పత్రాలిచ్చారు సరే.. పైసలేవీ..?
♦ బ్యాంకులకు పోటెత్తుతున్న రైతులు
♦ మాకేమి డబ్బులు రాలేదంటున్న బ్యాంకర్లు
♦ ముందు చూపులేక సమస్య జఠిలం
♦ జిల్లాలో అన్నిచోట్లాఇదే పరిస్థితి
♦ ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో క్లిక్ చేయాలంటున్న ఎల్‌బీఎం
సాక్షి కడప : ఐదేళ్లల్లో పూర్తి రుణం మాఫీ చేస్తామని మరోమారు అన్నదాతలకు రుణ ఉపశమన పత్రాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా.. బ్యాంకుల్లో అధికారులు మాత్రం వాటిపట్ల నిరాసక్తత చూపుతున్నారు. కారణం అవగాహన లేకపోవడంతో పాటు రాష్ట్రప్రభుత్వం నిధులు వేసిందో.. లేదో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున కొంతమంది మంత్రులు, టీడీపీ నేతలు అట్టహాసంగా రుణ ఉపశమన పత్రాలను రైతులకు పంపిణీ చేసినా.. బ్యాంకుల్లో నిధులు నిల్ అంటుండటంతో పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అన్నదాతలకు, మహిళలకు రుణాల మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తర్వాత సవాలక్ష కొర్రీలతో అతితక్కువ మంది రైతులకే రుణం మాఫీ చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. రూ.50వేలలోపు రుణం ఉన్న రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామన్నా.. చాలామందికి అది జరగలేదు. తాజాగా పంపిణీ చేస్తున్న రుణ ఉపశమన పత్రాల వ్యవహారం కూడా అయోమయంగా తయారైంది.
గగ్గోలుపెడుతున్న అన్నదాతలు.. : జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఖాతాలకు మొదటి విడతలోనే రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా పంపిణీ చేస్తున్న రుణ ఉపశమన పత్రాలు చాలామంది రైతులకు అందడం లేదు. ఉదాహరణకు తొండూరు మండలంలో 6వేల పైచిలుకు ఖాతాలు ఉండగా.. ఇప్పటివరకు 3వేలలోపు ఖాతాలకు మాత్రమే రుణవిముక్తి పత్రాలను అందజేశారు. మిగతా వారికి ఎప్పుడిస్తారో స్పష్టతలేదు. అసలు రుణవిముక్తి పత్రాలు వస్తాయో.. రావో తెలియని పరిస్థితి. దీంతో అన్నదాతలు గగ్గోలుపెడుతున్నారు. ఇదేమిటని పలువురు రైతులు పులివెందులలో జరిగిన రుణ ఉపశమన పత్రాల పంపిణీ సభలో టీడీపీ నేతలను నిలదీశారు. అయినా ప్రయోజనం శూ న్యం. ఒక్క తొండూరు మండలంలోనే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా చాలామంది రైతులకు రుణ విముక్తి పత్రాలు అందలేదు.
బ్యాంకు అధికారులకు అవగాహనలేక ఇబ్బందులు
తమకు అందజేసిన ఉమశమన పత్రాలను పట్టుకొని రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. అక్కడ రైతులకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రైతులు తీసుకెళ్లిన తర్వాత పత్రాల్లోని సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉన్న పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్యాంకు అధికారులకు దీనిపై అవగాహన లేకపోవడం.. ప్రభుత్వం మాఫీకి సంబంధించిన సొమ్మును ఎక్కడ పెట్టింది తెలపకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. మాఫీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రైతన్నలను పలువురు అధికారులు తిప్పిపంపుతున్నారు. నేతల ఆర్భాటం.. బ్యాంకు అధికారుల అవగాహన లోపం.. రైతులకు శాపంగా మారుతున్నాయి.
ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో క్లిక్ చేయాలి: ఎల్‌బీఎం
ప్రస్తుతం రుణ ఉపశమన పత్రాలు తీసుకున్న రైతులు బ్యాంకులకు రాగానే పత్రాలలో ఉన్న పేరుతోపాటు ఇతర వివరాలను ఎన్‌ఐసీ(నేషనల్ ఇన్‌ఫార్మటిక్ సెంటర్)లో అప్‌లోడ్ చేయాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి తెలియజేశారు. అందుకు సంబంధించి రైతులు బ్యాంకులకు రాగానే పత్రాల్లో ఉన్న సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తే సాధికారిత సంస్థకు వెళుతుందన్నారు. తర్వాత రెండు, మూడు రోజులకు సాధికారిత సంస్థల హెడ్ ఆఫీసు ఆ మొత్తాన్ని జమ చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం హెడ్ ఆఫీసుల నుంచి సంబంధిత బ్రాంచ్‌లకు వస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం రైతుల ఖాతాలకు జమచేస్తారని తెలిపారు. రైతులకు సంబంధించిన రుణ పత్రాలను తీసుకొని అన్ని బ్యాంకుల అధికారులు ఎన్‌ఐసీలో ఆప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు.