chip cards
-
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీలపై రవాణా శాఖ సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ స్మార్ట్ సేవలకు మంగళం పాడింది. 13 ఏళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ, తదితర ధ్రువపత్రాలకు సంబంధించిన స్మార్ట్ కార్డులు ఇప్పుడు స్మార్ట్‘లెస్’ అయ్యాయి. ఈ స్మార్ట్ కార్డుల్లో వినియోగించే చిప్స్‌ను తొలగించారు. వాహనదారుకు సంబంధించిన పూర్తి వివరాలతో రూపొందించే చిప్స్ లేకుండానే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి అందజేస్తున్నారు. తైవాన్, చైనా, తదితర దేశాల నుంచి చిప్స్ దిగుమతి కావడం లేదనే కారణంతో కొంతకాలం పాటు స్మార్ట్ కార్డుల జారీని నిలిపివేశారు. ఆ తర్వాత చిప్స్ లేకుండానే కార్డులను ముద్రించి అందజేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చిప్స్ కొరత లేకపోయినప్పటికీ వాటిని తిరిగి వినియోగింలోకి తేకుండానే చిప్లెస్ కార్డులనే వాహనదారులకు కట్టబెట్టడం గమనార్హం. వాహన తయారీ రంగంలో కీలకంగా భావించే చిప్స్ ప్రస్తుతం విదేశాల నుంచి నిరాటంకంగా దిగుమతి అవుతున్నాయి. దీంతో వాహన తయారీ రంగం కూడా తిరిగి వేగం పుంజుకుంది. రవాణాశాఖను మాత్రం ఇంకా చిప్స్ కొరత వెంటాడడం గమనార్హం. త్రీటైర్‌తో పాటే చిప్స్.. రవాణాశాఖ వివిధ రకాల పౌరసేవలను పారదర్శకంగా అందజేసేందుకు 2009లో త్రీటైర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ఉన్న టూటైర్ సాంకేతిక వ్యవస్థ స్థానంలో మరింత అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచి్చంది. దీంతో ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయం నుంచే అన్ని రకాల పౌరసేవలకు కిందిస్థాయి వరకు చేరేలా చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, వాహన బదిలీ పత్రాలు వంటివి చిన్న సైజు స్మార్ట్ కార్డుల రూపంలోకి తెచ్చారు. వాహనదారులపైన ఇది ఆర్థికంగా భారమైనప్పటికీ పెద్ద పత్రాల రూపంలో వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పింది. మరోవైపు స్మార్ట్ కార్డుల్లో చిప్స్‌ను ప్రవేశపెట్టారు. వాహనదారుడి పూర్తి వివరాలను ఇందులో నమోదు చేశారు. దీనివల్ల ఎలాంటి నకిలీ పత్రాలకు తావు లేకుండా ఆర్టీఏ సేవలు మరింత నాణ్యంగా, పారదర్శకంగా మారాయి. వాహనదారుడికి పూర్తి భద్రత లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి స్మార్ట్ సేవలు అందుబాటులో లేని రోజుల్లోనే ‘చిప్స్’ను పరిచయం చేయడం విశేషం. కానీ వీటిలో నమోదు చేసిన సమాచారాన్ని తెలుసుకొనేందుకు కావాల్సిన రీడర్స్‌ను మాత్రం ఆర్టీఏ సమకూర్చుకోలేకపోయింది. రవాణాశాఖలోనే కాదు పోలీసుల వద్ద కూడా చిప్స్ రీడర్స్ లేకపోవడం గమనార్హం. వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు, ఇతరత్రా సంఘటనల్లో ఈ స్మార్ట్ కార్డులలోని చిప్స్ ద్వారా సమాచారం తెలుసుకొనే అవకాశం ఉన్నా రీడర్స్ లేకపోవడంతో అవి కేవలం అలంకారప్రాయంగా మారాయి. ఏకంగా ఎత్తేశారు.. పారదర్శక సేవలను అందజేసే లక్ష్యంతో టు టైర్ నుంచి త్రీటైర్‌కు మారిన రవాణాశాఖ ఇప్పుడు చిప్స్ కొరతను సాకుగా చూపుతూ, చిప్ రీడర్స్ లేకపోవడంతో చిప్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదనే అంశాన్ని ఎత్తి చూపుతూ ఇప్పుడు ఏకంగా చిప్స్‌నే తొలగించారు. దీంతో నకిలీ కార్డులకు ఊతమిచ్చినట్లయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆధార్, ఓటర్ గుర్తింపు వంటి వివిధ రకాల నకిలీ కార్డులు వెల్లువెత్తుతుండగా, చిప్స్ లేకపోవడంతో లైసెన్సులు, ఆర్సీల్లోనూ నకిలీ పత్రాలకు ఊతమిచ్చినట్లవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
Telangana: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి చిప్ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది. గతంలో విచ్చలవిడిగా నకిలీ కార్డులు రావడంతో వాటిని అడ్డుకునే క్రమంలో రవాణాశాఖ చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. కానీ 40 రోజులుగా చిప్‌ల కొరతతో కార్డుల జారీ నిలిచిపోయింది. ఆరు లక్షల వరకు కార్డుల జారీ పేరుకుపోయింది. విదేశాల నుంచి చిప్‌ల దిగుమతి నిలిచిపోవటంతో తప్పనిస్థితిలో మళ్లీ పాతపద్ధతిలో కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. కార్డులు లేకపోవటంతో తనిఖీల్లో పోలీసులు చలానాలు రాస్తుండటం, రాష్ట్ర సరిహద్దుల్లో సమస్యలు ఎదురవుతుండటంతో గందరగోళంగా మారింది. ఈ మొత్తం పరిస్థితిని వారం కిందట ‘తైవాన్ చిప్ ఆగింది.. కార్డుల జారీ నిలిచింది’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో నిలిచిపోయిన కార్డులన్నింటినీ చిప్‌లు లేకుండా వెంటనే జారీ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. చిప్ లేని కార్డుల జారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. మళ్లీ రెండుమూడు నెలల్లో చిప్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్న రవాణాశాఖ.. అప్పటి వరకు చిప్ లేకుండానే కార్డులను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చిప్ ఉన్నా రీడర్లు లేవు.. వాహనం, దాని యజమానికి సంబంధించిన వివరాలను చిప్‌లో నిక్షిప్తం చేసి దాన్ని స్మార్ట్‌కార్డులో పొందుపరుస్తారు. పోలీసులు తనిఖీ సమయంలో కార్డును చిప్ రీడర్ పరికరం ముందు ఉంచగానే ఆ వివరాలు ఆ రీడర్లో కనిపిస్తాయి. కానీ మన అధికారుల వద్ద పరిమితంగానే చిప్ రీడర్లు ఉన్నాయి. దీంతో చిప్‌ఉన్నా దాని ఆధారంగా వివరాలు స్కాన్ చేసే వీలు లేకుండాపోయింది. ఇప్పుడు చిప్ లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదన్న భావనతో చిప్ లేని కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఇప్పుడు చిప్ లేని కార్డుల జారీ మొదలైతే మళ్లీ నకిలీ కార్డులతో కేటుగాళ్లు దందా చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరలో చిప్‌లు తెప్పించి మళ్లీ చిప్ ఉండే కార్డులను జారీచేస్తామని రవాణాశాఖ చెబుతోంది. గతంలో చైనా, ఉక్రెయిన్, తైవాన్ దేశాల నుంచి చిప్‌లు దిగుమతి అయ్యేవి. చైనా నుంచి దిగుమతిని కేంద్రం నిషేధించగా, యుద్ధంతో ఉక్రెయిన్ చిప్‌లు రావడంలేదు. స్థానికంగా వినియోగం పెరగడంతో తైవాన్ కూడా ఆపేసింది. -
తైవాన్ చిప్ ఆగింది.. వాహనాల ఆర్సీ, లైసెన్స్‌లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఓ చిన్న చిప్ ఇప్పుడు వాహనదారులను హైరానా పెడుతోంది. తైవాన్‌కు చెందిన ఆ చిప్ ఏకంగా రవాణాశాఖలో ఆర్సీలు, లైసున్సుల జారీ ప్రక్రియనే నిలిపేసింది. నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. రవాణాశాఖ కార్యాలయాల్లో లక్షల్లో కార్డులు పేరు కుపోయాయి. వాటిని పొందాల్సిన వాహనదారు లు, డౌన్లోడ్ చేసుకుని ప్రింట్లు దగ్గరపెట్టు కుని తిరుగుతున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో ఈ ప్రింట్లను పట్టించుకోకపోవడంతో వాహనాలను అనుమతించని పరిస్థితి ఉంది. స్థానికంగా, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా పెనాల్టీలు విధిస్తున్నారు. దీనికంతటికీ.. ఆ కార్డుల్లో ఇమడాల్సిన చిప్‌లు లేకపోవటమే కారణం. ఇదీ కారణం.. రాష్ట్రంలో పదేళ్లుగా లైసెన్సులు, ఆర్సీ కార్డుల్లో చిప్‌లను అమర్చుతున్నారు. ఆ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ చిప్‌లో నిక్షిప్తమై ఉంటాయి. నకిలీ కార్డులను అడ్డుకునేందుకు వీటిని తెచ్చారు. ఈ చిప్‌ల తయారీ మన దేశంలో నామమాత్రంగానే ఉంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోకతప్పని పరిస్థితి. తైవాన్, ఉక్రెయిన్, చైనా నుంచి అవి దిగుమతి అవుతున్నాయి. ఇటీవల చైనాతో సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో అక్కడి దిగుమతులను కేంద్రప్రభుత్వం నిషేధించింది. ఇక యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి కూడా వాటి దిగుమతి ఆగిపోయింది. మిగిలింది తైవాన్. రెండు దేశాల నుంచి దిగుమతి ఆగిపోయేసరికి తైవాన్‌పై భారం పడింది. సరిపడా చిప్‌లను ఆ దేశం అందించలేకపోతోంది. ఇటీవల స్థానికంగా వాటి డిమాండ్ పెరగడం, ఇతర దేశాలకు ఎక్కువ మొత్తంలో సరఫరా చేయాల్సి రావడంతో తైవాన్ కూడా చేతులెత్తేసింది. దీంతో చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడి స్మార్ట్ కార్డుల తయారీ నిలిచిపోయింది. మళ్లీ సాధారణ కార్డులు ఇప్పుడు చిప్‌లకు తీవ్ర కొరత రావటంతో మళ్లీ పాతపద్ధతిలో అవి లేకుండానే కార్డులు ప్రింట్ చేయాలని రవాణాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. ఈమేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా రావటంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌కార్డుల కోసం జనం రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవ్యాలెట్లో డౌన్లోడ్ చేసుకుని తనిఖీలప్పుడు చూపమని అధికారులు సలహా ఇస్తున్నారు. కానీ కొన్ని చోట్ల స్మార్ట్ కార్డు లేకుంటే పోలీసులు పెనాల్టీలు విధిస్తున్నట్టు వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా రవాణాశాఖ సరీ్వస్ చార్జీ విధిస్తుంది. కార్లకు రూ.450, ద్విచక్రవాహనాలకు రూ.300 చొప్పున వసూలు చేస్తోంది. కానీ, కార్డుల జారీలో అవాంతరాలున్నాయన్న సమాచారాన్ని కనీసం వారికి ఎస్ఎంఎస్ రూపంలో కూడా పంపడం లేదు. ఇది దారుణం ‘స్మార్ట్ కార్డుల జారీ నిలిచిపోయినా వాహనదారులకు సమాచారం ఇవ్వడం లేదు. కనీసం నోటీసు బోర్డుల్లోనూ పెట్టలేదు. పత్రికా ముఖంగా కూడా తెలపలేదు. రవాణాశాఖ సర్వీస్ చార్జీ వసూలు చేస్తూ కూడా ఇలా చేయటం దారుణం. దీనిపై వెంటనే పూర్తి వివరాలను వెల్లడించాలి. – దయానంద్, తెలంగాణ ఆటో మోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
ఆటో అమ్మకాలపై చిప్ ఎఫెక్ట్
ముంబై: దేశీయ ఆటో తయారీ కంపెనీల డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. గతేడాది చివరి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే డిసెంబర్లో ద్విచక్ర వాహన కంపెనీలైన హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. ఆర్థిక రికవరీతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ విభాగానికి చెందిన వోల్వో ఐషర్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ► మారుతీ గతేడాది డిసెంబర్లో దేశీయంగా 1,23,016 వాహనాలను అమ్మింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో (2020) లో విక్రయించిన 1,40,754 యూనిట్లతో పోలిస్తే 13 % తక్కువ గా ఉంది. 2021లో 12.14 లక్షల యూనిట్లను విక్రయించింది. ► ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ 50% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ సంస్థ 23,545 కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను అమ్మింది. దేశీయ ఆటో పరిశ్రమపై డిసెంబర్నూ సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగింది. ప్రతికూలతల కంటే సానుకూలతలు ఎక్కువగా ఉండటంతో కొత్త ఏడాది అమ్మకాలపై ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నాము. అయితే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, సెమికండెక్టర్ల కొరత సమస్యలు పరిశ్రమకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. శశాంక్ శ్రీవాస్తవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
మీ డెబిట్, క్రెడిట్ కార్డులు జాగ్రత్త.. పోగొట్టుకుంటే మళ్లీ కష్టమే!
మీకు డెబిట్, క్రెడిట్ కార్డులు బ్యాంకుల నుంచి రావాలంటే ఎంత సమయం పడుతుంది... డెబిట్ కార్డు కోసమైతే..రెండు లేదా మూడు రోజులు పట్టొచ్చు. కొన్ని బ్యాంకులయితే వెంటనే అకౌంట్ తీసిన రోజే డెబిట్ కార్డును జారీ చేస్తాయి. క్రెడిట్ కార్డు కోసమైతే.. అన్ని వెరిఫీకేషన్లు పూరైన వెంటనే బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు పోతే బ్లాక్ చేసి రెండు, మూడురోజుల్లో బ్యాంకులనుంచి తిరిగి సులువుగా పొందవచ్చుననీ అనుకుంటున్నారా..! భవిష్యత్తులో అలా కుదరదు. తీవ్ర చిప్స్ కొరతతో కార్డుల ఉత్పత్తికి ఆటంకం..! రానున్న రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చును అసలు డెబిట్, క్రెడిట్ కార్డులను ఇవ్వకపోవచ్చును. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుందని వ్యాపార నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3 బిలియన్ల డెబిట్, క్రెడిట్ కార్డులను కంపెనీలు తయారుచేస్తున్నాయి. సుమారు 90 శాతం మేర నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి కార్డులను తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్ర చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ , మొబైల్ చెల్లింపుల సంస్థలు చిప్‌ల కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ తెచ్చినా తంటాలు...! కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం చిప్ తయారీదారులు కార్యకలాపాలను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చిప్స్ కొరత ఏర్పడింది. చిప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం ఆకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. చిప్స్ కొరత ఏర్పడడంతో సెమీకండక్టర్ పరిశ్రమ దెబ్బతింది. చిప్స్ కొరతతో పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం నెలకొన్న ఈఎంవీ చిప్స్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్తత్తికిభారం కానుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి ఆటంకం ఏర్పడునుందని ట్రేడ్ యూనియన్ తెలిపింది. కాగా ప్రస్తుతం చిప్స్ కొరత 2022 సంవత్సరం వరకు కొనసాగనుందని చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థలు , మొబైల్ చెల్లింపుల సంస్థలు పేర్కొన్నాయి. సో ప్రస్తుతం ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడపడితే అక్కడే పొగ్గొట్టుకున్నారో ఇక అంతే సంగతులు. చదవండి: Debit Card EMI: మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి..? -
చిప్ సిస్టమ్ తొలగించాలి : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్‌లో సెన్సార్ చిప్ సిస్టమ్‌ను తొలగించాలని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారమిక్కడ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆందోళన నిర్వహించారు. రేడియో ఫ్రిక్వేన్సీ ఐడెంటిఫై(ఆర్ఎఫ్ఐ) సిస్టం ద్వారా ఈవెంట్స్ నిర్వహించడం వలన ఇబ్బందులు తలేత్తాయని వారు ఆరోపించారు. ఈవెంట్స్‌లో సెలక్ట్ కాని వారిని కూడా తుది పరీక్షకు అనుమతిచ్చారని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. -
స్కూల్‌కు డుమ్మా కొట్టడం కుదరదిక!
బీజింగ్: స్కూల్‌కు, కాలేజీకి వెళ్తున్నామని చెప్పి... డుమ్మాలు కొట్టే విద్యార్థుల ఆటలు ఇకపై సాగవు. ఎందుకంటే మీరెక్కడున్నా ఇట్టే చెప్పేసే స్మార్ట్ యూనిఫామ్స్ వచ్చేస్తున్నాయి. అద్భుతాలకు అడ్డాగా చెప్పుకునే చైనా ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. స్కూల్ ఎగ్గొట్టి బయట తిరుగుతున్న విద్యార్థులకు చెక్ పెట్టేందుకు ‘స్మార్ట్ యూనిఫామ్స్’ను ప్రయోగిస్తోంది. యూనిఫామ్‌లకు అమర్చిన చిప్‌ల ద్వారా విద్యార్థులు ఏ సమయంలో స్కూల్‌కి వచ్చారో? ఎప్పుడు బయటికి వెళ్లారో? లొకేషన్తోసహా తల్లిదండ్రులేకాదు.. పాఠశాలల యాజామాన్యాలు కూడా పర్యవేక్షించవచ్చు. ‘‘విద్యార్థులు స్కూల్లో ప్రవేశించగానే ఫోటో, వీడియో తీసేందుకు స్మార్ట్ యూనిఫామ్‌లు సాయం చేస్తాయి’’ అని గిఝౌ ప్రావిన్స్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపాల్ ర్యాన్ రుగ్జియాంగ్ పేర్కొన్నారు. ఈ స్కూల్లో గతేడాది నవంబర్ నుంచే స్మార్ట్ యూనిఫామ్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ విద్యార్థులు అనుమతి లేకుండా స్కూల్ నుంచి బయటికి వెళ్తే వెంటనే ఆటోమేటిక్ వాయిస్ అలారం మోగుతుందట. స్కూల్ తలుపులపై అమర్చిన ఫేషియల్ రికగ్నిషన్ డివైజ్‌లను యూనిఫామ్‌లకు అనుసంధానం చేయడం వల్ల.. ఎవరైనా యూనిఫామ్ మార్చుకునేందుకు ప్రయత్నించినా ఇట్టే తెలిసిపోతుందట. విద్యార్థులు తప్పిపోయినా, తరగతులు ఎగ్గొట్టినా ఎక్కడున్నారో తెలుసుకునేందుకు స్మార్ట్ యూనిఫామ్‌లు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. యూనిఫామ్‌లోని చిప్‌తో అనుసంధానమైన యాప్ ద్వారా విద్యార్థులకు హోమ్‌వర్క్‌లు, నోటిఫికేషన్లు కూడా పంపుతున్నారట! -
డెబిట్, క్రెడిట్ పాత కార్డులకు చెల్లు
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు: బ్యాంకు ఖాతాదారుల వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల్లో చిప్ ఉందో లేదో పరిశీలించండి. లేందటే మీ బ్యాంక్ హోం బ్రాంచ్‌ను సంప్రదించాలి. ప్రస్తుతం మీ వద్ద ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డు స్థానంలో చిప్ ఆధారిత కార్డులను బ్యాంకులు ఉచితంగా అందిస్తున్నాయి. లేదంటే డిసెంబరు 31 తర్వాత పాతకార్డులు పని చేయవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఆర్బీఐ ఆదేశాలతో... కొన్నేళ్లుగా కార్డు క్లోనింగ్, ఆన్‌లైన బ్యాంకింగ్ మోసాలు భారీగా పెరిగాయి. వీటిని అరికట్టేందుకు మాగ్నెటిక్ స్ట్రిప్ టెక్నాలజీ బదులు ఎలాక్ట్రానిక్ చిప్ ఆధారిత కార్డులను జారీ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది. పాత కార్డులతో పోలిస్తే ఈఎంవీ (యూరోవే, మాస్టర్‌కార్డు, వీసా) చిప్ కార్డుల్లో భద్రత అధికం. దేశీయ బ్యాంకులతో పాటు అంతర్జాతీయ సంస్థల డెబిట్/క్రెడిట్ కార్డులకు సైతం ఆర్బీఐ ఆదేశాలు వర్తిస్తాయి. పాతకార్డులు మార్చుకోవాలంటూ ఇప్పటికే ఖాతాదారులకు ఆయా బ్యాంకులు సంక్షిప్త సందేశాలు పంపుతున్నాయి. వీటిని చాలామంది గమనించడం లేదని బ్యాకులు చెబుతున్నాయి. 2016 నుంచి జారీ 2016 నుంచి మరింత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కార్డులను బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ కార్డుల్లో ఒక వైపు మాగ్నెటిక్ స్ట్రిప్ నల్లరంగులో మరోవైపు ఈవీఎం చిప్ ఉంటుంది. ఇందులో సెక్యూరిటీ పీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. మాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు ఎటీఎంల్లో నగదు తీసుకోవడానికి, పాయింట్ ఆప్ స్కేల్ (పీఓఎస్)లో స్వైపింగ్ చేయడానికి పనికి వస్తాయి. ఇందుల్లో నకిలీ కార్డుల తయారీ (క్లోనింగ్ కార్డు) తయారీ, డేటా కొల్లగొట్టేందుకు అవకాశం ఉందని నిషేధించారు. దీంతో 2016 నుంచి బ్యాంకు కార్డుల్లో మాగ్నెటిక్ స్ట్రిప్‌తో పాటు ఈఎంవీ చిప్ కూడా అమరుస్తున్నారు. మాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎంల్లో పని చేస్తుంది. ఏటీఎంలు బ్యాంకుల ఆధీనంలో, లైసెన్స్ కంపెనీల ఆధీనంలో ఉంటాయి. పాయిం ట్ ఆప్ స్కేల్ (పీఓఎస్) మిషన్లలో పని చేయదు. చిప్ ఉన్న కార్డులు మాత్రమే పని చేస్తాయి. చిప్ ఉన్న కార్డుల నుంచి సమాచారం కొల్లగొట్టడం, క్లోనింగ్‌కార్డులు తయారీ చేయడం వీలుకాదు. ♦ మాగ్నెటిక్ కార్డు వెనుకభాగంలో ఉన్న నలుపురంగు స్ట్రిప్‌లో సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. కొత్త టెక్నాలజీ కార్డుల్లో ముందు భాగంలో ఉంటే చిప్‌లో డైనమిక్ పార్మాట్లో నిక్షిప్తం చేసి ఉంటారు. దీన్ని క్లోనింగ్ చేయడం చాలా కష్టం. ♦ ఆన్లైన్ బ్యాంకింగ్ విషయంలో కొత్తకార్డు వినియోగదారులూ జాగ్రత్త వహించాలి. కార్డు పిన్ నెంబరు, సీవీవీ లాంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. మీ కార్డు నంబరు, పిన్, సీవీవీ ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఎవరైనా లావాదేవీలు నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ♦ ఖాతాదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి కొత్తకార్డు పొందవచ్చు. చాలా బ్యాంకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ 2016 ముందు ఏటీఎం కార్డులు తీసుకున్న ఖాతాదారులందరికీ పోస్టు ద్వారా ఉచితంగా కొత్తకార్డులు పంపిస్తోంది. -
మీ కార్డులో ‘చిప్’ ఉందా..?
మీరింకా పాత డెబిట్, క్రెడిట్ కార్డులే వాడుతున్నారా? మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులైతే మార్చుకోవాలని సూచన ఏడాది కిందట అమల్లోకి వచ్చిన ‘చిప్’ కార్డులు ఇప్పటికే ఈ తరహా కార్డుల్ని జారీ చేస్తున్న బ్యాంకులు పూర్తి స్థాయిలో మారటానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు వీటితో భారీగా తగ్గుముఖం పట్టిన కార్డు నేరాలు కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఇంకా మారకపోవచ్చు. కొన్ని ప్రైవేటు బ్యాంకులూ... ఆ... డెబిట్ కార్డులే కదా!! అని అలసత్వం ప్రదర్శిస్తూ ఉండొచ్చు. క్రెడిట్ కార్డుల విషయంలో దాదాపు అన్ని బ్యాంకులూ ఇప్పటికే మారిపోయాయి. డెబిట్ కార్డుల విషయంలోనూ చాలా బ్యాంకులు చిప్ కార్డులనే జారీ చేస్తున్నాయి. ఇంతకీ వీటివల్ల ఏం జరిగిందంటే... సైబర్ నేరగాళ్లు మాత్రం దెబ్బతిన్నారు. కార్డుల్ని క్లోన్ చేయటం, కోడ్లు కాపీ చేసి నకిలీ లావాదేవీలు నిర్వహించటం వంటివి చేయలేకపోతున్నారు. దాదాపు ఏడాది కిందటే అమల్లోకి వచ్చిన చిప్ కార్డులతో సైబర్ నేరాలు కూడా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు చిప్ కార్డులంటే ఏంటి? ఎందుకు వాటిని జారీ చేయాల్సి వస్తోంది? నేరగాళ్లకు ఎలా కళ్లెం పడింది? వీటిలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ కథనం... క్రెడిట్, డెబిట్ కార్డు దారులు సైబర్ నేరాల బారిన పడకుండా మరింత రక్షణ కల్పించడానికి కొన్నాళ్ల కిందటే ఆర్బీఐ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే... బ్యాంకులు చిప్ ఆధారిత, పిన్ ఎనేబుల్డ్ డెబిట్, క్రెడిట్ కార్డులనే జారీ చేయాలని ఆదేశించింది. దీనిప్రకారం దేశీ బ్యాంకులన్నీ కస్టమర్లకు చిప్‌ను అమర్చిన కార్డులనే జారీ చేయాలి. గతంలో జారీ చేసిన డెబిట్ కార్డులన్నీ కూడా మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఆధారిత డెబిట్ కార్డులు. వాటి స్థానంలోనే చిప్ కార్డులొచ్చాయి. -సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం కాకుంటే..కార్డు మార్చుకోండి ముందు మనది ఏ కార్డో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మీ కార్డు వెనుక భాగంలో నల్లటి మందమైన గీత కనిపిస్తుంది. అదే మ్యాగ్నటిక్ స్ట్రిప్. బ్యాంకులు ప్రారంభం నుంచీ జారీ చేస్తున్నవి ఇవే కార్డులు. చాలా బ్యాంకులు డెబిట్ కార్డుల చెల్లుబాటు వ్యవధి పదేళ్లు కూడా ఇచ్చాయి. దీంతో చాలామందికి ఈ కార్డుల కాల వ్యవధి తీరేందుకు ఇంకా సమయం ఉంది. సరే కదా అని ఊరుకుంటే మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుతో సైబర్ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది. కనుక వెంటనే మీ బ్యాంకును సంప్రదించి తగు దరఖాస్తు ఇస్తే... మీ కార్డు స్థానం లో అత్యాధునిక చిప్ కార్డు అందజేస్తుంది. చిప్ కార్డుకు ఒకవైపున మధ్యలో బంగారు వర్ణంలో మెరిసే చిప్ ఉంటుంది. దీనివల్లే అధిక సెక్యూరిటీ లభిస్తుంది. కొన్ని కార్డుల్లో చిప్‌తో పాటు మ్యాగ్నటిక్ స్ట్రిప్ కూడా ఉంటుంది. ఈఎంవీ చిప్ కార్డు అంటే... పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద, ఆన్లైన్లో చేసే చెల్లింపులకు ఈ కార్డులతో మరింత భద్రత ఉంటుందనే ఉద్దేశంతోనే ఆర్బీఐ వీటిని అమలు చేయాలని ఆదేశించింది. ఈఎంవీ చిప్స్ అనేది వీటి పేరు. అంటే ఈఎంవీ అంటే ‘యూరో పే మాస్టర్‌కార్డు అండ్ వీసా’ అని అర్థం. కంప్యూటర్ చిప్స్‌తో ఉన్న కార్డులకు ఈఎంవీ అనేది అంతర్జాతీయ ప్రమాణం. దీని రూపకర్త ‘ఈఎంవీ కో ఎల్ఎల్సీ. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆరు ప్రధాన పేమెంట్ ప్రాసెసింగ్, క్రెడిట్ కార్డు కంపెనీలు దీన్లో భాగస్వాములయ్యాయి. వీటిలో మాస్టర్ కార్డు, వీసా, జేసీబీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, చైనా యూనియన్ పే, డిస్కవర్ ఉన్నాయి. నేరగాళ్లకు కష్టమే... కార్డులో మెటల్ చిప్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ చిప్‌లో ఖాతాదారుడి సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో భద్రపరుస్తారు. చిప్ కార్డులు అత్యంత భద్రతను అందించే విషయంలో సందేహం అక్కర్లేదన్నది నిపుణుల సూచన. ఎందుకంటే కార్డులో ఉండే చిప్... ప్రతి లావాదేవీకి ఒక యూనిక్ కోడ్‌ను జారీ చేస్తుంది. దీన్ని కాపీ చేయడం సైబర్ నేరగాళ్లకు అంత సులభం కాదు. ఒకవేళ మహా తెలివితనంతో నేరగాడు ఈ కోడ్‌ను కాపీ చేసినా మరో లావాదేవీకి ఆ కోడ్ చెల్లుబాటు కాదు. దీంతో లావాదేవీలు భద్రంగా ఉంటాయి. ఇక మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డు విషయానికొస్తే దాన్ని సూక్ష్మ మ్యాగ్నెట్స్‌తో తయారు చేస్తారు. వీటిలో ఖాతాదారుడి సమాచారం ఉంటుంది. ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ (ఈడీసీ) మెషీన్‌పై స్వైప్ చేసిన తర్వాత అందులోని సమాచారం ఆధారంగా బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ కార్డుతో భద్రత తక్కువ. ఇందులోని వివరాలను కాపీ చేయడం సులభం. కార్డుపై ఉన్న వివరాలను చూసి అవే వివరాలతో డూప్లికేట్ కార్డును రూపొందించి సైబర్ నేరగాళ్లు తమ పని చేసుకోగలరు. పిన్‌తో రెండో అంచె రక్షణ మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తో ఉన్న కార్డులను దుకాణాల్లోని చిప్ రీడింగ్ మెషీన్లనో స్వైప్ చేయడం గమనించే ఉంటారు. అలా స్వైప్ చేసినప్పుడు మ్యాగ్నటిక్ స్ట్రిప్‌ను రీడ్ చేయడం ద్వారా అది బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అదే చిప్ ఆధారిత కార్డు అయితే అలా స్వైప్ చేయకుండా ఏటీఎం మెషీన్లో మాదిరిగా ఇన్సర్ట్ చేసినట్టు ఉంచుతారు. చిప్‌లో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్న సమాచారాన్ని ఈడీసీ మెషీన్ రీడ్ చేస్తుంది. పిన్ నంబర్ ఇస్తేనే ఆ లావాదేవీ ప్రాసెస్ అవుతుంది. దీనివల్ల మీ కార్డు మరొకరి చేతికి వెళ్లినా పిన్ ఉంటుంది కాబట్టి చోరీకి అవకాశం ఉండదు. అయితే, కొన్ని బ్యాంకులు పిన్ లేకుండా చిప్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఖాతాదారుడి సంతకాన్ని ధ్రువీకరణగా పరిగణిస్తారు. చిప్, మ్యాగ్నటిక్ స్ట్రిప్ రెండూ ఒకేదానిలో... దేశంలో 90 శాతం పాయింట్ ఆఫ్ సేల్ రీడింగ్ మెషీన్లు చిప్ కార్డుల్ని రీడ్ చెయ్యగలవు. కాకపోతే అన్ని ఏటీఎంలలో ఇవి పనిచేయకపోవచ్చు. కొత్తగా ఏర్పాటైన ఏటీఎంలయితే వీటిని రీడ్ చేయగలవు. ఎప్పుడో ఏర్పాటు చేసినవైతే వాటిలో హార్డ్‌వేర్ పరంగా చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని ఓ కమిటీ ఆర్బీఐకి లోగడే నివేదించింది. అయితే, ఈ సమస్యకు నివారణగా హెచ్డీఎఫ్సీ సహా కొన్ని బ్యాంకులు చిప్, మ్యాగ్నటిక్ రెండింటినీ ఒకే కార్డులో అమర్చి ఇస్తున్నాయి. అమెరికాలోనూ... ప్రపంచ వ్యాప్తంగా జరిగే క్రెడిట్/డెబిట్ కార్డు నేరాల్లో సగం అమెరికాలోనే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్డు ఆధారిత లావాదేవీల్లో 25 శాతమే అమెరికాలో జరుగుతున్నాయి. వీసా, మాస్టర్ కార్డు గతేడాది అక్టోబర్ 1 నాటికి చిప్ రీడింగ్ మెషీన్లను మార్చుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాలన్నింటికీ గడువు విధించాయి. అప్పటి వరకు చాలా దుకాణాల్లో కేవలం మ్యాగ్నటిక్ ఆధారిత కార్డు రీడర్లే ఉన్నాయి. దాంతో చిప్, మ్యాగ్నటిక్ కార్డు రీడర్లను అమర్చుకోవడం కోసం గడువు నిర్దేశించాయి. చాలా దుకాణాలు మార్చుకున్నాయి కూడా. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి, చిన్న బ్యాంకులు సైతం చిప్ ఆధారిత కార్డులను జారీ చేసేందుకు సంవత్సరాలు పడుతుందని అంచనా.