాలు కేటాయింపు. త్వరలోనే శంకుస్థాపన. రుణ విముక్తి కింద నాలుగు విడతల్లో భాగంగా రెండో విడత నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే ఇరువురు ఎమ్మెల్సీల పేర్లను సూచించాలని గవర్నర్ నరసింహన్ వద్ద నుంచి వచ్చిన సందేశాన్ని కేబినెట్ భేటీలో చదివి.. దీనిపై నిర్ణయాన్ని సీఎంకు వదిలిపెట్టారు. ఉన్నతాధికారులతో సీఎం భేటీ రాష్ట్ర కేబినెట్ సమావేశానంతరం సీఎం చంద్రబాబు సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యా రు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ప్రతి శాఖ కార్యదర్శి వచ్చే ఆర్ధిక సంవత్సరానికిగాను లక్ష్యాలు, కేటాయింపులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పది మంది మంత్రుల గైర్హాజరు ఏపీ మంత్రివర్గ సమావేశానికి పదిమంది మంత్రులు గైర్హాజరయ్యారు.ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల మంత్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ జిల్లాలకు వెళ్లారు. ఇక పరిటాల సునీత, సిద్ధా రాఘవరావు ముందస్తు అనుమతితో గైర్హాజరైనట్టు సమాచారం. -
మండలిలో రుణమాఫీ రగడ
అది వడ్డీమాఫీ పథకమేనంటూ విపక్షాల ఎద్దేవా వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామన్న సర్కారు సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ అంశం సోమవారం శాసనమండలిలో గందరగోళం సృష్టించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని చెప్పుకొంటోందని... కానీ వాస్తవానికి చేసింది వడ్డీమాఫీ మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో విమర్శించారు. రుణ మాఫీ పేరిట ప్రభుత్వం మొదటి విడతగా ఇచ్చిన సొమ్ము రైతులు తీసుకున్న రుణాల వడ్డీకి కూడా సరిపోలేదని ఆయన పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో రైతులకు ఎలక్ట్రానిక్ పహానీలు లేనందున రుణాల రెన్యువల్‌కు అర్హత కోల్పోతున్నారని, చేతి రాతతో ఇచ్చిన పహానీలను బ్యాంకులు అనుమతించడం లేదని చెప్పారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా.. లేదా?.. వస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నారని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించగా... వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమాధానమిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీతో సహా రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. రుణాల రెన్యువల్‌కు ఎలక్ట్రానిక్ పహానీలు తప్పనిసరి కాదని, ఈ కారణం చేత రుణాలు రెన్యువల్ కాని రైతుల వివరాలను సమర్పిస్తే ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. కౌలురైతులకు కూడా రుణ అర్హత కల్పించేందుకు ‘లోన్ ఎలిజిబిలిటీ’ కార్డు(ఎల్ఈసీ)లను రెవెన్యూ యంత్రాంగం జారీ చేస్తుందని పోచారం తెలిపారు. ఇక ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగించే వారికోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మజ్లిస్ సభ్యులు హసన్ జాఫ్రీ, హైదర్ రజ్వీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అంధ విద్యార్థుల పాఠశాలల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని, అంధ విద్యార్థుల పరిస్థితులను తెలుసుకునేందుకు సభాసంఘం వేయాలని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మంత్రి తుమ్మల జవాబిస్తూ.. అంధ పాఠశాలల్లో సదుపాయాల పరిశీలనకు ముగ్గురు సభ్యులతో కమిటీని వేస్తామని, కమిటీ నివేదిక మేరకు ఆయా పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో మెట్రోరైలును మరో ఆరు ప్రాంతాలకు విస్తరించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి తుమ్మల చెప్పారు. -
సర్కారుపై తగ్గిన రుణమాఫీ భారం
రుణ విముక్తి పత్రాలతో తేలిన లెక్కలు నిరుడు దాదాపు రూ.300 కోట్ల మిగులు మొత్తంగా రుణమాఫీ రూ.16 వేల కోట్ల లోపే సాక్షి, హైదరాబాద్: రైతు రుణ మాఫీపై సర్కారు లెక్క తప్పింది. గత ఏడాది అంచనా ప్రకారం వేసుకున్న లెక్కలకు... రుణాల మాఫీకి సంబంధించి క్షేత్రస్థాయి గణాంకాలకు దాదాపు రూ.1,200 కోట్ల తేడా ఉండే అవకాశముంది. కానీ ఈసారి బడ్జెట్లోనూ రూ. 4,250 కోట్లను ప్రభుత్వం రుణ మాఫీకి కేటాయించింది. కానీ నిరుడు దాదాపు రూ. 300 కోట్ల మాఫీ సొమ్ము బ్యాంకుల్లో మిగిలిపోయింది. రైతులను ఆదుకునేందుకు రూ.లక్ష వరకు పంట రుణం మాఫీ చేస్తామని టీఆర్ఎస్ సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి రాగానే హామీని నిలబెట్టుకుంది. రూ. లక్ష పరిమితి మేరకు పంట రుణంతోపాటు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకూ పథకాన్ని అమలు చేసింది. తొలి బడ్జెట్లోనే 35,56,678 మంది రైతులకు సంబంధించిన రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్లలో వాయిదాల పద్ధతిన ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించనుంది. అందులో మొదటి విడతగా 2014-15 సంవత్సరంలో రూ. 4,250 కోట్లు మంజూరు చేసింది. బ్యాంకుల నివేదిక ఆధారంగా రుణాల మాఫీకి ఎన్ని నిధులు కావాలో లెక్కలేసుకున్న సర్కారు.. అమలు చేసేటప్పుడు వాస్తవ గణాంకాలను మదించుకుంది. దీంతో రుణమాఫీ మొత్తం రూ.16 వేల కోట్లకు మించే పరిస్థితి కనిపించటం లేదు. గత నెల 16 నుంచి 23 వరకు వ్యవసాయశాఖ రుణమాఫీ వారోత్సవాలు నిర్వహించింది. రైతులకు రుణ విముక్తి పత్రాలను జారీ చేసింది. రైతులకు ఇచ్చే రుణమాఫీ పత్రంలో మొత్తం రుణం, ఇప్పటికే మాఫీ అయిన రుణం.. మిగిలిన రుణానికి సంబంధించిన మొత్తంలో ప్రభుత్వ బాధ్యత ఎంతమేరకనే వివరాలున్నాయి. దీంతో రైతులకు తమ రుణమెంత మాఫీ అయిందనే స్పష్టత వస్తుందని.. మిగిలిన రుణాన్ని భవిష్యత్తులో ప్రభుత్వమే చెల్లిస్తుందన్న భరోసా కల్పించేందుకు సర్కారు ఈ ప్రయత్నం చేసింది. మొదటి విడతలో రుణమాఫీ కింద విడుదల చేసిన రూ.4,250 కోట్లు రైతుల ఖాతాల్లో సర్దుబాటు చేసింది. కొత్తగా రుణాలు అవసరమయ్యే వారు బ్యాంకులను ఆశ్రయించాలని.. ఇంకా బకాయిలున్న వారు రెన్యువల్ చేసుకోవాలని కోరింది. ఈ వారోత్సవాలు ముగిసేసరికి.. 27.50 లక్షల మంది రుణాలు రెన్యువల్ చేసుకున్నారు. 8.50 లక్షల మంది ఇంకా చేసుకోవాల్సి ఉంది. కొందరు రైతులు మృతిచెందటంతో వారి వారసులు ఖాతాల మార్పిడి, రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. మొత్తంగా రుణ విముక్తి పత్రాల జారీతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన స్పష్టత వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో రైతుల ఖాతాలకు సంబంధించి రూ. 3,950 కోట్లు సర్దుబాటుకాగా మిగిలిన రూ. 300 కోట్లు మిగులు ఖాతాలోనే ఉండిపోయాయి. విముక్తి పత్రాలు తీసుకునేందుకు రైతులు రాకపోతే అంతమేరకు మిగులు సొమ్మును ప్రభుత్వానికి బ్యాంకర్లు తిరిగి పంపించాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వాయిదాకు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రుణ మాఫీ రూ.17 వేల కోట్లకు బదులు రూ.16 వేల కోట్లకు తగ్గిపోనుంది. -
బాబు మార్కు బడ్జెట్!
హద్దూ, అదుపూ లేకుండా ఇచ్చిన హామీలకూ... కళ్లముందున్న వాస్తవాలకూ పొంతన కుదరనప్పుడు జనం ముందు తప్పు ఒప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. పారదర్శకంగా వ్యవహరించడం తప్ప మార్గం లేదు. అయితే, అందుకు చిత్తశుద్ధి ఉండాలి. అదిలేకపోబట్టే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు భారీ గణాంకాల మాటున దాగవలసివచ్చింది. అందమైన మాటల వెనక వైఫల్యాలను కప్పెట్టే యత్నం చేయాల్సివచ్చింది. ఒకపక్క లక్షా 13 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పరుస్తూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకుగానీ, అధికారంలోకొచ్చాక కురిపించిన వరాలకుగానీ ఆయన చోటివ్వలేకపోయారు. నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కూ, ఇప్పటికీ చంద్రబాబు సర్కారు సాధించిన పురోగతి ఏమైనా ఉంటే అది జనం తలసరి అప్పును అమాంతం పెంచడమే! ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి అప్పులు రూ. 1,29,264 కోట్లుంటే...వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 17,588 కోట్లు అప్పుతీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇదింకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే రూ. 12,000 కోట్ల వరకూ అప్పు తప్పదని నిరుడు అంచనావేసిన ప్రభుత్వం దాన్ని రూ. 20,000 కోట్లకు పెంచింది. ఈ అప్పులనైనా ఆస్తుల కల్పనకు ఖర్చుచేసి ఉంటే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉండేది. కానీ, ఎక్కువ భాగాన్ని రెవెన్యూ వ్యయానికే ఉపయోగిస్తున్నారు. పర్యవసానంగా పెరిగేవి అప్పులే. వాటిపై కట్టాల్సిన వడ్డీలే. కనుక ఈసారి ద్రవ్యలోటు రూ. 17,584 కోట్లుగా అంచనావేసినా చివరకు అది అంతకన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పులు చేయడంపై విధించిన 14వ ఆర్థిక సంఘం పరిమితులను కూడా మించిపోవడమంటే వ్యయంపై ప్రభుత్వానికి అదుపు లేకపోవడమే. పాలనలో సుదీర్ఘ అనుభవమున్నదని తరచు చెప్పుకునేవారు చేయాల్సిన పనేనా ఇది?! అదనపు పన్నుల భారాన్ని మోపడం లేదంటూనే...వచ్చే ఏడాదిలో పన్నుల ద్వారా అదనంగా రూ. 7,000 కోట్లు వస్తుందని యనమల అంచనావేస్తున్నారు. ఈ అదనపు ఆదాయాన్ని రాబట్టడానికి ‘ఇతర మార్గాలు అన్వేషిస్తామ’నడం తప్ప ఏం చేయదల్చుకున్నదీ ఆయన చెప్పలేదు. పన్నుల రూపంలో మొత్తం రూ. 44,432 కోట్లు వస్తుందంటూనే వ్యాట్ పద్దులో రూ. 4,000 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా రూ. 1,000 కోట్లు, యూజర్ చార్జీల ద్వారా రూ. 500 కోట్లు అదనంగా రాగలవని మాత్రం ఆయన చూపారు. ఈ చూపిన మొత్తాలతో కలుపుకుని పన్నులు, చార్జీల ద్వారా మొత్తం రూ. 7,000 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆశిస్తూనే కొత్త పన్నులు ఉండబోవని చెప్పడం వంచన తప్ప మరేమీ కాదు. ఇక నిరుద్యోగ భృతి, అంగన్వాడీ కార్యకర్తల జీతాల పెంపు ఊసే లేదు. కొత్తగా మరో లక్షమందికి పింఛన్లు ఇస్తామని ఊదరగొట్టిన సర్కారు తీరా అమల్లో ఉన్నవాటికే అరకొర కేటాయింపులు చేసింది. రైతుల రుణమాఫీ విషయంలో ఏదో అమలు చేస్తున్నామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం...డ్వాక్రా రుణాల విషయంలో ఆ మాత్రం కూడా మాట్లాడటం లేదు. ఆ ఊసెత్తకుండా దాని స్థానంలో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించింది. అసలు డ్వాక్రా రుణమాఫీ విషయంలో నియమించిన కమిటీ నివేదిక ఏమైందన్నది కూడా చెప్పలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రుణమాఫీ కూడా డిటోయే. చేనేత రుణమాఫీకి రూ. 168 కోట్లు అవసరమని అంచనా వేస్తే అందుకోసం కేటాయించిన మొత్తం అత్యంత స్వల్పం. ఇక చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో నిధి హామీ ఎటుపోయిందో తెలియదు. ఇవి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల దుస్థితి. అధికారానికొచ్చాక ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అంతంతమాత్రమేనని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసమని భూ సమీకరణ కింద రైతులనుంచి ‘స్వచ్ఛందంగా’ 33,000 ఎకరాలు తీసుకున్నామని ఘనంగా ప్రకటించినా వారికివ్వాల్సిన నష్టపరిహారం కోసం చేసిన కేటాయింపు రూ. 60 కోట్లు మాత్రమే! ఒకపక్క అంతర్జాతీయ శ్రేణి రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటనలిస్తూ అందుకోసం కేటాయించింది రూ. 303 కోట్లు! తమ నిర్వాకమే ఇలావుంటే రాజధాని నిర్మాణానికి కేంద్రాన్ని అడగడం, సాధించడం సాధ్యమవుతుందా?! వర్షాభావ పరిస్థితులనూ, హుద్‌హుద్ తుపానువంటి విలయాన్ని ఎదుర్కొని కూడా 5.9 శాతం వృద్ధిని నమోదుచేసిన వ్యవసాయరంగంపై ప్రభుత్వం శీతకన్నేసింది. శుక్రవారం రూ. 14,184 కోట్లతో ప్రవేశపెట్టిన వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో అధిక భాగం ప్రణాళికేతర వ్యయమే ఉంది. అదంతా జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉపాధి హామీ తదితరాలుండే ప్రణాళికా వ్యయానికి కేటాయింపులు తక్కువున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసమే ప్రత్యేకంగా రూ. 5,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ హామీ కాస్తా అటకెక్కిందని ఈ ప్రత్యేక బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఉచిత విద్యుత్‌కు రూ. 6,455 కోట్లు అవసరమని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరితే అందుకోసం ప్రభుత్వం కేటాయించింది రూ. 3,000 కోట్లు. కనుక ఉచిత విద్యుత్‌కు కోతపడుతుందన్నమాట! వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ రంగం ఎంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదో అర్థమవుతుంది. సమస్యలు లేవని కాదు...కొత్త రాష్ట్రం గనుక ఎన్నో పరిమితులూ, ఇబ్బందులూ ఉంటాయి. కానీ, ఆ సవాళ్లను ఎదుర్కొనడం తమకే సాధ్యమని కదా అధికారంలోకొచ్చింది! ఇప్పటికైనా వాస్తవాలను చెప్పి, వైఫల్యాలను అంగీకరించక భారీ లక్ష్యాలు, గణాంకాల వెనక దాగడం దేనికి?! -
బ్రాందీ, విస్కీ, ఇసుక మరియు మట్టి
రుణమాఫీ ప్రస్తావన రెండు బడ్జెట్లు తీసుకురాలేదు. ఇది పచ్చి దగా అంటున్నాయి ప్రతిపక్షులు. ప్రతివారూ ఒక్క నిజం గ్రహించాలి. పార్టీ మేనిఫెస్టోలు ఉత్తమస్థాయి కాల్పనిక సాహిత్యమని గ్రహించాలి. హమ్మయ్య! ఒక పని అయిపోయింది. తెలుగు బ్రదర్స్ బడ్జెట్ పాఠాలు వినిపించడం విజయ వంతంగా పూర్తయింది. ప్రతి ఏటా మార్చిలో ఇదొక జాతర. బడ్జెట్లో అంకెలు చూస్తుంటే కడుపు నిండిపోతూ ఉంటుం ది సామాన్యుడికి. అయితే, మనం ఎన్నుకున్న మన సర్కార్లు ఈ ఏడాది ఖర్చు చేసే సొమ్ము లక్షా పదిహేను వేల కోట్లు! పైగా ఏదో మొద్దంకెలు కాకుండా రూపాయి అణాపైసలతో సహా విడివిడిగా పద్దుల్ని చూసి నివ్వెరపోతుంటే, ‘‘ఏముందిరా! మన కుటుంబ లెఖ్ఖలు మనం వేసు కోమూ! ఇదీ అంతే!’’ అన్నాడు మా బాబాయ్. అస లు మా బాబాయ్‌కి ఏదీ ఆశ్చర్యంగా అనిపించదు. ‘‘పంట రైతులం. మనం ఏటా పప్పులకు ఇంత, ఉప్పులకింత, పండుగలకింత, ప్రయాణాలకింత అని అనుకుంటాం కదా! అన్నీ అనుకున్నట్టు జర గవు. పంట దిగుబళ్లు మన లెఖ్ఖల ప్రకారం ఉండవు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టుండి ఓ చిన్నపిల్ల పెద్దపిల్ల అవుతుంది. మూడో పిల్ల మళ్లీ పురిటికి వస్తుంది. బోరుబావి ఎండిపోతుంది. ఇలాగే సవా లక్ష అనుకోనివి మనకే ఉంటే, యనమలకి ఎన్ని ఉంటాయి పాపం! అరవై ఏళ్ల నుంచి ఒకే మాట- ఇది పేదవాడి బడ్జెట్ అని. అయినా ఈ దరిద్రం దేనికంటే, అది మన ప్రార బ్ధం. చూడగా చూడగా మన రాష్ట్ర భవిష్యత్తు బ్రాందీ, విస్కీల మీద, ఇసుక మీద ఆధారపడి ఉండేటట్టుంది. తెలంగాణ ఫ్యూచర్ పూడిక మట్టి మీద కేంద్రీకృతమై ఉందని నిశ్చయమైపోయింది. లోపాయికారీగా అందిన సమాచారమేమంటే, మిషన్ కాకతీయ వాస్తుకి ముడి పడి తెరమీదకు వచ్చిందని! గ్రామానికి ఈశాన్య మూల పల్లం ఉండాలని, అది నీరు నిండిన తటాకమైతే ప్రశస్థ మని వాస్తు ఘోషిస్తోంది. నైజాం నవాబు 1945 తరు వాత చెరువుల్ని అలక్ష్యం చేశాడట. క్రమేపి మేటవేసి మెరకలైనాయి. దాంతో జలావాసాలు జనావాసాలుగా మారాయి. ఆ వాస్తు దెబ్బతోనే నైజాం రాజ్యాన్ని కోల్పో యాడట. అందుకే తెలంగాణ సర్కార్ ఈ మహో ద్యమానికి గడ్డ ఎత్తింది. పైగా ప్రయోజనం ఉభయ తారకం. అన్నట్టు బడ్జెట్లో ఎన్ని దుక్కుల వర్షం కురిపిస్తారో స్పష్టంగా చెప్పలేదు. ఎంతమందిని అక్షరాస్యులని చేస్తారో సెలవియ్యలేదు. ఎందర్ని లక్షాధికారుల్ని చేయ నున్నారో అంకెలు ఇవ్వలేదు. ‘జాబు-బాబు’ మాట మర్చేపోయారు. ఒక్కసారిగా విజన్ 2050 కి మహా జంప్ చేశారు. ‘‘అప్పటికి చాలామంది రాలిపోతారు, అడిగేవాళ్లుండరు’’ అన్నాడు బాబాయ్. రుణమాఫీ ప్రస్తావన రెండు బడ్జెట్లు తీసుకురాలేదు. ఇది పచ్చి దగా అంటున్నాయి ప్రతిపక్షులు. ప్రతివారూ ఒక్క నిజం గ్రహించాలి. పార్టీ మేనిఫెస్టోలు ఉత్తమ స్థాయి కాల్పనిక సాహిత్యమని గ్రహించాలి. ఆ సినిమా ఎందుకంత బాగా ఆడింది? మనదెందుకు ఆడలే దని ఆలోచన చేసుకోవాలి. అందులో కథ బావుంది, డైలాగులు అదిరాయి, పాటలు వినసొంపుగా ఉన్నాయి. మరింక ఆడకేంచేస్తుంది? అందుకని ఊరికే వాగ్దానాలు నెరవేర్చ లేదని వేష్ట పడకూడదు. నన్ను గెలిపిస్తే సముద్రాలని మంచినీటి సము ద్రాలుగా మారుస్తానని అంటే ఎవరైనా నమ్మి ఓటే స్తారా? ఒకవేళ గెలిపిస్తే ఆ నాయకుడు ఏమంటాడో తెలుసా? ‘‘ఇట్లాంటి శుష్క వాగ్దానాలు నమ్మి మోస పోకండి. ప్రజారాజ్యంలో దగాపడద్దు తమ్ము లారా!’’ అని హెచ్చరించడానికే చేశానంటాడు. ప్రతి ఏటా ఈ వసంతరుతువులో గవర్నర్ ప్రసంగాన్ని తీర్చి దిద్దడం, బడ్జెట్ అంకెల్ని పూరించడం, వ్యతిరేకతల మధ్య గవర్నర్‌కి ధన్యవాదాలు చెప్పడం తప్పనిసరి విధి. కాదంటే తిథి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వేలం వర్రీ!
అంపిలి గ్రామ రైతులకు బుధవారం ఆంధ్రాబ్యాంకు షాకిచ్చింది. ఈ గ్రామంలోని 30 రైతులకు బ్యాంకు నుంచి నోటీసులందాయి. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించకపోతే వాటిని వేలం వేస్తామన్న హెచ్చరిక ఆ నోటీసుల సారాంశం. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రుణమాఫీ ఉచ్చులో పడి పీకల మీదకు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. పాలకొండ : రైతు రుణమాఫీ హామీతో ఆధికారం చేపట్టిన ప్రభుత్వం.. ఆనక సవాలక్ష నిబంధనలతో తమను మోసగించిందని రైతులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రుణమాఫీ అర్హుల జాబితాను, మొత్తాలను సగానికి సగం కోత వేసినా..మిగిలిన వాటికైనా ఇప్పటికీ చెల్లింపులు జరపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది వడ్డీతో సహా రుణాలు చెల్లించాలని బ్యాంకులు పీక మీద కత్తి పెడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా బ్యాంకులు బంగారం తాకట్టు రుణాలకు సంబంధించి జారీ చేస్తున్న వేలం నోటీసులు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. పంట రుణాలతోపాటు బంగారం రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణంలో నాలుగోవంతు బ్యాంకులకు జమ చేస్తామని, మిగతా మొత్తానికి బ్యాంకులకు ఒప్పంద పత్రాలు అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో బ్యాంకు అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. బకాయి పడిన రైతులకు వేలం నోటీసులు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన 30 మంది రైతులకు బుధవారం ఆంధ్రాబ్యాంకు నుంచి నోటీసులు అందాయి. వీరంతా బంగారు అభరణాలను తాకట్టుపెట్టి రుణాలు పొందినవారే. మాఫీ జాబితాలో పేర్లు ఉండడంతో రుణాలు చెల్లించకుండా ఉన్నారు. అయితే రుణమాఫీ నిధులు బ్యాంకులకు జమ కాకపోవడంతో బ్యాంకర్లు బంగారు అభరణాలను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. వడ్డీతో సహా రుణ మొత్తాలు భారీగా పెరిగిపోవడం.. ఒకేసారి ఆ మొత్తం చెల్లించాల్సి రావడం రైతులను కలవరపరుస్తోంది. బ్యాంకులు మాత్రం తమకేమీ సంబంధం లేదని రైతులపైనే భారం వేస్తున్నాయి. మాఫీ జాబితాలో పేరు ఉన్నా... ఆంధ్రా బ్యాంకులో బంగారు అభరణాలు తాకట్టుపెట్టి రూ. 30 వేల రుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 42 వేలు చెలించాల్సి ఉంది. రుణమాఫీ జాబితాలో నా పేరు ఉండడంతో అప్పు చెల్లించలేదు. రుణమాఫీ పత్రాలు అందజేశారు. కానీ నిధులు జమ కాలేదంటూ వస్తువులను వేలం వేస్తామని నోటీసులు అందజేశారు. -లంక సూర్యనారాయణ, రైతు, అంపిలి మాఫీకి రుణాలకు సంబంధం లేదు రుణమాఫీకి రుణాలు చెల్లించడానికి సంబంధంలేదు. ప్రభుత్వం మాఫీ ప్రకటిస్తే నిధులు బ్యాంకులకు జమ కావాలి. ఎడాదిన్నర దాటిన రుణాలకు నోటీసులు ఇస్తున్నాం. ఒకవేళ మాఫీ వస్తే రుణాలు కట్టిన వారికీ వర్తిస్తుంది. ప్రభుత్వం నిధులు చెల్లించే వరకూ రుణాలు చెల్లించకుండా ఉంటే ఎలా? ప్రభుత్వం నిధులు జమ చేస్తే నోటీసులు వెనుక్కి తీసుకుంటాం. -జె.షన్ముఖరావు, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ -
ఆ ఒక్కటీ అడగొద్దు
‘లక్షల్లో రుణాలు మిమ్మల్ని ఎవరిమ్మన్నారు. మీరు ఇష్టమొచ్చినట్టు ఇవ్వడం వల్లే ఇప్పుడు రుణమాఫీ అమలు చేయలేకపోతున్నా..ఈసారి స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇవ్వండి..లేకుంటే మీకే ఇబ్బంది.’ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవీ.. మీ అవసరాల కోసం ఇష్టమొచ్చినట్టుగా రుణాలు తీసుకుంటారు..ఇప్పుడు బకాయిలు చెల్లించమంటే నోరెళ్లబెడతారు..మాఫీ వంకతో బకాయిలు చెల్లించడం లేదు..మీకు కొత్త రుణాలు కావాలా? జిల్లాలో ఓ బ్యాంకరు రైతులనుద్దేశించి అన్న మాటలు. సాక్షి, విశాఖపట్నం: ఇవి చాలు అన్నదాతల పట్ల ప్రభుత్వానికి..బ్యాంకర్లకు ఉన్న దృక్పథాన్ని అర్థం చేసుకోడానికి. ఎన్నికల్లో రూ.87వేల కోట్ల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తానంటూ రైతులను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష నిబంధనలతో ఆ మాఫీ కాస్తా ఐదువేల కోట్లకు కుదించేశారు. మాఫీ మాట దేవుడెరుగు..కొత్త రుణాలైనా ఇప్పించండి మహాప్రభో అంటే బకాయిల సాకుగా చూపి ఆ ఒక్కటీ అడగొద్దంటూ బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు. దీంతో జిల్లాలో రానున్న సీజన్లో రుణాలు విరివిగా మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ ఉన్నా అప్పులిచ్చేవారు..స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా ఇంటిలో ఎవరి పేరునైనా సరే విరివిగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం అంటూ బంగారం కుదవ పెట్టి అప్పులడిగితే ఆభరణాల విలువలో 75 శాతం మొత్తం రుణాలుగా ఇచ్చేవారు. వీటిపై 33 పైసలు మాత్రమే వడ్డీ వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయ అవసరాల కోసమని ఎవరైనా అప్పు కోసం బ్యాంకుకు వెళితే మేనేజర్లు పెడుతున్న ఆంక్షలు రైతులకు దిమ్మతిరిగిపోతుంది. నువ్వు రైతువా?నీకు భూమిఉందా? నీపేరు మీదే ఉందా? నీకు ఏ బ్యాంకులోనైనా అప్పు ఉందా? ఉంటే ఎంత? ఎంత చెల్లించావు? ఇంకా ఎంత చెల్లించాలి? అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారు. తన భార్య పేరు మీద భూమిఉందని చెబితే అయితే ఆమెనే తీసుకురా..ఆమె పేరుమీదే రుణం ఇస్తాం.. నువ్వు అడిగినంత ఇవ్వలేం. స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ఇక వ్యవసాయ అవసరాల కోసం భూమి పత్రాలతో పాటు బంగారం కుదువపెట్టి రుణం అడిగితే నీకు ఎకరం భూమి ఉండి.. కిలో బంగారం తీసుకొచ్చినా సరే గతంలో మాదిరి బంగారం విలువలో 75 శాతం మేర వ్యవసాయ రుణంగా ఇవ్వలేం. బంగారు రుణాలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఎకరాకు 24వేలకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. అంతకుమించి కావాలంటే బంగారాన్ని కుదవపెట్టుకుని రూపాయికి పావలా వడ్డీకి రుణాలిస్తామే తప్ప వ్యవసాయ రుణం పేరిట ఇవ్వలేమంటున్నారు. పైగా భూ మి, బంగారం తనదై ఉండాలంటూ మెలిక పెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఖరీఫ్‌లో రూ.650 కోట్లు, రబీలో రూ.312 కోట్ల రుణం ఇ వ్వాలని నిర్ణయిస్తే రుణమాఫీ పుణ్యమా ని అతికష్టం మీద ఖరీఫ్‌లో రూ.342 కోట్లు, రబీలో రూ.204కోట్ల మేర రుణాలివ్వగలిగారు. రానున్న 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో రూ.800కోట్లు, రబీలో రూ.300కోట్ల చొప్పున జిల్లాలో రైతులకు రూ.1100కోట్ల మేర రుణాలివ్వాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ రుణామాఫీ భూతం వెన్నాడుతున్నందున రానున్న వ్యవసాయసీజన్‌లో కూడా యాక్షన్ ప్లాన్‌కు తగ్గట్టుగా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని అధికారులే అంగీకరిస్తున్నారు. -
‘మాఫీ’ తొలిదశ అప్లోడ్ గడువు పెంపు
రుణ విముక్తిపై రేపు బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు భేటీ సాక్షి, హైదరాబాద్: తొలిదశలో రుణమాఫీకి సంబంధించి రైతుల వివరాల అప్‌లోడ్‌కు గడువును ఈనెల 23 వరకు పొడిగించారు. ఈ గడువు శనివారం ముగిసినా, ఇంకా ఆరులక్షల ఖాతాల వివరాలు అప్లోడ్ కావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో 26.77 లక్షల మంది రైతులకు సంబంధించి 20 శాతం మేర రుణ విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత డిసెంబర్ నాలుగో తేదీ ప్రకటించారు. వీరిలో ఆరులక్షల మంది రైతుల ఖాతాల వివరాలను ఇంకా బ్యాంకర్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ వివరాలను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌లో వేసిన తరువాత వడపోత చేపడతారు. ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, భూమి రికార్డులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా ఈ ఖాతాల కుటుంబాల సంఖ్యను తీస్తారు. అప్పుడు రుణ విముక్తికి అర్హులైన కుటుంబాలెన్ని, రుణం ఎంత అనేది తేలుతుంది. తొలి దశలో రుణ విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,664 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించగా ఇప్పటి వరకు రూ.4,300 కోట్లు వ్యయమయ్యాయి. మరోవైపు రెండో దశలో రుణ విముక్తి కోసం 25 లక్షల ఖాతాల వివరాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శనివారంతో ఈ గడువు ముగిసింది. 25 లక్షల ఖాతాలకుగాను శనివారం నాటికి 14 లక్షల ఖాతాల వివరాలు మాత్రమే వచ్చాయి. ఇక గడువు పొడిగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 14 లక్షల ఖాతాలనువడపోసి మాఫీకి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. సీఎం చంద్రబాబు సోమవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించనున్నారు. -
గుండెపోటుతో రైతు మృతి
అనంతపురం: రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆవేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పెరులో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఇప్పెరు గ్రామానికి చెందిన ఏకుల గోపాల్(50) రుణమాఫీ కోసం 20 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు. (కూడేరు) -
కరువుపై నిర్లక్ష్యం ఎందుకు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రైతాంగం కరువుకోరల్లో చిక్కుకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కరువు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అప్పులపాలై 750 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. 9 తెలంగాణ జిల్లాల్లో 40 శాతం దాకా వర్షపాతం లోటుందన్నారు. దీనిపై నివేదికలు అందినా ప్రభుత్వం కరువుప్రాంతాల ప్రకటన చేయలేదన్నారు. రుణమాఫీ అమలుకాక, ఖరీఫ్ రుణాలు అందక, కరెంటు కోతలతో పంటలెండిపోయి, పండిన పంటలకు మద్దతు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎస్బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన
నల్లగొండ: జిల్లాలోని నడిగూడెంలో పంట రుణాలు ఇవ్వాలని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. గత వారం రోజులుగా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 100 మంది రైతులు బ్యాంక్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. (నడిగూడెం) -
ఫిబ్రవరి 7 వరకు రుణమాఫీ గడువు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ గడువును ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. రైతులంతా బ్యాంకులకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. -
రెన్యువల్ కాకుంటే మాఫీ లేదు
రుణాలు పునరుద్ధరించుకోనిరైతుల ఖాతాల్లో మాఫీ నిధులు జమచేయొద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ ఇలా మిగిలిపోయే రూ. 500 కోట్లు వెనక్కు ఇచ్చేయండి బ్యాంకులకు సర్కారు ఆదేశం రాష్ట్రంలో రెన్యువల్ కాని రుణ ఖాతాలు దాదాపు 8 లక్షలు ఈనెల 31 వరకు రెన్యువల్‌కు గడువు సాక్షి, హైదరాబాద్: రుణాలు రెన్యువల్ (పునరుద్ధరణ) చేసుకోని రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం తేల్చింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. దీనితో బ్యాంకుల్లో పంట రుణం తీసుకుని, వాటిని పునరుద్ధరించుకోని దాదాపు ఎనిమిది లక్షల అకౌంట్లకు సంబంధించిన రైతులకు రుణమాఫీ అయ్యే అవకాశం లేకుండా పోతోంది. రుణాలు పునరుద్ధరించుకోని రైతుల ఖాతాల్లో మాఫీ నిధులు జమచేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బ్యాంకర్లకు దిక్కుతోచడం లేదు. రుణాలు తీసుకున్న రైతులను ఏదో విధంగా పిలిపించి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేకపోతే ఆ రుణాలన్నీ నిరర్థక ఖాతా కింద మారే ప్రమాదం ఏర్పడడంతో వారు రైతుల వెంటపడుతున్నట్లు సమాచారం. రైతులు పునరుద్ధరణ చేసుకోకపోవడం వల్ల బ్యాంకుల్లో మిగిలిపోయిన దాదాపు రూ. 500 కోట్ల నిధులను తమ ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. రైతుల నుంచి వసూలు చేసే బదులు ప్రభుత్వం ఏకమొత్తంలో నిధులు చెల్లించడంతో సంబరపడ్డ బ్యాంకర్లు తాజా నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ నెలాఖరులోగా సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులతో రుణాలు పునరుద్ధరణ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క రుణాలను పునరుద్ధరించుకోకపోవడంతో రుణమాఫీకి అర్హత కోల్పోయే రైతులకు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం పైసా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో మొత్తం రూ. 17 వేల కోట్లకుపైగా పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో మూలధనం, వడ్డీ కలిపి మొత్తం బ్యాంకులకు చెల్లించి రైతులకు రుణవిముక్తి కల్పిస్తామని ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా ఈసారి రుణం పునరుద్ధరణ చేసుకోకుంటే.. మిగిలిన దశల్లో రుణమాఫీ వర్తించదని పేర్కొనలేదని బ్యాంకర్లు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించలేదంటున్నారు. రుణమాఫీ మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,250 కోట్లను బ్యాంకులకు గత అక్టోబర్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 36 లక్షల అకౌంట్లు ఉంటే.. అందులో దాదాపు ఏడు లక్షలకు పైగా అకౌంట్లు ఉన్న రైతులు ఇప్పటి వరకు రుణాలను పునరుద్ధరించుకోలేదు. రుణమాఫీ ప్రక్రియ మూడు నెలలుగా సాగుతున్నా రైతులు ముందుకు రాకపోవడంతో ఇకపై వారిని కొనసాగించడం వల్ల లాభం లేదని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. లక్ష రూపాయలకుపైగా రుణాలు తీసుకున్న వారు, భూములు విక్రయించిన వారు పునరుద్ధరణకు ముందుకు రావడం లేదన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మొదటి దశలోనే ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలాయంటే... ఆ లెక్కన వచ్చే మూడు దశలకు చెల్లించాల్సిన మొత్తంలో దాదాపు రూ.1500 కోట్లు మిగిలే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 31లోగా రైతులు తమ పంటరుణాలను పునరుద్ధరించుకోకపోతే వారు రుణమాఫీకి అర్హత కోల్పోతారని జిల్లాల్లో వ్యవసాయ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ మేరకు వారు నోటీసులు జారీ చేస్తున్నారు. -
రాజధాని గ్రామాల రైతులకు ఒకేసారి రుణమాఫీ
విజయవాడ: ఏపీ రాజధాని గ్రామాల రైతలకు ఒకేసారి రుణమాఫీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. అర్హులైన వారికి రూ.1.50 లక్షలు ఓకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 7403 మంది రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కోంది. తుళ్లూరు పరిధిలోని 3 మండలాల్లోని 25 గ్రామాల రైతులకు ఈ రుణమాఫీ వర్తించనుంది. కాని రాజధాని గ్రామాల డ్వాక్రా మహిళలకు మాత్రం రుణమాఫీ వర్తించదు. -
రెండు రోజుల్లో రాజధానిలో రుణమాఫీ
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి తాడికొండ: తుళ్ళూరు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోని రైతులకు ఒకేసారి రూ.లక్షన్నర రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్‌శాఖమంత్రి నారాయణ తెలిపారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడలో సోమవారం ఉదయం సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని చర్చించామని, దానిపై తగిన చర్యలకు సీఎం వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో రాజధాని రైతులందరికీ రుణ మాఫీ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం రూ.186 కోట్లు ఖర్చవుతుందన్నారు. భూసమీకరణ వేగవంతానికి చర్యలు.. తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తుళ్ళూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా 10 వేల ఎకరాలు, ఫిబ్రవరి 10 తేదీలోగా 18 వేల ఎకరాలు సమీకరించి, ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. -
తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్: ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలవదని చరిత్ర రుజువు చేసిందని, అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇప్పల్‌నర్సింగాపూర్‌లో రైతులకు కృషి రత్నం అవార్డులను ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కిసాన్ రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయంపై 75 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 3,376 కోట్లు రుణమాఫీ చేస్తే, తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలోనే రూ. 4,250 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది కాలం కాకపోవడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని, వచ్చే ఏడాది వరకు కొంత మేరకు కష్టాలు గట్టెక్కుతాయని, మరో మూడేళ్లలో కంటి రెప్పపాటు కూడా కరెంటు కోతలు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కాదు జమ్మికుంట: ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కాదని, అది ప్రజలందరిదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పరమావధిగా ఉండాలన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బుధవారం జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ముళ్ల కిరీటం లాంటిదని, అది అందరికీ రాదని, ప్రజల ఓట్లతో వచ్చిన అధికారాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పాత్ర గొప్పదని, ఒక గ్రామంలో పదిమంది ఐఏఎస్‌లు ఉండవచ్చు కానీ.. ఆ గ్రామానికి ఒక్కరే సర్పంచ్ ఉంటారని, నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారని అన్నారు. గ్రామాలలో వార్డు సభ్యులే మూల స్తంభాలని, ప్రభుత్వపరంగా వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులతో సక్రమంగా ఉంటే గ్రామాలలో సమస్యలు తలెత్తవని సూచించారు. -
రైతన్న హైరానా
పెదకూరపాడు: రుణమాఫీ వ్యవహారం రైతులకు తలనొప్పిగా పరిణమించింది. నింబధనల పేరిట ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోంది. మాఫీ వర్తించిన వారికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఖాతాలకు నగదు జమచేసే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. లేని అప్పులు చూపిండటం.. ఉన్న లోను మాఫీ కాకపోవడం.. ఇలా వ్యవసాయ రుణాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారం తగ్గించుకునేందుకు చంద్రబాబు సర్కారు లేని పోని సాకులు చూపుతూ అన్నదాత సహనాన్ని పరీక్షిస్తోంది. మాఫీ మాట దేవుడెరుగు వెన్యూ అధికారులు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక రైతుల హైరానా పడిపోతున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేసేస్తాం అంటూ బీరాలు పలికారు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా షరతులు విధిస్తూ రైతు ఖాతాల్లో కోత విధించింది. వడ్డీ చెల్లించాలని బ్యాంకర్ల వత్తిడి.. 2013 డిసెంబరు 31 లోగా తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ కావాల్సి ఉండగా ఈ ఏడాది మార్చి 31 లోపు ఉన్న రుణాలే మాఫీకి కిందకి వచ్చాయి. ఆ తర్వాత రూ.50వేల లోపు రుణ బకాయి ఉన్న వారికి రూ.1400 నుంచి రూ.1500 వరకు వడ్డీ భారపడుతోంది. దీనిపై రైతులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తే మార్చి 2013 తర్వాత తీసుకున్న వారు వడ్డీ చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. పెదకూరపాడు మండలంలో 7350 మంది రుణమాఫీకి అర్హత సాధించారు. వారిలో తక్కువ మందికి రూ. 50వేలు లోపు మాఫీ వర్తించింది. మాఫీ వర్తించిన కాలం నుంచి నేటి వరకు వడ్డీతో పాటు మళ్లీ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, భూముల వివరాములు, ఆఫిడవిట్ పేర్లుతో నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కొందరి రైతులు పేర్లు నేటికి ఆన్లైన్లో చూపించడం లేదు. పదిరోజుల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు ప్రసుత్తం సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడులు లేక అవస్థలు పడుతున్నారు. వడ్డీ చెల్లించమంటున్నారు.. నేను 25వేలు అప్పు తీసుకున్నాను. వడ్డీతో సహా రూ.33769 అయింది. ఈ మొత్తానికి 2013 నుంచి ఇప్పటి వరకు వచ్చిన వడ్డీ రూ.1,400 చెల్లించమంటున్నారు. లేదంటే రుణం మాఫీ కాదని బ్యాంకుల వారు చెప్తున్నారు. వడ్డీతో సహా మాఫీ అవుతుందనుకుని మోసపోయా. ఇప్పుడు చెల్లించకపోతే అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నారు. - నరిశెట్టి శేషగిరిరావు, రైతు, పెదకూరపాడు -
ప్చ్.. మాఫీ రూపాయే!
విశాఖపట్నం: రుణమాఫీలోని డొల్లతనం మరోసారి బయటపడింది. సుమారు రూ.35 వేలకుగాను ఒక్క రూపాయి రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు రైతుకు అందిన రుణవిముక్తి పత్రం చూస్తే రుణమాఫీ తీరు ఎలా ఉండో తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం మజ్జిపేటకు చెందిన మజ్జి సూర్యారావుకు అక్షరాల ఒక్క రూపాయికి రుణవిముక్తి పత్రం ఇచ్చారు. సూర్యారావు రెండేళ్ల కిందట మజ్జివలస పీఏసీఎస్‌లో సుమారు రూ.32 వేల రుణం పొందాడు. దీనికి రెండు సంవత్సరాలుగా మరో రూ.3 వేలు వడ్డీ పడింది. మొత్తం కలసి అతడికి సుమారు రు.35 వేలు రుణమాఫీ కావలసి ఉంది. అధికారులు ‘ఒక్క రూపాయి’ విలువ చేసే రుణవిముక్తి పత్రం ఇచ్చారు. సూర్యారావుకు మజ్జిపేట పంచాయతీలో 5/4, 6/4, 96/3 సర్వే నంబర్లలో ఉన్న 1.97 ఎకరాల మెట్ల భూమిలో మామిడి, టేకు, బంతి తోటలు, తన సిమెంటు రేకుల షెడ్డు కూడా గత ఏడాది అక్టోబరులో సంభవించిన హుద్‌హుద్ తుపానులో పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి కూడా పైసా పరిహారం అందలేదని సూర్యారావు చెప్పారు. ఈ పత్రం పట్టుకుని బ్యాంకు వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నాడు. -
మాఫీ..ఏమాయే!
సాక్షి, కడప : రుణమాఫీ వర్తించక కొందరు అల్లాడుతుంటే, మాఫీ.. మాయతో మరికొందరు అల్లాడుతున్నారు. కౌలు రైతుకు రుణమాఫీలో చాలావరకు ఎగనామం పెట్టిన ప్రభుత్వం రూ.50 వేల లోపు రుణం ఉన్న వారికి ఏదో రూ. 2-3 వేలతో సరిపెట్టింది. మరికొంతమంది బంగారు రుణం తీసుకుంటే అసలుకే ఎసరు పెట్టింది. కుటుంబానికి అంతా కలిపి రూ. 1.50 లక్షలు అన్నారు. మాఫీకి అఫిడవిట్ అన్నారు. ఇలా ఎన్నో ఆంక్షలు పెడుతూ మాఫీకి కోత పెడుతున్న టీడీపీ సర్కార్ ఏకంగా వింత లీలలకు చోటు కల్పిస్తోంది. ఇది ఏ ఒకరిద్దరిదో కాదు.. బయటికి రాని చాలామంది ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లాలో 5.82 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో వ్యవసాయ, అనుబంధ రుణాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పలు రకాల లిటిగేషన్లు పెట్టి 2.86 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేల్చారు. దీనికిగాను రూ. 314 కోట్లు మాఫీ కింద జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు చిన్న ఓబులేశు. సిద్దవటం మండలం జ్యోతి గొల్లపల్లెకు చెందిన రైతు. ఈయన 2011 నవంబరు 11వ తేదీన చనిపోయారు. ఈయన పేరుపై రుణం ఉంది. తనకున్న 75 సెంట్ల భూమికి సంబంధించిన పాసు పుస్తకం సిద్దవటం ఎస్బీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి వరి పంటపై రూ. 20 వేల రుణం తీసుకున్నారు. దానికి వడ్డీ కూడా రూ.8162 అయింది. అయితే, ఈ రైతు చనిపోవడం వల్ల ఆధార్ కార్డు లేదు. బ్యాంకు, రెవెన్యూ అధికారులకు డెత్ సర్టిఫికెట్ సమర్పించారు. వివరాలు తెలియజేసి భార్య సారెమ్మ పేరు మీద ఉన్న ఆధార్‌కార్డును జత చేశారు. కానీ ప్రభుత్వం ఆధార్‌కార్డు లింక్ కావడం లేదని తేల్చింది. ప్రస్తుతం రుణమాఫీ జాబితాలో రైతు పేరు లేకపోవడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం మృతుని కుమారుడు మహేష్ ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బ్యాంకు, రెవెన్యూ, మీ-సేవా ఇలా అన్ని సెంటర్ల చుట్టూ తిరిగారు. కానీ రుణమాఫీ కాకపోవడంతో ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సూర్యనారాయణ. ఈయనకు పులివెందుల మండలం పోలేపల్లె పంచాయతీలో 8.11 ఎకరాల భూమి ఉంది. వేరుశనగ పంటకు సంబంధించి పులివెందుల ఎస్బీఐ బ్యాంకులో పాసు పుస్తకం పెట్టి 2013లో రూ. లక్ష రుణం తీసుకున్నారు. అకౌంట్ నెంబర్ 11146289663. వడ్డీ కూడా దాదాపు రూ. 12 వేల పైచిలుకు అయింది. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పుస్తకంతోపాటు అన్నీ సమర్పించారు. కానీ, మొదటి రుణమాఫీ జాబితాలో సూర్యనారాయణ పేరు గల్లంతైంది. విచిత్రమేమిటంటే ఈయన బంగారంపై రుణమే తీసుకోలేదు. కానీ, బంగారు రుణానికి సంబంధించి మాఫీ అయినట్లు రావడం ఆయనను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వెంటనే బ్యాంకు అధికారులను అడిగితే ఏదో వచ్చింది..మళ్లీ సవరణల్లో పోతుందో ఏమో అని అంటున్నారని రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈమె పేరు కేసు చెన్నమ్మ. ఈమెకు 4.52 ఎకరాల పొలం ఒకచోట, 3.28 ఎకరాలు ఇంకోచోట ఉంది. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన చెన్నమ్మ ఆంధ్రాబ్యాంకులో పంట రుణంతో బంగారుకు సంబంధించి రూ. 1.99 లక్షల రుణాన్ని తీసుకుంది. అయితే రుణమాఫీ పత్రంలో మాత్రం చెన్నమ్మ స్వగ్రామం ఊటుకూరు కాకుండా బుగ్గలేటిపల్లె అని ఇచ్చి రుణమాఫీ వర్తించలేదని స్పష్టంగా తెలిపారు. దీంతో ఆమె లబోదిబోమంటోంది. పైగా వడ్డీమాత్రం దాదాపు రూ. 10 వేల పైచిలుకు అయినట్లు పేర్కొంటున్నారు. అన్ని అర్హతలున్నా రుణమాఫీ మాత్రం కాకపోవడంతో ఆమె ఆందోళన చెందుతోంది. టికేషన్లు పెట్టి 2.86 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేల్చారు. దీనికిగాను రూ. 314 కోట్లు మాఫీ కింద జమ చేస్తామని హామి ఇచ్చారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
కదిరి : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తెలిపారు. స్థానిక అత్తార్ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించినఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రజలను ఎవరిని కదిపినా రాక్షస పాలన సాగుతోందంటున్నారని ఎమ్మెల్యే టీడీపీ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. మోసపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన మొదటి 5 సంతకాల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలేదన్నారు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులను, ఇలా అన్ని వర్గాలను ముంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ‘రైతులెవ్వరూ ఒక్క రూపాయి కూడా అప్పు చెల్లించద్దని ఎన్నికలకు మునుపు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆధార్, రేషన్ కార్డు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రుణమాఫీకి సవా లక్ష లింకులు పెడుతూ రైతులు, అక్క చెల్లెమ్మలను ఉసూమనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి మంచి ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ సిద్దారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాలేదని, అప్పుడే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేశ్వర్‌రెడ్డి అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వేమల ఫయాజ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కిన్నెర కళ్యాణ్, పార్టీ జిల్లా కార్యదర్శి ఏ క్రిష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి కుర్లి శివారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జైనుల్లా, కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, శివశంకర్, జెడ్పీటీసీ మేకల ప్రమీళమ్మ, ఎంపీటీసీలు లక్ష్మిదేవి, రామక్రిష్ణమ్మ, సూర్యనారాయణమ్మ, శిరీషా, సర్పంచ్ ఇంద్రప్రసాద్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కందికుంటపై ఎమ్మెల్యే ధ్వజం సమావేశంలో ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా మాట్లాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై ధ్వజమెత్తారు. ఇటీవల కందికుంటు ఎమ్మెల్యే చేసిన విమర్శలకు ఘాటుగా సమాధనమిచ్చారు. తాను ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తున్నానన్నారు. కంది కుంటలా బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటూ చుట్టపు చూపుగా వచ్చి ప్రజ లను వెంట తిప్పుకోవడం లేదన్నారు. మైనారిటీలు గాలిలో గెలుస్తున్నారని కందికుంట అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు నిజాం వలీ, రసూల్‌సాబ్, మహమ్మద్ షాకీర్ తదితరులందరూ జనం ఆదరిస్తేనే గెలి చి మంత్రులు కూడా అయ్యారని గుర్తు చేశారు. టీడీపీ హవాలో కూడా గెలవలేని కందికుంట మైనారిటీలను తక్కువ అంచనా వేసి విమర్శిస్తే తగిన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెబుతారన్నారు. -
రుణమాఫీలో... తిరకాసు..
కడప అగ్రికల్చర్ : రైతుల రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందే తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. రుణమాఫీ చేసేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా బ్యాంకర్లు మాత్రం అఫిడవిట్, కుటుంబంలోని వారందరి ఆధార్‌కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని మెలికపెట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మొదటి విడతలో అర్హులని తేల్చిన వారిని సైతం మళ్లీ పెండింగ్ లిస్టులో చేరిందని వివరాలు అడుగుతుండడంతో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలా ఇంకెన్ని మెలికలు పెడతారో చెప్పాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమేమి సమర్పించాలో ఒకేసారి చెబితే సమర్పిస్తారు కదా అని..? రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో 2.86 లక్షల మందికి రుణమాఫీ వర్తిస్తుందంటూ జాబితా ప్రభుత్వం నుంచి జిల్లాకు చేరిందని అధికారులు చెబుతున్నారు. ఈ జాబితా ప్రకారం రూ. 314 కోట్లు అర్హుల ఖాతాలకు చేరుతుందని బ్యాంకర్లు అంటున్నారు. రుణమాఫీలో మొదటి విడత ఖాతాల వారికేనా, రెండో విడత మాఫీ అయ్యే వారికి కూడా ఇప్పుడు ప్రభుత్వం పంపిన సొమ్ములు ఖాతాలకు పడతాయా అంటే ఈ విషయాన్ని రైతులకు చెప్పే వారు కరువయ్యారు. ప్రధాన పంటలకు స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రకారం పెట్టుబడులు సరిపోక రైతులు కొందరు రెండు ఖాతాలతో పాసు పుస్తకాలను, బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. వేరువేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే ఒక సర్వే నెంబరుతో తీసుకున్న ఖాతా రుణమాఫీనే వర్తిస్తుందని తెగేసి చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు. పంట పెట్టుబడులకు సరిపడా రుణాలు ఇస్తే రెండు సర్వే నంబర్లు బ్యాంకుల్లో పెట్టాల్సిన అఘత్యం పట్టదని రైతులు అంటున్నారు. ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది రైతులు మదనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారులు జిల్లాలో 3,08,380 మంది ఖాతాలకు సంబందించిన వివరాలలో తేడాలు ఉన్నాయని మండల రెవిన్యూ అధికారులకు నేరుగా ఆన్లైన్లో జాబితాను పంపింది. గత అక్టోబరునెల 13వ తేదీ లోపల తుది జాబితాను తయారు చేసి పంపాలని ఆదేశించారు. అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు దీనిపై అధికారులు కుస్తీ పట్టినా సరైన సమాచారం ఎవరి వద్ద లేకపోవడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా పంటల సాగు కోసం భూములు, బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి 5,50,513 మంది రైతులు రుణాన్ని తీసుకున్నారు. ఇందులో ఆధార్, రేషన్‌కార్డులకు ముడిపెట్టి 3,08,377 ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లాలో రేషన్‌కార్డులు లేని రైతులు 41,365 మంది, ఆధార్‌కార్డులు లేని 14,291 మంది, ఆధార్, రేషన్ కార్డులు లేని 85,104 ఖాతాలు, ఆధార్ ఉండి కూడా ఆన్లైన్ ధ్రువీకరించని 1,67,617 మంది ఖాతాలు ఉన్నాయని తేల్చారు. వీటన్నింటిని పరిశీలించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శించాలని ఆర్థికశాఖ ఆదేశించింది. మండల రెవిన్యూ అధికారులు ఏ గ్రామ పంచాయితీల్లో కూడా జాబితాను ప్రదర్శించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దీనిపై ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జన్మభూమి కమిటీలు దీనిపై విచారణ చేయాలని పురమాయించినా పట్టించుకున్న నాధుడేలేడు. రుణమాఫీకి అర్హులెవరో అనర్హులెవరో చూసుకోవడానికి జాబితానే అందుబాటులోలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన కేవలం మభ్య పెట్టేందుకేనని రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. రుణమాఫీ చేసి తీరుతామని ఢంకా బజాయించి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రుణమాఫీపై ఎలాంటి చర్యలు లేవు. కేవలం మసిపూసి మారేడు కాయచేసేందుకే ఈ హంగామా అంతా అని రైతు సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వం ఏదో ఒక లిటిగేషన్ పెట్టి రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తే రైతులు మరిచిపోయి రుణాలు బ్యాంకులకు చెల్లిస్తారనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోందని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి. -
రెండు మండలాల్లోనే నష్టమట
కర్షకునికి ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రుణమాఫీ పితలాటకం తీరకముందే మరో పిడుగు వారి నెత్తిన పడింది. జిల్లాలో 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన అనంతరం సర్వే బృందం సేకరించిన లెక్కల్లో పంట నష్టాలు అంతగా లేవని, సగానికి పైగా దిగుబడి రైతులకు దక్కిందని లెక్క తేల్చడంతో ఇన్పుట్ సబ్సిడీ రెండు మండలాలకే పరిమితమయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా పడిపోయింది. దీంతో పంటలు పండక, వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా జిల్లాలో 56 మండలాలుంటే అందులో 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. యద్దనపూడి, ఉలవపాడు మండలాల్లో మాత్రమే వర్షపాతం ఎక్కువగా పడిందని గుర్తించారు. ఇంతవరకు బాగానే ఉంది. కరువు మండలాలుగా గుర్తించిన తర్వాత జిల్లా యంత్రాంగం పంట నష్టాలను గుర్తించేందుకు కరువు సర్వే బృందాలను నియమించింది. ఈ బృందాలు ఆయా మండలాల్లో సర్వే జరిపి నివేదికలిచ్చాయి. మార్కాపురం, కొరిశపాడు మండలాల్లోనే 50 శాతం పైగా పంట నష్టం జరిగిందని తేల్చారు. మిగిలిన మండలాల్లో కరువు చెప్పుకోదగిన స్థాయిలో లేదని తేల్చడంతో ఆయా మండల రైతుల్లో గందరగోళం నెలకొంది. కొరిశపాడు మండలంలో మొక్కజొన్న పంట 50 శాతానికిపైగా దెబ్బతిందని బృందం గుర్తించినట్లు సమాచారం.108 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 168 రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కాపురం మండలంలో పత్తిపంట 50 శాతంపైగా దెబ్బతింది. 1168 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.1335 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని సర్వే బృందం తేల్చిందని సమాచారం. ప్రకటించిన కరువు మండలాల్లో పంటలు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం జరగలేదని తేల్చారు. మొత్తం 50 శాతంలోపే పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. ఒక ఎకరా పొలం ఉంటే అందులో 50 శాతానికిపైగా పంట ఎండిపోవాలి. సరాసరి దిగుబడి కూడా 50 శాతం కన్నా తక్కువ రావాలి, ఇటువంటి నిబంధనలన్నీ క్రోడీకరించారు. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నప్పటికీ దిగుబడి 50 శాతం కన్నా తగ్గే పరిస్థితి లేదని బృంద సభ్యుల భావన. సర్వే బృందాల నివేదికలపై విజిలెన్స్ బృందాలు కూడా తనిఖీ చేసే అవకాశం ఉండటంతో వారు సాధ్యమైనంతవరకూ పంట నష్టం తక్కువగానే చూపించినట్లు తెలిసింది. 50 శాతం పంట నష్టపోయినచోట మాత్రమే ఇన్పుట్ సబ్సిడీకి అవకాశం ఉంది. మిగిలినచోట్ల కరువు మండలాల ప్రకటన కారణంగా రుణాల రీ షెడ్యూల్, పన్ను రాయితీ వంటి వెసులుబాటు మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో సార్వాలో -44 శాతం, దాళ్వాలో -46 శాతం వర్షపాతం తక్కువ నమోదయింది. ఒక్క జూలై నెలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, జూన్, డిసెంబర్ నెలల్లో అతి తక్కువ వర్షపాతం, మిగిలిన నెలల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఎలెన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. అక్టోబర్ వరకు వర్షం జాడలేకుండా పోయింది. 2,42, 062 హెక్టార్ల సాధారణ లక్ష్యానికిగాను సుమారుగా లక్ష హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. వేసిన పంటలు సైతం వర్షాలు లేక ఎండిపోయాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు బాబు రుణమాఫీ పుణ్యమా అంటూ బ్యాంకు రుణాలు అందక రైతులు బయట అధిక వడ్డీలకు తెచ్చి మరింత అప్పుల పాలయ్యారు. అప్పు వడ్డీతో సహా రెండింతలై కూర్చుంది. ఈ పరిస్థితుల్లో జిల్లా అధికారులు మొత్తం కరువు పరిస్థితి ఉందని నివేదిక పంపించారు. మొత్తం 56 మండలాలుండగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రెండు మండలాలకే పరిమితం చేస్తూ ఇచ్చిన ఈ నివేదిక రైతులను కంగారు పెడుతోంది. -
సభలో సీఎం, విపక్ష నేతల సంవాదం
అంత కోపంలోనూ చంద్రబాబు నోటి వెంట ఒక్క నిజమూ రాదు: జగన్ నా నీతి, నిజాయితీ వల్ల ఇన్నేళ్లుగా ఎవరూ వేలెత్తి చూపలేదు: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ‘‘... అదేదో ముని శాపం గురించి చెబుతారు కదా! చంద్రబాబుకూ ముని శాపం ఉన్నట్లుంది. ఒక్క నిజం నోట్లోనుంచి వచ్చినా తల వేయి వక్కలయివుతుందేమో! అంత కోపంలోనూ అ బద్ధాలు తప్ప ఒక్క నిజమూ ఆయన నోటి వెంట రాలేదు...’’ అని ప్రతి పక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం శాసనసభలో సీఎం చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ దశలో సీఎం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ‘‘నా రాజ కీయ జీవితం మొత్తం నీతిమయం. ఎవరూ వేలె త్తి చూపలేకపోయారు. విశ్వసనీయతకు మారు పేరు టీడీపీ. మీరు సీబీఐ కేసుల్లో నిందితులు’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆవేశం కట్టలు తెంచుకున్న ఈ సన్నివేశానికి సోమవారం శాసనసభ వేదిక అయింది. రుణమాఫీ పేరిట రైతులను రుణగ్రస్తులను చేశారంటూ కేస్ స్టడీస్‌తో సహా ప్రతిపక్ష నేత సభ ముందు ఉంచడంతో బాబు ఎదురుదాడికి దిగారు. సభానేత, విపక్ష నేత మధ్య వాగ్వాదం సాగిన తీరు ఇలా... విపక్ష నేత జగన్: కేస్ స్టడీస్ చెబుతున్నా. షరతులు, పరిమితులు, నిబంధనలతో ప్రభుత్వం రుణమాఫీ చేసిన తీరుకు మచ్చుకు కొంత మంది వివరాలు చెబుతున్నా. ప్రభుత్వం జమ చేసిన మొత్తం కంటే వడ్డీ ఎక్కువగా ఉంది. సీఎం చంద్రబాబు: కేస్ స్టడీస్ వద్దు. రియల్ స్టడీ స్ కావాలి. నిబంధనలు, మార్గదర్శకాల మేరకు మాఫీ చేశాం. తెలివి ఎక్కువై కేస్ స్టడీస్ చెబుతున్నారు. 2008లో జరిగిన రుణ మాఫీలో అవినీతి జరిగింది. ఇప్పుడు ఎక్కడా అవినీతి లేకుండా మాఫీ చేస్తున్నాం. జగన్: నాకు మాట్లాడే అవకాశం ఇచ్చి.. మధ్య లో సీఎం ప్రసంగించడానికి మైక్ ఇస్తే ఎలా? స్పీకర్: మీకూ మైక్ ఇస్తాం. సీఎం: నేను ఏటా 10 శాతం వడ్డీ ఇస్తాను. బ్యాం కుల్లో రుణాలు రీషెడ్యూలు చేసుకుంటే 4 శాత మే వడ్డీ పడుతుంది. ఇంకా 6 శాతం మిగులుతుందని కొండపిలో చెప్పాను. కేస్ స్టడీస్ కాదు. రియల్ స్టడీస్ చెప్పండి. దొంగ లెక్కలు రాయడం లో మీరు సిద్ధహస్తులు. జగన్: సీఎంకు ముని శాపం ఉన్నట్లుంది. ఆయన నోట్లోంచి ఒక్క నిజమూ రాదు. సీఎం: ఈయన తండ్రి కూడా ఇదే మాదిరి మాట్లాడారు. నా నీతి, నిజాయితీ వల్ల ఇన్నేళ్లుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. సీబీఐ కేసుల్లో మీరు నిందితులు. వ్యవసాయం దండగన్నానని వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రచారం చేశారు. జగన్: ముఖ్యమంత్రి కళ్లు పెద్దవి చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే మాకు నిజంగా భయమేసింది. (నవ్వుతూ..) ఇంతగొప్పగా.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పారు. కేస్ స్టడీస్ అంటే రైతులు పడుతున్న తిప్పలే. అవే నేను చెబుతున్నాను. సీఎం : నేను విధానం చెప్పాను. వాళ్లు కేస్ స్టడీస్ చెబుతున్నారు. పేరు, చిరునామా చెబితే సకల సమాచారాన్ని 5 నిమిషాల్లో చెబుతాం. జగన్ : చెప్పినవన్నీ మీకు సమర్పిస్తాం. పరిశీలించుకోండి. ఎన్నికలకు వెళదాం: జగన్ ప్రతి సవాల్ ఏపీలో ఆత్మహత్య చేసుకున్న 86 మంది రైతు లు.. రుణ మాఫీ అమల్లో ఉన్న సమస్యలు, లోపాలవల్లనే బలవన్మరణానికి పాల్పడ్డారని నిరూపిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేస్తానని, ప్రతిపక్ష నేత స్థానం నుంచి జగన్ తప్పుకుంటారా? అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సవాలు విసిరారు. దీన్ని స్వీకరించిన విపక్ష నేత.. ‘‘నేను యావ త్ టీడీపీకి సవాల్ చేస్తున్నా. మీకు ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళదాం. ఏవరేమిటో తెలుస్తుంది’’అని ప్రతిసవాల్ చేశారు. -
బుచ్చయ్య దూషణల పర్వం
అసెంబ్లీలో వైఎస్, రోజాలపై అనుచిత వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మీద టీడీపీ సభ్యుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశా రు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి, అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదానికి కారణమయ్యారు. సోమవారం రుణమాఫీపై చర్చ సందర్భంగా.. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 500 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది 172 మిల్లీమీటర్లే నమోదైనా జిల్లాలోని 4 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడాన్ని తప్పుబట్టారు. ఆయన ప్రసంగం కొనసాగుతుండగానే మైక్ కట్ చేసి.. టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చ య్య చౌదరికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. ప్రసంగం ప్రారంభించిన గోరంట్ల.. రోజా సినిమాలు, టీవీల్లో విలన్ వేషాలు వేశారని, అందుకే సభలో కూడా విలన్ వేషాలు వేస్తున్నారంటూ దూషించారు. చంద్రబాబుకు ముని శాపం ఉందని జగన్ అన్నారని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణా లు గాల్లో ఉన్నప్పుడే గాల్లో కలిసిపోయాయని దూషించారు. బుచ్చయ్య దూషణల పర్వంపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తన గురించి అనుచిత వ్యాఖ్యానాలు చేసినందున తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రోజా స్పీకర్ పోడియం వద్ద నిలబడి గట్టిగా డిమాండ్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో 344 నిబంధన కింద జరిగిన ఈ చర్చకు మంత్రి సమాధానం ఇవ్వకుండానే స్పీకర్ సభను అర్ధాంతరంగా సాయంత్రానికి వాయిదా వేశారు. సభ వాయిదా తర్వాత వైఎస్సార్సీపీ సభ్యులు గోరంట్లతో వాగ్వాదానికి దిగారు. అయితే పత్రికల్లో రాయలేని భాషలో రోజాను గోరంట్ల దూషించారు. ఆమె కంటతడి పెట్టడంతో వైఎస్సార్సీపీ సభ్యులు కూడా ఎదురుదాడి చేశారు. కౌరవ సభలా వ్యవహరించారు: జగన్ సభ తిరిగి నాలుగు గంటలకు ప్రారంభం కాగానే రోజా తన ఆవేదనను సభ ముందుంచే ప్రయత్నం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరించడాన్ని సభాపతి కూడా ఖండించకపోవడం దారుణమన్నారు. దీనికి ఆగ్రహించిన సభాపతి కోడెల శివప్రసాదరావు ‘హోల్డ్ యువర్ టంగ్’ అంటూ రోజాను వారించారు. ఆ సమయంలో ఎవరేం మాట్లాడారో విన్పించలేదని, సీసీ కెమెరాలను పరిశీలించి నిర్థారణకు వస్తానని చెప్పారు. మంత్రి యనమల రామకృష్ణుడు కల్పించుకుని సభలోనే కాదని, సభ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక ఎవరేం మాట్లాడుకున్నారో కూడా టేపుల్లో పరిశీలించాలని కోరారు. దీనిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఓ మహిళా సభ్యురాలు తనకు అవమానం జరిగిందని కన్నీరు పెడితే, కనీసం క్షమాపణ కూడా చెప్పకపోతే, మనమంతా ఎమ్మెల్యేలమేనా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒక ఆడకూతురికి అవమానం జరిగిందంటే కనీసం స్పందించడం లేదని, కౌరవ సభలా వ్యవహరించారని, కౌరవులకు పట్టిన గతే పడుతుందని, అన్నీ దేవుడే చూసుకుంటాడని అన్నారు. -
చర్చ జరపకుంటే ప్రతిఘటిస్తాం
ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పట్టు అసెంబ్లీ 15 రోజులపాటు జరపాల్సిందే సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ సమావేశాలను 15 రోజులపాటు పెంచాలని వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం అవకాశమివ్వకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్య లు, కరువు, రుణమాఫీ, కనీస మద్దతు ధర సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పారు. గురు వారం శాసనసభ వ్యవహారాల మండలి (బీఏసీ) అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్నివర్గాల ప్రజ లు అనేక ఇబ్బం దులకు గురవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెం బ్లీ వేదికగా చర్చించేందుకు 15 రోజులపాటు సమావేశాలను పొడిగించాలని బీఏసీలో తమ పార్టీ తరఫున కోరినట్లు చెప్పారు. రాయలసీమకు సాగునీరందక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లలో అవకతవకలు, ‘పచ్చ’ కమిటీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, అంగన్వాడీల సమస్యలు, హుద్‌హుద్ తుపాను, ఇసుక మాఫి యా, శ్రీశైలం విద్యుత్, పోలవరం నిర్మాణం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం-టెండర్, ఉద్యోగుల విభజన, పీఆర్సీ పెంపు వంటి సమస్యలపై అసెం బ్లీలో కూలంకషంగా చర్చించాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మాణం ప్రధానమైన అంశమని అభిప్రాయపడ్డారు. వివిధ కోణాల్లో చర్చకు వచ్చే విధంగా కృషి చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎం మాత్రం 2 రోజులపాటు సాయంత్రం వరకు సెషన్స్ కొనసాగించి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారని తెలిపారు. సభను తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తారా?: గడికోట సీఎం చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాన్ని హేళన చేసే విధంగా వ్యవహరించారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. వెంకటరమణ, పెషావర్ కాల్పుల్లో మృతులపై సంతాపం తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించినప్పడు... హుద్‌హుద్ తుపానులో చనిపోయిన మృతులు, కరువు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని తాము కోరామని తెలిపారు. అయితే ఆ సంప్రదాయం లేదని చంద్రబాబు తప్పించుకున్నారని, తనకే అన్నీ తెలుసు అన్న ధోరణి ఆయన విడనాడాలని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చలు జరగకుండా ప్రభుత్వం తప్పించుకునే ధోరణి అనుసరిస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. గుంటూరు భూములు సింగపూర్‌కు.. సింగపూర్ భూములు బాబుకు.. రాజధాని ప్రకటించిన గుంటూరు జిల్లాలో భూములు సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించేందుకు చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ వేస్తున్నారని, రైతుల జీవితాలు పణంగా పెట్టే చంద్రబాబు ఆటలు మాత్రం సాగనివ్వమని ఆ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముస్తఫాలు తెలిపారు. ‘గుంటూరు భూములు సింగపూర్‌కు.. సింగపూర్ భూములు చంద్రబాబుకు..’ అన్న విధంగానే ఏపీ ప్రభుత్వం, సింగపూర్ నడుమ క్విడ్ ప్రోకో జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి ఎన్నిసార్లు సింగపూర్‌కు వెళ్ళారో.. ఆయన పాస్‌పోర్టు స్టాంపింగ్ చూపించాలని అసెంబ్లీలో తాము డిమాండ్ చేస్తామని వారు చెప్పారు. -
ఉచిత విద్యుత్తు బకాయిలు కట్టాల్సిందే!
8 ఏళ్ల ఉచిత విద్యుత్ బకాయిలు కట్టాల్సిందే 8 లక్షల మంది రైతులకు సర్కారు నోటీసులు 2004 నుంచీ కట్టాలని ఒత్తిడి.. గ్రామాల్లో చాటింపుతో హెచ్చరికలు రెవెన్యూ చట్టాల ప్రయోగానికి, కేసుల నమోదుకూ సిద్ధం ఆధార్ ఆధారంగా ఇళ్ల సర్వీస్ నంబర్ల గుర్తింపు.. ఇంటి కనెక్షన్లకూ విద్యుత్ బంద్? రబీ దృష్ట్యా అన్నదాతల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: రుణమాఫీలో మోసపోయిన రైతన్నకు చంద్రబాబు సర్కారు మరో షాకిచ్చింది. ఉచిత విద్యుత్‌ను దొంగదెబ్బ తీసే క్రమంలో మరో అడుగు ముందుకేసింది. ఉన్నపళంగా ఎనిమిదేళ్ల విద్యుత్ బకాయిలూ కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2004 నాటి ఉచిత విద్యుత్ కనె క్షన్ జాబితాలో ఉంటే చాలు ఎనిమిదేళ్లుగా బకాయిలు ఉన్నట్టేనంటూ కొత్త లెక్కలు తెరమీదకు తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షల మంది రైతులకు డిమాండ్ నోటీసులు పంపింది. ‘బిల్లులు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం...’ అంటూ హెచ్చరిస్తోంది. విద్యుత్ వాడినా, వాడకున్నా ఈ బిల్లులు చెల్లించాల్సిందేనంటూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. అవసరమైతే ఇళ్లకూ విద్యుత్ సరఫరా నిలిపివేయాలనే యోచనలో ఉంది. బకాయిలు కట్టనివారిపై రెవెన్యూ చట్టాలను ప్రయోగించాలని నిర్ణయించింది. కేసులు పెట్టాలని ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగాలకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో విద్యుత్ వినియోగదారుల ఆధార్ నంబర్‌ను సేకరించిన పంపిణీ సంస్థలు, దీని ఆధారంగా రైతుల ఇళ్ళ సర్వీస్ నంబర్లు గుర్తించారు. వీటి ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాది రూ.360కి పెరిగిన సాధారణ చార్జీలు గత ఏడాది ప్రభుత్వం ఈ సాధారణ చార్జీలను రూ.120 పెంచి, ఏడాదికి రూ.360 వసూలు చేయాలని ఆదేశించింది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మోయలేని భారమనీ చెప్పింది. ఎన్నికల సమయంలో కూడా ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి రావడంతోనే నష్టాల పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా 2004-2011 వరకు ఉన్న బకాయి పడిన బిల్లులు చెల్లించాల్సిందిగా విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో రైతులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సర్కారు నోటీసులు అందిన రైతుల్లో ఉచిత విద్యుత్ వినియోగదారులు కాకుండా.. డీజిల్‌తో మోటార్లు నడిపించుకుంటున్న వాళ్ళూ ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 13.5 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటన్నిటికీ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పాత బకాయిల పేరుతో రైతుల్ని వేధించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీసిందని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. ఈ విషయమై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్‌ను ‘సాక్షి’ వివరణ కోరింది. ఎస్పీడీసీఎల్ సీఎండీకి ఫోన్ చేసి విషయం తెలుసుకున్న ఆయన.. ఇప్పటికిప్పుడు విద్యుత్ కనెక్షన్లు తొలగించవద్దని ఆదేశించారు. చట్ట సమ్మతమేనా? విద్యుత్ చట్టాల ప్రకారం ఇన్నేళ్ళ బకాయిలు వసూలు చేయడం చట్ట విరుద్ధమని నిపుణులు అంటున్నారు. బకాయిలు ఉంటే, ప్రతి ఆరు నెలలకూ ఒకసారి నోటీసులు ఇవ్వాలని, అవి అందినా వినియోగదారులు కట్టకపోతే రెవెన్యూ చట్టాలను ఆశ్రయించవచ్చని చెబుతున్నారు. గతించిన బకాయిలకు ఇప్పుడే నోటీసులు ఇవ్వడం, ఇప్పటికిప్పుడే రెవెన్యూ, ఇతర చట్టాలను అమలు చేస్తామనడం న్యాయ సమ్మతం కాదని స్పష్టం చేస్తున్నారు. ఒక్క పైసా వసూలు చేయని వైఎస్ 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో కోరిన ప్రతి రైతుకు కనెక్షన్ ఇచ్చారు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో వ్యవసాయ కనెక్షన్లను పెంచుకుంటూ వచ్చారు. ఈ కనెక్షన్లపై సాధారణ చార్జీలు వసూలు చేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల సిఫారసులను అప్పటి సర్కారు పట్టించుకోలేదు. రైతుల కనెక్షన్లను అధికారికంగా గుర్తించడానికి నెలకు రూ.20 సర్వీసు చార్జీ విధించినా, ఆరేళ్ళూ ఒక్కపైసా వసూలు చేయలేదు. దీనికోసం రైతులపై ఎలాంటి ఒత్తిడి తేవద్దని వైఎస్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు నిజమే.. డిమాండ్ నోటీసులు ఇచ్చిన మాట నిజమే. అయితే సాధారణ విద్యుత్ చార్జీలనే అడుగుతున్నాం. ప్రస్తుతం ప్రతి రైతు ఏటా రూ.360 చెల్లించాలి. ఇది కూడా ఆరు నెలలకోసారి రెండు విడతలుగా చెల్లించాలి. కానీ చెల్లించడం లేదు. అందుకే ఇప్పుడు కట్టాలని కోరుతున్నాం. - ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ .వై.దొర -
రైతులకు ద్రోహం చేస్తున్న బాబు
వైఎస్ఆర్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో రైతుల జీవితాల్లో అంధకారం నెలకొంటోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చేతకాక రుణ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం వ్యవసాయానికి మాత్రమే 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తోందన్నారు. గడువులోగా సక్రమంగా రుణాలు చెల్లిస్తే 4 శాతమే వడ్డీ వసూలు చేస్తోందన్నారు. ఏపీలో 82 లక్షల కుటుంబాలు రుణాలు తీసుకుంటే, అందులో 40 లక్షల కుటుంబాలు మాత్రమే వ్యవసాయానికి రుణాలు తీసుకున్నాయని, తక్కిన వారంతా వ్యవసాయం కోసం రుణాలు తీసుకోలేదని సీఎం చేసిన వ్యాఖ్యలతో రైతులకు కొత్త చిక్కులు తలెత్తుతున్నాయన్నారు. అంతటితో ఆగకుండా 22 లక్షల కుటుంబాలే రుణమాఫీకి అర్హత సాధించాయని ప్రభుత్వం తేల్చిందని వివరించారు. పైగా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 32 లక్షల రైతు కుటుంబాలే ఉంటే, 82 లక్షల మందికి ఎలా రుణాలు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించి బ్యాంకర్లను చిక్కుల్లో పడేశారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యాఖ్యలు చేస్తే ఇకపై కేంద్రం రైతులకు 7శాతం వడ్డీ రుణాలు రద్దుచేసే ప్రమాదముందన్నారు. బాబు చెబుతున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా కొత్త చిక్కులు తెచ్చిపెడుతోం దని ‘అనంత’ విమర్శించారు. రైతులు తీసుకున్న రుణా ల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ప్రభుత్వం రుణాలు చెల్లిస్తామంటోందన్నారు. వారి లెక్క ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులూ అనర్హులే అన్నారు. రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల శ్రేయస్సుతోపాటు బ్యాంకర్లు పెట్టుబడి కోసం రుణాలు ఇచ్చారన్నారు. అయితే అధికంగా రుణాలు తీసుకున్నందుకు రైతులను దొంగలుగా, బ్యాంకర్లను దోషులుగా బాబు చిత్రీకరిం చారన్నారు. ఈ ప్రభావం పంటలబీమాపై కూడా పడుతుందన్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు... చంద్రబాబు వ్యాఖ్యలు భవిష్యత్తులో రైతులను నట్టేటముం చేందుకు తోడ్పడుతున్నాయని మండిపడ్డారు. -
మాఫీ కొందరికే!
అనుకున్నట్లే చంద్రబాబు సర్కారు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రుణమాఫీపై ఊరించే ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి.. ఆచరణలో ఉసూరుమనిపించారు. 20 శాతం మాత్రమే తొలివిడతలో రుణమాఫీ చేస్తామని, తక్కిన రుణాలను నాలుగు విడతల్లో నాలుగేళ్లలో మాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న ‘అనంత’ రైతాంగం చంద్రబాబు ప్రకటనతో నీరసించిపోరుుంది. జిల్లాలలో 50 వేల రూపాయల కంటే అధికంగా తీసుకున్న రైతులే అధికమని వీరి రుణాలు మాఫీ అయ్యేందుకు నాలుగేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పడం దారుణమని మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : రైతులకు సంబంధించి అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే చెప్పి.. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు. జిల్లాలో పాదయూత్ర చేపట్టినప్పుడు రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ ‘అనంత’ రైతుల సాక్షిగా ఆయన వాగ్దానం చేశారు. టీడీపీ మానిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని పొందుపరిచారు. తాజాగా పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని ప్లేటు ఫిరాయించడంపై రైతులు మండిపడుతున్నారు. రూ. 1.50 లక్షల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని చెబుతున్నారు. దీనిపై ప్రకటన చేసేందుకు ఆరు నెలలకు పైగా సమయం పట్టింది. ఈ కాలంలో ‘అనంత’లో 42 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈక్రమంలో ఇచ్చిన మాట నెరవేర్చకుండా రైతులను మోసం చేయడం, రైతుల ఆత్మహత్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచింది. గత నెల 5న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేసింది. నేడు కలెక్టరేట్ల ముందు మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రైతు రుణమాఫీపై చంద్రబాబు గురువారం విధాన ప్రకటన చేశారు. 2013 డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి కుటుంబానికి రూ. లక్షన్నర వరకు మాఫీ చేస్తామని చెప్పారు. రూ.50 వేల వరకు రుణమున్న రైతులకు పూర్తిగా, రూ.50 వేలకు పైగా ఉన్న వాటిని 20 శాతం మాఫీ చేస్తానని ప్రకటించారు. 1.57లక్షల రైతులకు మాత్రమే వర్తింపు జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఆధార్‌కార్డులు, కుటుంబంలో ఒక్కరికి, ఒక్క బ్యాంకులోని రుణం మాత్రమే అంటూ సర్కారు విధించిన నిబంధనల నేపథ్యంలో అర్హుల సంఖ్య దాదాపు 50 శాతానికిపైగా తగ్గింది. చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం జిల్లాలో 2.50-3లక్షల ఖాతాలకు మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. ఇందులో తొలి విడతలో 20 శాతం మాఫీ చేస్తామంటున్నారు. ఇందులో 1.57 లక్షల మంది కంటే తక్కువగానే ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 8.67 లక్షల మంది రైతులు నష్టపోనున్నారు. పైగా 50వేల రూపాయల కంటే అధికంగా రుణాలు ఉన్న రైతుల రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామంటే, నాలుగేళ్ల పడుతుంది. బ్యాంకులకు పూర్తిగా బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలను ఇస్తారు. అంటే నాలుగేళ్ల దాకా రైతులకు కొత్త రుణాలను అందని పరిస్థితి. ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చేందుకు బాండ్లు పంపిణీ చేస్తామని చెబుతోంది. మరి బాండ్ల విధానంపై బ్యాంకర్లు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి. గతేడాది బీమా సొమ్ము పాత బకాయికి జమ 2013-14కు సంబంధించి 226కోట్ల రూపాయల వాతావరణ బీమా జిల్లాకు మంజూరైంది. నెలన్నర కిందటే డబ్బులు బ్యాంకులకు చేరినా, బ్యాంకర్లు మాత్రం రైతుల ఖాతాల్లో బీమా మొత్తాన్ని జమ చేయలేదు. రైతుల బకాయిల కింద జమ చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇలా జమ చేసుకోకూడదు. ఈక్రమంలో కూడా జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు బ్యాంకర్లను నిలువరించలేకోయారు. దీంతోపాటు గతేడాదికి సంబంధించి 643 కోట్ల పంట నష్టపరిహారం జిల్లాకు అందాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఈ సొమ్ముపై ప్రభుత్వం ఉలుకు, పలుకూ లేకుండా ఉంది. ఇస్తారో.. ఇవ్వరో కూడా తెలీని అయోమయ పరిస్థితిలో ‘అనంత’ రైతాంగం ఉంది. ఈ ఏడాది 3,350 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రుణ మాఫీ వల్ల బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. దీంతో కేవలం 370 కోట్ల రుణాలను మాత్రమే రైతులు తీసుకున్నారు. రుణాలు తీసుకోకపోవడంతో అనివార్యంగా వాతావరణ బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో ఈ ఏడాది పంట పూర్తిగా నష్టపోయినా బీమా వచ్చే పరిస్థితి లేదు. కౌలు రైతులకు మొండి చెయ్యి జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 11,843 మంది కౌలు రైతులు ఉన్నారు. వీరు బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు పాసుపుస్తకాలు ఉండకపోవడంతో, బంగారు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా బంగారు రుణాలు 2.12 లక్షల ఖాతాల ద్వారా 1,851.18 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. బంగారు రుణాలను తొలి ప్రాధాన్యత కింద గుర్తించకుండా మూడో ప్రాధాన్యతగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కౌలు రైతులకు చిల్లిగవ్వ కూడా మాఫీ అయ్యే పరిస్థితి లేదు. రూ.955 కోట్లు వడ్డీ రుణాలు అన్నీ గడువు మీరిన జాబితాలోకి చేరడంతో వడ్డీ, అపరాధ వడ్డీ, చక్రవడ్డీ భారం పడుతోంది. బ్యాంకర్లు చెబుతున్న ప్రకారం వీటిపై 14 శాతం వడ్డీ చెల్లించాల్సివుంటుంది. దాని ప్రకారం మొత్తం రుణాలపై రూ.955 కోట్లు వడ్డీ భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎంత మందికి ఏ మేరకు ప్రయోజనం కల్పిస్తుందనేది అంతుచిక్కడం లేదు. బ్యాంకర్లు, రైతుల్లో గందరగోళం నెలకొంది. 9.86 లక్షల అకౌంట్లు సేకరణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ కోసం బ్యాంకర్లు రైతుల నుంచి సమగ్ర వివరాలు సేకరించారు. ఆధార్, రేషన్‌కార్డు నెంబర్‌తో పాటు అన్ని రకాల వివరాలతో 9.86 లక్షల మందిని వివరాలు సేకరించి అప్లోడ్ చేశారు. అందులో 2.36 అకౌంట్లు మిస్‌మ్యాచింగ్ కాగా వాటిని మరోసారి రీవెరిఫికేషన్ చేసి 1.08 లక్షల అకౌంట్లను సరిచేసి పంపారు. తక్కిన 1.18 అకౌంట్ల పరిస్థితి ఏమిటనేది అర్థంకాకుండా పోయింది. బ్యాంకర్లు సేకరించిన 9.86 లక్షల అకౌంట్లలో చిన్నకారు రైతులవి 5.80 లక్షలు, సన్నకారు రైతులవి 1.92 లక్షలుగా తక్కిన 2.14 లక్షల అకౌంట్లు పెద్దరైతులవిగా పరిగణించారు. అధికారిక లెక్కలు రాలేదు రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి 9.86 అకౌంట్ల వివరాలు అప్లోడ్ చేసి పంపాం. అయితే ఎంత మందికి ఎన్ని కోట్లు రుణమాఫీ అవుతుందనే వివరాలు అధికారికంగా రాలేదు. - జయశంకర్, ఎల్డీఎం ఆందోళనకు సిద్ధమైన ప్రతిసారీ మోసపూరిత ప్రకటన రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వంపై సమరభేరి మోగించే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టే ధర్నా కార్యక్రమాలకు ముందు మభ్యపెట్టే ప్రకటనలు గుప్పించడం చంద్రబాబుకు అలవాటైపోయింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఇప్పటికీ మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. మహాధర్నాకు రైతులు పోటెత్తే పరిస్థితి ఉందని గ్రహించిన చంద్రబాబు ఉన్నఫలంగా రుణమాఫీ అంటూ కంటితుడుపు చర్యలకు దిగారు. అన్ని రకాల రుణాలు మాఫీ చేసేదాకా రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట కొనసాగిస్తుంది. - ఎం.శంకరనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాట నిలబెట్టుకున్నాం రుణమాఫీ చేస్తామంటూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా తొలి అడుగు వేస్తూ అధికారిక ప్రకటన చేశారు. పంటరుణాలు, బంగారు రుణాలకు సంబంధించి కుటుంబానికి రూ.లక్షన్నర గడువులోగా మాఫీ చేసి తీరుతాం. త్వరలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ ప్రకటన చేస్తారు. ఐదేళ్ల హాయూంలో అన్ని రకాల హామీలు చంద్రబాబు తప్పకుండా నెరవేరుస్తారు. - బీకే పార్థసారధి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రైతులకు అన్యాయం మాట మార్చడం చంద్రబాబు అలవాటు. రుణమాఫీ విషయంలో మరోసారి ఆయన తత్వం నిరూపించుకుని రైతులకు అన్యాయం చేశారు. అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు చేసింది ఏమిటి? రూ.50 వేల వరకు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేసి, ఆపై ఉన్న వాటిని విడత వారీగా మాఫీ చేస్తాడంట! ఆయన టూర్లకు, క్యాంప్ కార్యాలయాల ముస్తాబులకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి డబ్బులుంటాయి కానీ, రైతులకు రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవంటారు. - కోటా సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు రుణ మాఫీ చేస్తాడనే నమ్మకం లేదు రుణ మాఫీ చేస్తాననడంతోనే జనాలు ఓట్లు వేశారు. తొలి సంతకం చేసినపుడే ప్రజల్లో చంద్రబాబు నాయుడు విశ్వాసం కోల్పోయారు. రుణ మాఫీ చేస్తాడనే నమ్మకం ప్రజల్లో లేదు. చేసేంత వరకు నమ్మే స్థితిలో లేరు. - జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒకేసారి రుణ మాఫీ చేయాలి రూ.50వేల లోపు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించారు. అలాగే మిగతా వారికి 20 శాతం చొప్పున అంటున్నారు. అన్ని రుణాలు ఒకేసారి మాఫీ చేయాలి. రుణమాఫీ, కొత్త రుణాలు, ఇన్పుట్, వాతావరణ బీమా లేక ఇప్పటికే రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం బాండ్లు అందజేస్తామని గ్యారంటీ ఇచ్చి తక్షణం కొత్త రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. - ఓబులు, సీపీఎం జిల్లా కార్యదర్శి రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేర్చుకుంటున్నారుు. అందులో భాగంగానే అన్ని రకాల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సాధ్యమైనంత త్వరగా అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ఇబ్బందుల దష్ట్యారుణ మాఫీ కార్యక్రమం దశల వారీగా జరుగనుంది. - వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
గందరగోళం
సాక్షి, కర్నూలు/అగ్రికల్చర్ : రైతులకు కన్నీటి కష్టాలు తప్పేలాలేవు. ఎన్నికల ముందు నుంచే రుణాల చెల్లింపులు నిలిపివేసిన రైతులు గడిచిన సంవత్సర కాలానికి 14 శాతం వడ్డీతోపాటు ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని కోల్పోనున్నారు. ఇంటికొక రైతుకు రూ. 1.50 లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం తేల్చేయడంతో బ్యాంకులు తమ పనిని కానిచ్చేస్తున్నాయి. ప్రస్తుతం రుణాలు చెల్లించినా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోనున్నారు. ప్రస్తుతం రుణ మాఫీ అంశంలో ప్రభుత్వం రోజుకో నిర్ణయం తీసుకుంటుండడంతో రుణమాఫీపై మరింత గందరగోళం నెలకొంది. ప్రభుత్వం రుణ మాఫీ ఇదిగో.. అదిగో.. అంటూ ఊరించి ఉసూరుమనిపిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను ఎప్పటికి పూర్తి చేస్తుందనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా రైతుల జాబితాలు మాత్రం అటు ఇటు తిరుగుతున్నాయి. ప్రభుత్వం కోరిన విధంగా మార్పులు, చేర్పులు చేయడంలో ఇటు అధికారులు, అటు బ్యాంకర్లకు తల ప్రాణం తోకకు వస్తోంది. రుణమాఫీ అర్హత కల్గిన రైతుల జాబితాలను ప్రభుత్వం బ్యాంకులకు ఇటీవలనే పంపింది. ఇందులోను తిరకాసు పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల లోన్ అమౌంట్, అవుట్ స్టాండింగ్ అమౌంట్లో మార్పులు ఉంటే సర్దుబాటు చేసి జాబితాలను తిరిగి పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సర్దుబాట్లు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఇవి రుణ మాఫీకి అర్హత కల్గిన జాబితాలా... వెనక్కి వచ్చిన జాబితాలా అనేది బ్యాంకర్లు సైతం చెప్పలేకపోతున్నారు. అవి అర్హత కల్గిన రైతుల జాబితాలు కాదని, సవరణల కోసం వచ్చినవి మాత్రమేనని ఎల్‌డీసీఎం నరసింహారావు స్పష్టం చేశారు. దీంతో రుణ మాఫీ వ్యవహారం మరింత గందరగోళంలో పడింది. మొదటి దశలో 2.50 లక్షల మందికే రుణ మాఫీ? జిల్లాలో 5.24 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు పంపగా, ఇందులో ఆధార్ నెంబర్ల, రేషన్ కార్డుల వివరాలు పూర్తిగా లేనివి, ఎస్ఆర్డీహెచ్లో చెల్లుబాటు కానివి దాదాపు 3.68 లక్షల రైతుల జాబితాలను ప్రభుత్వం వెనక్కి పంపింది. దీనిపై తహశీల్దార్లు, వీఆర్వోలు వారం రోజుల పాటు కుస్తీ పట్టి వెరిఫికేషన్ చేసి జాబితాలను బ్యాంకులకు ఇచ్చారు. కాగా, మళ్లీ 2.5 లక్షల మంది రైతులతో మొదటి దశ జాబితా అంటూ ప్రభుత్వం బ్యాంకులకు పంపింది. ఇందులో మార్పులు, సవరణలు చేసి పంపాలని సూచించింది. దీనిని కూడా ప్రభుత్వం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఇది కూడా శనివారం మధ్యాహ్నంతో పూర్తి అయింది. అయితే తహశీల్దార్లు చేపట్టిన వెరిఫికేషన్ సమయంలో దాదాపు 30 వేల మంది రైతులను విచారించలేకపోయారు. వీరి పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు. అదేవిధంగా ఓర్వకల్లు సహకార సంఘంలో మొదటి ఫేజ్‌లో 43.45 శాతం రైతుల వివరాలను డీసీసీబీకి పంపింది. గార్గేయపురం సొసైటీలో 45.37 శాతం రైతుల వివరాలను సవరణల కోసం పంపింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా 91,288 రైతుల వివరాలు పంపగా 60,600 మంది రైతుల వివరాల్లో సవరణల కోసం జాబితాలను పంపింది. ఇక ఆలూరు నియోజకవర్గం పరిధిలో 57 వేల మంది రైతులున్నారు. వీరంతా రుణమాఫీ కోసం ఆధార్‌కార్డులు, ఓటర్ ఐడెంటిటి కార్డులను సంబంధిత అధికారులకు అందజేశారు. అయితే దాదాపు 20 వేల మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలలో లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అర్హులందరికీ రుణమాఫీ
అనంతపురం సెంట్రల్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం డ్వామా హాలులో ఎమ్మెల్యేలతో కలిసి రుణమాఫీ అమలుపై సమీక్షించారు. మంత్రులు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, బంగారు, స్వయం సహాయక సంఘాలకు సంబంధిం చి 8,96,177 ఖాతాలు ఉన్నాయని, రూ. 4944 కోట్లు మాఫీ చేయబోతున్నామన్నారు. అయితే మొత్తం ఖాతాల్లో 2.80 లక్షల మంది ఇప్పటి కీ ఆధార్, రేషన్‌కార్డులు సమర్పించలేదన్నారు. వీరికి డిసెంబర్ 25 వరకూ అవకాశం ఉందని తెలిపారు. పంట రుణాలు లేకున్నా వ్యవసాయం కోసం బంగారు తాకట్టు పెట్టి రూ. 1.50 వేల వరకూ అప్పు తీసుకున్నా మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పండ్లతోటల రైతులకు కూడా రుణమాఫీ వర్తిం చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతామన్నారు. దీంతోపాటు 2011-12లో ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం కలిపి రూ. 675 కోట్లు రావాల్సి ఉందని, త్వరలో ఈ మొత్తం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల 53 మండలాలకు రూ. 227 కోట్లు వాతావరణబీమా మంజూరైందన్నారు. ఈ మొత్తం రైతు అప్పులకు జమ చేయరాదని బ్యాంకర్లను ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పిస్తామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మద్యం సిండికేట్ల వ్యవహారంపై సీబీసీఐడి విచారణ జరుగుతోందన్నారు. జూన్‌నాటికి నూతన పాలసీ విధానం తీసుకొచ్చి మద్యం నియంత్రిస్తామని వివరించారు. వీలైనన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి బయట రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, క్రెడిట్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, వరదాపురం సూరి, ఉ న్నం హనుమంతరాయచౌదరి, వీరన్న, ఎమ్మెల్సీలు గేయానంద్, శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, మేయర్ స్వరూ ప, కలెక్టర్ సొలమాన్ ఆరోగ్యరాజ్, జా యింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎల్డీఎం జయశంకర్, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మూడు మెగా క్లస్టర్లు అనంతపురం ఎడ్యుకేషన్ :చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో మూడు మెగా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం రాత్రి స్థానిక డ్వామా హాలులో చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. చేనేత కార్మికులకు హెల్త్ఇన్సూరెన్స్, క్రిడెట్కార్డుల జారీ, సబ్సిడీపై దారం సరఫరాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పెద్దపప్పూరు, రాయదుర్గం, సోమదేవరపల్లిలో ఏర్పాటు చేసిన మినీక్లస్టర్ల ద్వారా చేనేత కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తామన్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ జగన్నాథశెట్టిపై మంత్రులు కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలో అవినీతి పెరిగిపోయిందని, మామూళ్లు ఇస్తేనే పనులు చేస్తున్నారంటూ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆధారాలతో మం త్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మంత్రులు ఏడీపై మండిపడ్డారు. -
రైతురాజ్యం కాదిది
చంద్రబాబు ప్రభుత్వం రావణరాజ్యాన్ని తలపిస్తోందని దువ్వూరు, ముక్తాపురం గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి ఐదునెలలు పూర్తవుతున్నా ఒక్కరంటే ఒక్కరికి రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. ఇంకా కమిటీల పేరుతో పింఛన్లు తొలగించడాన్ని తప్పుబట్టారు. గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని, పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం లేదని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయడం లేదని, ఎరువులను సైతం అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను అప్పుల పాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారి సంగం మండలం దువ్వూరు, ముక్తాపురం గ్రామాల్లో పర్యటించి ప్రజాసమస్యలను ఆవిష్కరించారు. ఆ వివరాలు యథాతథంగా ‘సాక్షి’ పాఠకుల కోసం.... గౌతమ్‌రెడ్డి: రైతుల పరిస్థితి ఎలా ఉంది. రుణాలు మాఫీ అయ్యాయా? ఫణికుమార్,రైతుః లోన్లు తోసేస్తామన్నారు. అయితే పసుపుచొక్కాల వారికే అన్నీ చెందుతున్నాయి. పింఛన్లు కూడా వారికే ఇస్తున్నారు. అర్హులు అనర్హులుగా మారుతున్నారు. గౌతమ్‌రెడ్డి: బ్యాంకులో రుణాలు, విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా? రఘురామిరెడ్డి, రైతుసంఘం నాయకుడు: రైతులకు ఎలాంటి సాయం అందించలేదు. గతంలో రైతులందరికీ కులాలు, మతాలకతీతంగా మేలు జరిగింది. రుణాల మాఫీని అప్పట్లో వైఎస్సార్ ఒక్క కలం పోటుతో మాఫీ చేశారు. చంద్రబాబు వచ్చి ఐదునెలలు పూర్తై ఒక్కరికీ రుణం మాఫీ కాలేదు. గౌతమ్‌రెడ్డి: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అయ్యాయా? లక్ష్మీప్రసన్న, ఎంపీటీసీ: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసిందేమీ లేదు. వైఎస్సార్ హయాంలో అంతా బాగుపడ్డాం. అన్ని వర్గాలకు లోన్లు వచ్చాయి. గౌతమ్‌రెడ్డి: ఇప్పటి వరకు లోన్లు మాఫీ చేయలేదు కదా? ఎప్పుడు చేస్తారనుకుంటున్నారు? లక్ష్మి: లోన్లు తోసేస్తారనే ఆయన్ను గెలిపించాం. గౌతమ్‌రెడ్డి: ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? లక్ష్మి: వర్షం వస్తే నీళ్లల్లో ఉంటున్నాం. గవర్నమెంటు స్థలం కూడా లేదు. మీరైనా స్థలం ఇప్పించి ఆదుకోండి సార్. గౌతమ్‌రెడ్డి: ఏమ్మా.. నీపేరేమి? గౌతమ్‌రెడ్డి: మీ సమస్యలు చెప్పండి. వైకుంఠం వెంకటమ్మ: అందరికీ కాలనీలో ఇళ/్ల ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. గౌతమ్‌రెడ్డి: నీ పేరంటమ్మా? గౌతమ్‌రెడ్డి: ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నావ్? లక్ష్మమ్మ: పేదోళ్లకు లోన్లు ఇవ్వడం లేదు. ఉన్నోళ్లకే ఇస్తున్నారు. చంద్రబాబు న్యాయం చేయడం లేదు. గౌతమ్‌రెడ్డి: మీ సమస్యలు చెప్పండి. జె.వెంకటమ్మ: మాకు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వంలోనైనా ఇల్లు కట్టించి ఇవ్వండి. గౌతమ్‌రెడ్డి: మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఇందిరమ్మ, దువ్వూరు సర్పంచ్: రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ చేయవచ్చని. ప్రజలకు మేలు చేయాలంటే గ్రామ సర్పంచ్‌కు మంచి అవకాశం ఉంటుందని కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి, భర్త వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. అందుకే వచ్చాను. గౌతమ్‌రెడ్డి: సర్పంచ్‌గా 16 నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? సర్పంచ్: హరిజనవాడలో వీధులను విస్తరించి దారి వసతి కల్పించాను. అంతకుముందు వర్షం వస్తే వీధుల్లో నీళ్లు నిలబడేవి. నడవటానికి వీలుండేది కాదు. గౌతమ్‌రెడ్డి: ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టారా? సర్పంచ్: అన్ని వీధుల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశాను. ఇక్కడ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. రూ.3 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నాను. గౌతమ్‌రెడ్డి: పంచాయతీ అభివృద్ధికి నిధులు ఉన్నాయా? సర్పంచ్: లేవు. ఉన్న నిధులతో అభివృద్ధి చేస్తున్నాను. గౌతమ్‌రెడ్డి: మీరు ఏం చేస్తుంటారు? మల్లికార్జునరెడ్డి: వ్యవసాయం చేస్తుంటాను. గౌతమ్‌రెడ్డి: మీకు సబ్సిడీ పథకాలు అందుతున్నాయా? మల్లికార్జునరెడ్డి: ఎక్కడ సార్. కొన్ని ఇస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గౌతమ్‌రెడ్డి: మీకు విత్తనాలు, ఎరువుల అందుతున్నాయా? మల్లికార్జునరెడ్డి: వరి విత్తనాలు దొరకడం లేదు. రైతులు అడిగే విత్తనాలు ఇవ్వడం లేదు. వారు ఇచ్చే విత్తనాలనే నాటమంటున్నారు. ఎరువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. రైతుకు ఏదైతే అవసరం ఉంటుందో.. దాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. గౌతమ్‌రెడ్డి: రుణమాఫీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? సుధాకర్‌రెడ్డి, సర్పంచ్: రుణమాఫీపై స్పందన లేదు. రుణాలు పోతాయని బ్యాంకుల్లో రుణం చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో 14 శాతం వడ్డీ అదనంగా పడుతోంది. రూ.13 వేల నుంచి రూ.20 వేలు అదనంగా చెల్లిం చాల్సి వస్తోంది. గౌతమ్‌రెడ్డి: ఇది రామరాజ్యమేనా? సర్పంచ్: ఇది రావణరాజ్యం సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే నియోజక వర్గంలో పేరుకుపోయిన సమస్యలను తెలుసుకునేందుకు పల్లెబాట కార్యక్రమం పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నాను. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నాను. అధికారులతో మా ట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నాను. దువ్వూరు, ముక్తాపురం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను. -
రూ ఆరు వేల కోట్లకు ఎసరు !
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మార్చడం వల్ల జిల్లాలో సుమారు ఆరు వేల కోట్ల రూపాయల రుణాలు రద్దయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా గురువారం విజయవాడలో జరిగిన టీడీపీ విసృ్తత స్థాయి సమావేశంలో పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని చెప్పడం పట్ల ఆ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. మార్చి 31న తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లకు విడివిడిగా విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. విజయవాడ సమావేశంలో పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించడంతో ‘బాబు’నైజంపై అన్ని వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల బంగారు ఆభరణాలు తనఖా పెట్టి తీసుకున్న రుణాలు రద్దు కావని, రుణం తీసుకున్నప్పుడు రైతు బ్యాంకులో బంగారు ఆభరణాలతోపాటు భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకాల ఫొటోస్టాట్ కాపీలను ఇచ్చి ఉంటేనే ఆ రుణాలు మాత్రమే రద్దవుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు. కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి తీసుకున్న రుణాలు రద్దయ్యే అవకాశాలు లేదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. దీనికితోడు వ్యవసాయ రుణాల రద్దు ప్రక్రియకు సంబంధించిన వెబ్‌సైట్‌కు గురువారం నుంచి బ్యాంకర్లు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ.5995 కోట్లకు ఎగనామం? జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు రైతులు, స్వయం సహాయక సంఘాలకు కలిపి పదివేల కోట్ల రూపాయలను పంట రుణాలుగా ఇచ్చినట్లు లీడ్‌బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5,29,358 మంది రైతులు రూ.4005 కోట్లు పంట రుణాలు పొందారు. 6,49,025 మంది బ్యాంకుల్లో తమ బంగారాన్ని పెట్టి రూ. 4,593 కోట్లు రుణాలు తీసుకున్నారు. గుంటూరు రూరల్ పరిధిలో 58, 624 స్వయం సహాయక సంఘాలు రూ. 1145 కోట్లు, మెప్మా ద్వారా అర్బన్‌లో 12,794 గ్రూపులు రూ. 257 కోట్ల రుణాలను పొందాయి. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రుణమాఫీ జరిగితే ఇవన్నీ కలిపి జిల్లా వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల రుణాలు రద్దు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు స్వయం సహాయక సంఘాలు తీసుకున్న మొత్తం రుణాలను రద్దు చేయకుండా వాటికి మూల నిధిని ఏర్పాటు చేస్తామని మాట మార్చారు. దీంతో డ్వాక్రా గ్రూపులు వడ్డీతో కలిపి రూ.1402 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. బంగారం తనఖా పెట్టి రూ.4,593 కోట్ల రుణాలను తీసుకున్న 6.50 లక్షల మంది రైతులకు బాబు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు వర్గాలకు మొత్తం రూ.5 995 కోట్లను మాఫీ చేయకుండా బాబు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకర్లు చెబుతున్నా, పంట రుణాలకు, వ్యవసాయ రుణాలకు వ్యత్యాసం ఉందంటున్నారు. ఆది నుంచి ఆయన నైజం అంతే .. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే ఆశ్చర్య పడాల్సిందేకాని, మాట మార్చితే ఆశ్చర్యపోనవసరం లేదు. మొదటి నుంచి ఆయన నైజం ఇంతే. కిలో రూ. 2 బియ్యం పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.5.50కు పెంచారు. మొన్నటి ఎన్నికల్లో బెల్టుషాపులు రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలే వాటిని నడుపుతూ గతం కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చిన మైనింగ్ సెస్‌ను జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు ఇస్తానన్నారు. ఇప్పుడు ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు కేటాయించి వచ్చిన ఆదాయంలో 25 శాతం వాటికి ఇస్తూ మిగిలిన ఆదాయాన్ని రైతు సాధికారిక సంస్థకు జమ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల గ్రామాలు, మండలాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత వెన్నాడుతోంది. వ్యవసాయ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటన ఇచ్చిన బాబు ఇప్పుడు పంట రుణాలనే రద్దు చేస్తామనడం దుర్మార్గం. ప్రజలంటే ఆయనకు చులకన భావం. ఏ అబద్ధం అడినా కొంతకాలానికి మర్చిపోతారనే అభిప్రాయం ఆయనకు ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇస్తూ పబ్బం గడుపుతున్నారు. - మర్రి రాజశేఖర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
రుణమాఫీ ఇంకెప్పుడో..!
మహరాజశ్రీ సీఎం చంద్రబాబు గారికి.. జిల్లా రైతాంగం రాసుకున్న విన్నపమేమనగా.. అయ్యా.. ఎన్నికల ప్రచారంలో రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటే ఎగిరి గంతేశాం.. ఓట్లేశాం... అధికారంలోకి వచ్చారు.. ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకం మీకోసమే అంటే ఆనందపడ్డాం.. తీరా కమిటీ అంటే త్వరగా పూర్తి చేస్తారేమో అని మిన్నకుండిపోయాం.. పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షన్నరే అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కదా అని మనసుకు సర్దిచెప్పుకున్నాం.. పోనీలే అది వచ్చినా ఎంతోకొంత బాగు పడతామని ఎదురు చూశాం. బ్యాంకుల్లో అడ్డమైన పత్రాలు ఇవ్వాలని చెప్పావు.. ఒక్కొక్కరం రెండు, మూడు దఫాలు బ్యాంకుల చుట్టూ తిరిగి పత్రాలు అందజేశాం. ఛార్జీలు, ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.. కొందరైతే కూలి పనులు మానుకుని మరీ పత్రాలు ఇచ్చారు.. జిల్లాలో 4.95లక్షల మంది ఇలానే ఖర్చు భరించారు. రుణ మాఫీ పుణ్యమా అని ఒక్కొక్కరికి సుమారు 300 చొప్పున దాదాపు రూ.2 కోట్ల వరకు మా సొదరుల చేతి చమురు వదిలింది. అంతటితో ఆగారా.. సరిగా వివరాలు లేవంటూ 2.67లక్షల ఖాతాలను వెనక్కిపంపాదు. తిరిగి ఉరుకులు, పరుగుల మీద వెళ్లి వాటినీ అందజేశాం.ఇప్పుడేమో 3.08 లక్షల ఖాతాలను పరిశీలించాలంటూ రెవెన్యూ సిబ్బందికి పంపావు. పత్రాలు ఇవ్వకపోతే రుణమాఫీ రాదనే భయం వెంటాడుతోంది.. ఎందుకిలా మాతో ఆటలాడుకుంటున్నావు... మీ వంటి పెద్దలకు ఇది తగునా సామీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొదట 20 శాతం ఈ నెల 5న వేస్తానన్నావు.. మళ్లీ 12 అన్నావు.. తిరిగి 15వ తేదీ చెప్పావు.. ఇప్పుడేమో 18వ తేదీ అంటున్నావు.. మాట మీద నిలబడే అలవాటు మీకు లేదని అందరూ అనే మాటను నిజం చేస్తున్నావే. 49 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని మీకు నివేదికలు అందాయి.. అయినా కరుణించలేదు. మీరు రుణమాఫీ అమలు చేస్తారని బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. దీంతో వారు కొత్త రుణాల్విలేదు.. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి పంటలు సాగు చేశాం. రెన్యువల్స్ చేయకపోవడంతో బీమా కూడా దక్కలేదు. సరైన సమయంలో అప్పు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి గతం కంటే రూ.లక్షకు రూ.13వేలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారు. 20 శాతం ఖాతాల్లో వేస్తే బ్యాంకర్లు శాంతిస్తారనుకుంటే నువ్వు వాయిదాలు తప్ప నగదు జమ చేయడం లేదు. ఇప్పటికైనా మీరు మారండి.. మా ఉసురు ఉసురు పోసుకోవద్దని మనవి. -
రైతుల ఖాతాలకే ఎసరు..!
రుణాల మాఫీలో సర్కారు కొత్త కిరికిరి - 49 లక్షల ఖాతాలే అర్హతగా తేల్చిన వైనం సాక్షి, హైదరాబాద్ : రైతుల రుణాల మాఫీలో రకరకాల ఆంక్షలు, పరిమితులు విధిస్తూ అన్నదాతను ముప్పుతిప్పలు పెడుతున్న సర్కారు.. ఇప్పుడు ఏకంగా వారి ఖాతాలకే ఎసరు పెడుతోంది. వ్యవసాయ రుణాలు తీసుకున్న ఖాతాల సంఖ్యను దాదాపు 50 లక్షలకు కుదించింది. ఈ సంఖ్యను మరింత తగ్గించే ప్రయత్నాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోటీ ఐదు లక్షల రైతుల ఖాతాలకు గాను కేవలం 80 లక్షల ఖాతాల రుణాలనే ప్రభుత్వం తొలుత పరిగణనలోకి తీసుకుంది. ఈ ఖాతాల వివరాలను బ్యాంకులు ఎన్ఐసీ వెబ్‌సైట్‌కు ఆన్లైన్లో పంపాయి. వీటిని ఆధార్, రేషన్ కార్డు, సర్వే నంబర్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి రకరకాల నిబంధనలతో వడపోశారు. ఇప్పుడు కేవలం 49 లక్షల ఖాతాలు మాత్రమే రుణ మాఫీకి అర్హమైనవని తేల్చింది. ఈ విషయాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బుధవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ ఖాతాలనూ మరింతగా తగ్గించే ప్రయత్నాల్లో సర్కారు ఉంది. ఇప్పుడు అర్హత పొందిన ఖాతాలు ఎన్ని కుటుంబాలకు చెందినవో తేల్చాలని ప్రభుత్వం కొత్త కిరికిరి పెట్టింది. అధికారులు వాటిని తేల్చనున్నారు. 15లోగా తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశం ఇప్పటివరకు రైతుల ఖాతాలు ఆధార్ నంబర్లతో సరిపోవడంలేదంటూ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ ద్వారా 5.58 లక్షల ఖాతాలను మాఫీ పరిధి నుంచి తప్పించారు. మరో 22.92 లక్షల ఖాతాలను జన్మభూమి కమిటీల ద్వారా మరోసారి వడబోయనున్నారు. వీటిలో ఆధార్ నంబర్, రేషన్ కార్డులు లేని ఖాతాలు 16.16 లక్షలు, ఆధార్ నంబర్ ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేని రైతుల ఖాతాలు 6.76 లక్షలు ఉన్నాయి. ఆధార్ నంబర్ లేని రైతుల ఖాతాలన్నీ బోగస్విగా తేల్చి, వారిని మాఫీకి అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆధార్, రేషన్ కార్డులు లేని రైతుల జాబితాలను జిల్లా కలెక్టర్ల ద్వారా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలకు పంపిస్తారు. ఈ కమిటీలు ఆయా రైతులకు ఆధార్ నంబర్ ఉందా లేదా అనే విషయాన్ని తనిఖీల ద్వారా తెలుసుకుంటాయి. ఆధార్ నంబర్ లేకపోయినా, ఆ రైతులు గ్రామాల్లో లేకపోయినా ఆ ఖాతాల రుణాలు మాఫీకి అర్హత లేనివని తేలుస్తారు. ఆధార్ ఉండి రేషన్ కార్డు లేని వారు ఓటర్ కార్డు చూపిస్తే ఇంటి పేరు, ఇంటి నంబర్ ఆధారంగా ఏ కుటుంబానికి చెందిన వారో జన్మభూమి కమిటీలు తేలుస్తాయి. ఇందుకు ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఇస్తూ జిల్లా కలెక్టర్లకు ఆర్థిక శాఖ బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఖాతాలు తగ్గనున్నాయి. -
సమస్యలు చెప్పేందుకు..తరలుదాము రండి!
సన్నద్ధమవుతున్న జనం నేటి నుంచి జన్మభూమి-మన ఊరు ప్రత్యేకాధికారిగా జేసీ శర్మ ‘తరలుదామురండి...మనం జన్మభూమికి’ అని పదేళ్ల కిందట ఊరువాడ మార్మోగిన పాట మళ్లీ గురువారం నుంచి పల్లెసీమల్లో వినిపించనుంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులను పల్లెబాట పట్టిస్తోంది. అయితే అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో ఒక్క ప్రజా ఉపయోగ కార్యక్రమం కూడా చేపట్టని ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీ, కొత్తగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం, పింఛన్లు తీసివేత, ఆదర్శరైతుల తొలగింపు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్.. ఇలా ప్రతి సమస్యపై జన్మభూమిలో గళం విప్పనున్నారు. సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మనఊరు’ కార్యక్రమాన్ని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరులో ర్యాలీ ద్వారా ప్రారంభించనున్నారు. జన్మభూమి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ బదులు జేసీ శర్మ నియమితులయ్యారు. 20వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమాన్ని జేసీ శర్మ పర్యవేక్షించనున్నారు. ప్రజలకు బోలెడు హామీలిచ్చి అధికారంలో వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కహా మీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు బాబు హామీ ఇచ్చారు. అధికారం దక్కిన తర్వాత సవాలక్ష ఆంక్షలు విధించి రూ.1.50లక్షల వరకూ మాత్రమే మాఫీ చేస్తామన్నారు. కనీసం ఈ హామీనైనా నిలబెట్టుకున్నారా? అంటే అదీ లేదు. దీంతో కొత్త రుణాలు అందక రైతులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటసాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జన్మభూమి పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లోకి వెళితే ప్రజల నుంచి నిరసనలు, ప్రతిఘటనలు అనివార్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పింఛన్ల తొలగింపుపై నిలదీత జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే తీసుకున్న అర్జీలకు న్యాయం జరిగే పరిస్థితులు కన్పించడం లేదు. తనిఖీల పేరుతో జిల్లా వ్యాప్తంగా 34,459 మందికి పింఛన్లు తొలగిం చారు. మరో 10 వేల మంది తీసివేత జాబితా లో చేరనున్నారు. వీరిలో సింహభాగం అర్హులే ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛను సొమ్ము అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటికీ పింఛనుదారుల జాబితా సిద్ధం కాలేదు. ఈ క్రమంలో నామమాత్రంగా ఒకరిద్దరికి పెంచిన పింఛను ఇవ్వడం మినహా అర్హులందరికీ పింఛన్ అందే పరిస్థితులు లేవు. అలాగే జిల్లావ్యాప్తంగా 1846 మంది ఆదర్శరైతులను తొలగించారు. ‘బాబు వస్తే జాబు’ అని ఉన్న ఉద్యోగాలను తీసేయడంపై ఆదర్శరైతులు జన్మభూమిని అడ్డుకోనున్నారు. అలాగే ఇందిర్మబిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై కూడా ప్రశ్నాస్త్రాలను సంధిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని మహిళలు నిలదీయనున్నారు. ప్రతీ ‘సారీ’ మాట తప్పడం ఏంటీ ‘బాబూ..!’ జిల్లాలో ప్రతిగ్రామానికీ అక్టోబర్ 2 నుంచిస్వచ్ఛమైన తాగునీటి అందిస్తామని రాష్ట్ర కేబినెట్ రెండు నెలల కిందట ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో నడపాలని నిర్ణయించడంతో ఎవరూ ముందుకు రాక ‘సుజల’ ఆరంభశూరత్వమైంది. చివరకు నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ప్రారంభించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదికూడా సాధ్యం కాక అధికారులు చేతులెత్తేశారు. కేవలం కుప్పం, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు మండలాల్లోని ఒక్కొక్క గ్రామం చొప్పున పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితం చేశారు. దీంతో తక్కిన ప్రాంతాల్లో కోతలు యాథావిధిగా ఉండే పరిస్థితి. మొత్తానికి అరచేతిలో స్వర్గం చూపించేలా మాటలు కోటలు దాటేలా చెప్పి ప్రతి అంశంలోనూ మాట తప్పుతున్న చంద్రబాబు సర్కారు జన్మభూమిలో ఊరు దాటి రావడం కత్తిమీద సామే! -
హామీలు తీర్చేనా ?
ఎక్కడ నుంచో వచ్చినా.. పాలమూరు నన్ను ఎంపీగా గెలిపించింది. ఇక్కడి ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా. ఈ ఘనత పాలమూరు ప్రజలదే. ఈ జి ల్లాకు బాకీ ఉన్నా. వలసలు, కరువుతో జిల్లా ఆగమైంది. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిచే పాలమూరులోనా అంటూ ఇక్కడి కవులు ప్రజల కడగండ్లకు అద్దం పట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్ కథ ముగిసి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగు నీరందించి పచ్చని పాలమూరుగా తీర్చిదిద్దుతా. పాలమూరు నుంచి ముంబైకి వలస వెళ్లడం కాదు. ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడకు వలస వచ్చేలా చూస్తా. -2014 సాధారణ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆయన హామీలను జనం మరోమారు మననం చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. తొలి పర్యటన కేవలం ప్రైవేటు కంపెనీల్లో ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలకు పరిమితం కానుంది. ఎక్కడా అధికారులతో భేటీ జరపడం కానీ, సభలు, సమావేశాలు లేకుండానే సీఎం పర్యటన ముగియనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఇతరత్రా ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి స్పందించే అవకాశంలేదని అధికారవర్గాలు వెల్లడిం చాయి. 2009-14 మధ్యకాలం లో మహబూబ్‌నగర్ ఎంపీగా వ్యవహరించిన కేసీఆర్‌కు ఇక్కడి సమస్యలు తెలుసని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటి కే ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజ య్య, మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీ ష్‌రావు జిల్లాలో పర్యటిం చారు. అయితే కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు కావస్తున్నా కొన్ని ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోక పోవడంపై ప్రజానీకంలో ఆందోళన కనిపిస్తోంది. రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రియింబర్సుమెంటు వం టి అంశాలపై ఆయా వర్గాలు ఇప్పటికే ఆందోళనబాట పట్టాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు నీట మునగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటి ల్లింది. కీలక విభాగాలకు అధికారులు లేకపోవడంతో పాలన కుంటు పడిందనే భావన వ్యక్తమవుతోంది. సీఎం ఎన్నికల హామీలు ఇవే! ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు చొప్పున 14లక్షల ఎకరాలకు సాగునీరందించడం కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయడం పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధుల విడుదల, జూరాల-పాకాల సర్వే పూర్తి నాగర్‌కర్నూలు, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాలు. మొదటి ప్రాధాన్యతలో నాగర్‌కర్నూలు. ప్రతి నియోజకవర్గంలో మండలానికి వేయి ఇళ్ల చొప్పున మంజూరు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు మండలంలో నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద చేప పిల్లల కేంద్రం ఏర్పాటు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం. పన్నులో రాయితీ. కేసీఆర్, హామీలు, రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రియింబర్సుమెంటు -
నారీ..భేరీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పొదుపు సంఘాల మహిళలు కదంతొక్కారు. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. మహిళల సత్తా ఏమిటో చూపుతామని హెచ్చరించారు. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి నమ్మించి ఓట్లేయించుకున్నారు.. ఇంట్లో భర్త చెబుతున్నా వినకుండా చంద్రబాబుకు ఓట్లేశాం.. సీఎం అయ్యాక మాట తప్పుతున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోతే టీడీపీ ప్రభుత్వానికి పాడె కడతాం’ అని మహిళలు శాపనార్థాలు పెట్టారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తై డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు సీఐటీయూ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. అంతకుముందు ర్యాలీలు చేపట్టారు. తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పొదుపు నిధులు, పిల్లల స్కాలర్‌షిప్పులను అప్పుల కింద జమ చేసుకోవటంపై మండిపడ్డారు. స్త్రీ నిధిపై వడ్డీ వసూలు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెట్, పరపతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కర్నూలులోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బేతంచర్లలో భారీ ర్యాలీ నిర్వహించి నినదించారు. అనంతరం ధర్నా చేపట్టారు. బండిఆత్మకూరులో ర్యాలీతో హోరెత్తించారు. ఆలూరులో అంబేద్కర్ కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి మండల కేంద్రాల్లోనూ మహిళలు కదం తొక్కారు. ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆదోని తహశీల్దార్ కార్యాయం వద్ద ధర్నా చేసి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరువెళ్ల మండల కేంద్రాల్లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగాయి. బనగానపల్లి, కోవెలకుంట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల నినాదాలు మిన్నంటాయి. ఎమ్మిగనూరులో శివ కూడలి వద్ద ధర్నా నిర్వహించి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. గోనెంగండ్ల, మంత్రాలయంలో డ్వాక్రా మహిళలు రుణ మాఫీ కోసం ఆందోళన చేపట్టారు. కల్లూరులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండల కేంద్రాల్లోనూ మహిళలు ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు. ఇచ్చిన హామీని అమలు చేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. కొత్త రుణాలను ఇవ్వటం ఆపేసి పొదుపు డబ్బును అప్పు కింద జమ చేసుకోవడం దారుణమన్నారు. పిల్లల స్కాలర్‌షిప్పులను సైతం జమ చేసుకోవటాన్ని వారు నిరసించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మార్చడాన్ని తప్పుబట్టారు. రుణమాఫీ అయ్యేవరకు ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. -
మాఫికర్!
అయోమయం ముంచుకొస్తున్న గడువు రైతుల్లో ఆందోళన రుణమాఫీ.. ఎన్నికల ఫలితాల వచ్చేవరకూ రైతులను ఆనందడోలికల్లో తేలియాడించిన పథకం. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో సునాయాసంగా ఇచ్చేసిన హామీ. తీరా సవాలక్ష కొర్రీల కారణంగా అమలు విషయం అయోమయంగా మారింది. ఇందుకు నిర్ణయించిన గడువుతో ముంచుకొస్తుండడంతో రైతన్నలకు భయం పట్టుకుంది. విశాఖ రూరల్ : రుణమాఫీ వ్యవహారం అయోమయంగా మారింది. అమల విషయంలో రైతుల్లో భయం పట్టుకుంది. ప్రభుత్వం చెబుతున్నది ఒక రకంగా ఉంటే బ్యాంకుల తీరు మరో విధంగా ఉంటోంది. అసలు బ్యాంకులు, సహకార సంఘాలు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తుండడమే ఈ గందరగోళానికి కారణమవుతోంది. మరోవైపు అర్హుల జాబితా తయారీకి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఆధార్ సీడింగ్‌కు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. పాస్ పుస్తకంలో ఉన్న పేరు 1బీ అడంగల్‌లో ఉంటేనే కంప్యూటర్ స్వీకరిస్తుంది. లేనివి పక్కనపెడుతున్నారు. గతంలో అధికారులు నిర్లక్ష్య ధోరణితో రికార్డుల్లో సవరణలు చేయని కారణంగా ప్రస్తుతం తాము నష్టపోవాల్సి వ స్తోందని రైతులు వాపోతున్నారు. ఆధార్ వివరాల సమర్పణకు ఈ నెల 15 ఆఖరు తేదీగా ప్రకటించడంతో కార్డులు లేని వారు కలవరానికి గురవుతున్నారు. అనేక ఇబ్బందులు జిల్లాలో రైతులకు సంబంధించి భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్) రెవెన్యూ అధికారులు చాలా వరకు అందజేశారు. అయితే ఆ తర్వా యజమాని మరణం, భాగం పంపిణీ తదితరాలకు సంబంధించి వెంటనే క్లయిమ్ చేసుకుని తదుపరి హక్కు పొందాల్సి ఉంటుంది. దీనిపై సరైన అవగాహన లేక కొత్త పాస్‌పుస్తకాలు పొందని వారు అనేక మంది ఉన్నారు. అదే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో యజమాని పేరు మార్చేటప్పుడు వీఆర్వోలు, ఆర్ఐలు, తహశీల్దార్లు, ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో అందరి సంతకాలు అవసరమవుతాయి. అయితే కొన్ని చోట్ల యజమాని ఫొటోపై కొత్తగా ఎవరికి కేటాయిస్తున్నారో వారి ఫొటో అంటించి పేరు మార్చి వదిలేశారు. అడంగల్, 1బీలలో పేరు మార్పు జరగలేదు. అలాంటివి ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్నాయి. ఆధార్ సీడింగ్‌లో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నప్పటికీ 1బీ, అడంగల్‌లో పేరు మార్పు జరగని కారణంగా సీడింగ్ జరగడం లేదు. దీంతో తాము రుణమాఫీకి అర్హులంకామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నకిలీల నేపథ్యంలో నిశిత పరిశీలన : గతంలో అనేక చోట్ల నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపి బ్యాంకులకు టోకరా వేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా నిబంధనల మేరకు పుస్తకాలుంటేనే వాటిని పరిగణలోకి తీసుకోవాలని బాంకర్లు నిర్ణయించడంతో, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవానికి ఆధార్ అనుసంధానం అయితే సదరు పట్టాదారు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు పొందితే ఆ విషయం బయటపడుతుంది. కానీ సాంకేతికపరమైన అంశాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ అవస్థలు : గడువు ముగుస్తున్నా అనేక మంది రైతులకు నేటికీ ఆధార్‌కార్డులు లేవు. దీంతో మీసేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పథకం, సంక్షేమ కార్యక్రమానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో కేంద్రాల వద్ద జనాలు క్యూలు కడుతున్నారు. అందుకు అనుగుణంగా ఆయా కేంద్రాల వద్ద ఏర్పాట్లు లేవు. గడువులోగా కనీసం ఆధార్ రసీదు నంబర్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కొన్ని చోట్ల నెలకొన్నాయి. నిర్ణీత వ్యవధిలోపు రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఉంటుంది. అయితే రుణమాఫీ ప్రకటనలో అనేక మంది రైతులు రుణాలు చెల్లించలేదు. రుణమాఫీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే రైతులపై వడ్డీ భారం పడింది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
రుణమాఫీ కోసం పక్కా సమాచారం ఇవ్వండి
చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రుణమాఫీ కోసం వందశాతం తప్పులులేని సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి ఆయన మండల స్థాయి అధికారులతో రుణమాఫీ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారులు ఈ పథకానికి త్రిమూర్తులాంటివారని, ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ వ్యవస్థ కలిగిన బ్యాంకులన్నీ శనివారం లోపు వివరాలను 31 కాలమ్స్‌లో పూర్తిచేసి పంపాలన్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ల వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. ప్రొఫార్మా,ఆధార్, రేషన్‌కార్డుల నంబర్లు వారికి అందనట్లయితే వెంటనే ఎల్డీఎంను, డీఎస్వోను సంప్రదించాలన్నారు. వ్యవసాయ పంట రుణాలు, బంగారుపై వ్యవసాయ రుణాలు పొందిన వారిలో కుటుంబం యూనిట్‌గా రూ.1.5లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు జీవోలోని అంశాలను ఎలా అమలు చేస్తారన్న విషయాలను గ్రామకార్యదర్శులు, వీఆర్వోలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. జిల్లాలో 4లక్షల మంది రైతులున్నట్లు అంచనా అని, రుణమాఫీలో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలన్నారు. ప్రజలు అడిగినప్పుడు రుణమాఫీపై అధికారులు సమాచారాన్ని వివరించాలన్నారు. దళారులు ఇందులో ప్రవేశించకుండా రైతులను మోసగించకుండా పథకంపై స్పష్టమైన అవగాహన పెంపొందించాలన్నారు. తెలుగులో ముద్రించిన రుణమాఫీ జీవో ప్రతులను కరపత్రాల రూపంలో అన్ని గ్రామాల్లో పంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఇన్చార్జ్ జేడీఏ నిర్మల్ నిత్యానంద్, ఎన్ఐసీ అధికారి అనిల్, డివిజన్లోని ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
రైతులకు ఝలక్
వసూలుకాని లోన్లను ఏజెన్సీలకు అమ్మేసిన బ్యాంకులు! 60 శాతంతో రుణాలను కొనుగోలు చేసిన ఏఆర్సీసీ నిరర్థక ఆస్తులుగా విక్రయించిన బ్యాంకర్లు అమ్మిన రుణాల విలువ రూ.12 కోట్లకు పైమాటే ఇక రుణ వసూళ్లు ఏజెన్సీల చేతుల్లోనే ఆందోళనలో పలువురు బకాయిదారులు పలమనేరు: బ్యాంకుల్లో అప్పు తీసుకుని సకాలంలో చెల్లించక మొండి బకాయిదారులుగా మారిన వారికి ఇది పిడుగులాంటి వార్తే. ఎందుకంటే ఆ రుణాలను ప్రైవేటు ఏజెన్సీలకు బ్యాంకులు అమ్మేశాయి. రుణగ్రహీతల నుంచి రికవరీ చేసే పూచీ ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు ఆ ఏజెన్సీలు తాకట్టులోని ఆస్తులను జప్తు చేసేందుకు అధికారం చిక్కినట్టైంది. ఈ విషయం బ్యాంకర్లు గుట్టుగానే కానిచ్చేశారు. ఈ మధ్య రుణమాఫీ హడావిడితో తమ రుణాలేమైనా మాఫీ అవుతాయేమోనని బ్యాంకులకెళ్లిన రుణగ్రహీతలకు ఈ విషయంతెలిసి లబోదిబోమంటున్నారు. నిరర్థక ఆస్తులను ఏఆర్సీసీకి అమ్మేసిన బ్యాంకులు.. పలమనేరు ప్రాంతంలోని ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులు మొండి బకాయిలను ఎన్పీఏలు (నాన్ ఫెర్ఫార్మెన్స్ అసెట్)గా మార్చాయి. దీంతో గతం లో రుణాలు తీసుకున్న క్రాప్, టర్మ్, బిజినెస్ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. సంబంధిత బ్యాంకుల నుంచి మొండిబకాయిల వివరాలను పరిశీలించిన ప్రధాన కార్యాలయాలు ఈ రుణాలను ప్రైవేటు ఏజెన్సీలకు గతంలోనే విక్రయించేసినట్లు తెలిసింది. ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్‌లకు సంబంధించి వసూలు కాని రుణాలను ఏఆర్సీఎల్ (అసెట్ రికన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు అమ్మేసినట్లు తెలిసింది. ఇందులో రిలయన్స్ సంస్థే భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వసూలు కాని రుణాలను 60 శాతం వెలకట్టి కొనుగోలు చేసినట్లు బ్యాంకర్లే చెబుతున్నారు. విక్రయించిన లోన్ల విలువ రూ.12 కోట్ల పైమాటే.. పలమనేరు ప్రాంతంలోని పలు బ్యాంకుల్లో ఎన్పీఏలుగా మారిన రుణాలను ఏజెన్సీలకు అమ్మేసిన లోన్ల విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. జిల్లా మొత్తం మీద ఇలాంటి మొండిబకాయిలను వంద కోట్లకు పైగా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియని రైతులు మహా అయితే బ్యాంకుల నుంచి నోటీసులు రావడం లేదా తాకట్టు భూములపై కోర్టు కేసులు జరుగుతాయిలేనని అనుకుంటున్నారు. రుణగ్రహీతల ఆస్తులకు ఎసరే.. స్థానిక బ్యాంకుల్లో పలువురు తమ ఆస్తులను, ఇళ్లను తాకట్టుగా పెట్టి పలు రకాల రుణాలు పొందారు. వీటిని సకాలంలో కట్టలేకపోవడంతో మొండిబకాయిదారులయ్యారు. వీరి రుణాలను ప్రైవేటు ఏజెన్సీలు కొనుగోలు చేయడంతో రికవరీల బాధ్యత ఏజెన్సీలదే. దీంతో వారు రుణగ్రహీతలకు నోటీసులివ్వడం, నిర్ణీత గడువులోపు డబ్బు చెల్లించకపోతే ఆస్తుల జప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఇండియన్ బ్యాంక్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణరావ్ను వివరణ కోరగా బ్యాంకుల్లోని ఎన్పీఏలుగా మారిన రుణాలను ఏఆర్సీఎల్కు అమ్మేసిన మాట నిజమేనన్నారు. హెడ్ ఆఫీస్ ఉత్తర్వులతో అన్ని బ్యాంకుల్లోనూ ఈ విక్రయాలు జరిగిపోయాయన్నారు. -
యంత్ర సబ్సిడీ హుళక్కేనా!
అదును దాటినా అందని సహకారం ఏపీ ఆగ్రోస్ అలక్ష్యంపై రైతుల ఆగ్రహం రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంతో జాప్యం ఓ మారు అతివృష్టి, మరోమారు అనావృష్టితో అతలాకుతలమవుతున్న రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందనే విమర్శలున్నాయి. రుణమాఫీ హామీని తుంగలో తొక్కిన బాబు ప్రభుత్వం కనీసం సబ్సిడీపై అందించాల్సిన వ్యవసాయ యంత్ర పరికరాలను సమకూర్చడంలోనూ ఘోరంగా విఫలమవుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ : దాదాపు ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్నా ఇంత వరకు పరిశ్రమలతో ఏపీ ఆగ్రోస్ కొటేషన్ల దశే దాటకపోవడంతో రైతులకు అందించే సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు ఈ ఏడాదికి లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఈ పరికరాలను ఎక్కువ సొమ్ము పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంతో పాటు ఏపీ ఆగ్రోస్ నిర్లక్ష్య ధోరణి కూడా కారణమేనని చిన్నపరిశ్రమల యజమానులు, రైతులు విమర్శిస్తున్నారు. 40 నుంచి 50శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు... ప్రతి ఏటా ఏపీ ఆగ్రోస్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు 40నుంచి 50శాతం సబ్సిడీతో అందిస్తుంటారు. జిల్లాకు దాదాపు రూ.11కోట్ల విలువైన వివిధ రకాల యంత్ర పరికరాలు రైతులకు అందాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రైతులకు చిన్న పరిశ్రమలకు, వ్యవసాయశాఖకు మధ్య ఏపీ ఆగ్రోస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ పథకం ద్వారా గొర్రు నాగళ్లు, ఫ్లవులు, ఆఫ్గేజ్ దమ్ము చక్రాలు, రూ.లక్ష విలు వచేసే రోటావేటర్లు, డిస్క్ ఫడ్లర్లు, లెవిల్ బ్లేడులు, వివిధ రకాల కల్టివేటర్లు ఇస్తారు. వీటిలో రోటావేటర్లకు 50శాతం సబ్సిడీ ఉంటుంది. మిగిలిన వాటికి చిన్న పరిశ్రమల అధిపతులతో ఏపీ ఆగ్రోస్ సంస్థవారు మధ్యవర్తిత్వం వహించి ధరలు నిర్ణయిస్తారు. వీటిలో దాదాపు 40నుంచి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ట్రాక్టర్లు ఉన్న రైతులు ఈ సబ్సిడీ పథకాన్ని వినియోగించుకుంటారు. సబ్సిడీలో 10శాతమే రాష్ట్ర ప్రభుత్వ వాటా.. రైతులకు అందించే సబ్సిడీలో 90శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కేవలం 10శాతం వాటా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ కొద్దిపాటి సబ్సిడీని కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోటేషన్ల దశదాటని ఏపీ ఆగ్రోస్.. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో యంత్ర పరికరాలు తయారీ దారునుంచి కొటేషన్లు పొందుతారు. వీటిలో చిన్న పరిశ్రమలతోపాటు పెద్ద పరిశ్రమలుంటాయి. ట్రాక్టర్ వీల్స్, నాగళ్లు వంటివి చిన్న పరిశ్రమలు సరఫరా చేస్తుండగా రోటావేటర్లు వంటివి పెద్దపెద్ద కంపెనీలు ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కొటేషన్లు వేసాయి. ఈ ప్రక్రియలో మే నెలలో ధర ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఏపీ ఆగ్రోస్ నిర్ణయిస్తుంది. ఈఏడాది ఏపీ ఆగ్రోస్ వారు జూన్26 వరకు తయారీ దారుల నుంచి కొటేషన్లు ఆహ్వానించారు. అయితే నేటి వరకు ధరలు నిర్ణయించ లేదని చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ రాకపోవడమేనని తెలుస్తుంది. -
నట్టేట ముంచిన చంద్రబాబు
రుణమాఫీ పేరుతో వంచన అధికారం కోసమే దొంగ హామీలు అమలు చేయాల్సిందే జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి తోట్లవల్లూరు : రుణమాఫీ పేరుతో సీఎం నారా చంద్రబాబునాయుడు రైతులను, మహిళలను నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి విమర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రుణమాఫీ ఓ పెద్దడ్రామాలా కనబడుతుందన్నారు. రిజర్వుబ్యాంకు రీషెడ్యూల్కు కూడా ససేమిరా అంటుంటే టీడీపీ నేతలు మాత్రం రీషెడ్యూల్ అని ఒకరోజు, మాఫీ చేస్తామంటూ మరొక రోజు అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అనివార్యమని, కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఉంటుందని తెలిసి కూడా అధికారమే పరమావధిగా బాబు ఎన్నికల్లో రుణమాఫీ హామీలను ఇచ్చారన్నారు. మోడీతో నిధులు రాబట్టుకుందామనుకున్న బాబుకు అక్కడా నిరాశ తప్పడం లేదన్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా రైతులను రుణాలే చెల్లించేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని, అమలు చేయలేని హామీలు ఎందుకిచ్చారో వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. రైతులు రుణాలు చెల్లించే పరిస్థితి ఉంటే రుణమాఫీ కోసం ఎందుకు ఎదురుచూస్తారని పద్మావతి మంత్రిని ప్రశ్నించారు. రుణమాఫీ సాధ్యం కాదనే ద్దేశంతోనే జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రుణమాఫీ హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే 7 శాతం వడ్డీతో సరిపోయేదని, ఇప్పుడు బ్యాంకులు 13 శాతం వడ్డీని వసూలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలని ఆమె చంద్రబాబును నిలదీశారు. త్వరలోనే రైతులు, డ్వాక్రా మహిళల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందని పద్మావతి చెప్పారు. రుణమాఫీని వెంటనే అమలుచేసి రైతుల్ని, మహిళల్ని రుణవిముక్తుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ పిఎస్.కోటేశ్వరావు, సోలే నాగరాజు పాల్గొన్నారు. -
నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు
ముఖ్యమంత్రిపై డ్వాక్రా మహిళల ఆగ్రహం పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ తంబళ్లపల్లెలో నిరసన ర్యాలీ, ధర్నా తంబళ్లపల్లె: ఎన్నికల ముందు ప్రజలు అడగక మునుపే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మాట నిలుపుకోకుంటే మనుగడ ఉండదని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. డ్వాక్రా రుణాల మాఫీపై రోజుకో విధంగా ప్రకటనలు చేస్తూ కాలయాపన చేయడంపై తంబపల్లెలో నిరసనకు దిగారు. సోమవారం తంబళ్లపల్లెలో డ్వాక్రా మహిళలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహశీల్దార్ కార్యాల యం వరకు ర్యాలీ చేశారు. హరిత సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు డ్వా క్రా మహిళలు మాట్లాడుతూ మహిళలను న మ్మించి మోసం చేయడం ముఖ్యమంత్రికి తగదన్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణమాఫీపై రోజుకో నిర్ణయాన్ని తీసుకుంటూ మహిళలను తికమక పెట్టడం సరికాదన్నారు. డ్వాక్రా సంఘాలను పూర్తిగా అధోగతిపాలు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిపోతారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవ్వరూ రుణాలు చెల్లించవద్దని చెప్పి ఇప్పుడు మాట మార్చడం నీచమన్నారు. దీనిపై మహిళలంతా ఉద్యమించి ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధమవుతామే గానీ రుణాలు చెల్లించేది లేదని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయకుంటే ఓట్లు అడిగిన వారిని నిలదీస్తామన్నారు. ఎమ్మెల్యేలను సైతం గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. అనంతరం డెప్యూటీ తహశీల్దార్ షంషీర్ఖాన్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
రుణమాఫీ చేయకుంటే తిరుగుబాటు తప్పదు
నీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కురబలకోట: రుణమాఫీ చేయకుంటే రాష్ట్రం లో చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హెచ్చరించారు. మం డలంలోని తెట్టు, అంగళ్లు, కురబల కోట గ్రామాల్లో ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే ఏవీ.లక్ష్మిదేవమ్మతో కలసి పర్యటించారు. నీటి సమస్య పరి ష్కారం కోసం కొత్తబోర్లు వేయడానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కాగానే రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. రుణమాఫీపై కాకుండా కమిటీపై సం తకం చేసి అందరినీ మభ్య పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చేయడం సరికాదన్నారు. నెల రో జుల్లోగా రుణమాఫీ చేయకుంటే జరిగే తిరుగుబాటుకు తమ పార్టీ అండదండగా నిలుస్తుందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్, కరెంటు బకాయిల రద్దుపై చేసి తనేమిటో చాటారన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఇప్పటికే రాష్ట్ర రైతాంగంలో రుణమాఫీపై ఆశలు స న్నగిల్లాయన్నారు. ఒకవైపు రాష్ట్రానికి నిధులు లేవని చెబుతూనే మరోవైపు అగ్రస్థానంలో నిలుపుతానని చెప్పడం చూస్తే ఆయన వైఖరిపై జనాలు విస్తుపోతున్నారని అన్నారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చెప్పడం తప్ప ఆ దిశగా చర్యలు కన్పించడం లేదన్నారు. తమ నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సాధ్యాసాధ్యాలను ఊహించే ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి మంచి తనాన్ని, విశ్వసనీయతను జ నం తెలుసుకున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ఏ ప్ర భుత్వం కూడా ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదన్నారు. నీటి సమస్యకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి వర్షాకాలం అయినప్పటికీ పడమటి మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉం దని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి నీటి సమస్య పరిష్కారానికి తక్షణమే ప్రత్యే క నిధులు కేటాయించాలన్నారు. వర్షా లు పడే వరకు ఆదుకోవాల్సి ఉందన్నా రు. తనకున్న నిధులన్నింటినీ తాగునీటికే కేటాయిస్తున్నామన్నారు. మరోవైపు కరువు కాటకాటలతో జనం అల్లాడుతున్నారన్నారు. వీటిపై ప్రత్యేక దృ ష్టి సారించి ప్రజలకు ఉపశమనం కలి గించాలన్నారు. నాయకులు బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, ఎంజీ.మల్లయ్య, నుల క చెన్నకేశవరెడ్డి, నులక మనోహర్‌రెడ్డి, పోరెడ్డి విశ్వారెడ్డి, తెట్టు సర్పంచ్ మ ల్లమ్మ, బైసాని జ్యోతి, కురబలకోట స ర్పంచ్ ముస్తఫా, ఎంఆర్ఆర్, బీ.దస్తగిరి, కోళ్లబైలు మాజీ సర్పంచ్ బయ్యారెడ్డి, బైసాని భాస్కర్‌రెడ్డి, ఫజరుల్లా, ముట్ర దామోదర్‌రెడ్డి, ఎన్వీ.రమణారెడ్డి, శిద్దారెడ్డి, పిచ్చలవాండ్లపల్లె గోపి, ఎస్ భానుప్రకాష్తో పాటు యువజన నాయకులు బైసాని హేమచంద్రారెడ్డి, నిశాంత్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
‘గాలి’ నాటకం!
సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు గాలి ముద్దుకృష్ణమ ఎత్తుగడ డ్వాక్రా మహిళలను ప్రసన్నం చేసుకునే యత్నం మభ్య పెడుతున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు పుత్తూరులో మహిళా సమాఖ్య సమావేశాలు పుత్తూరు : డ్వాక్రా రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న పొంతనలేని ప్రకటనలపై వ్యతిరేకత వస్తుందనే ముందస్తు ఆలోచనతో అధికార తెలుగుదేశం పార్టీ పక్షాలు కొత్త నాటకానికి తెరలేపాయి. అధికార పక్షం ఉన్న మున్సిపాలిటీలు, మండలాల్లో ఉన్నఫలంగా డ్వాక్రాగ్రూపు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరినీ ఒకే వేదికపైకి రప్పిస్తే విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించి సమాఖ్యల వారీగా ఆయా ప్రాంతాల్లోనే సమావేశపరుస్తున్నారు. పెపైచ్చు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు అతి తెలివిని ప్రదర్శిస్తూ మాయ మాటలతో రుణ మాఫీ విషయాన్ని మభ్య పెట్టే పనిని కార్యక్రమంగా చేపట్టారు. సమావేశాలకు హాజరుకాకపోతే మున్ముందు సమాఖ్య ప్రతినిధులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని గ్రహించి వెళ్లాల్సి వస్తోందని పలువురు మహిళల వాదన. నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచనలతో పుత్తూరు మున్సిపల్ పరిధిలో డ్వాక్రా గ్రూపుల సమావేశాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధిపై పార్టీ అధిష్టానం అసంతృప్తిలో ఉందనే వాదన వినిపిస్తోంది. దీనిని అధిగమించి సీఎం దృష్టిని ఆకర్షించే యత్నంలో ఆయన వేసిన ఎత్తుగడలో భాగమే డ్వాక్రా గ్రూపు మహిళల సమావేశాల నిర్వహణ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుత్తూరు మున్సిపల్ పరిధిలో 862 డ్వాక్రా గ్రూపుల్లో 8620 మంది సభ్యులు ఉన్నారు. 24 వార్డులకు 42 సమాఖ్యలు కాగా ఒక్కొక్క సమాఖ్య నేతృత్వంలో 15 నుంచి 20 గ్రూపులు ఉన్నాయి. వీరికి 2013-14 ఆర్థిక సంవత్సానికి బ్యాంకు లింకేజి కింద రూ.11 కోట్ల రుణాలు అందించారు. ఒక్కొక్క గ్రూపునకు 1 నుంచి 5 లక్షల మేరకు రుణ మంజూరు చేశారు. అయితే ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని హామీతో బ్యాంకులకు నెలసరి కంతులు కట్టడం మానేశారు. ప్రస్తుతం రుణమాఫీపై సమగ్ర సమాచారం లేకపోవడంతో మహిళల్లో వ్యతిరేకత రాకుండా చేసేందుకు నేరుగా మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, టీడీపీ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే శుక్రవారం పుత్తూరు మున్సిపల్ పరిధిలోని 13, 14, 24 వార్డుల్లో మహిళా సమాఖ్య సమావేశాలు నిర్వహించారు. కాగా 14 వార్డులో నిర్వహించిన సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధి తనయుడు హాజరయ్యారు. రుణమాఫీ త్వరలో చేస్తారని ముందుగా రైతురుణ మాఫీకి ప్రాధాన్యత ఇస్తున్నారని తరువాత డ్వాక్రా మహిళలకు అంటున్న దశలో ఓ మహిళ ప్రశ్నిస్తూ ‘ఎప్పుడనేది తేదీ చెప్పకుండా తరువాతంటూ ఎప్పటికయ్యా..? ఇప్పటికే చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది’ అని నిలదీయడంతో ఆమెకు సర్దిచెప్పారు. నిబంధనల మేరకు సమాఖ్య సమావేశాలకు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరు కావాలి. అయితే మాజీ ప్రజా ప్రతినిధి తనయుడిని ఏ హోదాలో ఆహ్వానించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.