Government banks
-
అలెర్ట్, దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. బ్యాంక్ సేవలపై ఎఫెక్ట్!
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. డిసెంబర్, జనవరిలో అత్యవసరమైన బ్యాంక్ పనులున్నాయా? ఉంటే ఇప్పుడే చూసుకోండి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్ 4 నుంచి జనవరి 20 వరకు దేశ వ్యాప్తంగా సమ్మె చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్‌కి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు డిసెంబర్ 4 నుంచి స్ట్రైక్ చేయనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలకాలన్న ప్రధాన డిమాండ్లతో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘అన్ని బ్యాంకులలో తగినంత సిబ్బందిని నియమించాలి. బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాల ఔట్సోర్సింగ్ లేదా, అవుట్ సోర్సింగ్‌కు సంబంధించిన బీపీ సెటిల్మెంట్ నిబంధనల ఉల్లంఘనను ఆపాలి’ అని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మెలో ప్రైవేట్ బ్యాంకులు సైతం ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులు సైతం సమ్మెలో పాలు పంచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 11న సమ్మెకు దిగనుండగా.. జనవరి 19, 20 తేదీలలో స్ట్రైక్ చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడనుంది. డిసెంబర్ 4 నుంచి సమ్మె ప్రారంభం డిసెంబరు 4న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల సమ్మెలతో అఖిల భారత సమ్మె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5, 6, 7, 8, 11 తేదీల్లో వివిధ బ్యాంకులు మూసివేయబడతాయి. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సమ్మె అయితే, జనవరి 2 నుండి సమ్మె ఆయా రాష్ట్రాల వారీగా కొనసాగుతుంది. జనవరి 2తో ప్రారంభమైన ఈ స్ట్రైక్‌లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్, లక్ష్వదీప్‌లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మె నిర్వహించనున్నారు. యూపీ, ఢిల్లీ బ్యాంకుల సమ్మె ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు వరుసగా జనవరి 4, 5 తేదీలలో మూసివేయబడతాయి. రెండు రోజుల సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
ప్రభుత్వ బ్యాంకుల లాభాల జోరు..క్యూ1 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆకర్షణీయ పనితీరు చూపాయి. మొత్తం 12 సంస్థలు ఉమ్మడిగా రూ. 34,774 కోట్ల నికర లాభం ఆర్జించాయి. గతేడాది(2022–23) క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 15,306 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. అధిక వడ్డీ రేట్ల పరిస్థితులు ఇందుకు సహకరించాయి. రుణ రేట్ల సవరణ కారణంగా పలు బ్యాంకుల వడ్డీ మార్జిన్లు బలపడ్డాయి. వెరసి నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3 శాతానికిపైనే నమోదయ్యాయి. బీవోఎం అదుర్స్ పీఎస్‌యూ సంస్థలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ఐఎం అత్యధికంగా 3.86 శాతానికి చేరగా.. సెంట్రల్ బ్యాంక్ 3.62 శాతం, ఇండియన్ బ్యాంక్ 3.61 శాతం మార్జిన్లను సాధించాయి. నాలుగు సంస్థలు 100 శాతానికిపైగా నికర లాభంలో వృద్ధిని అందుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 307 శాతం అధికంగా రూ. 1,255 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ బాటలో నంబర్ వన్ సంస్థ ఎస్బీఐ నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో రికార్డ్‌కాగా.. మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల లాభాల్లో 50 శాతం వాటాను ఆక్రమించింది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 176 శాతం జంప్ చేసి రూ. 1,551 కోట్లకు చేరింది. గతేడాది మొత్తం లాభాల(రూ. 1.05 లక్షల కోట్లు)లోనూ ఎస్బీఐ నుంచి 50 శాతం సమకూరిన సంగతి తెలిసిందే. ఐదు బ్యాంకులు భేష్ క్యూ1లో ఐదు ప్రభుత్వ బ్యాంకులు 50–100 శాతం మధ్య లాభాలు ఆర్జించాయి. వీటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 95 శాతం వృద్ధితో రూ. 882 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 88 శాతం అధికంగా రూ. 4,070 కోట్లు, యుకో బ్యాంక్ 81 శాతం వృద్ధితో రూ. 581 కోట్లు సాధించాయి. కేవలం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ మాత్రమే 25 శాతం క్షీణతతో రూ. 153 కోట్ల నికర లాభం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు పీఎస్‌యూ బ్యాంకుల పురోగతికి దోహదపడ్డాయి. గుర్తింపు, పరిష్కారం, పెట్టుబడులు, సంస్కరణల పేరుతో అమలు చేసిన వ్యూహాలు ఫలితాలినిచ్చాయి. దీంతో మొండి రుణాలు దశాబ్దకాలపు కనిష్టం 3.9 శాతానికి చేరాయి. ఇదే సమయంలో(గత ఎనిమిదేళ్లలో) మొండి రుణాల నుంచి రూ. 8.6 లక్షల కోట్ల రికవరీని సాధించాయి. 2017–21 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 3,10,997 కోట్ల పెట్టుబడులను పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది. -
బ్యాంకుల్లో ఊహించని మార్పులు.. వారానికి 5 రోజులే పని..ఇంకా
గత కొంత కాలంగా వారంలో ‘ఐదురోజులే పనిదినాల’పై ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్లు, ప్రతిపాదనలు చివరి దశకు వచ్చాయి. ఐదు రోజుల పనిదినాలపై మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల భవితవ్యం తేలనుంది. జులై 28న కేంద్రం సైతం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఈ సంస్కృతి ప్రైవేట్ రంగ సంస్థల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ వర్క్ కల్చర్ ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాల్ని కొనసాగిస్తుండగా.. తమకు వారాంతంలో రెండు రోజుల సెలవుల సంస్కృతిని కొనసాగించాలని ప్రభుత్వ బ్యాంక్ రంగ సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం ( ఏప్రిల్28న).. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ)లు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ఐదు రోజుల పని, వేతన పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చర్చించనున్నాయి. వీటన్నింటికంటే వారానికి ఐదురోజుల పనిదినాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నాయి. ప్రస్తుతం, బ్యాంకుల్లో మొదటి, మూడవ శనివారం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యూఎఫ్‌బీయూ బ్యాంక్ ఉద్యోగులు వారినికి రెండురోజుల సెలవులిస్తూ వారానికి ఐదు రోజులు పనిచేసే వెసలు కల్పించాలని కోరుతుంది. వారానికి ఐదు రోజుల పని కల్పించాలన్న యూఎఫ్‌బీయూ డిమాండ్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ప్రకారం, వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున, దీనికి బదులుగా 5 రోజుల పాటు, సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది. దీంతో పాటు పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్ విధానంలో అనుమతించాలని కోరుతోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే..బ్యాంక్ ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ఎలాన్ మస్క్‌కు మెలిక పెట్టిన కేంద్రం! -
ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులతో కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి వివేక్ జోషి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జన సురక్ష, ముద్రా యోజన వంటి వివిధ ఆర్థిక స్కీములను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని బీమా పథకాల్లో మరింత మందిని చేర్చే దిశగా బ్యాంకులు తమ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లోన వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జోషి సంనట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రోజంతా సాగిన ఈ సవవేశంలో పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, హౌసింగ్ తదితర శాఖల సీనియర్ అధికారులు, నాబార్డ్ చైర్మన్, ఎన్పీసీఐ సీఈవో మొదలైన వారు కూడా పాల్గొన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి తదితర స్కీముల పురోగతిని సైతం ఇందులో సమీక్షించారు. -
దేశంలో భారీగా తగ్గిన బ్యాంక్ మోసాలు.. కారణాలివేనా?
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) బ్యాంకింగ్ రంగంలో భారీ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ. 100 కోట్లకుపైబడిన మోసాల విలువ రూ. 41,000 కోట్లకు పరిమితమమైంది. అంతక్రితం ఏడాది(2020–21)లో ఇవి ఏకంగా రూ. 1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం అటు ప్రయివేట్, ఇటు పబ్లిక్ బ్యాంకులలో కుంభకోణాల కేసులు 118కు తగ్గాయి. 2020–21లో ఇవి 265గా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లను తీసుకుంటే రూ.100 కోట్లకుపైబడిన మోసాలకు సంబంధించిన కేసుల సంఖ్య 167 నుంచి 80కు క్షీణించింది. ప్రయివేట్ రంగంలోనూ ఇవి 98 నుంచి 38కు దిగివచ్చాయి. విలువరీత్యా చూస్తే గతేడాది పీఎస్బీలలో వంచన కేసుల విలువ రూ. 65,900 కోట్ల నుంచి రూ. 28,000 కోట్లకు తగ్గింది. ఇక ప్రయివేట్ బ్యాంకుల్లోనూ ఈ విలువ రూ. 39,900 కోట్ల నుంచి రూ. 13,000 కోట్లకు వెనకడుగు వేసింది. బ్యాంకింగ్ రంగ మోసాలకు చెక్ పెట్టే బాటలో రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. తొలినాళ్లలోనే హెచ్చరించే వ్యవస్థ(ఈడబ్ల్యూఎస్) మార్గదర్శకాలను మెరుగుపరచడం, ఫ్రాడ్ గవర్నెన్స్, స్పందన వ్యవస్థను పటిష్టపరచడం,లావాదేవీల పర్యవేక్షణ, గణాంకాల విశ్లేషణ, మోసాలను పసిగట్టేందుకు ప్రత్యేకించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు తదితరాలకు ఆర్బీఐ తెరతీసింది. మోసాల తీరిలా ఈ ఏడాది మొదట్లో స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) దేశంలోనే అతిపెద్ద మోసానికి నెలవైంది. ఏబీజీ షిప్‌యార్డ్, కంపెనీ ప్రమోటర్లకు సంబంధించి రూ. 22,842 కోట్ల కుంభకోణం నమోదైంది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్ల మోసం చేసిన నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ కేసుకంటే పెద్దదికావడం గమనార్హం! ఇక గత నెలలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్), కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్ తదితరులపై రూ. 34,615 కోట్ల ఫ్రాడ్ కేసును సీబీఐ బుక్ చేసిన విషయం విదితమే. -
బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా?
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు గానీ, దీన్నుంచి స్థూలంగా దేశానికి ఏం ప్రయోజనం కలుగుతుందన్నది ప్రశ్న. ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాలకు సేవలు వంటి లాభదాయకం కాని సేవలనుంచి తప్పుకోవచ్చు. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది, ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగమిస్తోంది. మొత్తంమీద చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది సర్వరోగనివారిణి అయితే కాదు. నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు అనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోతోంది. 2021 ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒక ప్రభుత్వ బీమా కంపెనీని 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీ కరించాలనే లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను ముగించడానికి, ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావలసి ఉంది. అందుచేత, ప్రభుత్వం బ్యాంకింగ్ లాస్ (సవరణ) బిల్లు, 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ కనీసం వాటా 51 నుంచి 26 శాతానికి కుదించబడుతుంది. ప్రస్తుతానికి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ వాటాలు దాదాపు రూ. 44 వేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 31,641 కోట్లు కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ. 12,359 కోట్లు. ఈ రీతిన ఈ బ్యాంకుల్లో ఉన్న తన వాటాను ప్రభుత్వం అమ్ముకోవడం ద్వారా తానుపెట్టిన మూల ధనాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం తన వాటాని అమ్ముకోవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పడం కష్టమవు తుంది. ఈ మూలధనం విలువ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సమయంలో మార్కెట్ పరిస్థితులపైనా, బ్యాంక్ బలంపైనా అంటే బ్యాంకు శాఖలు, కస్టమర్లు, అలాగే బ్యాంక్ బిజినెస్ స్థాయి, నిరర్థక ఆస్తులు (ఎన్పీఎలు) తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులను ప్రైవేటీకరించిన తర్వాత, ఈ బ్యాంకుల్లోకి మూలధనాన్ని మళ్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి ప్రభుత్వ విభాగాలు ఈ సంస్థలను పర్యవేక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. అయితే ఈ రెండు ప్రభుత్వ బ్యాంకులకు చెందిన వాటాలను కొను గోలు చేసిన వారు బ్యాంకును మరింత స్వేచ్ఛగా నిర్వహించు కోగలుగుతారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 95.8 శాతం వాటాలు ఉన్నాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వాటా 92.4 శాతం వరకు ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను ప్రభుత్వం మొదట 51 శాతానికి తగ్గించుకుంటుందనీ, తర్వాత దాన్ని 50 శాతంకంటే తక్కువకు కుదించి ఆ బ్యాంకుల అమ్మకం సజావుగా జరిగేందుకు వీలు కల్పిస్తుందనీ భావిస్తున్నారు. ప్రైవేటీకరణ తర్వాత, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు. దీనివల్ల ప్రభు త్వానికి ఉన్న సంక్షేమ ముద్రపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా ఉద్యోగులు తమ పనిలో చురుకు దనం చూపలేకపోవచ్చు. ఇది ఈ బ్యాంకుల పనితీరునే దెబ్బ తీయవచ్చు. పైగా ఈ రెండు బ్యాంకుల సేవా రుసుములు పెరుగు తాయి. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం నుంచి ఈ బ్యాంకులు తప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలను అమలు చేయ డానికి ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. పైగా పెన్షన్ పంపిణీ, అటల్ పెన్షన్ యోజన, సుకన్యా సమృద్ధి యోజన వంటి తక్కువ ప్రతిఫలం లభించే తరహా సేవలకు సంబంధించిన పనులు చేయడంపై ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. అదే సమయంలో తమ రాబడిని పెంచు కోవడానికి మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి బ్యాంకింగేతర సేవలను అందించడానికి ఈ బ్యాంకులు పూనుకోవచ్చు. ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, ఈ బ్యాంకుల పట్ల కస్టమర్లు మనస్సుల్లో ఉండే పరపతి స్థాయి తగ్గిపోవచ్చు. ఇటీవలే యస్ బ్యాంక్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ (పీఎమ్‌సీ)లు మునిగిపోవడం చూశాం. ప్రభుత్వ పథకాలకు ఒక రూపమివ్వడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై తీవ్రమైన భారం పడవచ్చు. ప్రైవేటీకరణ కోసం ప్రతిపాదించిన బ్యాంకుల పరిమాణం చిన్నది. సెంట్రల్ బ్యాంక్‌లో 33 వేలమంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2021 ఆర్థిక సంవ త్సరంలో ఆరేళ్ల తర్వాత రూ. 831 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020 సంవత్సరంలో ఈ బ్యాంకు రూ. 8,527 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 887.58 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 20 శాతం పెరిగి రూ. 161 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలానికి గానూ బ్యాంకు 134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 6,703.71 కోట్లకు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2 శాతం పెరిగి రూ. 6,833. 94 కోట్లకు చేరింది. బ్యాంకు నిర్వహణాత్మక లాభం 42.16 శాతం వృద్ధితో రూ. 1,458 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలా నికి బ్యాంకు లాభం రూ. 1,026 కోట్లు మాత్రమే. గత సంవత్సరం బ్యాంకు నిరర్థక ఆస్తులు 19.89 శాతంగా ఉండగా, ఈ సంవత్సరం అవి 17.36కి తగ్గాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నికరలాభం గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 148 కోట్లు కాగా ఈ సంవత్సరం ఇదే కాలానికి అది రెట్టింపై రూ. 376 కోట్లకు చేరింది. బ్యాంక్ ఇచ్చిన మొత్తం అడ్వాన్సులలో నికర ఆస్తుల వాటా 2.77 శాతం కాగా, గత సంవత్సరం ఇదే కాలానికి అది 4.30 శాతంగా ఉండింది. బ్యాంక్ మొత్తం నిరర్థక ఆస్తులు గత సంవత్సరంలో రూ. 5,291 కోట్లు కాగా, ఈ సంవత్సరం అవి రూ. 3,741 కోట్లకు తగ్గి పోయాయి. 2017 మార్చి నెలలో, దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీన ప్రక్రియ మొదలైన తర్వాత 2020 ఏప్రిల్ నాటికి వీటి సంఖ్య 12కి పడిపోయింది. దేశంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 10కి తగ్గిపోతుంది. అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య 23కి పెరుగుతుంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదు. ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగ మిస్తోంది. అనేక ప్రైవేట్ బ్యాంకులు మునిగిపోయాయి. యస్ బ్యాంక్, పీఎమ్‌సీ దీనికి తాజా ఉదాహరణ. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎలా పనిచేశాయనన్నది అందరికీ తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభు త్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు కానీ, దీన్నుంచి ప్రభుత్వం ఎలా ప్రయోజనం పొందుతుందన్నది పరిశీలించాల్సిన విషయమే. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంతిమ పరిణామం ఏంట న్నది వేచి చూడాల్సిందే. – సతీష్ సింగ్ సీనియర్ జర్నలిస్టు -
నిధుల సమీకరణలో ప్రభుత్వ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో నిధులను సమకూర్చుకోవడంలో దూకుడు ప్రదర్శించాయి. వెరసి రుణాలు, ఈక్విటీ మార్గాలలో దాదాపు రూ. 58,700 కోట్లు సమీకరించాయి. ఒక ఏడాదిలో ఇది సరికొత్త రికార్డు కాగా.. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులను పెంపొందించుకోవడంలో బ్యాంకులు జోరు చూపాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 4,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 2,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ప్రయివేట్ ప్లేస్మెంట్) రూ. 3788 కోట్లు చొప్పున అందుకున్నాయి. క్విప్‌లు విజయవంతంకావడం పీఎస్‌బీల పట్ల దేశ, విదేశీ ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 12 పీఎస్‌బీలు రికార్డుకు తెరతీస్తూ టైర్–1, టైర్–2 బాండ్ల జారీ ద్వారా గతేడాది రూ. 58,697 కోట్లు సమీకరించాయి. సంస్కరణల ఎఫెక్ట్ గుర్తింపు, రుణ పరిష్కారాలు, కొత్తపెట్టుబడులు వంటి పలు ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) తగ్గడంతోపాటు.. లాభాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా పీఎస్‌బీల ఎన్పీఏలు రూ. 6,16,616 కోట్లకు తగ్గాయి. 2020లో ఇవి రూ. 6,78,317 కోట్లుకాగా.. 2019లో రూ. 7,39,541 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ప్రొవిజన్ల కవరేజీ నిష్పత్తి 84 శాతానికి బలపడింది. గత ఐదేళ్లలోలేని విధంగా ప్రభుత్వ బ్యాంకుల లాభాలు రూ. 31,816 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాది ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించినప్పటికీ పటిష్ట పనితీరును కనబరిచాయి. 2020లో నమోదైన రూ. 26,015 కోట్ల నష్టాల నుంచి ఈ స్థాయి టర్న్‌అరౌండ్‌ను సాధించడానికి మొండి రుణ సవాళ్లను అధిగమించడం సహకరించింది. ఎన్పీఏల నియంత్రణ, రికవరీ చర్యలు ఇందుకు తోడ్పాడునిచ్చాయి. గత ఆరేళ్లలో పీఎస్‌బీలు రూ. 5,01,479 కోట్లను రికవరీ చేయడం గమనార్హం. ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. కారణం అదేనా
