మీరు సీరియస్‌గా బ్రౌజింగ్ చేస్తుండగానో.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో మునిగి ఉండగానో.. ‘ఆకర్షించే’లా పాప్‌అప్స్ వచ్చాయా? హఠాత్తుగా మీ మెయిల్ ఐడీకి గుర్తుతెలియని అడ్రస్ నుంచి ‘ఫొటోలతో’కూడిన ఈ–మెయిల్ వచ్చిందా? అలాంటి వాటిని క్లిక్ చేసే ముందు ఒక్కక్షణం ఆగండి..! అవి మిమ్మల్ని నిలువునా ముంచేసే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇది చదవండి..
సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. ఓ యువకుడి ఖాతా నుంచి రూ.10 లక్షలు గోల్‌మాల్ అయ్యాయన్నది దాని సారాంశం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అతగాడు ఓ అశ్లీల వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడంతో ఈ మోసం చోటు చేసుకుందని గుర్తించారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు నెట్ బ్యాంకింగ్‌కు ఉపకరించే రహస్య అంశాలను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు అశ్లీలంతో ఎర వేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు.
– సాక్షి, హైదరాబాద్
ఆ వివరాలే కీలకం..
ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్‌లైన్‌లో స్వాహా చేయడానికి సైబర్ నేరగాళ్లకు అతడి క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్, సీవీవీ కోడ్‌లతో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలూ అవసరం. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. వీటన్నింటితో పాటు వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) సైతం ఎంటర్ చేయాల్సిందే. ఇవి లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బు కాజేయడం అసాధ్యం. సాధారణంగా ఈ వివరాల కోసం సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడంతో పాటు సూడో సైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘అశ్లీలం దారి’పట్టారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.
యువకులే టార్గెట్‌గా..
సైబర్ నేరగాళ్ల వల్లో ఎక్కువగా యువకులే పడుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లను సైతం రూపొందిస్తున్నారు. అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్ అప్స్‌ను వివిధ సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లతో పాటు వెబ్‌సైట్లకు లింక్ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువత వీటిపై క్లిక్ చేసిన వెంటనే అవి ఓపెన్ అవుతున్నాయి. ఆ తర్వాతే అసలు ఘట్టం ప్రారంభమవుతోంది. ఆ సైట్‌లోకి లాగిన్ కావాలన్నా, అందులోని వీడియోలు, ఫొటోలు ఓపెన్ కావాలన్నా కొంత రుసుము చెల్లించాలని ప్రత్యేక లింకు పెడుతున్నారు.
నేరుగా చేరిపోతున్న వివరాలు..
ఆయా సైట్లలోకి లాగిన్ కావడానికి, వీడియోలు–ఫొటోలు చూడటానికి కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని ఉంటోంది. దీంతో ‘కార్డుల’ వివరాలు, నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అందులో పూరిస్తున్నారు. దీంతో ఈ వివరాలన్నీ నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్‌లైన్ లావాదేవీలు పూర్తి చేసి.. ఓటీపీ వచ్చేలా ఆప్షన్ ఎంచుకుని వేచి చూస్తున్నారు. ఆ యువకుడు వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన లింకులో దీన్ని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో డబ్బు స్వాహా చేస్తున్నారు. ఈ వివరాలను వినియోగించి వారు తేలిగ్గా ఖాతాలు ఖాళీ చేయడమో, ఆన్‌లైన్ షాపింగ్ చేసి ‘కార్డు’లకు చిల్లు పెట్టడమో చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారి పూర్తి వివరాలు తెలుసుకోవడం అసాధ్యంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు.
ఆన్‌లైన్ చెల్లింపులను నమ్మదగ్గ సైట్లలోనే చేయాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదు. అలాంటి వాళ్లకు మీ వివరాలు తెలిస్తే కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. నిందితులు చిక్కడం, నగదు రికవరీ అంత కష్టం. అప్రమత్తతతోనే సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు.
– సైబర్ క్రైమ్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment