అంతా మా ఇష్టం!
- రెన్యువల్ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు
- చేసుకోని వారి ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకర్ల నిరాకరణ
- వడ్డీ చెల్లింపు విషయంలో స్పష్టత లేకపోవటమే కారణం
పరిగి: మేం మోనార్కులం.. ఎవరి మాటా వినం.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు బ్యాంకర్లు. రెండోవిడత రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు అందజేసినా.. అవి రైతుల ఖాతాల్లో బ్యాంక్ అధికారులు జమ చేయటంలేదు. రెన్యువల్ చేసుకున్న రైతుల ఖాతాల్లోనే రుణమాఫీ డబ్బులు జమచేసి చేతులు దులుపుకొంటున్నారు. రెన్యువల్ చేసుకోని రైతులకు సంబంధించిన డబ్బులు బ్యాం కుల్లోనే ఉంచుకుని వాటితో జమయ్యే వడ్డీతో బ్యాంకర్లు తమ వ్యాపారాలు వెలగబెట్టుకుంటున్నారు. విషయాన్ని పసిగట్టిన కలెక్టర్ వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆయా మండలాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు.
ఏయే బ్యాంకులకు ప్రభుత్వం ఎన్ని డబ్బులు జమచేసింది. ఆయా బ్యాంకులు రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమచేశాయి. ఇంకా ఎన్ని డబ్బులు ఖాతాల్లో మూలుగుతున్నాయనే విషయంలో తనకు వెంటనే నివేదిక సమర్పించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన ప్రత్యేకాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇదే సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చే యాలని వ్యవసాయ శాఖ అధికారులు బ్యాం కుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటంలేదు. రెన్యువల్ చేసుకున్నప్పుడే ఖాతాల్లో జమచేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
25 రోజులైనా.. 30 శాతంలోపే..
ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ డబ్బులు విడుదల చేసి 25 రోజులు కావస్తోంది. 25 రోజుల క్రితమే అన్ని బ్యాంకుల్లో రెండో రుణమాఫీకి సంబంధించి 12.5 శాతం నిధులు ప్రభుత్వం జమ చేసింది. ఇదే సమయంలో మరో 12.5 శాతం నిధులు త్వరలో బ్యాంకులకు ఇస్తాం. వాటిని కూడా రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించింది. అయితే బ్యాంకర్లు ఇవేవీ పట్టించుకోకుండా అసలుకే ఎసరు పెట్టారు. ఇప్పటికే బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిన 12.5 శాతం నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా తమ ఖాతాల్లోనే ఉంచుకున్నారు. ఇప్పటి వరకు పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న 30శాతంలోపు రైతులకు మాత్రమే ఖాతాల్లో జమ చేసి ఊరుకున్నారు.
పరిగి వ్యవసాయ డివిజన్‌లోని నాలుగు మండలాలకు చెందిన బ్యాంకుల్లో ప్రభుత్వం 25 రోజుల క్రితం రూ.22.89 కోట్లు జమ చేయగా ఇప్పటి (బుధవారం) వరకు రూ.7.35 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం 41,651 మందికి రుణమాఫీ జమచేయగా 14,337 మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి. ఈ విషయమై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నగేష్‌కుమార్‌ను వివరణ కోరగా.. విడుదల చేసిన డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమచేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం రెన్యువల్ చేసుకున్న వారి కాతాల్లోనే జమ చేస్తున్నారని తెలిపారు. రైతులంతా రెన్యువల్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.