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు 2020–21 ఆర్థిక సంవత్సరం సాధించిన నికర లాభాలకు వాటి బాండ్ పోర్ట్‌ఫోలియోల నుంచి భారీగా వచ్చిన ఆదాయాలు దన్నుగా నిలిచినట్లు రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. ఐదు సంవత్సరాల వరుస నష్టాల అనంతరం 2020–21లో బ్యాంకులు నికర లాభాలు నమోదుచేశాయి. దీనికి వాటి బాండ్ పోర్ట్‌ఫోలియోల నుంచి గణనీయంగా లభించిన ఆదాయాలే కారణమని ఇక్రా విశ్లేషించింది. గత కొన్ని సంవత్సరాలుగా తమ మొండి బకాయిల (ఎన్పీఏ)కు అధిక కేటాయింపులు (ప్రొవిజన్స్) జరుపుతూ వచ్చిన బ్యాంకింగ్, 2020–21లో మాత్రం కొంత తక్కువ ప్రొవిజన్స్ జరిపిందని ఇక్రా పేర్కొంది. బ్యాంకింగ్ నికర లాభాలకు ఇదీ ఒక కారణమేనని నివేదిక తెలిపింది.చదవండి: అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?! ఆయా అంశాలకు సంబంధించి రేటింగ్ సంస్థ తాజా నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 2020 మార్చి–2020 మే మధ్య బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అలాగే బ్యాంకులు తమ వద్ద ఉంచిన అదనపు నిధులకు ఇచ్చే వడ్డీరేటు– రివర్స్ రెపోను 155 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4, 3.35 శాతాలకు దిగివచ్చాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల బాండ్ పోర్ట్‌ఫోలియోలు భారీగా పెరిగాయి. సంబంధిత ట్రేడింగ్ లావాదేవీల నుంచి బ్యాంకింగ్ భారీ ప్రయోజనాలు పొందింది. 2020–21లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు రూ.32,848 కోట్లయితే, 2019–20లో నికర నష్టాలు రూ.38,907 కోట్లని ఇక్రా వైస్ ప్రెసిడెండ్ (ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్) అనిల్ గుప్తా పేర్కొన్నారు. ఏజెన్సీ అంచనాల ప్రకారం 2020–21లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల లాభాలు (పీబీటీ– ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్) రూ.45,900 కోట్లు. ఇందులో బ్యాంకులు బాండ్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయాల కారణంగా బుక్ చేసిన లా భాలే రూ.31,600 కోట్లు ఉండడం గమనార్హం. 2020–21 వార్షిక డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతం. అయితే రుణ వృద్ధి 5.5 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సైతం రూ 5 నుంచి 7 లక్షల కోట్ల వరకూ ఉంది. బ్యాంకింగ్‌లో పదేళ్ల బెంచ్‌మార్క్ ప్రభుత్వ సెక్యూరిటీల (బాండ్లు) రోజూవారీ సగటు 2019–20లో 6.42 శాతం. 2020–21 మొదటి త్రైమాసికంలో ఇది ఆరు శాతానికి తగ్గింది. రెండవ త్రైమాసికంలో 5.93 శాతానికి, మూడవ త్రైమాసికంలో 5.90 శాతానికి దిగివచ్చింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా బాండ్ల కొనుగోలుతో వ్యవస్థలోకి ఆర్బీఐ భారీ నిధులు పంప్ చేయడం, రెపో రేటు కోతల నేపథ్యం ఇది. 2020–21 చివరి త్రైమాసికంలో మాత్రం పదేళ్ల బెంచ్‌మార్క్ ప్రభుత్వ సెక్యూరిటీల (బాండ్లు) రోజూవారీ సగటు 6.06 శాతానికి చేరింది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో చోటుచేసుకున్న బాండ్ ఈల్డ్స్‌లో తీవ్ర ఒడిదుడుకులు కూడా బ్యాంకింగ్‌కు చక్కటి ట్రేడింగ్ అవకాశాలను కల్పించాయి. బాండ్ హోల్డింగ్స్‌పై భారీ ఆదాయాలను బ్యాంకింగ్ బుక్ చేయడం వల్ల బ్యాంకులు వాటి తాజా పెట్టుబడులు మార్కెట్ రేట్లకు దగ్గరగా ఉంటాయి. తద్వారా వాటి బాండ్ పోర్ట్‌ఫోలియోలపై ఈల్డ్స్‌ను తక్కువగా ఉన్న మార్కెట్ రేట్లకు అనుసంధానించగలుగుతుంది. ప్రభుత్వ బ్యాంకుల ఇన్వెస్ట్మెంట్ బుక్‌పై ఈల్డ్ 2019–20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 6.79 శాతం ఉంటే, 2020–21 ఇదే కాలంలో 6.18 శాతానికి తగ్గిందని ఇక్రా వైస్ ప్రెసిడెండ్ (ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్) అనిల్ గుప్తా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ని మినహాయిస్తే, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల 2020–21 స్థూల లాభాలు ‘బాండ్ పోర్ట్‌ఫోలియో ట్రేడింగ్‌లో బుక్ చేసిన ఆదాయాల కన్నా’ తక్కువగా ఉండడం గమనార్హం. ఎస్బీఐని మినహాయిస్తే 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్ పోర్ట్‌ఫోలియో ట్రేడింగ్ లాభాలు రూ.25,500 కోట్లు. స్థూల లాభాలు రూ.18,400 కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకుల తరహాలోనే ప్రైవేటు బ్యాంకులు కూడా తమ బాండ్ ట్రేడింగ్ లాభాలను 2020–21లో భారీగా రూ.14,700 కోట్ల నుంచి (2019–20) రూ.18,400 కోట్లకు మెరుగుపరచుకున్నాయి. వాటి మొత్తం స్థూల లాభాల్లో ఈ వాటా 21 శాతం. -
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ఇదే..
ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు టోకరా ఇస్తున్న ఉద్ధేశపూర్వక ఎగవేతదారులు (డిఫాల్టర్ల్స్ లిస్ట్)ను సెప్టెంబర్ 2019 వరకు బ్యాంక్ అసోసియేషన్ ప్రకటించింది. 2019 వరకు బ్యాంకులకు ఎగనామాలు పెట్టిన కంపెనీల లిస్ట్‌ను ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇందులో 2426 అకౌంట్స్ ద్వారా బ్యాంకులకు లక్షా 47 వేల 350 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్ధకు పెనుసవాల్‌గా భావిస్తున్న ఎగవాతదారుల జాబితాను విడుదల చేయడం హర్షనీయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 17 ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోకరా ఇచ్చిన ఎగవేతదారుల వివరాలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్దేశపూర్వక ఎగవేత దారులు 685 మంది కాగా చెల్లించని మొత్తం 43వేల 887 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 325, చెల్లించని మొత్తం 22వేల 370 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 355, చెల్లించని మొత్తం 14వేల 661 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 184, చెల్లించని మొత్తం 11వేల 250 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 69, చెల్లించని మొత్తం 9 వేల 663 కోట్లు యునైట్‌డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 128, చెల్లించని మొత్తం 7 వేల 028 కోట్లు యుకో బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 87, చెల్లించని మొత్తం 6 వేల 813 కోట్లు ఒబిసి డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 138, చెల్లించని మొత్తం 6 వేల 549 కోట్లు కెనరా బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 96, చెల్లించని మొత్తం 5 వేల 276 కోట్లు ఆంధ్రా బ్యాంక్ డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 84 , చెల్లించని మొత్తం 5 వేల 165 కోట్లు అలాహాబాద్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ సంఖ్య 57, చెల్లించని మొత్తం 4 వేల 339 కోట్లు ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 49 , చెల్లించని మొత్తం 3 వేల 188 కోట్లు కార్పొరేషన్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 58 , చెల్లించని మొత్తం 2 వేల 450 కోట్లు ఇండియన్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 27 , చెల్లించని మొత్తం 1 వేల 613 కోట్లు సిండికేట్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు) సంఖ్య 36 , చెల్లించని మొత్తం 1 వేల 438 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు) సంఖ్య 42, చెల్లించని మొత్తం 1 వేల 405 కోట్లు పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ డిఫ్లాల్టర్స్ (ఎగవేత దారులు)సంఖ్య 6 , చెల్లించని మొత్తం 255 కోట్లు -
10 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త చీఫ్‌లు!
న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం బుధవారం ఎండీ, సీఈఓలను నియమించింది. కొత్త చీఫ్‌లలో ఐదుగురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు కావడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. నియామక వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీచేసిన అధికారిక ఉత్తర్వులను క్లుప్తంగా చూస్తే... ఎస్బీఐ నుంచీ వీరు... మొండిబకాయిలతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులు ఈ సమస్య నుంచి బయటపడ్డానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు– ఎస్బీఐ నిపుణుల సహాయం కీలకం అని భావించిన కేంద్రం, ఎస్బీఐ నుంచి ఈ నియామకాలు చేపట్టినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నియామకాలు చూస్తే... ►ఆంధ్రాబ్యాంక్: జే. పకీర్‌సామి. 2021 ఫిబ్రవరి 28 పదవీ విరమణ వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు. ► సిండికేట్ బ్యాంక్: మృత్యుంజయ్ మహాపాత్ర. పదవీకాలం పూర్తయ్యే వరకూ అంటే 2020 మే 31 మహాపాత్ర ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. ► ఇండియన్ బ్యాంక్: పద్మజా చంద్రూ. 2021, ఆగస్టు 31న చంద్రూ పదవీ విరమణ చేస్తారు. ► సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పల్లవ్ మహాపాత్ర. 2021 ఫిబ్రవరి వరకూ ఉంటారు. ► దేనా బ్యాంక్: కర్నమ్ శేఖర్. 2020, జూన్ 30 వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇతర ఐదు బ్యాంకులనూ చూస్తే... ►అలహాబాద్ బ్యాంక్: ఎస్ఎస్ మల్లికార్జునరావు. తొలి బాధ్యతల కాలపరిమితి మూడేళ్లు. అయితే ఆయన పదవీ విరమణ సమయం 2022 జనవరి 31 వరకూ బాధ్యత కాలపరిమితిని పొడిగించే వీలుంది. ప్రస్తుతం ఆయన సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ►బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఏఎస్ రాజీవ్. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ కాలం మూడేళ్లు. మంచి పనితనం కనబరిస్తే, పదవీకాలం మరో రెండేళ్లు పొడిగించవచ్చు. ►యూకో బ్యాంక్: అతుల్ కుమార్ గోయెల్. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా పనిచేస్తున్నారు. ►పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: ఎస్. హరి శంకర్. అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ► యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అశోక్ కుమార్ ప్రధాన్, ప్రస్తుతం ఇదే బ్యాంకులో అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ స్థానిక బోర్డ్లకూ నియామకాలు... రిజర్వ్ బ్యాంక్ స్థానిక బోర్డుల సభ్యుల నియామకాలనూ కేంద్రం ప్రకటించింది. వీటిలో దక్షిణ(రాకేష్ జైన్), ఉత్తర (రేవతీ అయ్యర్, రాఘవేద్ర నారాయణ్ దుబే), తూర్పు (ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది) ప్రాంత బోర్డులు ఉన్నాయి. -
ప్రభుత్వ బ్యాంకులకు పూర్తి మద్దతు
ముంబై: ప్రభుత్వ రంగంలోని మొత్తం 21 బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం పూర్తిగా మద్దతిస్తుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మొండిబాకీల పరిష్కారం దిశగా ఎన్పీఏల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ‘‘దీనిపై తగు సిఫార్సులు చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించాం. ఈ కమిటీ రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ఆయన వెల్లడించారు. పీఎస్‌బీల చీఫ్‌లతో శుక్రవారం భేటీ అయిన సందర్భంగా విలేకరులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా సారథ్యంలోని కమిటీ.. రెండు వారాల వ్యవధిలో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయడంపై సిఫార్సులిస్తుందని మంత్రి చెప్పారు. మొండి పద్దులను పారదర్శకంగా, మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు బయటి నిపుణులతో ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసుకునే అంశాన్ని కూడా బ్యాంకులు పరిశీలిస్తాయన్నారు. బ్యాంకర్లతో సమావేశంలో గవర్నెన్స్ ప్రక్రియను పటిష్టం చేయడం, మొండిబాకీలను పక్కాగా గుర్తించడం తదితర అంశాలపై చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, రుణాల మంజూరు తీరుతెన్నులు, సక్రమంగా చెల్లింపులు జరిపే అర్హత గల రుణగ్రహీతలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసేలా తగు వ్యవస్థను రూపొందించడం కూడా చర్చకు వచ్చినట్లు గోయల్ చెప్పారు. మొండిబాకీల సత్వర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని బ్యాంకుల చీఫ్‌లు అభిప్రాయపడ్డారని ఆయన వివరించారు. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న చీఫ్‌ల స్థానాలను 30 రోజుల్లోగా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లాంటిది ఏర్పాటు చేయడం బ్యాంకింగ్ వ్యవస్థకు మేలు చేసేదేనా, ఒకవేళ ప్రయోజనకరమైనదే అయితే ఏర్పాటు చేయడానికి విధి విధానాలు ఎలా ఉండాలి మొదలైనవి కమిటీ పరిశీలించి, సిఫార్సులు చేస్తుందని గోయల్ తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన అంశంపై ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ఆయన దాటవేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ అంశం.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఐసీఐసీఐ బ్యాంకులో ఆశ్రిత పక్షపాత ధోరణులపై ఆరోపణల మీద స్పందిస్తూ.. ఆ బ్యాంకు పటిష్టమైన విధానాలే అమలు చేస్తుందని గోయల్ పేర్కొన్నారు. బ్యాంకు గురించి వాటాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఏవైనా లొసుగులు ఉన్నాయని విచారణలో తేలిన పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని గోయల్ వ్యాఖ్యానించారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. తన భర్త సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరీలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వరంగ బ్యాంకుల దివాలా
-
పిల్లాడి పాటి బుద్ధి కేంద్రానికి లేదా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఘరానా కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న అక్షరాల 2.4 లక్షల కోట్ల రూపాయలను మొండి బకాయిల కింద ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు ఎంతో ఉదారంగా ఇటీవల రద్దు చేసిన విషయం తెల్సిందే. ఎవరి బకాయిలను రద్దు చేశారో వెల్లడించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఇటీవల పార్లమెంట్లో ఓ సభ్యుడు లిఖిత పూర్వకంగా కోరగా, అందుకు ఆ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు–1934 చట్టంలోని 45ఈ సెక్షన్ ఇందుకు అనుమతించడం లేదని, ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని సదురు మంత్రిత్వ శాఖ సుస్పష్టం చేసింది. అంతకుముందు ఇదే విషయమై ఓ సామాజిక కార్యకర్త సమాచార చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తును కూడా ఆర్బీఐ తోసిపుచ్చింది. ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో లక్షల కోట్ల రూపాయలను ఎగవేసి బ్యాంకింగ్ వ్యవస్థ ఉనికికే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ల బాగోతాన్ని బయట పెట్టవద్దని చట్టం చెబుతుందా ? చెబుతుంటే అలా చెప్పే చట్టం చెల్లుతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి చట్టానికి కాలం మూడదా, పాడె కట్టరా? సుప్రీం కోర్టు 2015లో అదే చేసింది. ఆర్బీఐ వర్సెస్ జయంతిలాల్ ఎన్ మిస్త్రీ మధ్య నడిచిన కేసులో సమాచార చట్టాన్ని ఉల్లంఘించే ఏ చట్టం చెల్లదని స్పష్టం చేసింది. ప్రజల సమాచార హక్కుకు ప్రాధాన్యతనిస్తున్న సమాచార చట్టంలోని 22వ సెక్షన్‌ను ఆర్బీఐ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఎప్పుడూ అడ్డుకోలేవని, ముఖ్యంగా సమాచార సేకరణకు సంబంధించిన పారదర్శక చట్టమే చెల్లుతుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ‘దేశంలోని ఆర్థిక సంస్థలు తమ అవకతవలకు స్వచ్ఛత లేదా పారదర్శకత లేని చట్టాలను అడ్డం పెట్టుకుంటున్నాయి. అలాంటి చట్టాలు ఇక చెల్లవు. అవకతవకల ఆర్థిక సంస్థలకే ఆర్బీఐ కొమ్ముకాస్తూ ప్రజా సమీక్ష నుంచి తప్పించుకోవాలని చూడడం భావ్యం కాదు. అగౌరవ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. గతంలో కూడా ప్రజలను బ్యాంకుల ఇలా మభ్యపెట్టడం గురించి మాకు తెలుసు. ఇలాంటి చర్యలు దేశ ప్రయోజనాలకుగాని, ప్రజల ప్రయోజనాలకుగానీ ఎంత మాత్రం మంచివి కాదు. వాచ్డాగ్ సంస్థగా సమాచార హక్కు చట్టం కింద ప్రజలు అడిగిన సమాచారాన్ని వెల్లడించేందుకు ఉత్సాహం చూపాల్సిన ఆర్బీఐ, బ్యాంకుల అవకతవకలను దాచిపెట్టడం దిగ్భ్రాంతికరం’ అంటూ 2015లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆర్బీఐ చట్టంలోని 45ఈ సెక్షన్ కింద బ్యాంకులకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు తమకు హక్కు ఉందని, అలాగే చట్టంలోని 45ఈ (3) సెక్షన్ కింద సదరు సమచారాన్ని కోర్టులుగానీ, ట్రిబ్యునల్‌గానీ, మరే ఇతర అథారిటీగానీ వెల్లడించడానికి వీల్లేదంటూ ఆర్బీఐ చేసిన వాదనలను కూడా సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. అంతేకాకుండా దేశ ఆర్థిక ప్రయోజనాలు భంగం లేదా హాని కలిగించే సమాచారాన్ని తాము సమాచార చట్టంలోని 8 (1)(ఏ), 8 (1)(డీ) సెక్షన్ల మేరకు వెల్లడించాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ వాదించింది. ఈ సెక్షన్లను ఉటంకిస్తూనే సమచార వెల్లడికి సంబంధించి కేంద్ర సమాచార కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఆర్బీఐ అనేక సార్లు త్రోసి పుచ్చింది. ఈ వాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఆర్బీఐ వైఖరిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ‘సమాచారాన్ని వెల్లడిస్తే దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ ఆర్బీఐ చేస్తున్న వాదనలో ఆధారాలే కాదు, ఎలాంటి పస లేదు. పైగా అది అర్థంపర్థంలేని వాదన. ప్రజలు కోరిన సమాచారాన్ని ఇవ్వడం వల్ల ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని, ఇవ్వక పోవడం వల్ల దేశ ప్రయోజనాలే కాదు, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ కేంద్ర సమాచార కమిషన్ చెప్పడంలో అర్థం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో సార్వభౌములైన ప్రజలు అడిగిన సమాచారాన్ని వెల్లడించకుండా, అది దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం అనడం ఎంత అర్థరహితం!’ అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ప్రభుత్వ బ్యాంకులపై పునరాలోచన అవసరం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణల అవసరమని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యాజమాన్యం విషయంలో పునరాలోచనకు సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి పీఎన్బీ సహా పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాలు వెలుగు చూడడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిష్కార యత్నాలకు విఘాతం కలిగించాయన్నారు. పీఎస్బీల్లో ఈ మోసాలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదంటే విప్లవాత్మక అజెండా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం ట్విన్ బ్యాలన్స్ షీటు (రుణాలు తీసుకున్న సంస్థలు, ఇచ్చిన బ్యాంకులు సమస్యలను ఎదుర్కోవడం) సవాలును పరిష్కరించేందుకు దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ), బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అనే రెండు కీలక చర్యలు చేపట్టింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ ప్రయత్నాలన్నింటికీ బ్యాంకుల్లో మోసాలు గండికొట్టాయి’’ అని సుబ్రమణియన్ అన్నారు. ట్విన్ బ్యాలన్స్ షీటు సమస్య నుంచి బయటపడేందుకు తాజా చర్యలు అవసరమని సూచించారు. ప్రఖ్యాత నోబెల్ గ్రహీత ఆర్థిక వేత్త పాల్క్రుగ్మ్యాన్ భారత్‌లో తయారీ ఉద్యోగాలు లోపించాయనడం నిజమేనని సుబ్రమణియన్ అంగీకరించారు. తయారీ రంగంలో అవకాశాలను భారత్ 25–30 ఏళ్ల క్రితమే చేజార్చుకుందన్నారు. అయితే, భవిష్యత్తులోనూ తయారీ రంగం ఇదే స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుందన్న నమ్మకం లేదని, నిర్మాణం, వ్యవసాయం, సేవల రంగాలు మరింత ఉద్యోగాలు కల్పించగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ డిమాండ్‌పైనే భారత్ ఎదగడం సాధ్యం కాదన్నారు. -
35 విదేశీ శాఖల మూసివేత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) విదేశీ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. లాభసాటిగా లేని 35 శాఖలు, రిప్రజెంటేటివ్ కార్యాలయాలను మూసివేశాయి. స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ విధానాల అమల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మొత్తం 216 విదేశీ శాఖలు, రెమిటెన్స్ సెంటర్లు మొదలైన వాటన్నింటినీ సమీక్షించి, క్రమబద్ధీకరించుకోవాలంటూ గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పీఎస్బీ మంథన్‌లో బ్యాంకర్లు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తాజాగా బ్యాంకులు చర్యలు ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి 31 నాటికి.. పీఎస్బీలకు అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లు, ప్రాతినిధ్య కార్యాలయాలు కాకుండా 165 పైచిలుకు విదేశీ శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి అత్యధికంగా 52 శాఖలు ఉండగా, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 50, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 29 ఉన్నాయి. పీఎస్బీ శాఖలు ఎక్కువగా బ్రిటన్ (32), హాంకాంగ్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (చెరి 13), సింగపూర్‌లో (12) ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ దుబాయ్ ఆఫీసు మూసివేత.. విదేశీ శాఖల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. దుబాయ్‌లో తమ తమ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే పీఎన్బీ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. షాంఘై ఆఫీసులు మూసివేశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అటు యాంగాన్, బోట్స్వానా కార్యకలాపాలు కూడా నిలిపివేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సైతం.. హాంకాంగ్ శాఖను మూసివేశాయి. -
ప్రభుత్వ బ్యాంకుల్లో శాఖల కోత
న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) ఇక వ్యయ నియంత్రణపై తీవ్రంగా దృష్టిపెట్టనున్నాయి. ఇందులో భాగంగా శాఖలకు కత్తెర వేయనున్నాయి. కేంద్రం కూడా బ్యాంకుల శాఖల క్రమబద్ధీకరణ దిశగా చర్యలు మొదలుపెట్టింది. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా... ఖర్చులను తగ్గించుకోవడం కోసం నష్టాలతో నడుస్తున్న దేశ, విదేశీ శాఖలను క్రమబద్ధీకరించుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది. ‘‘నష్టాలను ఎదుర్కొంటున్న బ్యాంకు శాఖలను కొనసాగించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ షీట్లపై భారం మోయాల్సిన అవసరం లేదు. కనుక బ్యాంకులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు భారీ పొదుపు చర్యలపైనే కాకుండా ఈ తరహా చిన్న వాటిపైనా దృష్టి పెట్టాలి’’ అని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రభుత్వరంగంలోని అగ్రగామి బ్యాంకులు ఎస్బీఐ, పీఎన్బీ ఇప్పటికే ఈ చర్యలను అమల్లో పెట్టడం గమనార్హం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు దేశవ్యాప్తంగా తనకు 59 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా, వాటిని ఏకంగా 10 ప్రాంతీయ శాఖలకు తగ్గించుకుంది. వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతోపాటు, పరిపాలన వ్యయాలను తగ్గించుకునేందుకు ఇలా చేసింది. ఒక దేశంలో ఒక్క బ్యాంకు చాలు... విదేశీ శాఖల క్రమబద్ధీకరణ విషయమై చర్చించి, లాభసాటిగా లేని వాటిని మూసివేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఒక దేశంలో ఒకటికి మించిన బ్యాంకులు ఉండాల్సిన అవసరం లేదన్నది ఆర్థిక శాఖ ఆలోచనగా అధికార వర్గాలు తెలిపాయి. ఐదారు బ్యాంకులు కలసి ఓ సబ్సిడరీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా నిధుల ఆదాపై దృష్టి సారించాలని సూచించింది. శాఖలను మూసేయడం, సబ్సిడరీలను విక్రయించడంతోపాటు అధిక రాబడులను ఇచ్చే మార్కెట్లపై మరింత దృష్టి సారించే చర్యల్ని బ్యాంకులు పాటించనున్నాయి. ఆర్థిక శాఖ సూచనల మేరకు పీఎన్బీ బ్రిటన్ సబ్సిడరీ అయిన పీఎన్బీ ఇంటర్నేషనల్‌లో వాటాను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ కూడా విదేశీ శాఖల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. బ్యాంకు ఆఫ్ బరోడాకు 24 దేశాల్లో మొత్తం 107 శాఖలు, కార్యాలయాలు ఉన్నాయి. ఎస్బీఐకి 36 దేశాల్లో 195 కార్యాలయాలు ఉన్నాయి. -
14 లక్షల మందికి అందని పంట రుణం
ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకుగాను.. 22.50 లక్షల మందికే రుణాలు ఎస్ఎల్బీసీ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పంట రుణాలు అందడం లేదు.ఎన్నడూ లేనివిధంగా బ్యాంకుల నుంచి రైతులకు సహకారం తగ్గిపోతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ 22.50 లక్ష ల మందికే బ్యాంకులు రుణాలిచ్చాయి. అంటే ఏకంగా 14.02 లక్షల మంది రైతులకు ఖరీఫ్ పంట రుణాలు అందలేదు. రాష్ట్ర స్థాయి బ్యాం కర్ల సమితి (ఎస్ఎల్బీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రబీ సీజన్లోనూ అదే పరిస్థితి.. ఎస్ఎల్బీసీ నివేదిక ప్రకారం ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.17,460 కోట్లుకాగా... బ్యాంకులు రూ.15,205 కోట్ల (87.08%) మేర పంట రుణాలు ఇచ్చాయి. శాతంలో ఇది ఎక్కువగా కనిపించినా తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులకు రుణాలు అందలేదు. రబీ సీజన్లోనూ రైతులకు బ్యాంకులు రుణాలివ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రబీలో పంట రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు రూ.4 వేల కోట్ల మేర రుణాలు మాత్రమే ఇచ్చాయని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.9,202 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఇచ్చింది రూ.3,690 కోట్లే. రైతుల పట్ల బ్యాంకర్లు కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నారంటూ వ్యవసాయ అధికారులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వెనుకబడిన ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులే మొండి చెరుు్య చూపిస్తుండడం గమనార్హం. ఖరీఫ్‌లో ప్రభుత్వ బ్యాంకుల పంట రుణ లక్ష్యం రూ.10,348.56 కోట్లు కాగా.. ఇచ్చింది రూ.7,786.42 కోట్లు (75.24 శాతం) మాత్రమే. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.812.71 కోట్లుకాగా.. రూ. 1,192.28 కోట్లు ఇచ్చాయి. అంటే 146.70 శాతం రుణాలు ఇచ్చాయి. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,999.95 కోట్లు కాగా.. రూ.3,372.96 కోట్లు (112.43 శాతం) అందించాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. వాటి ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.3,299.60 కోట్లు కాగా.. రూ.2,853.74 కోట్లు (86.49 శాతం) మాత్రమే ఇచ్చాయి. ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య అగాధం ప్రభుత్వం రుణమాఫీ నిధులను, పావలా వడ్డీ సొమ్మును సకాలంలో విడుదల చేయకపోవడం వల్లే రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది బ్యాంకులకు, ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని పెంచింది. ఇటీవలి ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకుల తీరుపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విరుచుకుపడడం అందుకు నిదర్శనం కూడా. అంతర్గత సమావేశాల్లో కాకుండా ప్రజల్లో ఉంటే బ్యాంకుల దుమ్ముదులిపే వారమంటూ ఆయన బ్యాంకర్లపై మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా ఘర్షణ వైఖరి వల్ల నష్టమేనని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. -
మీ కార్డులో ‘చిప్’ ఉందా..?
మీరింకా పాత డెబిట్, క్రెడిట్ కార్డులే వాడుతున్నారా? మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులైతే మార్చుకోవాలని సూచన ఏడాది కిందట అమల్లోకి వచ్చిన ‘చిప్’ కార్డులు ఇప్పటికే ఈ తరహా కార్డుల్ని జారీ చేస్తున్న బ్యాంకులు పూర్తి స్థాయిలో మారటానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు వీటితో భారీగా తగ్గుముఖం పట్టిన కార్డు నేరాలు కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఇంకా మారకపోవచ్చు. కొన్ని ప్రైవేటు బ్యాంకులూ... ఆ... డెబిట్ కార్డులే కదా!! అని అలసత్వం ప్రదర్శిస్తూ ఉండొచ్చు. క్రెడిట్ కార్డుల విషయంలో దాదాపు అన్ని బ్యాంకులూ ఇప్పటికే మారిపోయాయి. డెబిట్ కార్డుల విషయంలోనూ చాలా బ్యాంకులు చిప్ కార్డులనే జారీ చేస్తున్నాయి. ఇంతకీ వీటివల్ల ఏం జరిగిందంటే... సైబర్ నేరగాళ్లు మాత్రం దెబ్బతిన్నారు. కార్డుల్ని క్లోన్ చేయటం, కోడ్లు కాపీ చేసి నకిలీ లావాదేవీలు నిర్వహించటం వంటివి చేయలేకపోతున్నారు. దాదాపు ఏడాది కిందటే అమల్లోకి వచ్చిన చిప్ కార్డులతో సైబర్ నేరాలు కూడా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు చిప్ కార్డులంటే ఏంటి? ఎందుకు వాటిని జారీ చేయాల్సి వస్తోంది? నేరగాళ్లకు ఎలా కళ్లెం పడింది? వీటిలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ కథనం... క్రెడిట్, డెబిట్ కార్డు దారులు సైబర్ నేరాల బారిన పడకుండా మరింత రక్షణ కల్పించడానికి కొన్నాళ్ల కిందటే ఆర్బీఐ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే... బ్యాంకులు చిప్ ఆధారిత, పిన్ ఎనేబుల్డ్ డెబిట్, క్రెడిట్ కార్డులనే జారీ చేయాలని ఆదేశించింది. దీనిప్రకారం దేశీ బ్యాంకులన్నీ కస్టమర్లకు చిప్‌ను అమర్చిన కార్డులనే జారీ చేయాలి. గతంలో జారీ చేసిన డెబిట్ కార్డులన్నీ కూడా మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఆధారిత డెబిట్ కార్డులు. వాటి స్థానంలోనే చిప్ కార్డులొచ్చాయి. -సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం కాకుంటే..కార్డు మార్చుకోండి ముందు మనది ఏ కార్డో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మీ కార్డు వెనుక భాగంలో నల్లటి మందమైన గీత కనిపిస్తుంది. అదే మ్యాగ్నటిక్ స్ట్రిప్. బ్యాంకులు ప్రారంభం నుంచీ జారీ చేస్తున్నవి ఇవే కార్డులు. చాలా బ్యాంకులు డెబిట్ కార్డుల చెల్లుబాటు వ్యవధి పదేళ్లు కూడా ఇచ్చాయి. దీంతో చాలామందికి ఈ కార్డుల కాల వ్యవధి తీరేందుకు ఇంకా సమయం ఉంది. సరే కదా అని ఊరుకుంటే మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుతో సైబర్ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది. కనుక వెంటనే మీ బ్యాంకును సంప్రదించి తగు దరఖాస్తు ఇస్తే... మీ కార్డు స్థానం లో అత్యాధునిక చిప్ కార్డు అందజేస్తుంది. చిప్ కార్డుకు ఒకవైపున మధ్యలో బంగారు వర్ణంలో మెరిసే చిప్ ఉంటుంది. దీనివల్లే అధిక సెక్యూరిటీ లభిస్తుంది. కొన్ని కార్డుల్లో చిప్‌తో పాటు మ్యాగ్నటిక్ స్ట్రిప్ కూడా ఉంటుంది. ఈఎంవీ చిప్ కార్డు అంటే... పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద, ఆన్లైన్లో చేసే చెల్లింపులకు ఈ కార్డులతో మరింత భద్రత ఉంటుందనే ఉద్దేశంతోనే ఆర్బీఐ వీటిని అమలు చేయాలని ఆదేశించింది. ఈఎంవీ చిప్స్ అనేది వీటి పేరు. అంటే ఈఎంవీ అంటే ‘యూరో పే మాస్టర్‌కార్డు అండ్ వీసా’ అని అర్థం. కంప్యూటర్ చిప్స్‌తో ఉన్న కార్డులకు ఈఎంవీ అనేది అంతర్జాతీయ ప్రమాణం. దీని రూపకర్త ‘ఈఎంవీ కో ఎల్ఎల్సీ. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆరు ప్రధాన పేమెంట్ ప్రాసెసింగ్, క్రెడిట్ కార్డు కంపెనీలు దీన్లో భాగస్వాములయ్యాయి. వీటిలో మాస్టర్ కార్డు, వీసా, జేసీబీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, చైనా యూనియన్ పే, డిస్కవర్ ఉన్నాయి. నేరగాళ్లకు కష్టమే... కార్డులో మెటల్ చిప్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ చిప్‌లో ఖాతాదారుడి సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో భద్రపరుస్తారు. చిప్ కార్డులు అత్యంత భద్రతను అందించే విషయంలో సందేహం అక్కర్లేదన్నది నిపుణుల సూచన. ఎందుకంటే కార్డులో ఉండే చిప్... ప్రతి లావాదేవీకి ఒక యూనిక్ కోడ్‌ను జారీ చేస్తుంది. దీన్ని కాపీ చేయడం సైబర్ నేరగాళ్లకు అంత సులభం కాదు. ఒకవేళ మహా తెలివితనంతో నేరగాడు ఈ కోడ్‌ను కాపీ చేసినా మరో లావాదేవీకి ఆ కోడ్ చెల్లుబాటు కాదు. దీంతో లావాదేవీలు భద్రంగా ఉంటాయి. ఇక మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డు విషయానికొస్తే దాన్ని సూక్ష్మ మ్యాగ్నెట్స్‌తో తయారు చేస్తారు. వీటిలో ఖాతాదారుడి సమాచారం ఉంటుంది. ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ (ఈడీసీ) మెషీన్‌పై స్వైప్ చేసిన తర్వాత అందులోని సమాచారం ఆధారంగా బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ కార్డుతో భద్రత తక్కువ. ఇందులోని వివరాలను కాపీ చేయడం సులభం. కార్డుపై ఉన్న వివరాలను చూసి అవే వివరాలతో డూప్లికేట్ కార్డును రూపొందించి సైబర్ నేరగాళ్లు తమ పని చేసుకోగలరు. పిన్‌తో రెండో అంచె రక్షణ మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తో ఉన్న కార్డులను దుకాణాల్లోని చిప్ రీడింగ్ మెషీన్లనో స్వైప్ చేయడం గమనించే ఉంటారు. అలా స్వైప్ చేసినప్పుడు మ్యాగ్నటిక్ స్ట్రిప్‌ను రీడ్ చేయడం ద్వారా అది బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అదే చిప్ ఆధారిత కార్డు అయితే అలా స్వైప్ చేయకుండా ఏటీఎం మెషీన్లో మాదిరిగా ఇన్సర్ట్ చేసినట్టు ఉంచుతారు. చిప్‌లో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్న సమాచారాన్ని ఈడీసీ మెషీన్ రీడ్ చేస్తుంది. పిన్ నంబర్ ఇస్తేనే ఆ లావాదేవీ ప్రాసెస్ అవుతుంది. దీనివల్ల మీ కార్డు మరొకరి చేతికి వెళ్లినా పిన్ ఉంటుంది కాబట్టి చోరీకి అవకాశం ఉండదు. అయితే, కొన్ని బ్యాంకులు పిన్ లేకుండా చిప్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఖాతాదారుడి సంతకాన్ని ధ్రువీకరణగా పరిగణిస్తారు. చిప్, మ్యాగ్నటిక్ స్ట్రిప్ రెండూ ఒకేదానిలో... దేశంలో 90 శాతం పాయింట్ ఆఫ్ సేల్ రీడింగ్ మెషీన్లు చిప్ కార్డుల్ని రీడ్ చెయ్యగలవు. కాకపోతే అన్ని ఏటీఎంలలో ఇవి పనిచేయకపోవచ్చు. కొత్తగా ఏర్పాటైన ఏటీఎంలయితే వీటిని రీడ్ చేయగలవు. ఎప్పుడో ఏర్పాటు చేసినవైతే వాటిలో హార్డ్‌వేర్ పరంగా చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని ఓ కమిటీ ఆర్బీఐకి లోగడే నివేదించింది. అయితే, ఈ సమస్యకు నివారణగా హెచ్డీఎఫ్సీ సహా కొన్ని బ్యాంకులు చిప్, మ్యాగ్నటిక్ రెండింటినీ ఒకే కార్డులో అమర్చి ఇస్తున్నాయి. అమెరికాలోనూ... ప్రపంచ వ్యాప్తంగా జరిగే క్రెడిట్/డెబిట్ కార్డు నేరాల్లో సగం అమెరికాలోనే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్డు ఆధారిత లావాదేవీల్లో 25 శాతమే అమెరికాలో జరుగుతున్నాయి. వీసా, మాస్టర్ కార్డు గతేడాది అక్టోబర్ 1 నాటికి చిప్ రీడింగ్ మెషీన్లను మార్చుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాలన్నింటికీ గడువు విధించాయి. అప్పటి వరకు చాలా దుకాణాల్లో కేవలం మ్యాగ్నటిక్ ఆధారిత కార్డు రీడర్లే ఉన్నాయి. దాంతో చిప్, మ్యాగ్నటిక్ కార్డు రీడర్లను అమర్చుకోవడం కోసం గడువు నిర్దేశించాయి. చాలా దుకాణాలు మార్చుకున్నాయి కూడా. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి, చిన్న బ్యాంకులు సైతం చిప్ ఆధారిత కార్డులను జారీ చేసేందుకు సంవత్సరాలు పడుతుందని అంచనా. -
గతవారం బిజినెస్
జీడీపీ వృద్ధి జోరు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి 7.3 శాతంగా నమోదయింది. ఇంతక్రితం రెండు త్రైమాసికాల గణాంకాలను కూడా ఎగువముఖంగా సవరిస్తూ... కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) తాజా లెక్కలను విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధిరేటు 7 శాతం నుంచి 7.6 శాతానికి చేరింది. జూలై- సెప్టెంబరు త్రైమాసిక వృద్ధి రేటు గణాంకాలను కూడా 7.4 నుంచి 7.7 శాతానికి పెంచారు. ప్రభుత్వ బ్యాంకులకు ఎన్పీఏల గుదిబండ ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) 2012-15 మధ్య కాలంలో రూ. 1.14 లక్షల కోట్ల మొండి బకాయిలను (ఎన్పీఏ) ఖాతాల నుంచి తొలగించాయి. 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో సగభాగం .. సుమారు రూ. 52,542 కోట్లను తొలగించాయి. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఈ గణాంకాలు విడుదల చేసింది. 2014-15లో రూ. 21,313 కోట్లను తొలగించిన ఎస్బీఐ అత్యధికంగా రైటాఫ్ చేసిన పీఎస్బీల్లో తొలి స్థానంలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 6,587 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ.3,131 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫార్మా రంగంలో ఉపాధి వెల్లువ! ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్‌కేర్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ రంగ ఉద్యోగ నియామకాల్లో ప్రస్తుత సంవత్సరం 20 శాతంపైగా వృద్ధి నమోదవుతుందని, దాదాపు 1.34 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పీపుల్స్స్ట్రాంగ్, వీబాక్స్లు సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2016’ తెలియజేసింది. తిరుపతిలో తొలి ఐటీ కంపెనీ కమ్యుని క్లిక్ తిరుపతిలో తొలి ఐటీ కంపెనీ ఏర్పాటయింది. అమెరికాకు చెందిన కమ్యుని క్లిక్ ఐటీ కంపెనీ... తన భారతీయ అనుబంధ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసింది. మెరుగైన, నాణ్యమైన వీడియో కాలింగ్‌ను అభివృద్ధి చేయడం, వీడియో కాలింగ్‌కు అనుబంధంగా యాప్స్‌ను రూపొందించటం ఈ విభాగం చేస్తుందని కమ్యుని క్లిక్ పేర్కొంది. పిచాయ్‌కి గూగుల్ బహుమతి గూగుల్ సెర్చింజన్ సహా పలు కీలక విభాగాలకు సీఈఓగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్‌కి కంపెనీ 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కేటాయించింది. అమెరికా చరిత్రలో ఒక లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగికి ఈ స్థాయిలో షేర్లు కేటాయించటం ఇదే తొలిసారి. పసిడి దిగుమతుల టారిఫ్ విలువ పెంపు అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పసిడి దిగుమతులపై టారిఫ్ విలువను పెంచింది. ఈ ధర 10 గ్రాములకు 363 డాలర్ల నుంచి 388 డాలర్లకు పెరిగింది. వెండి విషయంలో ఈ ధర 443 డాలర్ల నుంచి 487 డాలర్లకు ఎగసింది. ఎటువంటి అవకతవకలకూ (అండర్ ఇన్వాయిసింగ్) వీలులేకుండా పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించడానికి దిగుమతి టారిఫ్ విలువ ప్రాతిపదికగా ఉంటుంది. రెండో నెలా తగ్గిన పారిశ్రామికోత్పత్తి పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్‌లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణిం చింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటం ఇందుకు కారణమైంది. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది. కంపెనీలకు ‘వ్యాపార గుర్తింపు సంఖ్య’ కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల కల్పనే లక్ష్యంగా త్వరలో కంపెనీలకు ‘వ్యాపార గుర్తింపు సంఖ్య’ (బిజి నెస్ ఐడెంటిఫికేషన్ నంబర్-బీఐఎన్)ను అమల్లోకి తీసుకురానున్నది. ఒక కంపెనీ వేర్వేరు కార్యకలాపాలకు సంబంధించి పలు రకాల రిజిస్ట్రేషన్ నంబర్లను పొందే ప్రక్రియను తొలగించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. సాధారణంగా ఒక కంపెనీ 18 రకాల రిజిస్ట్రేషన్ నంబర్లను పొందాల్సి ఉంటుంది. భారత్‌లో వ్యాపారం కష్టం ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం వ్యాపారానుకూల దేశాల జా బితా-2016లో భారత్ 130వ స్థానంలో (189 దేశాలకుగానూ) ఉంది. గతేడాదితో పోలిస్తే భారత్ 4 స్థానాలను మెరుగుపరచుకుంది. ప్రభుత్వం టాప్-50లో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కింగ్‌ఫిషర్ హౌస్ వేలం! ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ.. బకాయిల వసూలు నిమిత్తం ముంబై దేశీ విమానాశ్రయం సమీపంలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్‌ను మార్చి 17న ఈ-వేలం వేయనుంది. దీన్ని ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ నిర్వహిస్తుంది. ఈ ప్రాపర్టీ ధరను ట్రస్టీ కంపెనీ రూ. 150 కోట్లుగా నిర్దేశించింది. ఆరో నెలా ధరలు రయ్ వరుసగా ఆరో నెలా ధరల పెరుగుదల కొనసాగింది. ఆహారోత్పత్తుల రేట్లు ఎగియడంతో జనవరిలో ద్రవ్యోల్బణం 5.69 శాతంగా నమోదైంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2014 సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణ రేటు 6.46 శాతంగా నమోదైంది. బీఎస్ఈ ‘ఆన్లైన్ ఎడ్యుకేషన్’ ‘బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్’ అనుబంధ సంస్థ ‘బీఎస్ఈ ఇన్స్టిట్యూట్’ తాజాగ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈవర్సిటీ.కామ్’ అనే ఆన్లైన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఫైనాన్షియల్ మార్కెట్స్ విభాగంలో ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడమే ఈ ప్లాట్‌ఫామ్ ఉద్దేశం. ఇది ఫైనాన్స్ సంబంధిత కోర్సులను అందిస్తుంది. డీల్స్.. * స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడు ల పరంపరను కొనసాగిస్తూ.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా మరో సంస్థ మోగ్లిక్స్లో ఇన్వెస్ట్ చేశారు. * దేశీయంగా మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో తాజాగా అ మెరికాకు చెందిన హెల్త్‌ప్లాన్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చే యనున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ 460 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,150 కోట్లు)గా ఉంటుందని తెలియజేసింది. * టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్ పబ్లిషింగ్ విభాగం వెస్ట్‌లాండ్‌లో 26 శాతం వాటాను ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. -
పేమెంట్ బ్యాంకులతో...మీకేంటి లాభం?
గ్రామీణులకూ అందనున్న డిజిటల్ బ్యాంకింగ్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు నిర్వహించుకునే వెసులుబాటు నిర్వాహకులైన కార్పొరేట్ల నుంచి రాయితీలొచ్చే అవకాశం ప్రభుత్వ బ్యాంకుల కాసా డిపాజిట్లపై మాత్రం ఒత్తిడి!! పేమెంట్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి. చెల్లింపు బ్యాంకులు ఆరంభం కాబోతున్నాయి. కార్పొరేట్లన్నీ బ్యాంకర్ల అవతారం ఎత్తబోతున్నాయి. ఇదీ తాజా ట్రెండ్. సరే! మరి మనకేంటి? బ్యాంకింగ్ కోసమైతే మనకిపుడు బ్యాంకులన్నీ అందుబాటులోనే ఉన్నాయిగా...? మరి ఈ కొత్త బ్యాంకులు రావటం వల్ల మనకు లాభమా? మున్ముందు ఒరిగేదేంటి? జరిగేదేంటి? సామాన్యుల్ని తొలుస్తున్న ఈ ప్రశ్నల విశ్లేషణే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం.. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం పేమెంట్ బ్యాంకులు మనకు ఇప్పటిదాకా పరిచయం లేవు. వివిధ రకాల చెల్లింపులకు ఉపయోగపడే ఈ తరహా 11 బ్యాంకులకు ఇటీవలే ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ అనుమతులు పొందిన వాటిలో పోస్టాఫీసును మినహాయిస్తే మిగి లినవన్నీ భారీ కార్పొరేట్ సంస్థలే. నిజానికి 1990లలో ప్రైవేటు బ్యాంకులకు అనుమతి మం జూరు చేశాక ఇప్పటిదాకా బ్యాంకింగ్‌లో ప్రభుత్వ పరంగా కీలక సంస్కరణలైతే ఏమీ లేవు. కానీ ఇపుడు ఏకంగా 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అనుమతివ్వటంతో పాటు త్వరలో చిన్నస్థాయి బ్యాంకులకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ పేమెంట్ బ్యాంకులతో గ్రామీణులకూ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని కొందరు భావిస్తుండగా... అసలు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకే ముప్పు వస్తుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రుణాలు తప్ప అన్నీ చేస్తాయి... పేరుకు ఇవి చెల్లింపుల బ్యాంకులే. కానీ రుణాలివ్వడం మినహా బ్యాంకులు చేసే అన్నిపనులూ చేస్తాయి. వీటిద్వారా అన్ని బిల్లులూ చెల్లించొచ్చు. ఇవి రూ.లక్ష లోపు విలువైన డిపాజిట్లు స్వీకరించటంతో పాటు డెబిట్/ఏటీఎం కార్డులు, చెక్బుక్లనూ జారీ చేస్తాయి. కాకపోతే ఈ డిపాజిట్లపై సేవింగ్ ఖాతాపై ఎంత వడ్డీ ఇస్తాయో అదే ఇవ్వాలి. చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా పేమెంట్ బ్యాంకులు దీన్ని పెంచే అవకాశం ఉంది. కరెంటు, టెలిఫోన్, మున్సిపాల్టీ, క్రెడిట్‌కార్డు వంటి ఇతర బిల్లులతో పాటు, బీమా, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాన్నీ ఇవి కల్పిస్తాయి. పూర్తిగా మొబైల్ టెక్నాలజీపై ఆధారపడి ఇవి పనిచేస్తాయి. ఇప్పటికే ‘మనీ’ పేరుతో ఎయిర్టెల్, ‘ఎం-పెసా’ పేరుతో వొడాఫోన్ మొబైల్ మనీ వ్యాలెట్ సర్వీసులు అందిస్తున్నాయి. కొత్త పేమెంట్ బ్యాంకులూ ఇలాంటివే. కాకపోతే వీటిద్వారా ఇప్పటిదాకా చెల్లింపులు మాత్రమే చేయగలిగేవాళ్లు. ఇప్పుడు ఈ రెండు సంస్థలకు పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ రావడంతో ఏటీఎంలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కార్డుల జారీ, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ వంటివి కూడా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది. ఈ పేమెంట్ బ్యాంకులు ఫారెక్స్, ట్రావెలర్స్, గిఫ్ట్ కార్డులను కూడా జారీ చేయొచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తుల చెల్లింపులకు ఇవి బాగా ఉపయోగపడతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులూ ఇవే చేస్తున్నాయి కదా? ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపుల దగ్గర నుంచి నగదు బదిలీ వరకు అన్ని సేవలనూ అందిస్తున్నపుడు ఈ కొత్త పేమెంట్ బ్యాంకుల వల్ల లాభం ఏంటన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. ఇది వాస్తవమే అయినా... ఈ లావాదేవీలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆర్బీఐ భావిస్తోంది. చాలా వాణిజ్య బ్యాంకుల్లో ఈ సేవలు పొందాలంటే మీ ఖాతాలో మూడు నెలల కనీస నిల్వ సగటున రూ. 25,000 వరకు ఉంచాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ. 10,000 వరకు ఉంది. దీన్ని మెయింటెన్ చేస్తున్న వారికి మా త్రమే బ్యాంకులు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. అదే పేమెంట్ బ్యాం కులు విషయానికొస్తే మినిమమ్ బ్యాలెన్స్ అనేదే ఉండదు. చెల్లింపులకు అవసరమైన నగదును వేసుకొని ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్ ఫోన్ నుంచే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఫోన్ ద్వారానే అన్ని లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామీణులు ఈ పేమెంట్ బ్యాంక్‌లను ఆదరిస్తారని ఆర్బీఐ భావన. ఆఫ్రికాలో కెన్యా వంటి చిన్న దేశంలో వొడాఫోన్ ప్రవేశపెట్టిన ‘ఎం-పెసా’కు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చక్కటి ఆదరణ లభించడమే పేమెంట్ బ్యాంకులకు ప్రేరణగా కనిపిస్తోంది. వ్యతిరేకత ఇందుకే...! బ్యాంకులు నమోదు చేస్తున్న లాభాల్లో కీలక పాత్ర చౌక వడ్డీరేటున్న కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లదే. చాలామంది ఖాతాదారులు నెలవారీ చెల్లింపుల కోసం సేవింగ్స్ ఖాతాల్లో భారీ మొత్తాన్ని ఉంచుతారు. కానీ ఇప్పుడు పేమెంట్ బ్యాంక్‌లు వస్తే కాసా డిపాజిట్లపై ఒత్తిడి పెరుగుతుందని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అలాగే చాలా బ్యాంకులు, నగదు బదిలీ, బిల్లు చెల్లింపులపై ఫీజుల రూపంలో ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ బ్యాంకులు వస్తే పోటీ పెరిగి ఇటువంటి ఇతర ఆదాయాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త బ్యాంకులివీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో, వొడాఫోన్ ఎం-పెసా, ఎయిర్టెల్ ఎం కామర్స్ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, టెక్ మహీంద్రా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీ ఎల్), ఫినో పేటెక్ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇవీ ప్రయోజనాలు ►గరిష్టంగా లక్ష రూపాయల డిపాజిట్లు స్వీకరించొచ్చు. ఈ డిపాజిట్లపై సేవింగ్స్ ఖాతా వడ్డీరేటును అందిస్తాయి. ► సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి పెరిగే అవకాశం ఉంది. ► మొబైల్ ఫోన్ ద్వారానే ఇతర ఖాతాలకు నగదు సులభంగా బదిలీ చేసుకోవచ్చు ►ఖాతాల్లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ►ఆఫీసులకు వెళ్లకుండానే ఆటోమేటిక్‌గా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ►క్రెడిట్ కార్డులు తప్ప ఏటీఎం, డెబిట్, ఫారెక్స్, ట్రావెల్ కార్డులను జారీ చేస్తాయి ►ఈ బ్యాంకులన్నీ కార్పొరేట్ల చేతిలోనే ఉన్నాయి కనక వాటి ఉత్పత్తులపై రాయితీలిచ్చే అవకాశం -
అంతా మా ఇష్టం!
- రెన్యువల్ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు - చేసుకోని వారి ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకర్ల నిరాకరణ - వడ్డీ చెల్లింపు విషయంలో స్పష్టత లేకపోవటమే కారణం పరిగి: మేం మోనార్కులం.. ఎవరి మాటా వినం.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు బ్యాంకర్లు. రెండోవిడత రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు అందజేసినా.. అవి రైతుల ఖాతాల్లో బ్యాంక్ అధికారులు జమ చేయటంలేదు. రెన్యువల్ చేసుకున్న రైతుల ఖాతాల్లోనే రుణమాఫీ డబ్బులు జమచేసి చేతులు దులుపుకొంటున్నారు. రెన్యువల్ చేసుకోని రైతులకు సంబంధించిన డబ్బులు బ్యాం కుల్లోనే ఉంచుకుని వాటితో జమయ్యే వడ్డీతో బ్యాంకర్లు తమ వ్యాపారాలు వెలగబెట్టుకుంటున్నారు. విషయాన్ని పసిగట్టిన కలెక్టర్ వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆయా మండలాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. ఏయే బ్యాంకులకు ప్రభుత్వం ఎన్ని డబ్బులు జమచేసింది. ఆయా బ్యాంకులు రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమచేశాయి. ఇంకా ఎన్ని డబ్బులు ఖాతాల్లో మూలుగుతున్నాయనే విషయంలో తనకు వెంటనే నివేదిక సమర్పించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన ప్రత్యేకాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇదే సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చే యాలని వ్యవసాయ శాఖ అధికారులు బ్యాం కుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటంలేదు. రెన్యువల్ చేసుకున్నప్పుడే ఖాతాల్లో జమచేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 25 రోజులైనా.. 30 శాతంలోపే.. ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ డబ్బులు విడుదల చేసి 25 రోజులు కావస్తోంది. 25 రోజుల క్రితమే అన్ని బ్యాంకుల్లో రెండో రుణమాఫీకి సంబంధించి 12.5 శాతం నిధులు ప్రభుత్వం జమ చేసింది. ఇదే సమయంలో మరో 12.5 శాతం నిధులు త్వరలో బ్యాంకులకు ఇస్తాం. వాటిని కూడా రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించింది. అయితే బ్యాంకర్లు ఇవేవీ పట్టించుకోకుండా అసలుకే ఎసరు పెట్టారు. ఇప్పటికే బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిన 12.5 శాతం నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా తమ ఖాతాల్లోనే ఉంచుకున్నారు. ఇప్పటి వరకు పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న 30శాతంలోపు రైతులకు మాత్రమే ఖాతాల్లో జమ చేసి ఊరుకున్నారు. పరిగి వ్యవసాయ డివిజన్లోని నాలుగు మండలాలకు చెందిన బ్యాంకుల్లో ప్రభుత్వం 25 రోజుల క్రితం రూ.22.89 కోట్లు జమ చేయగా ఇప్పటి (బుధవారం) వరకు రూ.7.35 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం 41,651 మందికి రుణమాఫీ జమచేయగా 14,337 మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి. ఈ విషయమై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నగేష్‌కుమార్‌ను వివరణ కోరగా.. విడుదల చేసిన డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమచేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం రెన్యువల్ చేసుకున్న వారి కాతాల్లోనే జమ చేస్తున్నారని తెలిపారు. రైతులంతా రెన్యువల్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. -
బ్యాంకుల మూలధన అవసరాలపై కసరత్తు!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం ఎంత మొత్తంలో అవసరమన్న అంశంపై ఆర్థికమంత్రిత్వశాఖ కసరత్తు ప్రారంభించింది. తక్షణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అలాగే సమీప ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి తాజా మూలధనం ఎంత కావల్సి ఉంటుందన్న అంశంపై నివేదికలు సమర్పించాలని ప్రభుత్వ బ్యాంకులు అన్నింటినీ ఆదేశించింది. బాసెల్ నిబంధనలు, అలాగే వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా మూలధన అవసరాలను తెలియజేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థికమంత్రిత్వశాఖ సూచించింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, అంతర్జాతీయ బాసెల్ 3 నిబంధనల అమలు దిశలో 2018 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.40 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని అన్నారు. తాజా బడ్జెట్లో రూ.8,000 కోట్ల తాజా మూలధనం కేటాయించినా... అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతామని అన్నారు. -
లాభాల్లో ప్రైవేటుదే పైచేయి..!
తొలిసారి నికరలాభంలో ప్రభుత్వ బ్యాంకుల కన్నా ముందంజ ప్రభుత్వ బ్యాంకులకు మొండిబకాయిలు గుదిబండలా మారుతున్నాయి. నానాటికీ ఇవి కొండలా పేరుకుపోతుండటంతో ఆ ప్రభావం వాటి లాభాలపై పడుతోంది. అందుకే... తొలిసారిగా దేశంలో 24 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికర లాభాన్ని 13 ప్రయివేటు బ్యాంకుల నికరలాభం మించిపోయింది. దేశ చరిత్రలో తొలిసారి ఉమ్మడిగా ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటు బ్యాంకులు అధిగమించాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 25 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికరలాభం రూ.33,976 కోట్లు కాగా... టాప్ 13 ప్రైవేటు బ్యాంకుల ఉమ్మడి నికరలాభం రూ.37,361 కోట్లకు చేరింది. అంటే రూ.3,385 కోట్లు ఎక్కువన్న మాట. మొండిబకాయిల కోసం, రాని బకాయిల కోసం ప్రభుత్వ బ్యాంకుల పక్కనబెట్టిన మొత్తం (ప్రొవిజనింగ్) విపరీతంగా పెరిగిపోవటంతో వాటి నికరలాభం గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) ఈ సారి ఏకంగా 0.58 శాతం పెరిగి 5.47 శాతానికి చేరుకున్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఎన్పీఏల స్థాయి ఇంతలా లేదు. ఈ ఏడాది పెరుగుదల 0.19 శాతం మాత్రమే ఉండగా మొత్తం ఎన్పీఏల శాతం 2.01గా ఉంది. అందుకే నిరర్ధక ఆస్తుల నిమిత్తం ప్రైవేటు బ్యాంకులు రూ.10,852 కోట్లు కేటాయించగా ప్రభుత్వ బ్యాంకులు ఏకంగా రూ.72,095 కోట్లు కేటాయించాయి. ఇదే వాటి నికరలాభం తగ్గుదలకు ప్రధాన కారణంగా మారింది. చిత్ర మేంటంటే ఏడాది కిందట పరిస్థితి ఇలా లేదు. 13 ప్రయివేటు బ్యాంకుల మొత్తం నికర లాభం కన్నా 24 ప్రభుత్వ బ్యాంకులే రూ.2,312 కోట్లను అధికంగా ఆర్జించాయి. సగానికి క్షీణించిన నికరలాభం... ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండింటి నికరలాభం గతేడాదితో పోలిస్తే సగమే నమోదయింది. గతేడాదికన్నా ఏకంగా 134 శాతం అధికంగా బీఓబీ ఏకంగా రూ.1,491 కోట్లను ఎన్పీఏల కోసం కేటాయించింది. చిత్రమేంటంటే ఈ విషయమై బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ, సీఈఓ రంజన్ ధావన్ ఇటీవల మాట్లాడుతూ... తదుపరి సంవత్సరానికి అంటే 2015-16కు ఎన్పీఏలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేమనటం. ‘‘బడా కార్పొరేట్ సంస్థలు చాలావరకూ దారుణమైన కష్టాల్లో ఉన్నాయి. అలాంటి వాటిని ఎన్పీఏలుగా ప్రకటించాలా? లేదా? అనే విషయమై ఇంకా చర్చ జరుగుతోంది. నా ఉద్దేశం ప్రకారం వచ్చే ఐదారు నెలల్లో ఇవి ఎన్పీఏలుగా మారకపోవచ్చు. అలా మారితే గనక ఒకే కంపెనీ నుంచి వందల కోట్లు రాని బాకీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది’’ అని చెప్పారు. పీఎన్బీ విషయానికొస్తే ఈ ఏడాది దాదాపు 76% అధికంగా రూ.7,979 కోట్లను రాని బాకీల కోసం కేటాయించింది. దీనిపై బ్యాంకు ఎండీ, సీఈఓ గౌరీ శంకర్ మాట్లాడుతూ ‘‘రాని బాకీలుగా గుర్తించిన వాటిలో కొన్ని రికవరీ అయ్యే చాన్సుంది. అదే జరిగితే ప్రొవిజనింగ్ మారి లాభం పెరుగుతుంది’’ అన్నారు. ఇన్ఫ్రా, ఉక్కు రంగాలు బాగా దెబ్బతిన్నట్లు చెప్పారాయన. ఈ మధ్యే దీనిపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా మాట్లాడతూ ఎన్పీఏలు అన్నిచోట్లా ఒకేలా లేవని, ప్రభుత్వ బ్యాంకుల్లో బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎస్బీఐ కేటాయింపులు రూ. 25,812 కోట్లు ఉదాహరణకు ఎస్బీఐను చూస్తే 2014-15 కోసం కేటాయించిన రూ.25,812 కోట్లలో రూ.19,086 కోట్లు రాని బాకీల కోసమే. దీంతో మొత్తం కేటాయింపులు ఈ ఏడాది ఏకంగా 21.6% పెరిగినట్లయింది. ప్రొవిజనింగ్.. - ఒక ఖాతా గనక ఏడాదిపాటు నిరర్థక ఆస్తిగా దాన్ని నాసిరకంగా పరిగణిస్తారు. అలాంటి ఖాతాకోసం 15% మొత్తాన్ని కేటాయించాలి. - నాసిరకంగా 12 నెలలు కొనసాగితే దాన్ని రికవరీ అవుతుందో రాదో తెలియని సందేహాస్పద ఖాతాగా పరిగణిస్తారు. దీనికి కనీసం 25%, గరిష్టంగా 100% ప్రొవిజనింగ్ చేయాలి. -
కొత్తబస్సుల కొనుగోలులో బెస్ట్‌కు సాయం చేస్తాం: బీఎంసీ
గతంలోనూ రూ. 1,600 కోట్లు అందజేత సాక్షి, ముంబై: కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వెల్లడించింది. అయితే ఈ నిధులు అప్పు రూపంలో ఇవ్వనుండటంతో ఈ మొత్తాన్ని బెస్ట్ సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నష్టాల బాటలో నడుస్తున్న సంస్థకు రుణాలు ఇచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం బీఎంసీ రూ.1,600 కోట్లు బెస్ట్‌కు అప్పుగా ఇచ్చింది. అంతేగాకుండా చార్జీలు పెంచకుండా అందులో రూ.150 కోట్లు మినహాయింపు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం బెస్ట్ సంస్థ ఆదీనంలో నడుస్తున్న 3,500 పైగా బస్సుల్లో సుమారు 300 బస్సులు పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని బెస్ట్ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం బెస్ట్ సంస్థ రూ.700 కోట్లకుపైగా నష్టాల్లో నడుస్తోంది. చార్జీలు పెంచినప్పటికీ ఈ లోటును పూడ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 300 కొత్త బస్సులు కొనుగోలు చేయడం పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకునేందుకు బీఎంసీ ముందుకు రావడంతో బెస్ట్‌కు ఊరట లభించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై స్థాయి సమితి అధ్యక్షుడు శైలేష్ ఫణసే ఆమోద ముద్రవేశారు. కాగా, ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) మాదిరిగా బెస్ట్ బస్సులపై బీఎంసీ లోగో అమర్చాలని బీఎంసీ శరతులు విధించనుంది. ప్రస్తుతం నగరంలో సేవలు అందిస్తున్న బెస్ట్ బస్సుల్లో కొన్నింటిని ఎంయూటీపీ నిధులతో కొనుగోలు చేయడంతో వాటిపై ఎంయూటీపీ లోగో ఉంది. దీంతో బీఎంసీ అందజేసిన నిధులతో కొనుగోలు చేసిన బస్సులపై ఆ సంస్థ లోగో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
నేడు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె