యంత్ర సబ్సిడీ హుళక్కేనా!
అదును దాటినా అందని సహకారం
ఏపీ ఆగ్రోస్ అలక్ష్యంపై రైతుల ఆగ్రహం
రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంతో జాప్యం
ఓ మారు అతివృష్టి, మరోమారు అనావృష్టితో అతలాకుతలమవుతున్న రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందనే విమర్శలున్నాయి. రుణమాఫీ హామీని తుంగలో తొక్కిన బాబు ప్రభుత్వం కనీసం సబ్సిడీపై అందించాల్సిన వ్యవసాయ యంత్ర పరికరాలను సమకూర్చడంలోనూ ఘోరంగా విఫలమవుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుడివాడ : దాదాపు ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్నా ఇంత వరకు పరిశ్రమలతో ఏపీ ఆగ్రోస్ కొటేషన్ల దశే దాటకపోవడంతో రైతులకు అందించే సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు ఈ ఏడాదికి లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఈ పరికరాలను ఎక్కువ సొమ్ము పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంతో పాటు ఏపీ ఆగ్రోస్ నిర్లక్ష్య ధోరణి కూడా కారణమేనని చిన్నపరిశ్రమల యజమానులు, రైతులు విమర్శిస్తున్నారు.
40 నుంచి 50శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు...
ప్రతి ఏటా ఏపీ ఆగ్రోస్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు 40నుంచి 50శాతం సబ్సిడీతో అందిస్తుంటారు. జిల్లాకు దాదాపు రూ.11కోట్ల విలువైన వివిధ రకాల యంత్ర పరికరాలు రైతులకు అందాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రైతులకు చిన్న పరిశ్రమలకు, వ్యవసాయశాఖకు మధ్య ఏపీ ఆగ్రోస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ పథకం ద్వారా గొర్రు నాగళ్లు, ఫ్లవులు, ఆఫ్‌గేజ్ దమ్ము చక్రాలు, రూ.లక్ష విలు వచేసే రోటావేటర్లు, డిస్క్ ఫడ్లర్లు, లెవిల్ బ్లేడులు, వివిధ రకాల కల్టివేటర్లు ఇస్తారు. వీటిలో రోటావేటర్లకు 50శాతం సబ్సిడీ ఉంటుంది. మిగిలిన వాటికి చిన్న పరిశ్రమల అధిపతులతో ఏపీ ఆగ్రోస్ సంస్థవారు మధ్యవర్తిత్వం వహించి ధరలు నిర్ణయిస్తారు. వీటిలో దాదాపు 40నుంచి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ట్రాక్టర్లు ఉన్న రైతులు ఈ సబ్సిడీ పథకాన్ని వినియోగించుకుంటారు.
సబ్సిడీలో 10శాతమే రాష్ట్ర ప్రభుత్వ వాటా..
రైతులకు అందించే సబ్సిడీలో 90శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కేవలం 10శాతం వాటా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ కొద్దిపాటి సబ్సిడీని కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కోటేషన్ల దశదాటని ఏపీ ఆగ్రోస్..
ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో యంత్ర పరికరాలు తయారీ దారునుంచి కొటేషన్లు పొందుతారు. వీటిలో చిన్న పరిశ్రమలతోపాటు పెద్ద పరిశ్రమలుంటాయి. ట్రాక్టర్ వీల్స్, నాగళ్లు వంటివి చిన్న పరిశ్రమలు సరఫరా చేస్తుండగా రోటావేటర్లు వంటివి పెద్దపెద్ద కంపెనీలు ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కొటేషన్లు వేసాయి.
ఈ ప్రక్రియలో మే నెలలో ధర ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఏపీ ఆగ్రోస్ నిర్ణయిస్తుంది. ఈఏడాది ఏపీ ఆగ్రోస్ వారు జూన్26 వరకు తయారీ దారుల నుంచి కొటేషన్లు ఆహ్వానించారు. అయితే నేటి వరకు ధరలు నిర్ణయించ లేదని చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ రాకపోవడమేనని తెలుస్తుంది.