మహరాజశ్రీ సీఎం చంద్రబాబు గారికి..
జిల్లా రైతాంగం రాసుకున్న విన్నపమేమనగా.. అయ్యా.. ఎన్నికల ప్రచారంలో రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటే ఎగిరి గంతేశాం.. ఓట్లేశాం... అధికారంలోకి వచ్చారు.. ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకం మీకోసమే అంటే ఆనందపడ్డాం.. తీరా కమిటీ అంటే త్వరగా పూర్తి చేస్తారేమో అని మిన్నకుండిపోయాం.. పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షన్నరే అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కదా అని మనసుకు సర్దిచెప్పుకున్నాం.. పోనీలే అది వచ్చినా ఎంతోకొంత బాగు పడతామని ఎదురు చూశాం.
బ్యాంకుల్లో అడ్డమైన పత్రాలు ఇవ్వాలని చెప్పావు.. ఒక్కొక్కరం రెండు, మూడు దఫాలు బ్యాంకుల చుట్టూ తిరిగి పత్రాలు అందజేశాం. ఛార్జీలు, ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.. కొందరైతే కూలి పనులు మానుకుని మరీ పత్రాలు ఇచ్చారు.. జిల్లాలో 4.95లక్షల మంది ఇలానే ఖర్చు భరించారు. రుణ మాఫీ పుణ్యమా అని ఒక్కొక్కరికి సుమారు 300 చొప్పున దాదాపు రూ.2 కోట్ల వరకు మా సొదరుల చేతి చమురు వదిలింది. అంతటితో ఆగారా.. సరిగా వివరాలు లేవంటూ 2.67లక్షల ఖాతాలను వెనక్కిపంపాదు.
తిరిగి ఉరుకులు, పరుగుల మీద వెళ్లి వాటినీ అందజేశాం.ఇప్పుడేమో 3.08 లక్షల ఖాతాలను పరిశీలించాలంటూ రెవెన్యూ సిబ్బందికి పంపావు. పత్రాలు ఇవ్వకపోతే రుణమాఫీ రాదనే భయం వెంటాడుతోంది.. ఎందుకిలా మాతో ఆటలాడుకుంటున్నావు... మీ వంటి పెద్దలకు ఇది తగునా సామీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొదట 20 శాతం ఈ నెల 5న వేస్తానన్నావు.. మళ్లీ 12 అన్నావు.. తిరిగి 15వ తేదీ చెప్పావు.. ఇప్పుడేమో 18వ తేదీ అంటున్నావు.. మాట మీద నిలబడే అలవాటు మీకు లేదని అందరూ అనే మాటను నిజం చేస్తున్నావే.
49 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని మీకు నివేదికలు అందాయి.. అయినా కరుణించలేదు. మీరు రుణమాఫీ అమలు చేస్తారని బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. దీంతో వారు కొత్త రుణాల్విలేదు.. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి పంటలు సాగు చేశాం. రెన్యువల్స్ చేయకపోవడంతో బీమా కూడా దక్కలేదు. సరైన సమయంలో అప్పు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి గతం కంటే రూ.లక్షకు రూ.13వేలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారు. 20 శాతం ఖాతాల్లో వేస్తే బ్యాంకర్లు శాంతిస్తారనుకుంటే నువ్వు వాయిదాలు తప్ప నగదు జమ చేయడం లేదు. ఇప్పటికైనా మీరు మారండి.. మా ఉసురు ఉసురు పోసుకోవద్దని మనవి.
రుణమాఫీ ఇంకెప్పుడో..!
Published Sat, Nov 15 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement