రెన్యువల్ కాకుంటే మాఫీ లేదు | If renewal is not waived | Sakshi
Sakshi News home page

రెన్యువల్ కాకుంటే మాఫీ లేదు

Published Fri, Jan 30 2015 1:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రెన్యువల్ కాకుంటే మాఫీ లేదు - Sakshi

  • రుణాలు పునరుద్ధరించుకోనిరైతుల ఖాతాల్లో మాఫీ నిధులు జమచేయొద్దు
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ
  • ఇలా మిగిలిపోయే రూ. 500 కోట్లు వెనక్కు ఇచ్చేయండి
  • బ్యాంకులకు సర్కారు ఆదేశం
  • రాష్ట్రంలో రెన్యువల్ కాని రుణ ఖాతాలు దాదాపు 8 లక్షలు
  • ఈనెల 31 వరకు రెన్యువల్‌కు గడువు
  • సాక్షి, హైదరాబాద్: రుణాలు రెన్యువల్ (పునరుద్ధరణ) చేసుకోని రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం తేల్చింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. దీనితో బ్యాంకుల్లో పంట రుణం తీసుకుని, వాటిని పునరుద్ధరించుకోని దాదాపు ఎనిమిది లక్షల అకౌంట్లకు సంబంధించిన రైతులకు రుణమాఫీ అయ్యే అవకాశం లేకుండా పోతోంది. రుణాలు పునరుద్ధరించుకోని రైతుల ఖాతాల్లో మాఫీ నిధులు జమచేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బ్యాంకర్లకు దిక్కుతోచడం లేదు. రుణాలు తీసుకున్న రైతులను ఏదో విధంగా పిలిపించి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    లేకపోతే ఆ రుణాలన్నీ నిరర్థక ఖాతా కింద మారే ప్రమాదం ఏర్పడడంతో వారు రైతుల వెంటపడుతున్నట్లు సమాచారం. రైతులు పునరుద్ధరణ చేసుకోకపోవడం వల్ల బ్యాంకుల్లో మిగిలిపోయిన దాదాపు రూ. 500 కోట్ల నిధులను తమ ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. రైతుల నుంచి వసూలు చేసే బదులు ప్రభుత్వం ఏకమొత్తంలో నిధులు చెల్లించడంతో సంబరపడ్డ బ్యాంకర్లు తాజా నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నారు.

    దీంతో ఈ నెలాఖరులోగా సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులతో  రుణాలు పునరుద్ధరణ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క రుణాలను పునరుద్ధరించుకోకపోవడంతో రుణమాఫీకి అర్హత కోల్పోయే రైతులకు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం పైసా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో మొత్తం రూ. 17 వేల కోట్లకుపైగా పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో మూలధనం, వడ్డీ కలిపి మొత్తం బ్యాంకులకు చెల్లించి రైతులకు రుణవిముక్తి కల్పిస్తామని ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది.

    ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా ఈసారి రుణం పునరుద్ధరణ చేసుకోకుంటే.. మిగిలిన దశల్లో రుణమాఫీ వర్తించదని పేర్కొనలేదని బ్యాంకర్లు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించలేదంటున్నారు. రుణమాఫీ మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,250 కోట్లను బ్యాంకులకు గత అక్టోబర్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 36 లక్షల అకౌంట్లు ఉంటే.. అందులో దాదాపు ఏడు లక్షలకు పైగా అకౌంట్లు ఉన్న రైతులు ఇప్పటి వరకు రుణాలను పునరుద్ధరించుకోలేదు.

    రుణమాఫీ ప్రక్రియ మూడు నెలలుగా సాగుతున్నా రైతులు ముందుకు రాకపోవడంతో ఇకపై వారిని కొనసాగించడం వల్ల లాభం లేదని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. లక్ష రూపాయలకుపైగా రుణాలు తీసుకున్న వారు, భూములు విక్రయించిన వారు పునరుద్ధరణకు ముందుకు రావడం లేదన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

    మొదటి దశలోనే ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలాయంటే... ఆ లెక్కన వచ్చే మూడు దశలకు చెల్లించాల్సిన మొత్తంలో దాదాపు రూ.1500 కోట్లు మిగిలే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 31లోగా రైతులు తమ పంటరుణాలను పునరుద్ధరించుకోకపోతే వారు రుణమాఫీకి అర్హత కోల్పోతారని జిల్లాల్లో వ్యవసాయ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ మేరకు వారు నోటీసులు జారీ చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement