మీ కార్డులో ‘చిప్’ ఉందా..? | Credit Card with Chips | Sakshi
Sakshi News home page

మీ కార్డులో ‘చిప్’ ఉందా..?

Published Mon, Oct 17 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

మీ కార్డులో ‘చిప్’ ఉందా..?

మీ కార్డులో ‘చిప్’ ఉందా..?

మీరింకా పాత డెబిట్, క్రెడిట్ కార్డులే వాడుతున్నారా?    
 మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులైతే మార్చుకోవాలని సూచన  
 ఏడాది కిందట అమల్లోకి వచ్చిన ‘చిప్’ కార్డులు

 
 ఇప్పటికే ఈ తరహా కార్డుల్ని జారీ చేస్తున్న బ్యాంకులు
 పూర్తి స్థాయిలో మారటానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు
 వీటితో భారీగా తగ్గుముఖం పట్టిన కార్డు నేరాలు

 
 కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఇంకా మారకపోవచ్చు. కొన్ని ప్రైవేటు బ్యాంకులూ... ఆ... డెబిట్ కార్డులే కదా!! అని అలసత్వం ప్రదర్శిస్తూ ఉండొచ్చు. క్రెడిట్ కార్డుల విషయంలో దాదాపు అన్ని బ్యాంకులూ ఇప్పటికే మారిపోయాయి. డెబిట్ కార్డుల విషయంలోనూ చాలా బ్యాంకులు చిప్ కార్డులనే జారీ చేస్తున్నాయి. ఇంతకీ వీటివల్ల ఏం జరిగిందంటే... సైబర్ నేరగాళ్లు మాత్రం దెబ్బతిన్నారు. కార్డుల్ని క్లోన్ చేయటం, కోడ్‌లు కాపీ చేసి నకిలీ లావాదేవీలు నిర్వహించటం వంటివి చేయలేకపోతున్నారు. దాదాపు ఏడాది కిందటే అమల్లోకి వచ్చిన చిప్ కార్డులతో సైబర్ నేరాలు కూడా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు చిప్ కార్డులంటే ఏంటి? ఎందుకు వాటిని జారీ చేయాల్సి వస్తోంది? నేరగాళ్లకు ఎలా కళ్లెం పడింది? వీటిలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ కథనం...
 
 క్రెడిట్, డెబిట్ కార్డు దారులు సైబర్ నేరాల బారిన పడకుండా మరింత రక్షణ కల్పించడానికి కొన్నాళ్ల కిందటే ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే... బ్యాంకులు చిప్ ఆధారిత, పిన్ ఎనేబుల్డ్ డెబిట్, క్రెడిట్ కార్డులనే జారీ చేయాలని ఆదేశించింది. దీనిప్రకారం దేశీ బ్యాంకులన్నీ కస్టమర్లకు చిప్‌ను అమర్చిన కార్డులనే జారీ చేయాలి. గతంలో జారీ చేసిన డెబిట్ కార్డులన్నీ కూడా మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఆధారిత డెబిట్ కార్డులు. వాటి స్థానంలోనే చిప్ కార్డులొచ్చాయి.
 -సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 కాకుంటే..కార్డు మార్చుకోండి
 ముందు మనది ఏ కార్డో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మీ కార్డు వెనుక భాగంలో నల్లటి మందమైన గీత కనిపిస్తుంది. అదే మ్యాగ్నటిక్ స్ట్రిప్. బ్యాంకులు ప్రారంభం నుంచీ జారీ చేస్తున్నవి ఇవే కార్డులు. చాలా బ్యాంకులు డెబిట్ కార్డుల చెల్లుబాటు వ్యవధి పదేళ్లు కూడా ఇచ్చాయి. దీంతో చాలామందికి ఈ కార్డుల కాల వ్యవధి తీరేందుకు ఇంకా సమయం ఉంది. సరే కదా అని ఊరుకుంటే మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుతో సైబర్ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది. కనుక వెంటనే మీ బ్యాంకును సంప్రదించి తగు దరఖాస్తు ఇస్తే... మీ కార్డు స్థానం లో అత్యాధునిక చిప్ కార్డు అందజేస్తుంది. చిప్ కార్డుకు ఒకవైపున మధ్యలో బంగారు వర్ణంలో మెరిసే చిప్ ఉంటుంది. దీనివల్లే అధిక సెక్యూరిటీ లభిస్తుంది. కొన్ని కార్డుల్లో చిప్‌తో పాటు మ్యాగ్నటిక్ స్ట్రిప్ కూడా ఉంటుంది.
 
 ఈఎంవీ చిప్ కార్డు అంటే...
 పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద, ఆన్‌లైన్‌లో చేసే చెల్లింపులకు ఈ కార్డులతో మరింత భద్రత ఉంటుందనే ఉద్దేశంతోనే ఆర్‌బీఐ వీటిని అమలు చేయాలని ఆదేశించింది. ఈఎంవీ చిప్స్ అనేది వీటి పేరు. అంటే ఈఎంవీ అంటే ‘యూరో పే మాస్టర్‌కార్డు అండ్ వీసా’ అని అర్థం. కంప్యూటర్ చిప్స్‌తో ఉన్న కార్డులకు ఈఎంవీ అనేది అంతర్జాతీయ ప్రమాణం. దీని రూపకర్త ‘ఈఎంవీ కో ఎల్‌ఎల్‌సీ. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆరు ప్రధాన పేమెంట్ ప్రాసెసింగ్, క్రెడిట్ కార్డు కంపెనీలు దీన్లో భాగస్వాములయ్యాయి. వీటిలో మాస్టర్ కార్డు, వీసా, జేసీబీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, చైనా యూనియన్ పే, డిస్కవర్ ఉన్నాయి.
 
 నేరగాళ్లకు కష్టమే...
 కార్డులో మెటల్ చిప్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ చిప్‌లో ఖాతాదారుడి సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో భద్రపరుస్తారు. చిప్ కార్డులు అత్యంత భద్రతను అందించే విషయంలో సందేహం అక్కర్లేదన్నది నిపుణుల సూచన. ఎందుకంటే కార్డులో ఉండే చిప్... ప్రతి లావాదేవీకి ఒక యూనిక్ కోడ్‌ను జారీ చేస్తుంది. దీన్ని కాపీ చేయడం సైబర్ నేరగాళ్లకు అంత సులభం కాదు. ఒకవేళ మహా తెలివితనంతో నేరగాడు ఈ కోడ్‌ను కాపీ చేసినా మరో లావాదేవీకి ఆ కోడ్ చెల్లుబాటు కాదు. దీంతో లావాదేవీలు భద్రంగా ఉంటాయి.
 
 ఇక మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డు విషయానికొస్తే దాన్ని సూక్ష్మ మ్యాగ్నెట్స్‌తో తయారు చేస్తారు. వీటిలో ఖాతాదారుడి సమాచారం ఉంటుంది. ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ (ఈడీసీ) మెషీన్‌పై స్వైప్ చేసిన తర్వాత అందులోని సమాచారం ఆధారంగా బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ కార్డుతో భద్రత తక్కువ. ఇందులోని వివరాలను కాపీ చేయడం సులభం. కార్డుపై ఉన్న వివరాలను చూసి అవే వివరాలతో డూప్లికేట్ కార్డును రూపొందించి సైబర్ నేరగాళ్లు తమ పని చేసుకోగలరు.
 
 పిన్‌తో రెండో అంచె రక్షణ

 మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తో ఉన్న కార్డులను దుకాణాల్లోని చిప్ రీడింగ్ మెషీన్లనో స్వైప్ చేయడం గమనించే ఉంటారు. అలా స్వైప్ చేసినప్పుడు మ్యాగ్నటిక్ స్ట్రిప్‌ను రీడ్ చేయడం ద్వారా అది బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అదే చిప్ ఆధారిత కార్డు అయితే అలా స్వైప్ చేయకుండా ఏటీఎం మెషీన్‌లో మాదిరిగా ఇన్‌సర్ట్ చేసినట్టు ఉంచుతారు. చిప్‌లో ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉన్న సమాచారాన్ని  ఈడీసీ మెషీన్ రీడ్ చేస్తుంది. పిన్ నంబర్ ఇస్తేనే ఆ లావాదేవీ ప్రాసెస్ అవుతుంది. దీనివల్ల మీ కార్డు మరొకరి చేతికి వెళ్లినా పిన్ ఉంటుంది కాబట్టి చోరీకి అవకాశం ఉండదు. అయితే, కొన్ని బ్యాంకులు పిన్ లేకుండా చిప్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఖాతాదారుడి సంతకాన్ని ధ్రువీకరణగా పరిగణిస్తారు.
 
 చిప్, మ్యాగ్నటిక్ స్ట్రిప్ రెండూ ఒకేదానిలో...
 దేశంలో 90 శాతం పాయింట్ ఆఫ్ సేల్ రీడింగ్ మెషీన్లు చిప్ కార్డుల్ని రీడ్ చెయ్యగలవు. కాకపోతే అన్ని ఏటీఎంలలో ఇవి పనిచేయకపోవచ్చు. కొత్తగా ఏర్పాటైన ఏటీఎంలయితే వీటిని రీడ్ చేయగలవు. ఎప్పుడో ఏర్పాటు చేసినవైతే వాటిలో హార్డ్‌వేర్ పరంగా చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని ఓ కమిటీ ఆర్‌బీఐకి లోగడే నివేదించింది. అయితే, ఈ సమస్యకు నివారణగా హెచ్‌డీఎఫ్‌సీ సహా కొన్ని బ్యాంకులు చిప్, మ్యాగ్నటిక్ రెండింటినీ ఒకే కార్డులో అమర్చి ఇస్తున్నాయి.
 
 అమెరికాలోనూ...  
 ప్రపంచ వ్యాప్తంగా జరిగే క్రెడిట్/డెబిట్ కార్డు నేరాల్లో సగం అమెరికాలోనే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్డు ఆధారిత లావాదేవీల్లో 25 శాతమే అమెరికాలో జరుగుతున్నాయి. వీసా, మాస్టర్ కార్డు గతేడాది అక్టోబర్ 1 నాటికి చిప్ రీడింగ్ మెషీన్లను మార్చుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాలన్నింటికీ గడువు విధించాయి. అప్పటి వరకు చాలా దుకాణాల్లో కేవలం మ్యాగ్నటిక్ ఆధారిత కార్డు రీడర్లే ఉన్నాయి. దాంతో చిప్, మ్యాగ్నటిక్ కార్డు రీడర్లను అమర్చుకోవడం కోసం గడువు నిర్దేశించాయి. చాలా దుకాణాలు మార్చుకున్నాయి కూడా. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి, చిన్న బ్యాంకులు సైతం చిప్ ఆధారిత కార్డులను జారీ చేసేందుకు సంవత్సరాలు పడుతుందని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement